వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
'భారత్- యూకే సీఈటీఏ' ద్వారా గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా సహాయం చేసేందుకు దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమించనున్నట్లు ప్రకటించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా సాంకేతికత, కృత్రిమ మేధ, రక్షణ రంగం, హరిత ఇంధనం రంగాలకు విస్తరిస్తోన్న భారత్-యూకే భాగస్వామ్యం: శ్రీ పీయూష్ గోయల్
ద్వైపాక్షిక వృద్ధికి చోదక శక్తులుగా 'బర్మింగ్‌హామ్-గుజరాత్', 'మాంచెస్టర్-మహారాష్ట్ర' లింకేజీలను ప్రముఖంగా తెలియజేసిన శ్రీ పీయూష్ గోయల్
प्रविष्टि तिथि:
26 JUN 2026 6:46PM by PIB Hyderabad
‘భారత్- బ్రిటన్ సీఈటీఏ’ ద్వారా వ్యాపార వాణిజ్య సంస్థలు గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా సహాయపడేందుకు దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమించటంతో పాటు వాణిజ్య వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రకటించారు.
లండన్‌లో ఈ రోజు జరిగిన 10వ వార్షిక 'యూకే-ఇండియా వీక్'లో భాగంగా శ్రీ పీయూష్ గోయల్ పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 జూలై 15 నుంచి అమలులోకి రానున్న 'భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం' (సీఈటీఏ) ద్వారా లభించబోయే సరికొత్త అవకాశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇప్పటివరకు భారత్ కుదుర్చుకున్న అత్యంత సమగ్రమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా నిలిచిన 'భారత్-యూకే సీఈటీఏ' ద్వారా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 25.5 బిలియన్ పౌండ్ల మేర వృద్ధి చెందుతుందన్న అంచనా ఉంది.
'ఇండియా గ్లోబల్ ఫోరమ్ (ఐజీఎఫ్) క్యాపిటల్ ఫ్రాంటియర్స్ ఫోరమ్’ను ఉద్దేశించి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారత్-యూకే భాగస్వామ్యం కేవలం సంప్రదాయ వాణిజ్యానికే పరిమితం కాకుండా సాంకేతికత, సార్వభౌమ కృత్రిమ మేధ, కీలకమైన ఖనిజాలు, రక్షణ, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని అన్నారు. ఇరు దేశాల మధ్య మారుతున్న ఈ భాగస్వామ్యం.. ద్వైపాక్షిక ఆర్థిక బంధంలో పెరుగుతున్న లోతును, వైవిధ్యాన్ని తెలియజేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత హైకమిషన్, ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూకే పర్యటనకు విచ్చేసిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారీ భారతీయ వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన స్వాగతం పలికారు. ఈ బృందంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వ్యాపార సంస్థలతో పాటు మొదటిసారిగా ఎగుమతులు ప్రారంభించిన పలువురు పాల్గొనడం విశేషం.
భారతీయ నిపుణులకు 'భారత్-యూకే సీఈటీఏ' ద్వారా చేకూరే ప్రయోజనాలను శ్రీ పీయూష్ గోయల్ ప్రత్యేకంగా వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం యూకేలో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు అక్కడి సామాజిక భద్రతా విరాళాల (కాంట్రిబ్యూషన్స్) నుంచి ఐదేళ్ల పాటు మినహాయింపు లభిస్తుందని ఆయన తెలిపారు. దీనివల్ల ఆదా అయ్యే సొమ్మును వారు భారత్‌లో వడ్డీ ఇచ్చే పన్ను రహిత భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాల్లోకి మళ్లించుకునే వీలుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి (సబ్-నేషనల్) ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యతను కూడా కేంద్ర మంత్రి ప్రధానంగా చెప్పారు. ఇందులో భాగంగా 'బర్మింగ్‌హామ్-గుజరాత్', 'మాంచెస్టర్-మహారాష్ట్ర' వంటి ప్రాంతాల మధ్య ఉన్న లింకేజీలను భవిష్యత్ ద్వైపాక్షిక వృద్ధికి ముఖ్యమైన చోదక శక్తులుగా ఆయన అభివర్ణించారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడాన్ని శ్రీ పీయూష్ గోయల్ గుర్తుచేశారు. వ్యాపార సంస్థలు పూర్తి ఆత్మవిశ్వాసంతో 'బ్రాండ్ ఇండియా'ను ప్రపంచానికి చాటిచెప్పాలని.. తయారీ, సేవలు, ఆవిష్కరణల రంగాల్లో దేశానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనితో పాటు ‘యూకే’లోని వ్యాపార సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించుకోవాలని ప్రోత్సహించారు. 'భారత్-యూకే సీఈటీఏ' ఒప్పందం మార్కెట్ అందుబాటును పెంచుతుందని, భారతీయ పరిశ్రమల పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని, నిపుణుల రాకపోకలను మరింత సులభతరం చేస్తుందని.. వస్తువులు, సేవలు, పెట్టుబడుల రంగాలలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు.
నేటి భారత్ నమ్మకానికి, ప్రతిభకు, సమ్మిళిత వృద్ధికి, స్థిరమైన పరిస్థితులకు ప్రతిరూపంగా నిలిచిందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలకు, ఉమ్మడి ఆవిష్కరణలకు దేశం అపారమైన అవకాశాలను కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత నిరంతర ఆర్థిక వృద్ధి, విస్తరిస్తున్న ప్రపంచ భాగస్వామ్యాల ద్వారా లభిస్తున్న ఈ సువర్ణ అవకాశాలను వ్యాపార సంస్థలు చక్కగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
భారత్-యూకే భాగస్వామ్యం వృద్ధి సాధించడానికి అపారమైన అవకాశాలను కలిగి ఉందని కేంద్ర మంత్రి మరింతగా పేర్కొన్నారు. భారతీయ వ్యాపార సంస్థలు ఈ అవకాశాలను ముందుగానే అందిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అవలంబించాలని.. యూకేతో వాణిజ్య, పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా 'బ్రాండ్ ఇండియా'ను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారతీయ పరిశ్రమలు పోషించాల్సిన పాత్రను కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
***
(रिलीज़ आईडी: 2278323)
आगंतुक पटल : 5