పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇ20 ఒక పరిశుభ్ర... అత్యుత్తమ పనితీరు గల ఇంధనం


పాత వాహనాలలో క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే దీనిపై ముందడుగు పడింది: పరిశ్రమ నిపుణుల స్పష్టీకరణ

సర్వీసింగ్ చేసిన 1.5 కోట్లకు పైగా పాత వాహనాల్లో ఎలాంటి సమస్యలూ కనిపించలేదు: ఇ20పై మారుతి సుజుకి “విశ్వాస ప్రకటన”

प्रविष्टि तिथि: 04 JUL 2026 8:16PM by PIB Hyderabad

   పెట్రోలులో ఇథనాల్ మిశ్రణం ఒక ప్రణాళికాబద్ధ, శాస్త్రీయ, దశలవారీ ప్రక్రియ కాబట్టి, ఇ20 మిశ్రమ ఇంధనంపై ఆందోళన పడవద్దని వాహన యజమానులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ మేరకు పెట్రోలియం-సహజ వాయువులు, భారీ పరిశ్రమలు, రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖలు న్యూఢిల్లీలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇంధన, ఆటోమొబైల్ రంగాల్లోని ప్రసిద్ధ నిపుణులు ఇ20 మిశ్రణ కార్యక్రమంపై ప్రసంగించారు.

ఈ సమావేశంలో ప్రసంగించిన వారిలో- ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) మాజీ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వర్తికా శుక్లా, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) కంట్రీ హెడ్-ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ విక్రమ్ గులాటీ, మారుతి సుజుకి కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాహుల్ భారతి, హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ అశుతోష్ వర్మ, టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ కృష్ణన్, హ్యుందాయ్ మోటార్ ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పునీత్ ఆనంద్, బజాజ్ ఆటో లిమిటెడ్ అర్బనైట్ బిజినెస్ సర్కిల్ హెడ్-సేల్స్ (నార్త్ అండ్‌ ఈస్ట్) శ్రీ మన్‌ప్రీత్ సింగ్ బింద్రా తదితరులున్నారు.

ముందుగా శ్రీ విక్రమ్ గులాటీ మాట్లాడుతూ- అత్యంత కఠిన నియంత్రిత రంగాల్లో ఆటోమోటివ్ పరిశ్రమ ఒకటని పేర్కొన్నారు. వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందు-తర్వాత కూడా స్వతంత్ర-అంతర్జాతీయ గుర్తింపు గల సంస్థల ద్వారా కఠిన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తామని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇథనాల్ అత్యుత్తమ పనితీరు గల, పరిశుభ్ర ఇంధనంగా తేలిందని, వాస్తవానికి ఇది 1900 ప్రారంభం నుంచి ఫార్ములా రేసింగ్‌లోనూ వాడుకలో ఉందని వివరించారు. పాత వాహనాలపై కఠిన పరీక్షల అనంతరమే ఇ20కి మారడంపై నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, ఇటీవల ప్రారంభించిన ఇ85 విక్రయ కేంద్రాలు ప్రత్యేకించి పూర్తి మిశ్రమ ఇంధన (ఫ్లెక్స్ ఫ్యూయల్) వాహనాల కోసమేనని, భవిష్యత్ విధానానికి ఇది దిశానిర్దేశం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పరీక్షా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రశ్నలకు జవాబిస్తూ- సంబంధిత విధివిధానాలు ఒక్క  భారత్‌ మాత్రమే నిర్దేశించినవి కావని, శ్రీ గులాటి వెల్లడించారు. భారత్‌ ‘యూఎన్‌ఈసీఈ’ సభ్య దేశం కాబట్టి, సదరు పరీక్ష విధానాలకు అంతర్జాతీయ ప్రామాణీకరణ ఉన్నదని పేర్కొన్నారు. తదనుగుణంగా పరీక్షా సంస్థలు తగిన గుర్తింపుతో ప్రపంచమంతటా నిబంధనల మేరకు పనిచేస్తున్నాయని చెప్పారు. అలాగే, ఇతర దేశాలకు ఎగుమతి చేసే వాహనాలకూ ఈ పరీక్షలు నిర్వహిస్తారని, ఈ విధివిధానాల్లో రాజీపడే ప్రస్తక్తే ఉండదని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం శ్రీ రాహుల్ భారతి మాట్లాడుతూ- ఇ10 కోసం రూపొందించిన వాహనాలను అన్ని పారామితుల నడుమ ఇ20 ఇంధనంతో పరీక్షించామని, ఆందోళన కలిగించే అంశాలేవీ లేవని వినియోగదారులకు “విశ్వాస ప్రకటన” చేశారు. దీనిపై వివరణనిస్తూ-  2025-26లో మారుతి సుజుకి సర్వీసింగ్‌ చేసిన 2.84 కోట్ల కార్లలో, 1.5 కోట్లకు పైగా మూడేళ్లకన్నా పాతవని గుర్తుచేశారు. వాటికి ఇ20 సర్టిఫికేషన్ లేకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇ20 సంబంధిత తుప్పు, అరుగుదల, విడిభాగాల జీవితకాలం తగ్గడం వంటి సమస్యలేవీ కనిపించలేదన్నారు.

