ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సేతు 2.0తోపాటు పలు డిజిటల్ ఆరోగ్య సేవలను జూన్ 29న ప్రారంభించనున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా
దేశంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఆయుష్మాన్ సారథి చాట్‌బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ-సుశ్రుత్ క్లినిక్, ఎన్‌హెచ్‌సీఎక్స్, బీమా పథకం ఎఫ్‌హెచ్‌ఐఆర్ అబ్జెక్ట్ వంటి అధునాతన సాంకేతికతలు సిద్ధం
ఆరోగ్య సేవలను మరింత సులభంగా, అనుసంధానంగా, సమర్థవంతంగా మార్చడమే నూతన డిజిటల్ కార్యక్రమాల లక్ష్యం
పౌర-కేంద్రిత సాంకేతికతలు, పరస్పర అనుసంధాన ఆరోగ్య వ్యవస్థల ద్వారా దేశ ఆరోగ్య రంగ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలకు ఊతం
ఆరోగ్య రికార్డుల నిర్వహణ నుంచి క్లెయిమ్‌ల ప్రక్రియ వరకు... వైద్య సేవల రంగాన్ని పూర్తిగా మార్చనున్న కొత్త డిజిటల్ ఆవిష్కరణలు
प्रविष्टि तिथि:
27 JUN 2026 11:23AM by PIB Hyderabad
భారతదేశ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన ముందడుగు పడనుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా జూన్ 29 సోమవారం నాడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు విప్లవాత్మక డిజిటల్ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. జాతీయ ఆరోగ్య సంస్థ, ఈహెచ్‌ఆర్ ప్రమాణాల జాతీయ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఈ సరికొత్త డిజిటల్ ఆవిష్కరణలు రూపొందాయి. దేశవ్యాప్తంగా వైద్య సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడం, వివిధ ఆరోగ్య వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానాన్ని పెంచడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
దేశంలో ఒకదానితో ఒకటి అనుసంధానించిన సరికొత్త ఆరోగ్య వ్యవస్థను నిర్మించే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆరోగ్య సంరక్షణ రంగ ప్రముఖులు, సాంకేతిక భాగస్వాములు, పరిశ్రమల ప్రతినిధులు, ఆరోగ్య వ్యవస్థలోని కీలక భాగస్వాములు హాజరవుతారు.
ఈ కార్యక్రమంలో ప్రారంభించబోయే డిజిటల్ సేవల్లో సాధారణ ప్రజల కోసం రూపొందించిన అప్లికేషన్లు, వైద్యులు, ఆసుపత్రుల కోసం ప్రత్యేక పరిష్కారాలు, డేటా ప్రమాణాలు, పరస్పర అనుసంధాన విధానాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్య రంగంలో సరికొత్త పారదర్శకతను, వేగాన్ని తీసుకువస్తాయి. దీని ద్వారా ప్రధానంగా పౌరులకు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, బీమా సంస్థలు, సాంకేతిక ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు.
ఈ విప్లవాత్మక కార్యక్రమాల్లో అత్యంత కీలకమైనది ఆరోగ్య సేతు 2.0. ఇది పౌరులందరికీ ఒక సమగ్ర వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల అప్లికేషన్‌గా అందుబాటులోకి రానుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా సంపాదించుకున్న నమ్మకాన్ని, విస్తృత ఆదరణను పునాదిగా చేసుకుని ఈ అప్లికేషన్‌ను సరికొత్త రూపంలోకి మార్చారు. ఆధునికీకరించిన ఈ సరికొత్త వెర్షన్ ఒకే వేదిక ద్వారా పౌరులందరికీ బహుళ డిజిటల్ ఆరోగ్య సేవలను అందించే ఏకైక వేదికగా పనిచేస్తుంది.
ఈ సరికొత్త అప్లికేషన్ ద్వారా పౌరులు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌ను సులభంగా రూపొందించుకోవడమే కాకుండా దానిని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. దీని సహాయంతో డిజిటల్ ఆరోగ్య రికార్డులను భద్రపరుచుకోవచ్చు. అలాగే రోగి పూర్తి అనుమతితో కూడిన ఆరోగ్య సమాచార మార్పిడి వ్యవస్థ ద్వారా అవసరమైనప్పుడు ఆ రికార్డులను వైద్యులతో పంచుకునే వీలుంటుంది. ఇందులో పొందుపరిచిన కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా రోగులకు స్మార్ట్ ఆరోగ్య నివేదికలు, ఆరోగ్య విశ్లేషణలు అందుతాయి. ఆసుపత్రులలో లైన్లలో నిలబడే పనిలేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా ఓపీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచీలు, ఫిట్‌నెస్ బ్యాండ్‌ల వంటి పరికరాలను ఈ యాప్‌కు లింక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్కాన్, పే ద్వారా హాస్పిటల్ బిల్లుల చెల్లింపులు కూడా చేయవచ్చు. ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలో గుర్తుచేసే అలారాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఒకే చోట పర్యవేక్షించే ఫ్యామిలీ హెల్త్ మేనేజ్‌మెంట్ సదుపాయం ఉంది.
ఈ యాప్ ద్వారా రోగులు తమకు సమీపంలో ఉన్న ఆసుపత్రులు, అందుబాటులో ఉన్న వైద్యులు, అంబులెన్స్ సేవలు, ఏ బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కడ అందుబాటులో ఉందో చూపే బ్లడ్ బ్యాంకులు, తక్కువ ధరకే మందులు లభించే ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలు వంటి సేవలను సులభంగా కనుగొనవచ్చు.
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సేవలను కూడా ఈ యాప్‌లో చేర్చారు. దీని ద్వారా పీఎం-జేఏవై పరిధిలోకి వచ్చే ఆసుపత్రుల వివరాలను వెతకవచ్చు.
ఏబీ పీఎం-జేఏవై వాలెట్, ఆయుష్మాన్ సీఏపీఎఫ్ పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు. వీటితోపాటు ఇతర ఆరోగ్య సంరక్షణ సేవలను కూడా పొందవచ్చు.
మెరుగుపరిచిన ఆయుష్మాన్ యాప్ ఇకపై ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలబ్ధిదారులందరికీ అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే ఒక ఏకైక డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఆధునీకరించిన ఈ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారులు ఈ పథకానికి సంబంధించిన కీలక సేవలను సులభంగా పొందవచ్చు. ఇందులో తమ అర్హతను ధ్రువీకరించుకోవడం, ఆయుష్మాన్ కార్డ్ సేవలు పొందడం, తమ చికిత్స చరిత్రను చూసుకోవడం, ఆసుపత్రులను వెతకడం, ఫిర్యాదుల పరిష్కారం, లబ్ధిదారులకు అవసరమైన పూర్తి మద్దతు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
పీఎం-జేఏవై లబ్ధిదారుల కోసం ఆయుష్మాన్ సారథి అనే ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌ను కూడా ప్రారంభించనున్నారు. సులభమైన సంభాషణల ద్వారా పీఎం-జెఏవై సేవలను అందించేలా దీనిని రూపొందించారు. ఈ చాట్‌బాట్ సహాయంతో పౌరులు వాట్సాప్ ద్వారానే పథకానికి సంబంధించిన ముఖ్యమైన సేవలను పొందవచ్చు. ఇది గ్రామీణ, సుదూర ప్రాంతాల ప్రజలకు కూడా ఈ పథకాన్ని మరింత దగ్గర చేస్తూ, చివరి వ్యక్తి వరకు సేవలను వేగంగా అందిస్తుంది.
కేవలం సామాన్య ప్రజల కోసమే కాకుండా దేశంలోని మొత్తం వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు, క్లెయిమ్ ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు, వైద్య సేవల్లో ప్రామాణీకరణ, ఆవిష్కరణలను పెంపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా పలు డిజిటల్ ఆరోగ్య, పరస్పర అనుసంధాన కార్యక్రమాలను దేశానికి అంకితం చేయనున్నారు.
