ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సముద్రంలో చేపలు పట్టే వృత్తికి సంబంధించిన అధికార పత్రాల జారీ... జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్


భారత నౌకావాణిజ్య ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘హైసీస్ కార్యక్రమం’: ఉపరాష్ట్రపతి

చేపలు పట్టే వృత్తిని సైన్సు, టెక్నాలజీపై ఆధారపడిన ఓ ఆధునిక వృత్తిగా యువత చూడాలన్న ఉపరాష్ట్రపతి

చేపలు పట్టడమనేది ఓ నైతిక బాధ్యత...
అభివృద్ధి, సంరక్షణ కలిసి ముందుకు సాగాలి: ఉపరాష్ట్రపతి

ప్రత్యేక ఆర్థిక మండలం, హైసీస్ కార్యక్రమం సాయంతో
అపార సామర్థ్యాన్ని సద్వినియోగపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్న భారత్: ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 09 JUL 2026 1:32PM by PIB Hyderabad

సముద్ర మధ్యం (హైసీస్)లో సుస్థిర ప్రాతిపదికన చేపలు పట్టేందుకు అధికార పత్రాలను జారీ చేయడానికి సంబంధించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంటు’ను కూడా విడుదల చేశారు. దీంతో పాటు, దేశవ్యాప్తంగా పది ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల  (ఎఫ్‌పీపీఓస్)కు, మత్స్యకారులకు సముద్ర మధ్యంలో చేపల వేటకు ఉద్దేశించిన అధికార పత్రాల్ని ఆయన అందజేశారు.  
సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమం భారత సముద్ర వాణిజ్య నౌకాయానంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని వర్ణించారు. దీంతో భారతీయ మత్స్యకారులు దేశంలో ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్), సముద్ర మధ్యంలో ఉండే విశాల వనరులను నిరంతర ప్రాతిపదికన సద్వినియోగ పరుచుకోగలుగుతారని ఆయన అన్నారు. మత్స్య పోషణ రంగంలో వృద్ధి, నిరంతరత్వం, సౌభాగ్యాల తాలూకు నవ శకాన్ని మత్స్యకారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొన్న ఉమ్మడి సంకల్పాన్ని  ఈ కార్యక్రమం చాటుతోందని కూడా ఆయన అన్నారు.    
భారత్‌కు 11,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పొడవున విస్తరించిన కోస్తాతీరప్రాంతం ఉందని, దీనిలో ప్రత్యేక ఆర్థిక మండలమే (ఈఈజడ్) సుమారు 24 లక్షల చ.కి.మీ. ఉందని, ఇది అపార జల వనరులకు నిలయమని, వీటిని ఇంతవరకు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచలేదని  ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. సాంప్రదాయికంగా చూస్తే చేపలు పట్టే కార్యకలాపాలు తీరానికి దగ్గరగానే ఉంటాయని, అయితే భారతీయ మత్స్యకారులు ట్యూనా వంటి అధిక విలువ కలిగిన చేపల జాతుల నిరంతర వేట కోసం లోతయిన సముద్ర జలాల్లోకి ఆత్మవిశ్వాసంతో వెళ్లేందుకు కొత్త ప్రాథమిక ప్రణాళిక వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.
భారత్‌ మత్స్య పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోందని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, భారత్ ఇవాళ ప్రపంచంలో చేపల ఉత్పాదనలో రెండో అతి పెద్ద ఉత్పాదక దేశంగా పేరు తెచ్చుకుందని, ప్రపంచంలోని మత్స్య ఉత్పాదనల్లో దాదాపు 8 శాతం మన దేశమే అందిస్తోందని అన్నారు. మత్స్యకారులు, మత్స్య పాలకులు కలిపి దాదాపు 3 కోట్ల మందికి జీవనోపాధిని  ఈ రంగం కల్పిస్తోందని, సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.73,000 కోట్లను మించాయని తెలిపారు. ‘హై సీస్ (సముద్ర మధ్యం) కార్యక్రమం’ భారత్ ఎగుమతి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాక, దీంతో చేపలను పట్టే, శుద్ధి చేసే (ప్రాసెసింగ్), ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థను జత పరిచిన నిలవ సదుపాయాలు (కోల్డ్ చైన్), రవాణా, ప్యాకేజింగ్, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ, ఎగుమతి సేవల్లో ఉద్యోగావకాశాలు లభించగలవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.  
అధికార పత్రాల (ఆథరైజేషన్ లెటర్స్) జారీ ప్రక్రియలో మత్స్య సహకార సంఘాలు, మత్స్య రైతు ఉత్పాదన సంస్థలు, భారతీయ మత్స్యకారులకు కొత్త ప్రాథమిక ప్రణాళిక ప్రాధాన్యాన్ని ఇస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమం కోస్తా తీర ప్రజలకు సాధికారతను కల్పించే దిశగా తీసుకున్న ఒక కీలక నిర్ణయమని ఆయన అన్నారు. ఉమ్మడి ప్రయత్నాలతో మత్స్య పోషణ రంగంలో పెనుమార్పును తీసుకు రావడం సాధ్యపడుతుందని ఉపరాష్ట్రపతి స్పష్టంచేశారు.
చేపలు పట్టడం ఒక నైతిక బాధ్యత అని ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. ఆర్థిక ప్రగతి, సముద్ర వనరుల సంరక్షణ ఒకదానితో మరొకటి పరస్పర ఆధారితమై ముందుకు సాగాలని ఆయన అన్నారు. డిజిటల్ అధికృత వ్యవస్థలు, నౌకల ట్రాకింగు, అంతర్జాతీయ ధ్రువపత్రాల ప్రక్రియ, చట్టవిరుద్ధ, అనధికార, అనియంత్రిత పద్ధతుల్లో చేపల వేటకు వ్యతిరేకంగా కఠిన చర్యలను తీసుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చేపలు పట్టే వృత్తిని  విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆధారపడిన ఆధునిక వృత్తిగా చూడాలంటూ  ఉపరాష్ట్రపతి యువతను కోరారు. 2047 కల్లా వికసిత్ భారత్ విజనును సాధించడానికి జ్ఞానాన్ని, సాంకేతికతని, ఆర్థిక సహాయాన్ని చేపలు పట్టే వృత్తిలో ఉన్న వర్గాలకు అందించాల్సిందిగా సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒడిశా గవర్నరు శ్రీ హరి బాబు కంభంపాటి, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్, ఒడిశా మత్స్య, ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ మంత్రి శ్రీ గోకులానంద మల్లిక్, కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ చెందిన సీనియర్ అధికారులు, మత్స్య సంస్థల ప్రతినిధులు, మత్స్యకారుల సంఘాల ప్రతినిధులతో పాటు ఇతర ఆసక్తిదారులు ఉన్నారు.

 

 

 

***


(रिलीज़ आईडी: 2282887) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Malayalam