రాష్ట్రపతి సచివాలయం
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి
‘ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజనుల ఆత్మవిశ్వాసం, నాయకత్వం, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నా’
విద్యార్థులు తమ కమ్యూనిటీ, సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమై ఉంటూనే... సమాజం, దేశ భవిష్యత్తును మెరుగుపరచడానికి కృషి చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
30 JUN 2026 5:41PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి అనేక ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయని అన్నారు. ఇది గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వం, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయ లక్ష్యంతో స్థాపించిన సంస్థలకు తమ ప్రాంతంలోని గిరిజన వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ విశ్వవిద్యాలయం అణగారిన, గిరిజన వర్గాల యువత సంపూర్ణ అభివృద్ధి, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం అర్థవంతమైన కృషి చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం కోసం అటవీ ఉత్పత్తులు, చేతివృత్తులు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు, పర్యావరణ పర్యాటకం, స్థానికంగా పరిశ్రమలను స్థాపించడం వంటి రంగాల్లో ఉత్పాదక పనిని సులభతరం చేస్తూ... అన్ని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు వినూత్న వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి సూచించారు.
ప్రతి విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి అని భారత రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇది వేడుక చేసుకునే రోజు మాత్రమే కాదు... తమ భవిష్యత్తు గురించి ఒక సంకల్పం తీసుకోవడానికి విద్యార్థులను ప్రేరేపించే సందర్భమని ఆమె తెలిపారు. వేగంగా మారుతున్న ప్రపంచ వాతావరణంలో నిలదొక్కుకోవడం కోసం నైపుణ్యాభివృద్ధిలో ఆవిర్భవిస్తున్న అవకాశాలపై దృష్టి పెట్టాలని భారత రాష్ట్రపతి విద్యార్థులకు సూచించారు. వారు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న పరిసరాల నుంచీ నేర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు తమ కమ్యూనిటీ, సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమై ఉంటూనే... సమాజం, దేశ భవిష్యత్తును మెరుగుపరచడానికి కృషి చేయాలని శ్రీమతి ముర్ము పిలుపునిచ్చారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో... మన వారసత్వానికి అనుసంధానమై ఉండటంతో పాటు, ఆధునిక విజ్ఞాన ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికీ అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు. ఇదే లక్ష్యంతో, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన వర్గాలను శక్తిమంతం చేయడానికి విశ్వవిద్యాలయం 'సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్'ను నిర్వహిస్తోందని ఆమె పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార-పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి రంగాల్లో ఈ విశ్వవిద్యాలయం విద్యాపరమైన, క్షేత్రస్థాయి కార్యకలాపాలపైనా దృష్టి సారించిందని రాష్ట్రపతి వివరించారు. సమానత్వంతో కూడిన, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఈ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించడమే మన లక్ష్యమని రాష్ట్రపతి అన్నారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే అర్థవంతమైన, సమ్మిళితమైన, ఆచరణాత్మక బోధనా పద్ధతి ద్వారా ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. గిరిజనులను ఆధునిక విద్యా సంబంధిత ప్రయోజనకర అంశాలతో అనుసంధానించడం ద్వారా, దేశ సమానత్వ అభివృద్ధిలో స్థానిక యువత కీలక పాత్ర పోషించడానికి వీలు కలుగుతుందని భారత రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి-
***
(रिलीज़ आईडी: 2279537)
आगंतुक पटल : 15