ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

‘స్వయంసమృద్ధ భారత్‌ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం-2026’కు మంత్రిమండలి ఆమోదం

प्रविष्टि तिथि: 15 JUL 2026 3:33PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన ‘స్వయంసమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం-2026’ (ఎన్‌ఐపీయూ)కు ఆమోదం తెలిపింది.

ప్రయోజనాలు

దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ పరిశ్రమల ఏర్పాటుతోపాటు ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన లక్ష్య సాధనలో ఈ విధానం తోడ్పడుతుంది. ‘ఎన్‌ఐపీ-2012’తో పోలిస్తే ఈ కొత్త విధానంలో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈ మేరకు మరింత పారదర్శకత కోసం స్థిర-చర వ్యయాలను వేరు చేశారు. అలాగే, ‘ఈక్విటీపై రాబడి’కి సంబంధించి 12 శాతం కనిష్ఠ, 16 శాతం గరిష్ఠ పరిమితితో  ఆచరణాత్మక శ్రేణిని నిర్దేశించారు. మునుపటి మారకం రేట్ల ప్రాతిపదికన నాలుగేళ్ల తర్వాత స్థిర వ్యయాన్ని భారత రూపాయి (ఐఎన్‌ఆర్‌) విలువలోకి మార్చడం ద్వారా విదేశీ మారకం రేటు సంబంధిత ముప్పును తగ్గించారు. ఈ చర్యల వల్ల ‘ఎన్‌ఐపీ-2012’తో  పోలిస్తే ‘ఎన్‌ఐపీయూ-2026’ కింద ఏర్పాటయ్యే ప్రతి కర్మాగారానికీ రూ.250 కోట్లకు పైగా ఆదా అవుతుందని అంచనా.

అమలు వ్యూహం-లక్ష్యాలు

దేశంలో కొత్త యూరియా తయారీ కర్మగారాల ఏర్పాటు ప్రక్రియ ఇకపై ‘స్వయంసమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం-2026’ పరిధిలోకి వస్తుంది.

నేపథ్యం

యూరియా రంగంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఎరువుల శాఖ 2012లో ‘పునరుద్ధరణ-విస్తరణ-పునరుజ్జీవనం సహా కొత్త తయారీ కర్మాగారాల కోసం ఒక పెట్టుబడి విధానాన్ని రూపొందించింది. ఈ ‘నవ్య పెట్టుబడి విధానం-2012’ కింద దేశంలో 6 కొత్త కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ప్రతిపాదిత ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త అనుబంధ కంపెనీల ద్వారా 4, ప్రైవేట్ కంపెనీల ద్వారా 2 వంతున ఏర్పాటు చేశారు. అయితే, ‘ఎన్‌ఐపీ-2012’ కింద కొత్త పెట్టుబడుల సంబంధిత గడువు 2019 అక్టోబరు నాటికే ముగిసింది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 269.42 లక్షల పునరంచనా లేదా స్థాపిత సామర్థ్యంతో 33 యూరియా తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. కానీ, దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉండటం వల్ల ఉత్పత్తి-డిమాండ్‌ మధ్య ఏర్పడిన అంతరాన్ని ఇప్పటిదాక దిగుమతులతో పూరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కర్మాగారాల స్థాపన కోసం ఎరువుల మంత్రిత్వశాఖకు అనేక ప్రతిపాదనలు అందుతుండటంతో ఒక ప్రత్యేక జాతీయ పెట్టుబడి విధానం అవసరమైంది.

 

***


(रिलीज़ आईडी: 2284853) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam