సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాఫెడ్ వేలంపాటల పోర్టల్ నాఫెక్స్‌డాట్ఇన్ (NAFEX.in)ను న్యూఢిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


రైతుల పిల్లల కోసం నాఫెడ్-కల్యాణ్ స్కాలర్‌షిప్ పథకాన్ని, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ పోర్టల్ ‘దృష్టి’ (DRISHTI)ని, ఈఆర్‌పీ (ERP) పోర్టల్‌‌ను కూడా ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా

వ్యవసాయ ఉత్పాదనల వేలం ప్రక్రియలో పారదర్శకత్వాన్ని, దక్షతని, డిజిటల్ ప్రక్రియల్ని పటిష్ఠపరచనున్న ‘నాఫెక్స్‌డాట్ఇన్’

प्रविष्टि तिथि: 22 JUN 2026 2:26PM by PIB Hyderabad

నాఫెడ్ వేలంపాటల పోర్టల్ ‘నాఫెక్స్‌డాట్ఇన్’ (‘NAFEX.in’)ను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రేపు.. అంటే 2026 జూన్ 23న న్యూఢిల్లీలోని అటల్ అక్షయ్ ఊర్జా భవన్‌లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొంటారు. నాఫెడ్ ఛైర్మన్ శ్రీ జేఠాభాయి అహీర్, నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దీపక్ అగర్వాల్, సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు.
ఇదే కార్యక్రమంలో.. నాఫెడ్‌కు చెందిన అనేక ముఖ్య డిజిటల్ కార్యక్రమాలనూ, రైతులకు ప్రయోజనాలు అందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను  శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు. వాటిలో.. రైతుల పిల్లలకు నాఫెడ్-కల్యాణ్ ఉపకార వేతనం, పప్పు ధాన్యాలతో పాటు నూనెగింజల ఇన్వెంటరీ మేనేజ్‌మెంటు కోసం ‘దృష్టి’ (DRISHTI) పోర్టల్, ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగును బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘ఈఆర్‌పీ’ (ERP) పోర్టల్, వేలానికి తోడ్పడే ‘నాఫెక్స్‌డాట్ఇన్’ (NAFEX.in) పోర్టల్ భాగంగా ఉన్నాయి. వేలం పోర్టల్‌లో లైవ్ రిజిస్ట్రేషన్ పద్ధతిని కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. దీంతో పాటు, వేలం ప్రక్రియను కూడా మొదలుపెడతారు.
‘నాఫెక్స్‌డాట్ఇన్‌’ను ప్రారంభించాలన్న నిర్ణయం వేలం ప్రక్రియలో పారదర్శకత్వాన్ని, దక్షతని, కార్యకలాపాల నిర్వహణలో సౌలభ్యాన్ని బలపరిచే దిశగా ఓ ముఖ్య చర్య కానుంది. ఈ పోర్టల్ వేలానికి సంబంధించిన కార్యకాలపాలను వ్యవస్థీకరించడం, రైతులు, సభ్య సంస్థలు, ఆసక్తిదారుల ప్రయోజనాలను లెక్కలోకి తీసుకొని నాఫెడ్ సమగ్ర పనితీరును మరింత ఎక్కువ ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఈ సందర్భంగా నాఫెడ్-కల్యాణ్ ఉపకార వేతన చెక్కులను రైతుల పిల్లలకు  కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అందిస్తారు. ఈ కార్యక్రమం రైతుల సంక్షేమంతో పాటు రైతుల పిల్లలు చదువుకోవడానికి సాయపడాలన్న నాఫెడ్ నిబద్ధతకు అద్దం పడుతుంది.
కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత, నాఫెడ్ డైరెక్టర్ల బోర్డు సభ్యులతో  శ్రీ అమిత్ షా సమావేశమవుతారు. నాఫెడ్ కార్యకలాపాలపైనా, పురోగతి పైనా సమావేశంలో ఒక ప్రజెంటేషన్‌నిస్తారు. దీనిలో కేంద్ర మంత్రి ఇంతవరకు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యలతో పాటు నాఫెడ్ భవిష్య ప్రణాళికపై కూడా చర్చిస్తారు.
రైతులకు సహకారాన్ని అందించడంలో, వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్‌లో, కొనుగోళ్లు, సహకారిత ఆధారిత వ్యవసాయ వాణిజ్యంలో నాఫెడ్ ముఖ్య పాత్రను పోషిస్తోంది. డిజిటల్, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోవడం.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న ‘‘సహకార్ సే సమృద్ధి’’ విజన్‌ను సాకారం చేయడంతో పాటు సాంకేతికత, పారదర్శకత్వం, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిస్తూ సహకార సంస్థలను పటిష్ఠపరచాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు కూడా అనుగుణంగా ఉండబోతోంది.

***


(रिलीज़ आईडी: 2276683) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada