గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వీబీ-జీ-రామ్-జీ కోసం మొదటి విడతగా రాష్ట్రాలకు రూ. 25,863 కోట్లు విడుదల
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఒకే రోజున విజయవంతంగా, సజావుగా అమల్లోకి వీబీ-జీ-రామ్-జీ
ఏ రాష్ట్రంలోనూ రోజుకు రూ.300 కంటే తక్కువ వేతన రేటు ఉండదు
సకాలంలో వేతనాల చెల్లింపులు, పారదర్శకత, నాణ్యమైన ఆస్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
प्रविष्टि तिथि:
05 JUL 2026 1:03PM by PIB Hyderabad
వీబీ-జీ-రామ్-జీ పథకం పథకం అమలు కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొదటి విడతగా రూ.25,863 కోట్ల నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో వీడియో అనుసంధానం ద్వారా ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) [వీబీ-జీ-రామ్-జీ] పథకం అమలు తీరును ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు తొలి విడత నిధులు విడుదల చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ... దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా వీబీ-జీ-రామ్-జీ పథకాన్ని 2026 జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలు కావడం... ఎంజీఎన్ఆర్ఈజీఏ నుంచి వీబీ-జీ-రామ్-జీకి పరివర్తన సక్రమంగా, సజావుగా జరగడం సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి సాంకేతిక, సమస్యలు తలెత్తినట్లు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.
పేద కార్మికులకు సేవ చేయడం దేవుడికి సేవ చేసినట్లేనని కేంద్ర మంత్రి అన్నారు. గ్రామీణ కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధి, సకాలంలో వేతన చెల్లింపులు, మన్నికైన గ్రామీణ ఆస్తుల సృష్టిని నిర్ధారించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు కావడానికి దాదాపు మూడేళ్లు పట్టగా, వీబీ-జీ-రామ్-జీని ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, రాష్ట్రాల సహకారం, దేశ పరిపాలనా సామర్థ్యం కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. దీనిని ఒక గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. ఇది ప్రధానమంత్రి నిబద్ధత, సుపరిపాలన, సమర్థమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
పథకం ప్రాథమిక పురోగతిని సమావేశంలో ఆయన సమీక్షించారు. మొదటి వారంలోనే పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమయ్యాయనీ, లక్షలాది గ్రామీణ కార్మికులకు ఉపాధి లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. తొలి రోజే పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిన ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన గ్రామ పంచాయతీల్లోనూ వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లను ఆయన కోరారు. ఈ పథకాన్ని నోటిఫై చేసి, అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయాలని జార్ఖండ్‌ను అభ్యర్థించారు. ఆర్‌బీఐ ఖాతాలు, ఇతర లాంఛనాలు ఇంకా పెండింగ్‌లో ఉన్న రాష్ట్రాలూ వాటిని నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరారు.
వీబీ-జీ-రామ్-జీ కింద వేతన రేట్లను సగటున సుమారు 10 శాతం పెంచినట్లు ఆయన తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇకపై రోజుకు రూ.300 కంటే తక్కువ వేతన రేటు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణ కార్మికుల ఆదాయం, సామాజిక భద్రత బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
15 రోజుల్లోగా వేతనాలు చెల్లించేందుకు రాష్ట్రాలకు తగిన నిధులు అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యంగా ఈ రోజు తొలి విడతగా రూ.25,863 కోట్లు విడుదల చేసినట్లు శ్రీ చౌహాన్ తెలిపారు. వేతనాల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులనూ సకాలంలో విడుదల చేయాలని ఆయన కోరారు.
వీబీ-జీ-రామ్-జీ పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి నిధుల కొరత ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల నుంచి అందిన డిమాండ్ ఆధారంగా తొలి విడత నిధులను విడుదల చేశామని తెలిపారు. సమ్మిళిత, భాగస్వామ్య గ్రామీణాభివృద్ధిని నిర్ధారించడానికి గ్రామ సభలు, గ్రామ పంచాయతీలు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ఎంపిక చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.
పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... ఫేస్ అథెంటికేషన్, జియో-ట్యాగింగ్, ఇతర సాంకేతిక చర్యలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. ఈ పథకంలో ఎలాంటి అవకతవకలకూ, మోసానికీ తావులేదనీ... పారదర్శకత, విశ్వసనీయత, నాణ్యమైన ఆస్తుల సృష్టిని నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
రాష్ట్రాలకు నిరంతర మద్దతునందించడం కోసం సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారుల నేతృత్వంలో మంత్రిత్వ శాఖ ఏరియా అధికారులను నియమించిందనీ ఆయన తెలిపారు. ఈ అధికారులు రాష్ట్రాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ, అమలుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చూస్తారని శ్రీ చౌహాన్ వివరించారు.
సకాలంలో వేతనాలు చెల్లించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తొలి విడత నిధులను సకాలంలో విడుదల చేసి తన బాధ్యతను నెరవేర్చిందనీ... అర్హులైన ప్రతి కార్మికుడికి నిర్దేశిత కాలపరిమితిలోగా వేతనాలు అందించడం కోసం రాష్ట్రాలూ తమ వాటాను వెంటనే విడుదల చేస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, సహాయ మంత్రి శ్రీ కమలేశ్ పాశ్వాన్, వివిధ రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి రోహిణి ఆర్. భజిభకరే, మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులూ హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2281439)
आगंतुक पटल : 7