హోం మంత్రిత్వ శాఖ
‘ఎఫ్‌సీఆర్‌ఏ 2.0’ పోర్టల్.. ‘ఇ-ఓసీఐ కార్డు’ను ప్రారంభించిన కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
“ఇవి రెండూ పౌరులకు ఎంతో సౌలభ్యాన్నిస్తాయి... ముఖ్యంగా ‘ఇ-ఓసీఐ’ కార్డుతో 50 లక్షల మందికి పైగా ప్రయోజనం పొందుతారు”
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ‘కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ సూత్రం ప్రాతిపదికగా కేంద్ర సర్కారు పనిచేస్తోంది”
“సత్సంకల్పం.. సుస్పష్ట విధానం.. సాంకేతిక దృక్పథం కలగలిస్తే నిజాయితీపరులకు పాలన సులభమవుతుంది... అలాగే తప్పు చేస్తే ఫలితం కఠినంగా ఉంటుంది”
“ఎఫ్‌సీఆర్‌ఏ వ్యవస్థ 2014కు ముందు ఫైళ్ల గందరగోళంలో చిక్కి పర్యవేక్షణకు దూరంగా ఉండేది... మోదీ ప్రభుత్వం హయాంలో సంక్లిష్ట విధానాల నుంచి విముక్తి పొంది.. నేడు మరింత బలోపేతమైంది”
“దరఖాస్తులు.. విరాళాల ప్రవాహం పెరుగుదల దృష్ట్యా దేశ భద్రత దిశగా కాగితపు పని తగ్గింపు.. విదేశీ విరాళాలపై సముచిత పర్యవేక్షణ అత్యంత కీలకం”
“ఎఫ్‌సీఆర్‌ఏ 2.0’ పోర్టల్ కాగితపు పని తగ్గించి... దరఖాస్తు ప్రక్రియను వేగిరపరుస్తుంది... విదేశీ విరాళాలపై సమర్థ ప్రత్యక్ష పర్యవేక్షణకు భరోసా లభిస్తుంది”
“ఇకపై ఏ పత్రాలనైనా భౌతికంగా సమర్పించే అవసరం ఉండదు”
“ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కట్టుదిట్టంగా రూపొందడంతో దురుద్దేశపూరిత విదేశీ విరాళాలపై పర్యవేక్షణ పెరుగుతుంది”
प्रविष्टि तिथि:
30 JUN 2026 5:09PM by PIB Hyderabad
కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ‘ఎఫ్‌సీఆర్‌ఏ 2.0’ పోర్టల్ సహా ‘ఇ-ఓసీఐ’ కార్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ- ఈ రెండు కొత్త కార్యక్రమాలు పౌరులకు సౌలభ్యం కల్పించడమే కాకుండా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. మెరుగైన సదుపాయాలు లభిస్తాయని, ముఖ్యంగా ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారికి కలిగే ఇబ్బందులను పరిష్కరిస్తాయని ఆయన చెప్పారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘కనిష్ఠ ప్రభుత్వం – గరిష్ఠ పాలన’ సూత్రంపై ప్రాతిపదికగా తమ కర్తవ్యం నిర్వర్తిస్తామని చెప్పడాన్ని గుర్తుచేశారు. సత్సంకల్పం, సుస్పష్ట విధానం, సాంకేతిక దృక్పథం కలగలిస్తే, నిజాయితీపరులకు పాలన అత్యంత సులువు కాగలదన్నారు. అదే సమయంలో తప్పు చేసేవారిపై కఠిన నిఘా వ్యవస్థ ద్వారా దేశం మరింత సురక్షితంగా ఉంటుందని శ్రీ అమిత్ షా అన్నారు.

ఎఫ్‌సీఆర్ఏ వ్యవస్థ 2014కు ముందు ఫైళ్ల గందరగోళంలో చిక్కి, పర్యవేక్షణకు దూరంగా ఉండేదని, మోదీ ప్రభుత్వం హయాంలో సంక్లిష్ట విధానాల నుంచి విముక్తి పొంది నేడు మరింత బలోపేతమైందని హోంశాఖ మంత్రి అన్నారు. జాతీయ భద్రతతోపాటు దేశ పురోగమనానికి ఈ పర్యవేక్షణ అత్యంత కీలకమని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ పోర్టల్‌ను నేడు ఆధునికీకరించడంతో సంస్థల కార్యకలాపాలు మరింత సులభమవుతాయని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా దరఖాస్తుల సంఖ్య, విరాళాల ప్రవాహం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాగితపు పని తగ్గింపు, విదేశీ విరాళాలపై ప్రత్యక్ష, సమర్థ పర్యవేక్షణకు భరోసా ఇవ్వడం దేశ భద్రతకు అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఈ చట్టం అమలుతో దురుద్దేశపూరిత విదేశీ విరాళాలపై నిఘా పెరుగుతుందని చెప్పారు. మరోవైపు ఈ కొత్త వ్యవస్థ వల్ల పత్రాల భౌతిక సమర్పణ ప్రక్రియతో అవసరం ఉండదన్నారు. ‘ఇ-సైన్’ ఆధారిత ధ్రువీకరణ, ‘ఓసీఆర్’, ‘ఎన్‌జీవో దర్పణ్’ బ్యాంకు ఖాతా అనుసంధాన వ్యవస్థ వంటి సదుపాయాలు లభిస్తాయి. ఈ సమాచారమంతా ‘మేఘ్‌రాజ్’ (ప్రభుత్వ క్లౌడ్)లో భద్రంగా ఉంటుంది కాబట్టి, డేటా చౌర్యానికి అవకాశం దాదాపు ఉండదన్నారు. దీంతోపాటు రాబోయే నెలల్లో ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ మొబైల్ అప్లికేషన్, ఏఐ ఆధారిత చాట్‌బాట్, బ్యాంకుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్ కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.
