రాష్ట్రపతి సచివాలయం
ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి
గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయం నిలవాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విద్యార్థులు వారి సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే.. సమాజం, దేశ భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కృషి చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
30 JUN 2026 5:41PM by PIB Vijayawada
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (జూన్ 30, 2026) ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి పలు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయన్నారు. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన కేంద్రంగా ఇది ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం ధ్యేయంగా ఏర్పాటైన సంస్థలు వాటి ప్రాంతంలోని గిరిజన వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. రాబోయే సంవత్సరాల్లో ఈ విశ్వవిద్యాలయం అణగారిన, గిరిజన వర్గాల యువత సమగ్ర వికాసంతో పాటు, ఈ ప్రాంతమంతటా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి అర్థవంతమైన ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకం ఉందన్నారు.

అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, తృణధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకో టూరిజం, స్థానిక వ్యవస్థాపకత వంటి రంగాలలో ఉత్పాదక పనులను ప్రోత్సహిస్తూ.. గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి అన్ని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు వినూత్న వ్యవస్థలను కలిగి ఉండాలని రాష్ట్రపతి సూచించారు.

స్నాతకోత్సవం అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన మైలురాయి అని రాష్ట్రపతి అన్నారు. ఇది వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదు, విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఒక బలమైన సంకల్పాన్ని తీసుకునేలా ప్రేరేపించే క్షణమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానానికే పరిమితం కాకుండా, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న వ్యవస్థ నుంచి నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉంటూనే.. సమాజం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో, మన వారసత్వంతో ముడిపడి ఉంటూనే.. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదే లక్ష్యంతో ఉత్తరాంధ్రలోని గిరిజన వర్గాలను సాధికారులను చేసేందుకు ఈ విశ్వవిద్యాలయం 'సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్' ను నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార-పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి రంగాలలో విద్యాపరంగానూ, క్షేత్రస్థాయిలోనూ విశ్వవిద్యాలయం తన ప్రయత్నాలను కేంద్రీకరించిందని ఆమె అభినందించారు. ఈ ప్రయత్నాలు సమసమాజ స్థాపనకు, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
2047 వ సంవత్సరం నాటికి 'వికసిత్ భారత్' నిర్మించడమే మన లక్ష్యమని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే అర్థవంతమైన, సమగ్రమైన, ఆచరణాత్మక బోధనా పద్ధతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలను ఆధునిక విద్యా ప్రయోజనాలతో అనుసంధానించడం ద్వారా, స్థానిక యువత దేశ సమానత్వ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించేలా ఈ సంస్థ తోడ్పడుతుందని రాష్ట్రపతి దౌపది ముర్మూ ఆకాంక్షించారు.
*****
(रिलीज़ आईडी: 2279515)
आगंतुक पटल : 27