రాష్ట్రపతి సచివాలయం
ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి
కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, జ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవాలి: విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపు
प्रविष्टि तिथि:
01 JUL 2026 2:24PM by PIB Vijayawada
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (జూలై 1, 2026) ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఈ నూతన విద్యాసంస్థ ప్రస్థానంలో కీలక మైలురాయి అని అభివర్ణించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ధి చేసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు, ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కట్టుబడి ఉండటం.. సమ్మిళిత, సమానత్వ వృద్ధిపై దానికి ఉన్న బాధ్యతను తెలియజేస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అద్భుత విద్యా కేంద్రంగా ఎదుగుతుందని, 2047 నాటికి 'వికసిత్ భారత్' స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని రాష్ట్రపతి ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు.

పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవం వారి సంవత్సరాల అంకితభావం, పట్టుదల, కఠోర శ్రమకు ప్రతిఫలమన్నారు. ఎన్నో కలలతో విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన విద్యార్థులు.. ఈ రోజు జ్ఞానం, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాల తలుపులు తెరిచే పట్టాతో బయటకు వెళ్తున్నారని అన్నారు.
విద్యార్థుల విజయం వెనుక వారి కష్టంతో పాటు తల్లిదండ్రుల త్యాగాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజ మద్దతు ఉన్నాయని.. అందుకే సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్తులో వీరంతా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలు అయినా, ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు అయినా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అయినా లేదా సమాజ సేవ చేసే దాతలు అయినా.. వారి విద్యా జ్ఞానం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు.

సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్నీ వేగంగా మార్చేస్తోందన్న రాష్ట్రపతి.. ఇలాంటి వేగంగా మారుతున్న ప్రపంచంలో పట్టా పొందడంతో విద్య పూర్తికాకూడదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని అన్నారు. తమ జ్ఞానాన్ని సృజనాత్మకత, సంకల్పం, బాధ్యతాయుత భావంతో ముడిపెట్టడం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలరని, మరింత సంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడగలరని పేర్కొన్నారు.
జీవితంలో నైతిక విలువలను ఆచరణలో పెట్టుకోవడం విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుందని రాష్ట్రపతి సూచించారు. నిజాయితీ, కరుణ, సానుభూతి, ప్రకృతి పట్ల గౌరవం ఉన్నతమైన నైతిక ఆదర్శాలు మాత్రమే కావని, అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పునాదులని ఆమె తెలిపారు. ఈ విలువలు విద్యార్థుల జీవితాన్ని సార్థకం చేయడంతో పాటు సమాజానికి, దేశానికి అర్థవంతమైన సేవలందించేలా తీర్చిదిద్దుతాయని చెప్పారు.
'వికసిత్ భారత్' దార్శనికత యువతలోని శక్తి, ప్రతిభ, అంకితభావం ద్వారానే సాకారమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా, అంకితభావంతో, నిజాయితీతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
***
(रिलीज़ आईडी: 2279922)
आगंतुक पटल : 31