అలాగే, ‘ఇ-ఓసీఐ’ కార్డును నేడు ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- ఓసీఐ వ్యవస్థకు శ్రీకారం చుట్టినపుడు ఎదురైన సమస్యలను ప్రస్తుత కొత్త విధానంలో పరిష్కరించామని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. ఇది 50 లక్షల మందికి పైగా ఓసీఐ కార్డుదారులకు ఎంతో ఉపయుక్తం కాగలదని చెప్పారు. ఓ 20 ఏళ్ల తర్వాత కొత్త పాస్‌పోర్ట్ జారీ అయితే, ఓసీఐ బుక్‌లెట్ తిరిగి జారీచేసే అవసరం ఉండదన్నారు. అంతేకాకుండా కార్డుదారుకు విశిష్ట రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంటుందని, ఈ డిజిటల్ ఓసీఐ కార్డు వల్ల పత్రాలు పోగొట్టుకోవడం లేదా పాడు కావడం వంటి సమస్యలకు తావుండదని చెప్పారు. తక్షణ ప్రత్యక్ష ధ్రువీకరణకు వీలుంటుంది కాబట్టి ఎలాంటి సమస్యలూ తలెత్తవని పేర్కొన్నారు.
ఎఫ్‌సీఆర్‌ఏ 2.0 పోర్టల్
‘విదేశీ విరాళాల (నియత్రణ) చట్టం’ నిబంధనల సరళీకరణ సహా పర్యవేక్షణ, అమలు యంత్రాంగాల బలోపేతం లక్ష్యంగా ‘ఎఫ్‌సీఆర్‌ఏ 2.0’ పోర్టల్ రూపొందింది. తద్వారా దరఖాస్తు, పునరుద్ధరణ, వార్షిక రిటర్న్ దాఖలు తదితర సేవల సంబంధిత ప్రధాన ప్రక్రియలన్నీ ఇప్పుడు పూర్తి డిజిటల్ విధానంలోకి మారిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 14,500 క్రియాశీల ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ సంస్థలు పనిచేస్తుండగా, ఏటా దాదాపు 15,000 నుంచి 20,000 దాకా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతోపాటు 17,000 దాకా వార్షిక రిటర్నులు దాఖలవుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో సాగుతున్న కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సురక్షిత వ్యవస్థ అవసరం ఎంతయినా ఉంది. ఆ మేరకు ‘నేషనల్ గవర్నమెంట్ క్లౌడ్’ (మేఘ్‌రాజ్) పరిధిలో ఇది పనిచేస్తుంది. తదనుగుణంగా ప్రక్రియల పునర్వ్యవస్థీకరణ, సమగ్ర డాష్‌బోర్డ్, ఆధార్ సంధానిత ధ్రువీకరణ, ఇ-సైన్ సదుపాయం, ఓసీఆర్ ఆధారిత పత్రాల విశ్లేషణ వంటి అంశాలెన్నో ఈ పోర్టల్‌లో ఉన్నాయి. కొత్త ‘ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ నిబంధనలు-2026’లోని కీలకాంశాలను కూడా ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. అంతేకాకుండా పాన్, ఆధార్, ఓసీఐ, ఎన్‌జీవో దర్పణ్ సహా ఐసీఏఐ పరిధిలోని యూడీఐఎన్ వ్యవస్థ సహా ప్రభుత్వ ప్రధాన సమాచార నిధులు, బ్యాంకులతోనూ ఈ పోర్టల్‌ను అనుసంధానించారు.
సంస్థల విషయానికొస్తే, ఈ పోర్టల్ ద్వారా కాగితపు పని తగ్గి, సమయం ఆదాకావడమే కాకుండా సరళ, సౌలభ్య అనుభవం లభిస్తుంది. దరఖాస్తు పరిశీలన వేగం పెరిగడంతోపాటు లాగిన్ ఆధారిత సమగ్ర డాష్‌బోర్డ్ సౌకర్యాం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వంతో, ప్రధాన సమాచార నిధులతో ఏపీఐ ఆధారిత అనుసంధానం వల్ల ధ్రువీకరణ వేగం, కచ్చితత్వం ఇనుమడిస్తాయి. నిబంధనల ద్వారా పర్యవేక్షణ మెరుగుపడటం సహా విదేశీ విరాళాల స్వీకరణ-వినియోగంపై సమర్థ పర్యవేక్షణకు వీలుంటుంది. తద్వారా జాతీయ భద్రత, సుపరిపాలన రెండూ బలోపేతమవుతాయి. ఏఐ ఆధారిత చాట్‌బాట్, మొబైల్ ద్వారా అందుబాటు వంటి భవిష్యత్తు విశిష్టతల కల్పకు తగినట్లు ఈ వేదిక రూపొందింది.
ఇ-ఓసీఐ కార్డు
ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఇ-ఓసీఐ) కార్డు పూర్తి డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్త ప్రవాస భారతీయులకు వినూత్న రీతిలో ఓసీఐ సేవలందించే లక్ష్యంతో చేపట్టిన కీలక పౌర కేంద్రక కార్యక్రమం. దీనికింద దరఖాస్తు సమర్పణ, అనుబంధ పత్రాల అప్‌లోడ్ నుంచి ఆమోదానంతరం డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం వరకూ ఓసీఐ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారానే ముగించవచ్చు. ప్రస్తుత కార్డుదారులు కూడా చాలా సందర్భాల్లో కొత్త దరఖాస్తు లేదా భౌతిక ధ్రువీకరణతో నిమిత్తం లేకుండా తమ ‘ఇ-ఓసీఐ’ కార్డును డిజిటల్‌గా పొందవచ్చు. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం- 20 ఏళ్ల వయస్సు తర్వాత కొత్త పాస్‌పోర్ట్ పొందే సమయంలో ‘ఓసీఐ’ బుక్‌లెట్‌ను తిరిగి జారీ చేసే అవసరం ఇకపై ఉండదు. అయితే, కొత్త పాస్‌పోర్ట్ జారీ అయినప్పుడల్లా కార్డుదారులు తత్సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
అందువల్ల ఈ వ్యవస్థతో దరఖాస్తుదారులకు సరళ, సౌలభ్య, పూర్తి డిజిటల్ అనుభవం లభిస్తుంది. ప్రత్యక్ష హాజరీ అవసరం తొలగిపోవడమేగాక మొబైల్ ద్వారా ఎప్పుడైనా వినియోగానికి వీలు కల్పిస్తుంది. డిజిటల్ జారీ ద్వారా పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను వేగిరపరుస్తుంది. భౌతిక పత్రాలను పోగొట్టుకునే లేదా పాడుచేసుకునే ముప్పును తొలగిస్తూ, సత్వర ఇమ్మిగ్రేషన్ అనుమతులకు వీలు కల్పించడం ద్వారా ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. ఈ వ్యవస్థతో పూర్తిస్థాయి ఆన్‌లైన్ పరిశీలన ప్రక్రియ అందుబాటులోకి రావడం వల్ల ప్రభుత్వానికి కూడా కాగితపు పని తగ్గి, పాలన వ్యయం ఆదా అవుతుంది. సమాచార నిర్వహణకు వీలు కల్పిస్తూ కేంద్రీకృత పర్యవేక్షణను బలపరుస్తుంది. మరోవైపు విమానాశ్రయాలలో ప్రత్యక్ష ధ్రువీకరణ కోసం డిజిటల్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలతో అనుసంధానితమవుతుంది. కాబట్టి, గుర్తింపు ధ్రువీకరణ మెరుగుపడటమే కాకుండా భద్రత పెరిగి, మోసాల ముప్పు తగ్గుతుంది.
‘ఎఫ్‌సీఆర్‌ఏ 2.0’ పోర్టల్, ‘ఇ-ఓసీఐ’ కార్డు ప్రారంభం రెండూ... ప్రజలకు నిరంతర సేవల ప్రదానం, మెరుగైన పరిపాలన దిశగా సాంకేతికత వినియోగంలో హోం మంత్రిత్వ శాఖ సాధించిన మరో కీలక విజయాన్ని ప్రతిబింబిస్తాయి. మరింత పారదర్శక, సురక్షిత, డిజిటల్‌గా సాధికార పాలన వ్యవస్థ రూపకల్పనలో ఇవి దోహదం చేస్తాయి.
***
(रिलीज़ आईडी: 2279531)
आगंतुक पटल : 9