ఇందులో భాగంగా నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ అనే సరికొత్త డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాయాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇది ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల ప్రక్రియను ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభతరం చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య బీమా కార్యక్రమాల్లో ఆసుపత్రులు, బీమా సంస్థల మధ్య ఆరోగ్య క్లెయిమ్స్ సమాచారాన్ని ఒకే ప్రామాణిక పద్ధతిలో మార్పిడి చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. దీనివల్ల డాక్యుమెంట్ల నిర్వహణ భారం తగ్గడమే కాకుండా, క్లెయిమ్‌ల ప్రక్రియ అత్యంత వేగంగా, సమర్థవంతంగా పూర్తవుతుంది.
ఆరోగ్య బీమా క్లెయిమ్స్ రంగంలో పరస్పర అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి జాతీయ ఆరోగ్య సంస్థ సరికొత్త సాంకేతిక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇది బీమా సంస్థల సమాచారాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రామాణిక ఎఫ్‌హెచ్ఐఆర్ బండిల్స్‌గా మారుస్తుంది. దీనివల్ల వివిధ బీమా సంస్థల ప్లాన్ల సమాచారం ఎటువంటి తప్పులు లేకుండా, ఒకే పద్ధతిలో రపొందించడాన్ని సులభతరం చేస్తుంది. ఫలితంగా మానవ శ్రమ తగ్గడమే కాకుండా, ఆరోగ్య క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ మరింత వేగంగా, పారదర్శకంగా మారుతుంది.
దేశంలో అందరికీ అందుబాటులో ఉండే పరస్పర అనుసంధాన వ్యవస్థ ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత సులభంగా చేరవేయడానికి యునిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్‌ను కూడా దేశానికి అంకితం చేస్తున్నారు. ఈ యూహెచ్ఐ సాంకేతికత ద్వారా వివిధ రకాల డిజిటల్ అప్లికేషన్లు నేరుగా పౌరులను వైద్య సేవలు అందించే ఆసుపత్రులు, డాక్టర్లతో అనుసంధానిస్తాయి. ఒకే ఉమ్మడి పరస్పర అనుసంధాన వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ వ్యవస్థ వల్ల ప్రజలు తమకు కావలసిన ఆరోగ్య సేవలను సులభంగా వెతుక్కోవడమే కాకుండా పొందవచ్చు.
ఆసుపత్రులు, క్లినిక్కుల స్థాయిలో డిజిటల్ ఆరోగ్య సాంకేతికతను పెంపొందించేందుకు ఈ-సుశ్రుత్ క్లినిక్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఇది క్లినిక్ నిర్వహణను సులభతరం చేసే ఒక అత్యాధునిక ప్లగ్-అండ్-ప్లే పరిష్కారంగా పనిచేస్తుంది. దీని సహాయంతో చిన్న, పెద్ద ఆసుపత్రులు తము రోజువారీ చూసే రోగుల వివరాలను డిజిటలైజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను భద్రపరచవచ్చు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వ్యవస్థతో నేరుగా అనుసంధానం కావచ్చు. వైద్య సదుపాయాలు వేగంగా డిజిటల్ సాంకేతికతలను అవలంబించడానికి, రోగులకు మరింత సమర్థవంతమైన సంరక్షణ అందించడానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుంది.
మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఔషధాలకు సంబంధించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఒక డ్రగ్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించనున్నారు. వివిధ డిజిటల్ ఆరోగ్య అప్లికేషన్‌లలో మందులకు ఒకే రకమైన కోడింగ్ విధానాన్ని తీసుకురావడం ద్వారా ఈ రిజిస్ట్రీ వైద్యులు మందులు రాసిచ్చే విధానాన్ని, మెడికల్ షాపులు మందులు పంపిణీ చేసే ప్రక్రియను, ఆరోగయ సంరక్షణ డేటా మార్పిడిని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.
