ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
నాడు పోస్టు చేయడమైనది:
07 JUL 2026 8:20PM by PIB Hyderabad
గౌరవనీయులైన ఇండోనేషియా అధ్యక్షులు,
గౌరవ ఉపాధ్యక్షులు,
గౌరవనీయులైన స్పీకర్లు,
విశిష్ట పార్లమెంటు సభ్యులు,
మహాశయులారా,
నా ప్రియమైన ఇండోనేషియా సోదరీసోదరులారా,
అందరికీ నమస్కారం.
సెలమత్ సియాంగ్!
నా సహబత్ సెజాతీ - నిజమైన స్నేహితుల మధ్య ఉండటం ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నాను.
ఈ రోజు మీ అందరి మధ్య ఉండటం నాకు లభించిన గొప్ప గౌరవం, అదృష్టం. 1.4 బిలియన్ల మంది భారతీయులకు ప్రతినిధిగా, ప్రజాస్వామ్యానికి తల్లిగా పరిగణించే దేశానికి చెందిన పౌరునిగా నేను మీ మధ్య నిలబడ్డాను. భారతీయ ప్రజలందరి తరఫున ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.
స్నేహితులారా,
ఈ రోజు ఉదయం, ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించే అదృష్టం నాకు లభించింది. కోట్లాది మంది భారత ప్రజల పట్ల ఇండోనేషియా ప్రజలకున్న ఆత్మీయతను ప్రతిబింబిస్తున్న ఈ గౌరవాన్ని నేను వినయపూర్వకంగా, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. మనం ఆచరిస్తున్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను, వారసత్వాన్ని, రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఈ గౌరవం తెలియజేస్తోంది. ఈ విశిష్ట పురస్కారాన్ని అందించిన మీ అందరికీ, అధ్యక్షులు ప్రబోవోకు, ఇండోనేషియా ప్రభుత్వానికి, ఇండోనేషియా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
గౌరవ సభ్యులారా,
ఇప్పుడు భారత్, ఇండోనేషియా దేశాలు చరిత్రలో ఓ ముఖ్యమైన సమయంలో కలసి నిలబడ్డాయి. ఈ శతాబ్దంలో మొదటి పావు భాగం గడచిపోయింది. వచ్చే పాతికేళ్లు మన రెండు దేశాలకు అత్యంత ముఖ్యమైనవి. విశిష్టమైన ఇండోనేషియా నేలపై, మన ఉమ్మడి అభివృద్ధి ప్రయాణంపై విశ్వాసంతో మీ ముందు నిలబడ్డాను. భారత్, ఇండోనేషియా రెండూ కలసి సరి కొత్త ఆశ, లక్ష్యం, శక్తితో మానవాళికి స్ఫూర్తిని అందిస్తాయనే విశ్వాసంతో మీ ముందుకు వచ్చాను.
ఉమ్మడి లక్ష్యం, సమష్టి కృషితో 1.4 బిలియన్ల మంది భారత ప్రజలు, 290 మిలియన్ల మంది ఇండోనేషియా ప్రజలు కలసి ముందుకు సాగినప్పుడు.. చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కావడాన్ని ఈ ప్రపంచం వీక్షిస్తుంది.
విస్తరణను కాకుండా అభివృద్ధిని విశ్వసించే దేశం భారత్. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ - అందరితో కలసి, అందరి కోసం అభివృద్ధి అనే మార్గదర్శక సూత్రాన్ని అనుసరిస్తున్నాం.
ఇదే మంత్రంతో, ఇదే స్ఫూర్తితో ఈ రోజు నేను ఇండోనేషియా విశిష్ట పార్లమెంటు సభ్యుల ముందు నిలబడ్డాను.
గౌరవ సభ్యులారా,
మన రెండు దేశాల రాజధాని నగరాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, సముద్రం మీదుగా మన రెండు దేశాల మధ్య దూరం కేవలం 150 కి.మీ. మాత్రమే. అనేక దేశాలకు సముద్రాలు సరిహద్దులుగా, దూరానికి చిహ్నాలుగా ఉన్నాయి. అయితే ఇండియాను, ఇండోనేషియాను ఈ మహాసముద్రం ఎన్నడూ వేరు చేయలేదు. మనకు ఈ సముద్రం అడ్డంకి కాదు, వారధి. మన ఉమ్మడి భవిష్యత్తుకు కేంద్ర బిందువు.
ఇండియా, ఇండోనేషియా, ఇండియన్ ఓషన్ – ఈ పేర్లే మన రెండు దేశాల మధ్య ఉన్న బలమైన, చిరకాలంగా కొనసాగుతున్న సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వేల ఏళ్ల పాటు ఈ ప్రపంచాన్ని మన ఓడరేవులు అనుసంధానించాయి. మన నౌకలు వాణిజ్యాన్ని, సంస్కృతిని, ఆలోచనలను సుదూర తీరాలకు మోసుకెళ్లాయి. మన ఉమ్మడి భవిష్యత్తుకు అవసరమైన అనేక అవకాశాలను ఈ సముద్రాలు అందిస్తూనే ఉన్నాయి. ఈ మహా సముద్రానికున్న విస్తృతినే స్ఫూర్తిగా తీసుకొని ఇండియా-ఇండోనేషియా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
భారత్, ఇండోనేషియా సముద్రాన్ని మాత్రమే కాకుండా ఉమ్మడి చరిత్రను కూడా పంచుకుంటున్నాయి. మన సంబంధాలు – కాలానికి అతీతమైన రామాయణ, మహాభారతాల వారసత్వంలో ఉన్నాయి. శతాబ్దాల క్రితమే ఈ తీరానికి చేరుకున్న నలంద విజ్ఞానంలో ఉన్నాయి. వాయాంగ్, నృత్యం, సంగీత సంప్రదాయాల్లో కూడా ఉన్నాయి.
బోరోబుదూర్, ప్రంబనన్ లాంటి గొప్ప కట్టడాల ద్వారా మనం అనుసంధానమై ఉన్నాం. ఇండోనేషియా జాతీయ చిహ్నం గరుడ ద్వారా కూడా మనం ఏకమయ్యాం. బలి జాతర పండగ స్ఫూర్తి, ఉత్సవాల ద్వారా మనం అనుసంధానమై ఉన్నాం. ఇక ఆహారం విషయానికి వస్తే.. క్రుపక్, అప్పడంలో ఏది బాగా కరకరలాడుతుందో చెప్పడం కష్టం. ఒకటి మాత్రం నిశ్చయం – మసాలా, బుంబు రెండూ మన జీవితాలకు గొప్పదనాన్ని, రుచిని జోడిస్తాయి.
మిత్రులారా,
భారత దేశ పశ్చిమ తీరంలో ఉన్న గుజరాత్ నా స్వరాష్ట్రం. శతాబ్దాల క్రితం గుజరాత్ నుంచి వర్తకులు, సూఫీ సాధువులు సముద్ర మార్గం ద్వారా ఇండోనేషియాకు వచ్చారని, తమతో పాటు ఇస్లాం సందేశాన్ని, విలువలను తీసుకువచ్చారని చెబుతుంటారు. ఇప్పటికీ గుజరాత్‌లోని పటోలా వస్త్రాలను ప్రతిష్ఠకు, విశిష్టతకు చిహ్నాలుగా భావిస్తారు. వాటి ప్రభావం సుసంపన్నమైన ఇండోనేషియా బాతిక్ కళలో ఇప్పటికీ కనిపిస్తుంది.
ఒక సందర్భంలో ‘‘రక్త సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలతో భారత్, ఇండోనేషియా ప్రజలు ముడిపడి ఉన్నారు’’ అని అధ్యక్షులు సుకర్ణో చెప్పడానికి ఇదే కారణం.
మిత్రులారా,
మన పూర్వీకులు అనేక అనుభవాలను కలసి ఎదుర్కొన్నారు. మన ప్రజలు సుదీర్ఘ కాలం విదేశీ పాలనలో ఉన్నారు. మన రెండు దేశాలు కూడా దాదాపు ఒకే సమయంలో స్వాతంత్ర్యాన్ని పొందాయి. 1945లో ఇండోనేషియా, 1947లో భారత్ స్వాతంత్ర్యాన్ని సాధించాయి. తన సార్వభౌమత్వం ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ఇండోనేషియా చేసిన స్వాతంత్ర్య పోరాటానికి భారత్ దృఢమైన మద్దతును అందించింది. ఐక్యరాజ్యసమితిలో ఈ ఆశయానికి బలమైన గొంతుకగా మారింది.
ఆ నిర్ణయాత్మక సమయంలో, గౌరవ బిజు పట్నాయక్ పోషించిన పాత్ర మన ఉమ్మడి చరిత్రలో గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. ప్రధానమంత్రి సుతాన్ సహ్రీర్, ఉపాధ్యక్షులు మహమ్మద్ హట్టాను ఇండియాకు సురక్షితంగా తీసుకురావడంలో ఆయన ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల... మన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశాయి.
గౌరవ సభ్యులారా,
మన బంధాన్ని మరింత దగ్గర చేసిన మరో ముఖ్యమైన అంశం... ప్రజాస్వామ్యం పట్ల, భిన్నత్వంలో ఏకత్వం పట్ల మనకున్న ఉమ్మడి నిబద్ధత. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి దేశం భారత్. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండోనేషియా.
వందలాది భాషలకు, ఘనమైన సంస్కృతులకు భారత్ పుట్టినిల్లు. అలాగే ఇండోనేషియా కూడా వందలాది భాషలు, వైవిధ్యమైన సంస్కృతీ సంప్రదాయాలతో వర్ధిల్లుతోంది. వసుధైక కుటుంబం – ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే శాశ్వత సూత్రం ఆధారంగా భారత్ ముందుకెళుతోంది. ఇండోనేషియా కూడా బిన్నేకా తుంగల్ ఇక – భిన్నత్వంలో ఏకత్వం అనే తత్వంతో స్ఫూర్తి పొందింది. మన రెండు దేశాలూ మన ప్రజాస్వామ్యానికి, మన ఐక్యతకు ఈ వైవిధ్యాన్నే పునాదిగా చేసుకున్నాయి.
గౌరవ సభ్యులారా,
1950లో భారత్ మొదటి గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించిన సందర్భంలో ముఖ్య అతిథిగా అధ్యక్షులు సుకర్ణో హాజరయ్యారని ఇప్పుడే మన గౌరవ స్పీకర్ గుర్తు చేసుకున్నారు. అదే కాలంలో.. నిర్వహించిన బాండుంగ్ సదస్సులో స్వతంత్ర్య దేశాలకు తమ నిర్ణయాలను తామే తీసుకొనే సార్వభౌమాధికారం ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని అధ్యక్షులు సుకర్ణో, ప్రధానమంత్రి నెహ్రూ ఈ ప్రపంచానికి తెలియజేశారు.
గౌరవ సభ్యులారా,
సంస్కరణల ద్వారా ప్రజాస్వామ్యానికున్న అసలైన సామర్థ్యాన్ని ఇండోనేషియా ఈ ప్రపంచానికి ప్రదర్శించింది. గడచిన రెండు దశాబ్దాలుగా.. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతూ.. మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చింది.
భారత దేశ ప్రజాస్వామ్య ప్రయాణం కూడా ఇదే కథను చెబుతుంది. ప్రస్తుతం, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. గడచిన దశాబ్దంలో 250 మిలియన్ల మందికి పైగా భారతీయులు పేదరికాన్ని అధిగమించారు.
అందుకే, మిత్రులారా! భారత్, ఇండోనేషియా కలసి నిలబడితే... ప్రజాస్వామ్యం అవకాశాలను సృష్టిస్తుందనే, విశ్వాసాన్ని పెంపొందిస్తుందనే ప్రపంచం నమ్మకాన్ని బలోపేతం చేయవచ్చు.
ప్రజాస్వామ్యమే భవిష్యత్తును నిర్మిస్తుంది. మన ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ఉమ్మడి ఆకాంక్షలు భారత్–ఇండోనేషియా సంబంధాలను నూతన శిఖరాలకు చేరుస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
కొత్తగా స్వాతంత్ర్యం సాధించిన దేశాలుగా మనం కలసి ప్రారంభించిన ఈ ప్రయాణం త్వరలోనే వందేళ్లను పూర్తి చేసుకుంటోంది. ఇండోనేషియా ఎమాస్ 2045 లక్ష్యంతో ఇండోనేషియా ముందుకు వెళుతోంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే సంకల్పంతో భారత్ ముందుకు ప్రయాణిస్తోంది. ఈ జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో మన రెండు దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవాలి. ఈ ఉమ్మడి ఆశయాల సాధనలో ఒకరినొకరు బలపరచుకోవాలి.
అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో మనం ఉన్నాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉన్నాం. మనం నౌకా వాణిజ్యంలో ప్రధాన దేశాలుగా కూడా ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మనం బలమైన గొంతుకగా ఉన్నాం. మనం ప్రాచీన నాగరికతలకు చెందిన వాళ్లం. అలాగే భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహజ భాగస్వాములుగా ఉన్నాం.
ఈ ప్రయాణంలో, కేవలం భాగస్వాములుగానే కాకుండా.. ఒకరికొకరు అండగా నిలబడదాం. ఈ దార్శనికతతోనే.. అధ్యక్షులు ప్రబవోతో ఈ రోజు నేను సమగ్ర చర్చలు జరిపాను. మన లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న ఈ సద్భావనను, పరస్పర విశ్వాసాన్ని మన ప్రజల కోసం నూతన అవకాశాలుగా మనం మలచుకోవాలి.
గతేడాది, మన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపుగా 25 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం వందకు పైగా భారతీయ సంస్థలు ఇండోనేషియాలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మనం వేగంగా కలసి ముందుకు సాగుతున్నామనే దానిలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో మన కోసం గొప్పవైన, అంతులేని అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.
గౌరవ సభ్యులారా,
భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్న రంగాల్లో అనంత శిఖరాలకు చేరుకొనే సామర్థ్యం భారత్, ఇండోనేషియాకు ఉన్నాయి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానమే దీనికి ఉదాహరణ. ఇప్పుడు, అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యాలను ప్రపంచమంతా గుర్తిస్తోంది. ఈ ప్రయాణంలో ఇండోనేషియాను తన సహజ భాగస్వామిగా భారత్ గుర్తిస్తుంది.
అనేక సంవత్సరాలుగా బియాక్‌లోని ఉపగ్రహ పర్యవేక్షణ సౌకర్యాలు భారత దేశ అంతరిక్ష కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నాయి. భారత్ కూడా అనేక ఇండోనేషియా ఉపగ్రహాలను ప్రయోగించింది. అంతరిక్ష రంగంలో సామర్థ్య నిర్మాణానికి సహకరించింది. ఇప్పుడు ఈ సహకారాన్ని మరో మెట్టు ఎక్కించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఉపగ్రహ అనువర్తనాలపై కలసి పనిచేయవచ్చు. ఇండోనేషియాలో ఉపగ్రహ ప్రయోగ సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
మిత్రులారా,
ఘనమైన మన నౌకా వాణిజ్య వారసత్వాన్ని పరిరక్షించేందుకు, నిర్వహించేందుకు 5వేల ఏళ్లనాటి ఓడరేవు అయిన లోథాల్‌లో జాతీయ నౌకా వాణిజ్య వారసత్వ సముదాయాన్ని మేం నిర్మిస్తున్నాం.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగం కావాల్సిందిగా ఇండోనేషియాను కోరుతున్నాను.
గౌరవ సభ్యులారా,
ఉగ్రవాదం లాంటి సమస్యలపై భారత్, ఇండోనేషియా ఎల్లప్పుడూ ఒకే విధమైన అభిప్రాయంతో ఉన్నాయి. గతేడాది, పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భారత్ పక్షాన ఇండోనేషియా దృఢంగా నిలబడింది. మీరు అందించిన మద్దతుకు గాను అధ్యక్షులు ప్రబోవోకు, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఉమ్మడి కార్యాచరణ బృందం ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మన రెండు దేశాలు కలసి పని చేస్తున్నాయి. నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సైబర్ ముప్పులు, ఉగ్రవాదులకు నిధులను అడ్డుకోవడం, తీవ్రవాద భావజాల నిర్మూలన తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతిని బలోపేతం చేయవచ్చు.
గౌరవ సభ్యులారా,
ప్రస్తుతం ప్రపంచ క్రమం వేగంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాన భాగస్వామ్యాన్ని, విస్తృత పాత్రను కోరుకుంటున్నాయి. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఆలస్యం చేయకూడదని భారత్ బలంగా విశ్వసిస్తోంది.
2022లో ఇండోనేషియా, 2023లో భారత్ జీ20కి అధ్యక్షత వహించడం ద్వారా... అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలను అంతర్జాతీయ చర్చలకు కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించాయి.
అంతర్జాతీయ సమస్యలపై కలసి నిలబడేందుకు అవసరమైన పునాదిని ఇండోనేషియా సంప్రదాయమైన బేబస్-అక్తిఫ్ (స్వతంత్రమైన, క్రియాశీలకమైన విదేశాంగ విధానం), వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి పట్ల భారతదేశానికున్న నిబద్ధత అందిస్తున్నాయి.
