ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: భారత - న్యూజిలాండ్ ప్రతినిధుల స్థాయి చర్చల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 11 JUL 2026 9:01AM by PIB Hyderabad

గౌరవ ప్రధానమంత్రి,

మీరు చెప్పిన స్నేహపూర్వకమైన మధుర వాక్యాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

గతరాత్రి విమానాశ్రయంలో మీరు స్వయంగా నాకు స్వాగతం పలికిన తీరు ఎంతో విశిష్టమైనది. ఇందుకోసం నేను మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

రాత్రంతా మీ మంత్రి గారు నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ ఆర్థిక రాజధానిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా భారత్-న్యూజిలాండ్ సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చే అవకాశాన్ని మీరు కల్పించారు. దీనికి నేను మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

న్యూజిలాండ్ ప్రజల మధ్యకు రావడం, భారతదేశం పట్ల వారికున్న ఆదరాభిమానాలు- ఆత్మీయతను స్వయంగా చూడటం నా మనస్సుకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇది నా హృదయాన్ని స్పృశించింది. దీనికి కూడా నేను మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మన సంబంధాల్లో ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. మన బంధాలలోని నూతన శక్తిని, స్నేహం పట్ల పునరుద్ధరించిన మన నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోంది. మీరు భారత్‌ను సందర్శించినప్పుడు మనం ఎఫ్‌టీఏ ప్రక్రియను ప్రారంభించాం. ఇంత స్వల్ప కాలంలోనే ఎఫ్‌టీఏను ముందుకు తీసుకెళ్లి దానిని సాకారం చేయడానికి మొత్తం న్యూజిలాండ్ ఏకతాటిపైకి వచ్చింది. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి విజయాన్ని సాధించడం బహుశా ప్రపంచంలోనే అరుదైన ఘనత. దీనికి మీ నాయకత్వానికి, మీ ప్రభుత్వానికి, మీ మొత్తం బృందానికి, వారి కృషికి నేను నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

గత సంవత్సరం హోలీ పండుగ సమయంలో మీరు భారత్‌ను సందర్శించారు. మీ పర్యటన మన సంబంధాలకు సరికొత్త రంగులను అద్దింది. హోలీ రంగులకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ స్ఫూర్తిని మనం కలిసి చూశాం. నేడు మనం మన సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం అనే సరికొత్త చట్రంలోకి తీసుకెళ్లడానికి అడుగులు వేస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మరింత నూతన శక్తి, మరింత లోతైన విశ్వాసంతో మనం ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుంది.

గౌరవ ప్రధానమంత్రి,

ప్రజాస్వామ్య విలువలపై మనకున్న బలమైన నమ్మకమే మనల్ని సహజ భాగస్వాములుగా నిలబెట్టింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన బంధం ఒకరి కోసం ఒకరం ఏర్పడినట్టుగా ఉంటుంది. రెండు సముద్రతీర దేశాలుగా మన మధ్య ఉన్న సన్నిహిత సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త బలాన్ని చేకూరుస్తుంది. శాంతి, స్థిరత్వం అనే మన ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో మన సంబంధాలు సరికొత్త శక్తిని నింపగలవు.

నా ఈ పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని.. ప్రపంచ శాంతి, స్థిరత్వం, భద్రతలకు మన వంతు సహకారాన్ని ఉమ్మడిగా పెంపొందిస్తుందని నేను నమ్ముతున్నాను. మనం ఒక రకంగా ఒక ఉత్ప్రేరకం వలె పనిచేయగలం. శాంతి కోసం నిలబడే, శాంతి కోసం శ్రమించే, శాంతి మార్గం ద్వారా ప్రపంచ సంక్షేమం వైపు దూసుకుపోయే ఒక శక్తిగా మనం నిలవగలం.

మీరు అందించిన ఘన స్వాగతానికి, మీ ఆదరాభిమానాలకు, నాకు చూపిన గౌరవానికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గమనిక : ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు. 


(रिलीज़ आईडी: 2283927) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam