వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారుల అనుమతి లేకుండా సేవా రుసుము వసూలు చేస్తున్న 41 రెస్టారెంట్లపై సుమోటోగా చర్యలు చేపట్టిన సీసీపీఏ


జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు

వినియోగదారు అనుమతి లేకుండా సేవా రుసుము వసూలు చేసినట్లు బిల్లులతో సహా అందిన ఫిర్యాదుల ఆధారంగా చేపట్టిన చర్యలు

प्रविष्टि तिथि: 19 JUL 2026 5:42PM by PIB Hyderabad

వినియోగదారుల బిల్లులపై డిఫాల్ట్‌గా సేవా రుసుమును విధించడం ద్వారా వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు, అనైతికమైన వ్యాపార పద్ధతులను అవలంబించినందుకు దేశవ్యాప్తంగా 41 రెస్టారెంట్లపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) సుమోటో చర్యను  ప్రారంభించింది  

జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH) ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. వినియోగదారుల నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోకుండానే వారి బిల్లులకు సర్వీస్ ఛార్జీని జోడించినట్లు రుజువు చేసే ఇన్‌వాయిస్‌లను ఈ ఫిర్యాదులకు జత చేశారు. 

ఈ ఫిర్యాదుల ఆధారంగా సీసీపీఏ విచారణ చేపట్టింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుని అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం వారి ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తేల్చింది. అంతేకాకుండా, ఇలా సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 2(47) ప్రకారం అనైతికమైన వ్యాపార విధానం పరిధిలోకి వస్తుందని అథారిటీ స్పష్టం చేసింది. 

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇతరులు వర్సెస్ భారత ప్రభుత్వం, ఇతరులు కేసులో 2025 మార్చి 28న ఇచ్చిన తీర్పులో సేవా రుసుములపై సీసీపీఏ మార్గదర్శకాల చెల్లుబాటును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అలాగే సర్వీస్ ఛార్జీని నిర్భందంగా వసూలు చేయడం చట్టానికి విరుద్ధమని కోర్టు చెప్పింది. అన్ని రెస్టారెంట్లు ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని, చట్టానికి అనుగుణంగా వాటిని అమలు చేసే అధికారం సీసీపీఏకు ఉందని కోర్టు స్పష్టం చేసింది.

సీసీపీఏ మార్గదర్శకాల్లోని కీలకమైన నిబంధనలు

హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీసు ఛార్జీని విధించే విషయంలో అనైతికమైన వ్యాపార పద్ధతులను నివారించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి 2022 జులై 4న మార్గదర్శకాలను విడుదల చేసింది.

  • ఏ హోటల్ అయినా లేదా రెస్టారెంట్ అయినా కూడా ఆహార బిల్లులో సర్వీస్ ఛార్జీని వినియోగదారుని అనుమతి లేకుండా జోడించకూడదు.

  • మరే ఇతర పేరుతోనూ సేవా రుసుమును వసూలు చేయరాదు.

  • ఏ హోటల్ అయినా రెస్టారెంట్ అయినా సేవా రుసుము చెల్లించాలని వినియోగదారుని బలవంతం చేయకూడదు. ఇది స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, వినియోగదారుని అభీష్టానికి అనుగుణంగా చేసే చెల్లింపు అని వారికి స్పష్టంగా తెలియజేయాలి.

  • సేవా రుసుము చెల్లించని పక్షంలో వినియోగదారుల ప్రవేశంపై గానీ, వారికి సేవలు అందించడంపై గానీ ఎలాంటి ఆంక్షలు విధించకూడదు.

  •  సర్వీసు ఛార్జీని ఆహార బిల్లులో ముందుగానే జోడించకూడదు. ఆ రుసుముపై జీఎస్టీ విధించకూడదు.

 

సీసీపీఏ చేపట్టిన చర్య

ఒక కేసులో, డిఫాల్ట్‌గా సేవా రుసుము విధిస్తున్న చాయోస్ (సన్‌షైన్ టీ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్)‌కు రూ. 50,000 జరిమానా విధిస్తూ తుది ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే వినియోగదారుల నుంచి చెల్లించిన సేవా రుసుమును వారికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

వినియోగదారుల బిల్లులకు సర్వీస్ ఛార్జ్ లేదా అలాంటి ఇతర ఛార్జీలు ఆటోమేటిక్‌గా జోడించకుండా ఉండేలా... ఈ సంస్థకు సంబంధించిన అన్ని అవుట్‌లెట్లలో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ఆధారిత బిల్లింగు వ్యవస్థను మార్చాలని ఆదేశించారు.  దిగువన పేర్కొన్న రెస్టారెంట్లకు కూడా సీసీపీఏ తుది ఉత్తర్వులను జారీ చేసింది.

  1. కేఫ్ బ్లూ బాటిల్, పాట్నా

  2. చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్

  3. ఫియెస్టా బార్బెక్యూ నేషన్ (బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్)

  4. ఎఫ్‌వోవో అహ్మదాబాద్ రెస్టారెంట్ (పెబుల్ స్ట్రీట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్)

  5. ఎల్ ఒపెరా ఫ్రెంచ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్

  6. జొర్రో – ది లగ్జరీ నైట్ క్లబ్ (రుద్రా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ‌కు సంబంధించిన ఒక విభాగం)

  7. చాయోస్ (సన్‌షైన్ టీహౌస్ ప్రైవేట్ లిమిటెడ్)

ఫిర్యాదులు అందిన, పరిశీలన పూర్తయిన ఇతర రెస్టారెంట్లపై సైతం తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

 

ఉల్లంఘనలపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు

రెస్టారెంట్లు డిఫాల్ట్‌గా సర్వీసు ఛార్జీలను విధించే ఘటనలపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 1915 (టోల్ ఫ్రీ) నెంబరుకు కాల్ చేసి లేదా ఎన్‌సీహెచ్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సీసీపీఏ సూచించింది. సర్వీసు రుసుములకు సంబంధించిన ఫిర్యాదులను అథారిటీ నిశితంగా పర్యవేక్షిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల విషయంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి వినియోగదారుల రక్షణ చట్టం– 2019ను, సంబంధిత మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు తేలిన సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటుంది. ఆతిథ్య రంగంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి, న్యాయమైన, పారదర్శకమైన, వినియోగదారులకు అనుకూలమైన వ్యాపార పద్ధతులను అనుసరించేలా చూడటానికి సీసీపీఏ కట్టుబడి ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2286528) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Kannada