స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో ఉండే, సమ్మిళిత్వంతో కూడిన ఇండో-పసిఫిక్‌కు బలమైన మద్దతుదారుగా భారత్ ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని భారత్ సమర్థిస్తోంది. దీనిని సాధించేందుకు మా విధానానికి కేంద్రంగా ఆసియాన్‌ను ఉంచాం. మా యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా ఆసియాన్ కేంద్రంగానే ఉంది. భారత్, ఆసియాన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతూనే ఉంది. కాబట్టి ఈ దిశగా భారత్, ఇండోనేషియా స్థిరంగా కలసి పని చేయాల్సిన అవసరం ఉంది.
గౌరవ సభ్యులారా,
మన ముందు మరో మంచి అవకాశం ఉంది. గతేడాదే ఇండోనేషియాకు బ్రిక్స్‌లో శాశ్వత సభ్యత్వం లభించింది. ఈ ఏడాది బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. బ్రిక్స్ వేదికను మరింత ఆచరణీయంగా, మరింత సమతౌల్యంగా, గ్లోబల్ సౌత్ అవసరాలకు మరింత స్పందించేదిగా మార్చేందుకు మనం కలసి పనిచేద్దాం.
గౌరవ సభ్యులారా,
ఈ రోజు, ఇండోనేషియా పార్లమెంటు సభ్యులందరి సమక్షంలో... ఇండియా-ఇండోనేషియా భాగస్వామ్యంలో సరికొత్త శకానికి పిలుపునిస్తున్నాను. గంగా, మహకం నదీ ప్రవాహాల మాదిరిగానే... మన నాగరికతలు కూడా శతాబ్దాలుగా ఆలోచనలు, నమ్మకం, వర్తకం, సంస్కృతితో అనుసంధానమై ఉన్నాయి. భవిష్యత్తు కోసం ఈ చరిత్రాత్మక సంబంధంలో నూతన శక్తిని నింపేందుకు ఈ రోజు మీ అందరి ముందు గంగ-మహకం దార్శనికతను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాను.
ఈ దార్శనికత మన భాగస్వామ్యాన్ని కేవలం ప్రస్తుత అవసరాలకే పరిమితం చేయదు. ఇది భవిష్యత్ తరాలకు శాంతి, శ్రేయస్సు, భద్రత, ఉమ్మడి పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.
మొదటిది... నాగరికతా అనుసంధానం
మన నాగరికతా సంబంధాలను యువ తరాల చైతన్యంతో మనం అనుసంధానిస్తాము. రామాయణం నుంచి బోరోబుదూర్ వరకు, సముద్రయాత్రల నుంచి సాంస్కృతిక వినిమయం వరకు, మన ఉమ్మడి చరిత్రను భవిష్యత్తుకు శక్తిని అందించేదిగా మారుస్తాం. దీనిని సాధించడానికి, మనం భారత్-ఇండోనేషియా నాగరికతా చర్చను ప్రారంభించాలి.
రెండోది... ఉమ్మడి అభివృద్ధి
అభివృద్ధి చెందిన దేశాలుగా మారే దిశగా చేస్తున్న ప్రయాణంలో భారత్, ఇండోనేషియా దృఢమైన భాగస్వాములుగా కొనసాగుతాయి. ఇండోనేషియా అనుసరిస్తున్న 'ఇండోనేషియా ఎమాస్ దార్శనికత', భారతదేశ 'వికసిత్ భారత్ లక్ష్యం'... ఒకదానికొకటి తోడ్పడుతూ ఇరు దేశాల పురోగతిని వేగవంతం చేస్తాయి. అలాగే రెండు దేశాలు పరస్పరం సాధికారతను అందించుకుంటూ మన ప్రజలకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తాయి.
మూడోది... భద్రత, వ్యూహాత్మక విశ్వాసం
మన రక్షణ, భద్రత సహకారాన్ని నూతన శిఖరాలకు మనం తీసుకెళ్లాలి. మన దేశాల సామర్థ్యాలను మనం కలసి బలోపేతం చేసుకోవాలి. ఉగ్రవాదాన్ని, సైబర్ నేరాలను, సముద్ర భద్రత సవాళ్లను, కొత్తగా ఎదురవుతున్న భద్రతా ముప్పులను కలసి ఎదుర్కొందాం. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న వ్యూహాత్మక విశ్వాసం బలమైన పునాదిగా పనిచేస్తుంది.
నాలుగోది... నౌకా వాణిజ్య అభివృద్ధి
రెండు గొప్ప నౌకా వాణిజ్య దేశాలుగా... మన ఉమ్మడి సముద్ర భౌగోళిక ప్రాంతాన్ని ఉమ్మడి శ్రేయస్సుగా మనం తీర్చిదిద్దుతాం. సబంగ్ నుంచి గ్రేట్ నికోబార్ వరకు, మలక్కా సంధి నుంచి ఇండో–పసిఫిక్ వరకు అనుసంధానంలో, సరకు రవాణాలో, సముద్ర ఆర్థిక వ్యవస్థలో, సముద్ర భద్రతలో, స్థిరమైన వర్తకంలో నూతన అవకాశాలను మనం సృష్టిస్తాం.
అయిదోది... గ్లోబల్ సౌత్ వాణి
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు మరింత బలమైన స్వరాన్ని మనం అందిస్తాం. అభివృద్ధి సమ్మిళితంగా ఉండే, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండే, అంతర్జాతీయ పాలన న్యాయంగా, సమానంగా, ప్రాతినిధ్యం వహించేలా ఉండే ఒక సరికొత్త ప్రపంచ వ్యవస్థ కోసం మనం కలిసి పనిచేస్తాం.
మిత్రులారా,
భారత్, ఇండోనేషియా కలసి, మానవాళిలో అయిదో వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మన భాగస్వామ్యం కేవలం రెండు దేశాల మధ్య సంబంధం మాత్రమే కాదు-ఇది ఇండో-పసిఫిక్ స్థిరత్వానికి, గ్లోబల్ సౌత్ బలానికి, ప్రపంచ భవిష్యత్తుపై ఉమ్మడి నమ్మకం పట్ల ప్రదర్శించే నిబద్ధత. మన చరిత్రాత్మక స్నేహాన్ని ఒక కొత్త శకంలోకి తీసుకువెళ్దాం. గంగా-మహకం దార్శనికతను సాకారం చేయడానికి కలిసి పనిచేద్దాం.
గౌరవ సభ్యులారా,
భారత దేశంలో.. గొప్ప కవి, సాధువు అయిన తులసీదాస్ ఇలా రాశారు:
జానే బిను న హోయి పరతీతీ।
జానే బిను న హోయి పరతీతీ।
బిను పరతీతి హోయి నహి ప్రీతీ॥
అంటే, ప్రజలు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోనంత వరకు, వారి మధ్య నమ్మకం ఏర్పడదు. నమ్మకం లేనిదే ప్రేమ లేదా అనురాగం ఉండదు.
ఇదే విషయాన్ని తెలియజేసే సామెత ఇండోనేషియాలోనూ ఉందని నాకు చెప్పారు.
‘‘తాక్ కెనాల్ మాకా తాక్ సాయాంగ్’’
- ఒకరి గురించి తెలుసుకోకుండా వారి పట్ల నిజమైన శ్రద్ధ చూపించలేం.
అందుకే...
మన ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని మేం నిర్ణయించాం. అధ్యక్షులు ప్రబోవో, నేను ఈ సాయంత్రం ఇండోనేషియాలోని ప్రవాస భారతీయులతో సమావేశమవుతాం. అధ్యక్షుడు ప్రబోవో, నేను కలసి రేపు ప్రంబనన్‌ను సందర్శిస్తాం. అక్కడ ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని పరిరక్షించే, పునరుద్ధరించే ప్రాజెక్టును ప్రారంభిస్తాం. చరిత్ర మనకు అప్పగించిన ఈ అమూల్యమైన ఈ వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు, పరిరక్షించేందుకు భారత్, ఇండోనేషియా కట్టుబడి ఉన్నాయి.
గౌరవ సభ్యులారా,
ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరినీ భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మీ కుటుంబంతో, మీ స్నేహితులతో కలసి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు భారతీయులు సంతోషంగా, మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతారు.
మనం మిత్ర సెలమాన్యా – శాశ్వత భాగస్వాములుగా నిలిచిపోతామనే విశ్వాసం నాకుంది. భారత్, ఇండోనేషియా ప్రజల ఉమ్మడి శ్రేయస్సు కోసం మనం కలిసి ఒక సరికొత్త భవిష్యత్తును నిర్మిద్దాం. ఈ మాటలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
ఇండోనేషియా వర్థిల్లాలి!
భారత్ మాతాకీ జై!
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధాని హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2282508)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15