ఇక మైలేజీ విషయానికొస్తే- ఇ10తో పోలిస్తే ఇ20 కెలోరిఫిక్ విలువ 3 నుంచి 3.5 శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి, మైలేజీపై ప్రభావం కూడా అంతవరకే పరిమితమని శ్రీ భారతి వివరించారు. అంటే- లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీ సామర్థ్యంగల కారుపై ప్రభావం సుమారు 0.6 కిలోమీటర్ల స్థాయిలో మాత్రమే తగ్గుతుందన్నారు. కానీ, టైర్లలో గాలి ఒత్తిడి, డ్రైవింగ్ విధానం, గేర్ల సముచిత వాడకం, వేగం, బ్రేకింగ్, నిర్వహణ వంటి అంశాలు కూడా మైలేజీలో ఎక్కువ వ్యత్యాసానికి కారణం కాగలవన్నారు. స్వచ్ఛమైన పెట్రోలుతో పోలిస్తే ఇథనాల్ విషయంలో మెరుగైన వేగం, యాంటీ నాకింగ్, స్వల్ప కాలుష్యం వంటి సానుకూలతలతో ఆ కొద్దిపాటి మైలేజీ నష్టం పూర్తిగా భర్తీ అవుతుందని విశ్లేషించారు.

ఇ20 నిబంధనలకు మించిన భద్రత ప్రమాణాలతో వాహనాలను రూపొందించారని, ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి ‘రెట్రోఫిట్‌మెంట్ కిట్’ అందుబాటులో లేదని చెప్పారు. కాబట్టే, అటువంటి పరిష్కారాలు పరిశోధన-అభివృద్ధికి మాత్రమే పరిమితమైనట్లు ఆయన స్పష్టం చేశారు.

అటుపైన శ్రీమతి వర్తికా శుక్లా ప్రసంగిస్తూ- అంతర్జాతీయ ఉత్తమ విధానాలకు తగినట్లు భాగస్వాములందరితో చర్చించి ఇథనాల్ మిశ్రణ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు సహా ఆటోమోటివ్ తయారీదారుల నుంచి విస్తృత పరీక్షల మద్దతు ఉందన్నారు. ఇ20 ఇంధనం బీఐఎస్‌ ప్రమాణంతోపాటు బీఎస్‌-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉందని తెలిపారు. దేశంలోని అన్ని చిల్లర విక్రయ కేంద్రాల్లో ఇది ఏకరీతిగా అందుబాటులో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అనేక దేశాలు కొన్నేళ్లుగా ఇథనాల్ మిశ్రణ ఇంధనాన్ని వాడుతున్నాయని వివరించారు.

చివరగా శ్రీ అశుతోష్ వర్మ మాట్లాడుతూ- ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు సంస్థలలో ఒకటిగా విస్తృత సర్వీస్ డేటాను తమ కంపెనీ విశ్లేషించిందని చెప్పారు. పాత ఇంధనాలతో పోలిస్తే ఇ20తో నడిచే వాహనాల్లో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.

ఈ విధంగా ఇ20 కార్యక్రమంపై పరిశ్రమలకు గల సమష్టి విశ్వాసాన్ని, వినియోగదారుల ప్రశ్నలకు పారదర్శక వివరణపై నిబద్ధతను ఈ బృందం పునరుద్ఘాటించింది.

 

***


(रिलीज़ आईडी: 2281259) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Gujarati , Urdu , हिन्दी , Assamese , Tamil , Malayalam