వివిధ ఆరోగ్య వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానం అనేది ఉమ్మడి ప్రమాణాలు, ఉమ్మడి పదజాలంపైనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం కామన్ లోయింక్ కోడ్స్ ఫర్ ఇండియాను (సీఎల్‌సీఐ) ప్రారంభించనుంది. దీనిని ఎన్‌ఆర్‌సీఈఎస్‌సంస్థ అంతర్జాతీయ లాబొరేటరీ ప్రమాణాల ఆధారంగా భారతీయ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించింది. ల్యాబ్ పరీక్షల వివరాలు, రోగనిర్ధారణ సమాచారాన్ని ఒకే రకమైన ప్రామాణిక పద్ధతిలో సూచించడం ద్వారా, వివిధ ఆసుపత్రులు, ప్రయోగశాలలు, డిజిటల్ ఆరోగ్య వేదికల మధ్య ప్రయోగశాల డేటా ఎటువంటి అడ్డంకులు లేకుండా బదిలీ కావడానికి సీఎల్‌సీఐ మద్దతు ఇస్తుంది. ఇది డేటా నాణ్యతను, క్లినికల్ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మరింత మెరుగుపరుస్తుంది.
ఈ ప్రయత్నాలకు తోడుగా ఎన్‌ఆర్‌సీఈఎస్ అభివృద్ధి చేసిన భారత్ హెల్త్ టెర్మినాలజీ సర్వీస్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఇది ప్రామాణికమైన ఆరోగ్య సంరక్షణ పరిభాషలు, కోడ్ సిస్టమ్‌లు, విలువలను అందిస్తుంది. దీనివల్ల డిజిటల్ హెల్త్ సిస్టమ్‌లో ఆరోగ్య సమాచారాన్ని ఒకే రకంగా అర్థం చేసుకోవడం, మార్పిడి చేసుకోవడం సాధ్యమవుతుంది.
డ్రగ్ రిజిస్ట్రీ, సీఎల్‌సీఐ, బీహెచ్‌టీఎస్‌లు కలిసి దేశంలో డిజిటల్ ఆరోగ్య సంరక్షణ రంగానికి ఒక ఉమ్మడి భాషను అందిస్తాయి. ఇది వైద్య సేవలు అందించేవారు, ప్రయోగశాలలు, బీమా సంస్థలు, డిజిటల్ వేదికలు పరస్పరం ఆరోగ్య సమాచారాన్ని సులభంగా మార్పిడి చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ కార్యక్రమాలు, భాగస్వాముల మధ్య మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రామాణీకరణ, ఆరోగ్య సమాచార సజావైన మార్పిడి ద్వారా దేశ ఆరోగ్య రంగ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. మరింత అనుసంధానించిన, సమర్థవంతమైన, పరస్పర అనుసంధాన ఆరోగ్య సంరక్షణ పంపిణీని సాధ్యం చేయడం ద్వారా దేశంలోని ప్రజలందరికీ సులభమైన, సరసమైన, సమ్మిళితమైన ఆరోగ్య సంరక్షణను అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి
దేశంలోని సమగ్ర డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు అవసరమైన ఒక బలమైన వెన్నెముక వంటి వ్యవస్థను రూపొందించడమే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వివిధ భాగస్వామ్య పక్షాల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరాలను డిజిటల్ మార్గాల ద్వారా అనుసంధానించడానికి ఏబీడీఎం కృషి చేస్తోంది. తద్వారా దేశంలోని పౌరులందరికీ సులభంగా అందుబాటులో ఉండే, సరసమైన ధరల్లో లభించే, అత్యంత సమర్థవంతమైన వైద్య సేవలను అందించడమే ఈ మిషన్ ఉద్దేశం.
మరింత సమాచారం కోసం https://abdm.gov.in/ ను సందర్శించండి.
(रिलीज़ आईडी: 2278532)
आगंतुक पटल : 6