ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బంగారం స్మగ్లింగ్ ముఠాను ఛేదించిన డీఆర్‌ఐ: వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో 15 కిలోల విదేశీ బంగారం స్వాధీనం; 15 మంది అరెస్ట్

प्रविष्टि तिथि: 26 JUN 2026 3:53PM by PIB Hyderabad

విదేశీ బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా దాడులు చేపట్టారు. ముంబై విమానాశ్రయం కేంద్రంగా అత్యంత వ్యవస్థీకృతంగా సాగుతున్న బంగారం అక్రమ రవాణా ముఠాను అధికారులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా స్మగ్లింగ్ చేసిన విదేశీ బంగారాన్ని కరిగించడానికి ఉపయోగిస్తున్న ఒక రహస్య కేంద్రాన్నికూడా డీఆర్‌ఐ అధికారులు గుర్తించి, ధ్వసం చేశారు.

 

ముంబయి విమానాశ్రయ సిబ్బందితో పాటు స్మగ్లింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం 9 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక విమానాశ్రయ ఉద్యోగిని, ఆమెను నడిపించే హ్యాండ్లర్,ముగ్గురు మధ్యవర్తులు, బంగారం కరిగించే కేంద్రం నిర్వాహకుడు, అందులో పనిచేసే మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దాడి జరిగిన ప్రదేశంలో సుమారు 6 కిలోల విదేశీ మూలాలు కలిగి అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

విమానాశ్రయాల లోపలి సిబ్బంది సహాయాన్ని తీసుకుంటూ, తనిఖీలకు దొరకకుండా ఉండేందుకు ఈ వ్యవస్థీకృత స్మగ్లింగ్ ముఠాలు ఎంత అధునాతనమైన, పకడ్బందీ వ్యూహాలను, బహుళ అంచెల పంపిణీ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయో ఈ కేసు స్పష్టం చేస్తోంది.బెంగళూరులో జరిగిన మరో సోదాల్లో ఒక అంతర్జాతీయ ప్రయాణికుడి నుంచి 1.8 కిలోల బరువున్న 24 క్యారెట్ల బంగారాన్ని డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. నిందితుడు ఈ బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి, తాను ధరించిన దుస్తుల పొరల మధ్య అత్యంత చాకచక్యంగా దాచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత నిందితుడి నివాసంలో జరిపిన తదుపరి సోదాలలో సుమారు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 45 కిలోల వెండి, భారతీయ, విదేశీ కరెన్సీ లభ్యమయ్యాయి. దీంతో అధికారులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

 

ఈ వారం ప్రారంభంలో కూడా డీఆర్‌ఐ అధికారులు దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లలో వరుస దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్‌కోట్, కాలికట్, గువహటి, పెట్రాపోల్ ప్రాంతాల్లో జరిపిన ఈ ఆపరేషన్లలో మొత్తం మరో 6 కిలోల విదేశీ మూలాలు కలిగి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

 

ఈ భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా డీఆర్‌ఐ జరిపిన అన్ని దాడుల ద్వారా కలిపి సుమారు 15 కిలోల బంగారం, 45 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి మొత్తం విలువ సుమారు రూ. 23 కోట్లు. ఇప్పటివరకు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు.

ఫోటో క్యాప్షన్‌ 1- ముంబైలోని బంగారాన్ని కరిగించే కేంద్రం నుంచి బంగారం స్వాధీనం

 

ఫోటో క్యాప్షన్‌ 2- లోదుస్తుల్లో దాచిన పేస్ట్ రూపంలోని బంగారం... బెంగళూరులో స్వాధీనం

ఫోటో క్యాప్షన్‌ 3- విశాఖపట్నంలో స్వాధీనం చేసుకున్న బంగారం


(रिलीज़ आईडी: 2278327) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam