2026 జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా మహేలోని విక్టోరియాలో ఉన్న స్టేట్ హౌస్‌లో సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు.
ఆరోగ్యం, విద్య, సామర్థ్య నిర్మాణం, డిజిటల్ మార్పులు, సుస్థిరాభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, నౌకా వాణిజ్య భద్రత, రక్షణతో సహా అన్ని రంగాల్లోనూ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి నాయకులు అంగీకరించారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఎదురవుతున్న చేపల అక్రమ వేట, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పైరసీ లాంటి సవాళ్లతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఆలోచనలను పంచుకున్నారు. భారత్ ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద అమలు చేస్తున్న ప్రాజెక్టులు, కార్యక్రమాల్లో సాధించిన పురోగతి పట్ల నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. సీషెల్స్ అభివృద్ధి ప్రాధాన్యాలకు తోడ్పాటును అందించడంలోనూ, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలోనూ భారతదేశ చిత్తశుద్ధిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
అధికారిక చర్చల అనంతరం, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంయుక్త స్మారక చిహ్నాన్ని నాయకులు విడుదల చేశారు. సామర్థ్య నిర్మాణం, యూపీఐ, ఆరోగ్యం, వ్యవసాయం, నౌకా రవాణా, అంతరిక్షం, నేరస్తుల అప్పగింత, రుణాలు, తదితర రంగాల్లో అవగాహన ఒప్పందాలు/ఒడంబడికలను కుదుర్చుకున్నారు. గరిష్ఠ రుణ సదుపాయం రూ.1250 కోట్లుగా ఉంది. ఎంవోయూలు/ఒప్పందాల పూర్తి జాబితాను ఈ లింకు వద్ద [link] చూడవచ్చు. వీటితో పాటుగా, సీషెల్స్ అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా సహాయపడేలా ఆహార భద్రత, మౌలిక వసతులు, ఆరోగ్యం, వృత్తిపరమైన శిక్షణ, నౌకా వాణిజ్య భద్రత, రక్షణ, తదితర రంగాల్లో అనేక ప్రకటనలను చేశారు. ఈ ప్రకటనలనకు సంబంధించిన వివరాలు ఈ లింకులో [link] చూడవచ్చు. విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన సమితి (సీడీఆర్ఐ)లో చేరుతున్నట్లు కూడా సీషెల్స్ ప్రకటించింది.
ఆ తర్వాత, సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ గౌరవం దక్కిన తొలి ప్రధానిగా ఆయన నిలిచారు. తన ప్రసంగంలో భారత్, సీషెల్స్ మధ్య ఉన్న చారిత్రక స్నేహ సంబంధాల గురించి చర్చించారు. రెండు దేశాలకూ మార్గనిర్దేశం చేస్తున్న, ఉమ్మడి విలువలైన ప్రజాస్వామ్యం, న్యాయం, పౌరకేంద్ర పరిపాలన గురించి కూడా వివరించారు. అభివృద్ధి సహకారం, నౌకా వాణిజ్య భద్రత, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ఆరోగ్యం, సామర్థ్య నిర్మాణంలో పటిష్టమైన భాగస్వామ్యాన్ని పరస్పర విశ్వాసం, సన్నిహిత సహకారం తీర్చిదిద్దాయని ఆయన అన్నారు. అలాగే రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య పార్లమెంటరీ సహకారాన్ని పెంపొందించాలని ప్రధానమంత్రి అన్నారు. ప్రధానమంత్రి ప్రసంగ పాఠాన్ని ఈ లింకులో చదవండి. [link]
ప్రధానమంత్రితో సీషెల్స్ ప్రతిపక్ష నాయకుడు బెర్నార్డ్ జార్జెస్ కూడా సమావేశమయ్యారు. భారత్–సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారు చర్చించారు. అలాగే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రత్యేక స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తమ పూర్తి మద్దతును తెలియజేశారు.
***