ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దిగుమతి చేసుకునే మందుల ‘మిగులు నిల్వకాలం’ నిబంధనలను హేతుబద్ధీకరించే ముసాయిదా సవరణపై ప్రజాభిప్రాయాలను కోరిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ


వ్యాపార సౌలభ్యంతో పాటు తగినంత నిల్వ కాలం కలిగిన నాణ్యమైన మందుల నిరంతర లభ్యతను నిర్దారించడమే లక్ష్యంగా ప్రతిపాదిత సవరణ

నాడు పోస్టు చేయడమైనది: 26 JUN 2026 10:22AM by PIB Hyderabad

దిగుమతి చేసుకునే మందుల ‘మిగులు నిల్వ కాలం’ (షెల్ఫ్‌ లైఫ్)  నిబంధనలను హేతుబద్ధీకరించడానికి... అలాగే ఫార్మా రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మరింత సులభతరం చేయడానికి వీలుగా 1945 నాటి ఔషధ నిబంధనలలోని నియమం 31కి సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించింది.

 

ఈ ప్రతిపాదిత సవరణకు సంబంధించిన ముసాయిదాను ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాల కోసం 2026 జూన్ 22 నాటి గెజిట్‌ నోటిఫికేషన్ జీ.ఎస్‌.ఆర్‌. 505 (ఈ) ద్వారా కేంద్ర ప్రభుత్వం బహిరంగపరిచింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలోకి దిగుమతి చేసుకునే మందులకు కనీసం 60 శాతానికి పైగా నిల్వ కాలం మిగిలి ఉండాలి. తాజా సవరణ ద్వారా ఈ నిబంధనను మార్చి, దిగుమతి చేసుకునే సమయానికి ఆ మందులకు కనీసం 12 నెలల నిల్వ కాలం ఉంటే సరిపోయేలా ప్రతిపాదించారు. అయితే, జీవ సంబంధిత ఉత్పత్తులు,రేడియో ఫార్మాస్యూటికల్స్ వంటి మందుల ప్రత్యేక స్వభావాన్ని, ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. వీటికి ప్రస్తుతం అమల్లో ఉన్న 60 శాతానికి పైగా కనీస నిల్వ కాల నిబంధన యథాతథంగా కొనసాగుతుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

 

ఈ ప్రతిపాదిత సవరణ ద్వారా ఔషధ రంగ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడంతోపాటు రోగులకు నాణ్యమైన మందులు నిరంతరం అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. దేశంలోకి దిగుమతి అయ్యే సమయానికి మందులకు కనీసం 12 నెలల నిల్వ కాలం ఉండటం వల్ల, అవి గడువు తీరడానికి ముందే ప్రజలకు పంపిణీ చేయడానికి, వారు వాడుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. దీనివల్ల రోగులకు తగినంత నిల్వ కాలం ఉన్న సురక్షితమైన మందులు అందుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

 

ఈ సవరణ ద్వారా కఠినమైన నిల్వ కాల నిబంధనల వల్ల ఔషధ సరఫరా వ్యవస్థలో అనవసరంగా జరిగే మందుల వృధాను గణనీయంగా తగ్గించవచ్చు. దీనివల్ల ఔషధాల నిల్వలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా సరఫరా నిర్వహణ మెరుగుపడటంతో పాటు ఖర్చులు తగ్గుతాయని, దేశంలో నిత్యావసర మందుల లభ్యత మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఈ ప్రతిపాదిత సవరణ కేవలం మందులను దిగుమతి చేసుకునే సమయంలో వర్తించే షెల్ఫ్ లైఫ్ నిబంధనకు మాత్రమే పరిమితమని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, డ్రగ్స్ నిబంధనలు 1945 ప్రకారం మందుల నాణ్యత, భద్రత లేదా వాటి పనితీరుకు సంబంధించిన ఇతర నియంత్రణ నిబంధనలలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

 

ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై సంబంధిత వర్గాలన్నిటి నుంచి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు, సలహాలను ఆహ్వానించింది. ఆసక్తి గలవారు తమ అభిప్రాయాలను నిర్ణీత గడువులోగా అండర్ సెక్రటరీ (ఔషధాలు), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, యు-6, వర్క్ హాల్–సీ వింగ్, మొదటి అంతస్తు, కర్తవ్య భవన్-1, న్యూఢిల్లీ – 110001 చిరునామాకు లేదా drugsdiv-mohfw[at]gov[dot]in అనే ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చు.

 

ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్‌ చేయండి: https://egazette.gov.in/WriteReadData/2026/273833.pdf 


(రిలీజ్ ఐడి: 2278180) సందర్శకుల సూచీ సంఖ్య : : 60
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada