జౌళి మంత్రిత్వ శాఖ
‘భారత్ టెక్స్-2026’కు శ్రీకారం చుట్టిన కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
రికార్డు స్థాయి అంతర్జాతీయ భాగస్వామ్యంతో భారత్‌లో అత్యంత భారీ ప్రపంచ స్థాయి జౌళి రంగ కార్యక్రమం ప్రారంభం
దేశీయ జౌళి రంగ దార్శనికత.. ప్రపంచ వాణిజ్య ఆకాంక్షల సంగమం ‘భారత్ టెక్స్-2026’
प्रविष्टि तिथि:
14 JUL 2026 7:24PM by PIB Hyderabad
భారత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జౌళి వేడుక భారత్ టెక్స్-2026ను కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఇవాళ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. తద్వారా రికార్డు స్థాయి అంతర్జాతీయ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత జౌళి విలువ శ్రేణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ సహకారంతో ‘భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్’ (బీటీటీఎఫ్) ఆధ్వర్వాన సాగే ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. దీంతో 6,000 మందికి పైగా కొనుగోలుదారులు, 1.3 లక్షల మందికిపైగా వాణిజ్య సందర్శకులు ఒకే వేదికపైకి వచ్చారు. మొత్తం 1.6 మిలియన్ చదరపుటడుగుల ప్రాంగణంలో 20,000కు పైగా వస్త్ర ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. పటిష్ట, సుస్థిర, వినూత్న ఆవిష్కరణలతో పురోగమించే జౌళి విలువ శ్రేణిలో ఒక విశ్వసనీయ ప్రపంచ వనరుల కూడలిగా, వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ ఆవిర్భావాన్ని ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తోంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి శ్రీ పవిత్ర మార్గరిటా సహా ఆ శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు, ఇతర ఉన్నతాధికారులు, భారత్ టెక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నరేన్ గోయెంకా, కో-ఛైర్మన్ శ్రీ భద్రేష్ దోధియా, భాగస్వామ్య దేశాల మంత్రులు, అధికారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, సోర్సింగ్ అధిపతులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.





రష్యన్ ఫెడరేషన్ వ్యవసాయ మంత్రి తిమూర్ గవేవ్ నేతృత్వంలో ఆ దేశ మంత్రుల బృందం, న్యూజిలాండ్ వ్యవసాయ శాఖ సహాయ మంత్రి-గ్రామీణ సమాజాల మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వాన హై కమిషనర్ సహా మంత్రుల బృందాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. అంతర్జాతీయంగా భారత్ టెక్స్‌కు ఇనుమడిస్తున్న ప్రాధాన్యాన్ని వీరందరి హాజరు ప్రతిబింబిస్తోంది. ప్రపంచ వాణిజ్య, విధాన చర్చలకు భారత్ ఒక వేదికగా ఆవిర్భవించడంలో ఈ కార్యక్రమం తనవంతు పాత్ర పోషిస్తోంది.
ఎనిమిది ప్రాయోజిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. తమిళనాడు సహా 9 భాగస్వామ్య రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిషా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ సహా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, విధానపరమైన మద్దతును ప్రదర్శించడం ద్వారా ఈ కార్యక్రమ వాస్తవిక జాతీయ స్వభావం నిరూపితమైంది.
ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్, బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి శ్రేయసి సింగ్, అలాగే, తమిళనాడు నుంచి చేనేత-వస్త్ర-ఖాదీ శాఖ మంత్రి శ్రీ ఎం.విజయ బాలాజీ, పరిశ్రమలు-పెట్టుబడుల ప్రోత్సాహం-వాణిజ్య శాఖ మంత్రి శ్రీమతి సెల్వి ఎస్.కీర్తన కూడా హాజరయ్యారు.


కేంద్ర-రాష్ట్ర పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమంలో గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కోసం ప్రత్యేక ‘స్టేట్ ఇన్వెస్టర్ కనెక్ట్ సెషన్లు’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విధానపరమైన మద్దతును క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా రూపొందించే దిశగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్‌ల కోసం ప్రత్యేకంగా ‘పీఎం మిత్ర మాస్టర్ డెవలపర్ సెషన్’ కూడా ఏర్పాటు చేశారు.
ప్రారంభ వేదిక కార్యక్రమంతో పాటు ‘భారత్ టెక్స్-2026’లో వివిధ అంశాలపై నిర్వహించే కార్యకలాపాల్లో 20కి పైగా దేశాల అంతర్జాతీయ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ‘సీఎక్స్ఓ’లు, విధాన రూపకర్తలు, మేధావులు సహా 350 మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారు. వీరి మధ్య ఫలితాధారిత చర్చల దిశగా సమన్వయం కోసం ఒక ప్రత్యేక అంతర్జాతీయ పెవిలియన్ కూడా ఏర్పాటైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల పారిశ్రామిక-వాణిజ్య ప్రతినిధి బృందాలు పాల్గొంటాయి. వారి మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్-అమెరికా పత్తి భాగస్వామ్యం, భారత్-న్యూజిలాండ్ ఉన్ని వ్యవస్థ, భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం, రష్యాపై దృష్టి సారిస్తూ జౌళి రంగ చర్చలు వంటివి ఉంటాయి.
భారతీయ జౌళి పరిశ్రమ సంపూర్ణ స్వరూపాన్ని ‘భారత్ టెక్స్-2026’ ఆవిష్కరిస్తుంది. ఫైబర్లు, నూలు, వస్త్రాలు, దుస్తులు, ఫ్యాషన్, గృహ వస్త్రాలు, సాంకేతిక వస్త్రాలు, చేనేత, హస్తకళలు, యంత్రాలు సహా అనుబంధ పరిశ్రమల నుంచి వేలాది వాణిజ్య ప్రదర్శన సంస్థల వారు ఇందులో పాల్గొంటారు. వీరితోపాటు తిరుపూర్, ఇచల్కరన్జీ, అహ్మదాబాద్ వంటి ప్రసిద్ధ వస్త్ర సముదాయాల ప్రతినిధులు కూడా హాజరవుతారు. అమెరికా, ఇంగ్లండ్, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్ సహా 14 దేశాల ప్రదర్శన సంస్థలు పాలుపంచుకుంటాయి. అలాగే, ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్ నుంచి సంస్థాగత ప్రతినిధులు సహా దేశీయంగా ట్రైడెంట్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్, ఆర్‌ఎస్‌డబ్ల్యూఎం, షాహి ఎక్స్‌పోర్ట్స్, కలర్‌జెట్, అరవింద్, పీడీపీఎస్ లిమిటెడ్, సత్వా వంటి కీలక పారిశ్రామిక ప్రాయోజిత సంస్థలు కూడా భాగస్వాములు అవుతున్నాయి. ఈ విధంగా నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం ప్రపంచ వస్త్ర విలువ శ్రేణిలోని భాగస్వాములను ఒకేచోటకు చేరుస్తుంది. వారి మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విధాన చర్చలు సహా అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్యాల దిశగా చర్చలకు ఒక సమగ్ర వేదికగా ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రసంగిస్తూ- ‘భారత్ టెక్స్’ను ప్రారంభించాక ఇది మూడో సంవత్సరమని గుర్తుచేశారు. ఈ మూడేళ్లలోనే వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ, విధాన చర్చలకు ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందిన వేదికగా రూపొందిందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఉత్పాదక శక్తి, విధాన వ్యవస్థ, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యంపై ప్రపంచ వస్త్ర పరిశ్రమకుగల విశ్వాసాన్ని ఇది స్పష్టం చేస్తున్నదని చెప్పారు. ప్రధానమంత్రి నిర్దేశిత ‘5ఎఫ్’ సూత్రం ‘ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్’ గురించి మాట్లాడుతూ- ఆయన దార్శనికతకు అనుగుణంగా భారతీయ సంస్థలను ప్రపంచ మార్కెట్లతో సంధానించే శక్తిమంతమైన వేదికగా ‘భారత్ టెక్స్’ మారిందన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వస్త్ర శ్రేణిలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నదని వివరించారు.
ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి నానాటికి ఇనుమడిస్తున్న నేపథ్యంలో నేటి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధ వస్త్ర-ఫ్యాషన్ సోర్సింగ్ వేదికలలో ఒకటైన ‘ప్రీమియర్ విజన్-ప్యారిస్’, ‘బీటీటీఎఫ్’ల ఒక ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడిక (ఐఓఎల్) కూడా కుదిరింది. ఈ మేరకు మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ సమక్షంలో ఆ ప్యారిస్ సంస్థ ప్రతినిధి ఫ్యాషన్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి ఫ్లోరెన్స్ రౌసన్, బీటీటీఎఫ్ ఛైర్మన్ శ్రీ నరేన్ గోయెంకా దీనిపై సంతకాలు చేశారు. ఆవిష్కరణ, సుస్థిరత, డిజైన్ నైపుణ్యం, ట్రెండ్ ఇంటెలిజెన్స్, కొనుగోలుదారు-విక్రేతల అనుసంధానం, ప్రపంచ మార్కెట్ ప్రవేశం వంటి రంగాల్లో భారత్-ఐరోపా సహకారాన్ని మరింత విస్తరించే దిశగా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఓ కీలక మలుపు. భారత ‘ఎంఎస్‌ఎంఈ’లు, తయారీదారులు, ఎగుమతిదారులు, డిజైనర్లు ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు, ఫ్యాషన్ సంస్థలతో కలిసి కృషి చేసే దిశగా ఇది కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.
ఈ భాగస్వామ్యం మూడు రంగాల్లో ఒక చట్రాన్ని ఏర్పరుస్తుంది. ఈ మేరకు భారత్ టెక్స్- ప్రీమియర్ విజన్-ప్యారిస్ మధ్య ఒక ప్రదర్శన భాగస్వామ్యం, ఐరోపా సహా ప్రపంచ మార్కెట్లలో భారత-ఫ్రెంచ్ తయారీదారుల గుర్తింపు పెంచే ఉమ్మడి ఎగుమతులకు ప్రోత్సాహం, అమలుకు మార్గనిర్దేశం చేసే ఒక ఉమ్మడి సారథ్య కమిటీ ఏర్పడతాయి. ఈ సహకారం విస్తృతి మరింత సంస్థాగత సహకారం, ప్రధాన వస్త్ర కార్యక్రమాలలో పరస్పర భాగస్వామ్యం, ప్రపంచ ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం, సుస్థిర వనరుల సమీకరణకు ప్రోత్సాహం, భారత పరిశ్రమలకు-అంతర్జాతీయ ఫ్యాషన్ వ్యవస్థకు మధ్య బలమైన వ్యాపార సంబంధాలు నెలకొంటాయి. తద్వారా ‘భారత్ టెక్స్’ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన వస్త్ర వేదికగా మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని విశ్వసిస్తున్నారు.
ఈ భాగస్వామ్యంపై శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ- “భారత్ టెక్స్‌ను ప్రపంచ వేదికగా నిలపడంలో ఇది మరో ముఖ్యమైన మలుపు. కీలక ఐరోపా కొనుగోలుదారులతో భారత ‘ఎంఎస్ఎంఈ’లతోపాటు తొలిసారి ఎగుమతిదారులు, తయారీదారుల సంధానానికి తోడ్పడుతుంది. దీంతోపాటు విశ్వసనీయ, వినూత్న, సుస్థిర సోర్సింగ్ గమ్యంగా భారత్ తన సామర్థ్యాన్ని చాటుతుంది. ప్రపంచ టెక్స్‌టైల్ విలువ శ్రేణిలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ పాత్ర ఇనుమడించేందుకూ దోహదం చేస్తుంది” అన్నారు.
మరో నాలుగు రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడి, సుస్థిరత, ఇండస్ట్రీ 5.0, ఆవిష్కరణ, సాంకేతిక వస్త్రాలు, ఫ్యాషన్, విధానాలు-అంతర్జాతీయ సోర్సింగ్ అంశాలపై భారత్ టెక్స్-2026ను నిర్వహిస్తారు. ఇందులో 50కి పైగా విజ్ఞాన భాగస్వాములతో 100కు పైగా చర్చాగోష్ఠులను నిర్వహిస్తుంది. వీటిలో 39 బృంద చర్చలు, 16 రౌండ్‌టేబుళ్లు, 37 మాస్టర్‌క్లాసులు, 8 అధికారిక చర్చాగోష్ఠులు ఉంటాయి. వీటితోపాటు 4,000కు పైగా క్యూరేటెడ్ ‘బి2బి’ సమావేశాలను, 100కు పైగా ‘బి2జి’ సదస్సులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అంతేగాక వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, సుస్థిరత, మార్కెట్ సౌలభ్యం వంటి రంగాల్లో 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడానికీ తోడ్పడుతుంది. తద్వారా ప్రపంచ జౌళి విలువ వ్యవస్థ అంతటా చర్చలను వాణిజ్య రూపంలోకి తెస్తుంది.
ఈ కార్యక్రమంలో ‘సిఐటీఐ సస్టైనబిలిటీ అవార్డ్స్-2026’ ప్రదానోత్సవం కూడా నిర్వహిస్తారు. ఇది ఏడు ప్రధాన రంగాలలో బాధ్యతాయుత వాణిజ్య పద్ధతులను గుర్తిస్తుంది.. ఈ మేరకు వనరుల సామర్థ్యం, ఇంధనం-ఉద్గారాలు, వర్తుల ఆర్థిక వ్యవస్థ, సుస్థిర పదార్థాలు, సామాజిక బాధ్యత, బాధ్యతాయుత వ్యాపారం, పారిశ్రామిక సహకారం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.
నిరంతరాయ భాగస్వామ్య సౌలభ్యం దిశగా ‘భారత్ టెక్స్-2026’ తన మొబైల్ యాప్ సహా ప్రీ-ఫెయిర్ డైరెక్టరీని సమీకృత డిజిటల్ వ్యాపార వేదికలుగా వినియోగిస్తోంది. ఇవి ఎగ్జిబిటర్ డిస్కవరీ, మీటింగ్ షెడ్యూలింగ్, ఈవెంట్ నావిగేషన్, క్యూఆర్ ఆధారిత లీడ్ క్యాప్చర్, డిజిటల్ బ్యాడ్జ్ యాక్సెస్, ఏఐ-ఆధారిత మద్దతు, మరింత సమర్థ-డేటా ఆధారిత వ్యాపార అనుభవం కోసం ఆదునిక కొనుగోలుదారు-విక్రేతల జోడింపులో తోడ్పడతాయి.
అంతర్జాతీయంగా విశ్వసనీయ వస్త్ర తయారీ-సరఫరా కూడలిగా భారత్ రూపాంతరం చెందడాన్ని ప్రతిష్టాత్మక ప్రపంచ వస్త్ర రంగ కార్యక్రమమైన ‘భారత్ టెక్స్-2026 స్పష్టం చేస్తోంది. ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులను ఇది ఒకే వేదికపైకి తెస్తుంది. తద్వారా వికసిత భారత్-2047 స్వప్న సాకారం దిశగా ప్రస్థానంలో భాగంగా పటిష్ట, సుస్థిర, భవిష్యత్ సంసిద్ధ వస్త్ర విలువ శ్రేణిని రూపొందించడంలో భారత్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
భారత్ టెక్స్-2026 విశిష్టత
‘భారత్ టెక్స్-2026’ భారత అగ్రగామి అంతర్జాతీయ వస్త్ర రంగ ప్రదర్శన. దీన్ని కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ మద్దతుతో వస్త్ర ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమల సంఘాల ఉమ్మడి వేదిక ‘భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్’ నిర్వహిస్తోంది. ఇది నేటి నుంచి 17వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో కొనసాగుతుంది. భారతదేశపు సార్వజనీన వస్త్ర శ్రేణి వైవిధ్యాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే, వస్త్ర-దుస్తుల రంగంలో అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, అంతర్జాతీయ సహకారానికి ఇదొక ప్రధాన వేదికగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2284662)
आगंतुक पटल : 5