వ్యవసాయ మంత్రిత్వ శాఖ
గడచిన ఏడాది కాలంలో 44 పంటలకు సంబంధించి మొత్తం 386 మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసిన ఐసీఏఆర్: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
వీటిలో 94 శాతం వాతావరణ అనుకూల, 29 బయోఫోర్టిఫైడ్ రకాలు ఉన్నాయి...
భారత వ్యవసాయ రంగ విప్లవాత్మక పరివర్తనకు ఐసీఏఆర్ ఒక మార్గదర్శి: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
వ్యవసాయానికి రైతులు ప్రాణం వంటివారైతే... శాస్త్రవేత్తలు దాని మెదడు లాంటివారు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జరుపుకున్న ఐసీఏఆర్, శాస్త్రీయ ఆధారిత వ్యవసాయ పరివర్తన దిశగా అచంచల నిబద్ధత
प्रविष्टि तिथि:
16 JUL 2026 4:38PM by PIB Hyderabad
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) నేడు న్యూఢిల్లీలో 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జరుపుకుంది. వికసిత్ భారత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసే దిశగా శాస్త్రీయ ఆధారిత, వాతావరణ అనుకూల, రైతు శ్రేయస్సే ధ్యేయంగా సాగే వ్యవసాయ అభివృద్ధిని పెంపొందించడానికి గల నిబద్ధతను ఈ సందర్భంగా ఐసీఏఆర్ మరోసారి చాటిచెప్పింది.
ప్రతి సంవత్సరం జూలై 16న జరుపుకునే ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం.. 1928లో ఏర్పాటైన ఈ మండలి స్థాపనను గుర్తుచేస్తుంది. గడిచిన 98 సంవత్సరాలుగా దేశ వ్యవసాయ పరిశోధనలు, విద్యాబోధన, విస్తరణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఐసీఏఆర్ అత్యంత కీలక పాత్ర పోషించింది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఉత్పాదకతను పెంచడం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు దేశ ఆహార, పోషకాహార భద్రతను నిర్ధారించడంలోనూ ఈ సంస్థ అగ్రభాగాన నిలిచింది.

ఈ వేడుకలకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పీ సింగ్ బఘేల్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ భగీరథ్ చౌదరి, శ్రీ రామ్ నాథ్ ఠాకూర్ అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు నీతి ఆయోగ్ సభ్యులు శ్రీ కేవీ రాజు, మత్స్యశాఖ కార్యదర్శి శ్రీ నరేష్ పాల్ గంగ్వార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సదస్సును ఉద్దేశించి కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. భారత వ్యవసాయ రంగ విప్లవాత్మక పరివర్తనకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఒక అగ్రగామి మార్గదర్శిగా అభివర్ణించారు. ఈ మండలి సాగించిన శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు దేశంలో ఆహార ధాన్యాలు, ఉద్యానవన పంటలు, పాలు, మత్స్య ఉత్పత్తి రంగాలలో రికార్డు స్థాయి విజయాలు సాధించడానికి ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఐసీఏఆర్ 44 పంటలకు సంబంధించి 386 మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసిందని వెల్లడించారు. వీటిలో 94 శాతం వాతావరణ మార్పులను తట్టుకునే రకాలు కాగా, 29 బయోఫోర్టిఫైడ్ (పోషక విలువలు పెంచిన) రకాలు ఉండటం విశేషమన్నారు. రైతులు వ్యవసాయానికి ఆత్మ వంటివారైతే, శాస్త్రవేత్తలు దాని మెదడు లాంటివారని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పోల్చారు. డిమాండుకు అనుగుణమైన పరిశోధనలు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, పప్పుధాన్యాలు నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నాణ్యమైన వ్యవసాయ విద్యను అందించడం, సాంకేతికతలను వాణిజ్యీకరించడం, కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) వ్యవస్థల ద్వారా నూతన ఆవిష్కరణలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు కనుగొన్న సాంకేతికతలను ప్రయోగశాలల నుంచి నేరుగా రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు వేగంగా చేరవేయడానికి కృషి విజ్ఞాన కేంద్రాల వ్యవస్థను మరింత విస్తరించాలని కోరారు. కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ, ఐసీఏఆర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం.. పరిశోధనలను, ఆవిష్కరణలను, సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తిని మరింత బలోపేతం చేస్తుందని, తద్వారా రైతుల శ్రేయస్సును వేగవంతం చేస్తూ వికసిత్ భారత్ దార్శనికతకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ నాథ్ ఠాకూర్ మాట్లాడుతూ.. వ్యవసాయ, పాడి రంగాల్లో సాధించిన అద్భుతమైన పురోగతి, రైతుల సంక్షేమం, గ్రామీణ శ్రేయస్సు పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఐసీఏఆర్ శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆహార కొరత దశ నుంచి స్వయంసమృద్ధి సాధించే వరకు భారత్ సాగించిన ప్రయాణం.. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతుల ఉమ్మడి ప్రయాణాన్ని ప్రతిబింబిస్తోందని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి పేర్కొన్నారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించడానికి శాస్త్రీయ ఆధారిత పరిశోధనలు, ప్రకృతి వ్యవసాయం, రైతు శ్రేయస్సే ధ్యేయంగా సాగే ఆవిష్కరణలు అత్యంత అవసరమని ఆయన చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి ఐసీఏఆర్ సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
శాస్త్రీయ ఆధారిత వ్యవసాయం, అధునాతన సాంకేతికతలు, సరికొత్త ఆవిష్కరణల ద్వారానే వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసుకోగలమని మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పీ సింగ్ బఘేల్ తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయాన్ని మరింత ఉత్పాదకతతో కూడినదిగా, సుస్థిరమైనదిగా మార్చడానికి ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో సెక్స్ సార్టెడ్ సెమెన్ (లింగ నిర్ధారిత వీర్యం), కృత్రిమ గర్భధారణ, పిండ మార్పిడి, మత్స్య పరిశ్రమ, ప్రకృతి వ్యవసాయం, సూక్ష్మ నీటి పారుదల, నానో ఎరువుల వాడకాన్ని దేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.

‘‘గడిచిన 365 రోజుల సమీక్ష, వికసిత్ భారత్ 2047 కోసం వ్యవసాయ పునరావిష్కరణ’’ అనే ఇతివృత్తంతో ఐసీఏఆర్ సాధించిన వార్షిక విజయాలను డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం ఎల్ జాట్ సమర్పించారు. 2025-26 సంవత్సరంలో కౌన్సిల్ సాధించిన ప్రధాన విజయాలను వివరిస్తూ.. వ్యవసాయ పరిశోధనలు, ఆవిష్కరణలు, విద్య, విస్తరణ రంగాలను ముందుకు తీసుకెళ్లే భవిష్యత్ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. ఈ సంవత్సర కాలంలో పంటలు, ఉద్యానవన పంటలు, పశుసంపద, మత్స్య రంగాలలో పెరిగిన ఉత్పత్తి దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ. 1.70 లక్షల కోట్ల అదనపు ఆర్థిక విలువను చేకూర్చిందని వెల్లడించారు. కేవలం వ్యవసాయ పరిశోధనల ద్వారానే రికార్డు స్థాయిలో రూ. 55,000 కోట్ల విలువైన ప్రయోజనం లభించిందని పేర్కొంటూ, వ్యవసాయ శాస్త్రంలో పెట్టే పెట్టుబడులు దేశానికి ఎంతటి అద్భుతమైన రాబడులను అందిస్తాయో ఆయన గణాంకాలతో వివరించారు.
ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన శాస్త్రీయ సాంకేతికతలు దాదాపు కోటి మంది రైతులకు నేరుగా చేరాయని, వివిధ మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల ద్వారా మరో అయిదు కోట్ల మందికి పైగా రైతులకు చేరువయ్యాయని డాక్టర్ జాట్ వెల్లడించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకునేలా 18 విదేశీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారం కోసం విజ్ఞాన ఆధారిత, అవసరాల ననుసరించి సాగే సుస్థిర వ్యవసాయ పరివర్తనను ప్రోత్సహించడానికి ఐసీఏఆర్ కట్టుబడి ఉందని తెలిపారు.
అంతకుముందు డీఏఆర్ఈ అదనపు కార్యదర్శి, ఐసీఏఆర్ కార్యదర్శి శ్రీ జ్ఞానేంద్ర డీ త్రిపాఠి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ ప్రత్యేక సందర్భంలో 43 మెరుగైన పంట రకాలు, 17 అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు, 14 ప్రచురణలను విడుదల చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికతల్లో లవణీయ, క్షార నేలలను సమర్థవంతంగా తట్టుకునే బాస్మతి బియ్యం, వాతావరణ అనుకూల వరి వంగడాలు ఉన్నాయి. వీటితో పాటు ఎగుమతులకు అనువైన మామిడి సాగు సాంకేతికత, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్, డిజిటల్ స్వైన్ డిసీజ్ అట్లాస్, చిన్నకారు రైతుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన కర్రపెండలం కోత యంత్రం ఉన్నాయి. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న 150 మంది తాత్కాలిక రోజువారీ వేతన కార్మికుల సేవలను క్రమబద్ధీకరించారు. వారందరికీ వేదికపై నియామక పత్రాలను అందజేశారు.
వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్యీకరించడం, క్షేత్రస్థాయిలో చివరి రైతు వరకు వేగంగా చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో 51 మంది పరిశ్రమల భాగస్వాములతో ఏకంగా 72 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐసీఏఆర్ పరిశోధనా శాలల్లో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాలను అత్యంత వేగంగా రైతులకు బదిలీ చేయడానికి ఈ ఒప్పందాలు ఎంతగానో దోహదపడతాయి.
ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ మాజీ కార్యదర్శులు, మాజీ డైరెక్టర్ జనరల్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఐసీఏఆర్ సంస్థల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, నూతన ఆవిష్కర్తలు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు, వ్యవసాయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వికసిత్ భారత్ 2047 దార్శనికత లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో అత్యాధునిక పరిశోధనలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, రైతు శ్రేయస్సే ధ్యేయంగా సాగే సాంకేతికతల ద్వారా ఆవిష్కరణలతో కూడిన, వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర వ్యవసాయాన్ని పెంపొందించడానికి ఐసీఏఆర్ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఈ సదస్సు స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2285648)
आगंतुक पटल : 9