ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 21 JUN 2026 8:25AM by PIB Hyderabad

   గౌరవనీయులైన పశ్చిమబెంగాల్‌ గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు శ్రీ ప్రతాపరావు జాదవ్, వేదికను అలంకరించిన ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరైన సభికులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి యోగా వేడుకలో పాలుపంచుకుంటున్న వారు సహా నా ప్రియమైన దేశప్రజలారా... మీకందరికీ నమస్కారం!

ఈ భూగోళం మీద జూన్ 21వ తేదీన కొన్ని ప్రాంతాలలో పగటి సమయం అత్యధికంగా ఉంటుంది. మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం వల్ల ఇదే తేదీ ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకకు వేదికగానూ మారింది. ప్రపంచం నలుమూలల నుంచి ఇవాళ యోగా సంబంధిత అద్భుత దృశ్యాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో ఆసేతు శీతాచలం నుంచి హిందూ మహాసముద్రం దాకా.. ఈశాన్య ప్రాంతం-బెంగాల్ నుంచి పశ్చిమాన సౌరాష్ట్ర వరకూ యావద్దేశం యోగా శక్తి-చైతన్యాలతో పొంగులు వారుతోంది. దేశం, ప్రపంచం పరస్పర సంధానితమైనట్లు దర్శనమివ్వడం యోగా వాస్తవిక  శక్తిని ప్రతిబింబిస్తోంది. యోగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి, ఐకమత్యంతో పెనవేస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రపంచానికి, యావత్‌ మానవాళికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ఈ రోజున యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని... ముఖ్యంగా బెంగాల్ రాష్ట్ర ప్రజలు ‘స్వచ్ఛత యోగా’ (పరిశుభ్రత దిశగా కృషి) కార్యక్రమం చేపట్టడాన్ని అభినందిస్తున్నాను. ఇదొక అద్భుత కార్యక్రమం... ‘పరిశుభ్రతతో స్వాగతం’ కోసం ఈ నగరంలో సాగిన నిరంతర కృషి, పౌర బాధ్యతలు దేశప్రజలందరికీ ఎనలేని స్ఫూర్తినిచ్చాయి.

మిత్రులారా!

ఈ ఏడాది యోగా దినోత్సవం నాడు బెంగాల్‌లో ఉండటం నాకెంతో ప్రత్యేక అనుభూతినిచ్చింది. భగవాన్ రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు జన్మించిన, స్వామి వివేకానంద ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన, మహర్షి అరవిందుల వంటి గొప్ప యోగులు జన్మించిన, లాహిరి మహాశయులు యోగా సంప్రదాయాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఈ పవిత్ర బెంగాల్ గడ్డపై సామూహిక యోగాభ్యాస అనుభవం విశిష్ట ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. మనిషికి గుర్తింపు ఒంటరితనంలో కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచంతో ముడిపడటంలోనే ఉంటుందని ఇదే గడ్డపై జన్మించిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వసించారు. ఆయన ప్రబోధించిన అనుసంధానమే ఈ యోగా సారాంశం. మహర్షి అరవిందులు కూడా- “మనకు తెలిసినా తెలియకపోయినా, జీవితం మొత్తం యోగామయం. యోగం మన స్వభావంలో భాగమైతే మానవ ఐక్యతకు అదొక పునాదిగా మారుతుంది” అన్నారు.

మిత్రులారా!
యోగా కేవలం శారీరక వ్యాయామ ఉపకరణం మాత్రమే కాదు... యోగా ఏదో ఒక  వయస్సు వారికి పరిమితం కాదు. మన దేశంలో యోగా మానవ జీవితంలో ఒక వెలుగు వంటిదని, చైతన్యం-శక్తితో అది మనను మమేకం చేస్తుందని మనం చూశాం, తెలుసుకున్నాం. అందుకే, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ‘ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా’ను ఇతివృత్తంగా ఎంచుకున్నాం. వయసు పెరుగుతున్నా మనం ఆరోగ్యంగా, శక్తిమంతంగా, చురుగ్గా ఉండగలం.. ఈ దిశగా యోగా మనకు మార్గనిర్దేశం చేస్తుంది.

మిత్రులారా!

“ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా” అంటున్నామంటే- మానవ సామర్థ్యాన్ని వయసు తగ్గించకుండా మనం కృషి చేయగలమని అర్థం. నిరంతర అభివృద్ధిని ఆకాంక్షించేలా యోగా మానవాళికి తోడ్పడుతుంది. అంటే- 20 ఏళ్ల వయసులో ఉన్నదానికి మించి 40 ఏళ్ల వయసులో మనపై మనకు అదుపు ఉండాలన్నది లక్ష్యం కావాలి. అలాగే, 30 ఏళ్లతో పోలిస్తే 50 ఏళ్ల వయసులో మరింత శక్తిమంతంగా ఉండాలన్నది మన లక్ష్యం కావాలి. అదే తరహాలో 50 ఏళ్ల వయసుతో పోలిస్తే 70 ఏళ్ల వయసులో జీవనశైలి వ్యాధులను మరింత తట్టుకోగల శక్తి ఉండాలనేది మన లక్ష్యం కావాలి. ఇక్కడే యోగా మనకు సహాయపడుతుంది. మనోశరీరాలను మన స్వాధీనంలో ఉంచుకునేలా తోడ్పడుతుంది. మన శక్తి స్థాయిని ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. ఒత్తిడి లేని ప్రశాంత జీవనం గడపడానికి చేయూతనిస్తుంది. జీవనశైలి వ్యాధులను దూరంగా ఉంచడమే కాకుండా క్రమబద్ధ సాధనతో, మనో శరీరాల గురించి జీవితాంతం అవగాహన పెంచుకునే మార్గాలను యోగా బోధిస్తుంది. మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే, మనల్ని మనం అంత బాగా తీర్చిదిద్దుకోగలం. అందుకే, ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా అంశాన్ని కేవలం వృద్ధులకు పరిమితం చేయకుండా అన్ని వయసుల వారికోసం ఉద్దేశించినదిగా పరిగణించాలి.

మిత్రులారా,

భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగా గురించి- “యుక్తాహార విహారస్య, యుక్తాచేష్టస్య కర్మసు, యుక్తా స్వప్నవబోధస్య, యోగో భవతి దుఃఖః” అని ప్రబోధించాడు. అంటే- సమతుల ఆహారవిహారాలు, సమతుల కర్మలు-విధులు, సమతుల నిద్ర-జాగరూకత ద్వారా యోగా దుఃఖాన్ని రూపుమాపుతుంది. సమతౌల్యమే యోగాకు పునాది... మన జీవితాలకూ అదే మూలస్తంభం. అయినప్పటికీ, ఈ ఆధునిక కాలంలో చాలా మంది జీవిత అసమతౌల్యంతో పోరాడుతున్నారు. యోగా మనకు సమతుల జీవన కళను బోధిస్తుంది. ఏమి చేయాలో.. ఏం చేయకూడదో చూపుతుంది. మన శరీరాన్ని సరిగ్గా నడిపించడం నేర్చుకుంటే ఆరోగ్యం మన సహజ స్థితిగా మారుతుంది.

మిత్రులారా!

యోగా మన శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం నుంచి శారీరక ఆరోగ్యం దిశగా సాగే మార్గాన్ని చూపుతుంది. అందుకే యోగాలో “యుక్త చేష్టస్య కర్మసు” అంటారు. అంటే- మనమేం చేయాలి.. ఏం చేయకూడదు? అనే దానిపై అవగాహన కలిగి ఉండటం అన్నమాట. ఈ అవగాహన మన జీవితాల్లోనే కాకుండా ప్రపంచ శాంతికీ మార్గం సుగమం చేస్తుంది. అందుకే నేడు యోగా అనేది మన వ్యక్తిగత జీవనశైలికి మాత్రమేగాక మెరుగైన ప్రపంచ భవిష్యత్తుకూ ఆవశ్యకం.

మిత్రులారా!

ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు లక్షలాది ప్రజలు ఈ వ్యాయామంతో మమేకమవుతారు. అయితే, మన ఉమ్మడి సంకల్ప పునరుద్ధరణ అవకాశాన్ని ఈ రోజు మనకు కల్పిస్తోంది. యోగా కేవలం ఒక రోజుకు లేదా ఓ కార్యక్రమానికి పరిమితం చేయబోమని ప్రతినబూనుదాం. యోగాను మన జీవితాల్లో, కుటుంబాల్లో, భావి తరాల జీవనశైలిలో అంతర్భాగం చేసుకుందాం.

మిత్రులారా!

ఈ దిశగా ఈదఫా “యోగా 365” కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించాం. దీనికింద ఇప్పటికే 100 రోజుల ఆన్‌లైన్ యోగా కార్యక్రమాలను నిర్వహించగా విశేష ప్రజా స్పందన లభించింది. ఈ మేరకు 130 దేశాల నుంచి 30 లక్షల మందికి పైగా ప్రజలు ఇందులో పాలుపంచుకున్నారు.

మిత్రులారా!

సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం మరింత సమర్థం, సంపన్నంగానూ, ఆత్మవిశ్వాసంతో కూడినదిగానూ మారుతుంది. ఈ సందర్భంగా “సర్వే భవంతు సుఖిన... సర్వే సంతు నిరామయా” (అందరూ సుఖంగా ఉండాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలి) అంటూ మీకందరికీ దీర్ఘాయురారోగ్యాలు కలగలని నేను ఆకాంక్షిస్తున్నాను. చివరగా, ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నా ప్రసంగం ముగిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

 

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(रिलीज़ आईडी: 2276066) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali