ఆయుష్
మానసిక ప్రశాంతత, ఓర్పు, మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి ఒక శక్తిమంతమైన సాధనం యోగా: లోక్‌సభ స్పీకర్
యోగా కేవలం భారత్ సాఫ్ట్ పవర్ మాత్రమే కాదు.. ఇది మానవాళి పట్ల దేశానికి ఉన్న బాధ్యత: లోక్‌సభ స్పీకర్
ప్రజాస్వామ్యానికి చర్చలు అవసరం.. సంభాషణకు మానసిక సమతుల్యత అవసరం. యోగా సరిగ్గా దానినే నేర్పుతుంది: లోక్‌సభ స్పీకర్
యోగా అనేది ఒక రోజు వేడుకగా మాత్రమే మిగిలిపోకూడదు. అది 365 రోజుల నిబద్ధతగా మారాలి: లోక్‌సభ స్పీకర్
ఆరోగ్యకరమైన ప్రజలే బలమైన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద సంపద: లోక్‌సభ స్పీకర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సముదాయంలో ఎంపీలతో కలిసి యోగా సెషన్‌లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్
प्रविष्टि तिथि:
21 JUN 2026 8:14AM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ సభ్యులు యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్.. మానవాళికి ఆరోగ్యం, సమతుల్యత, అంతర్గత శాంతి మార్గాన్ని అందించిన భారత కాలాతీత నాగరికతా వారసత్వాన్ని ఈ రోజు వేడుకగా చేసుకుంటున్నామని అన్నారు. “యోగా శరీరాన్నే కాకుండా మనస్సును, ఆలోచనలను కూడా సమతుల్యం చేస్తుంది. పార్లమెంట్లో భిన్నాభిప్రాయాలు సహజం కానీ యోగా మనకు చర్చలకు, ఆత్మనిగ్రహానికి ఉన్న మార్గాన్ని చూపిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
యోగా ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ ఓం బిర్లా.. భారత్‌కు చెందిన మునులు, పండితులు శతాబ్దాల తరబడి యోగా సంప్రదాయాన్ని పరిరక్షించడానికి కృషి చేశారని, వారంతా దానిని ఒక జీవన విధానంగా మార్చారని అన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మానవ చైతన్యాన్ని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరించే ఒక అంతర్జాతీయ ప్రజా ఉద్యమంగా మారిందన్న ఆయన.. ఇది భారతదేశ వేల సంవత్సరాల నాటి జ్ఞాన సంప్రదాయం అందించిన బహుమతి అని స్పష్టం చేశారు.
సమకాలీన జీవితంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పిన లోక్‌సభ స్పీకర్.. ఆధునిక జీవితం ఒత్తిడి, అసమతుల్యత, అనిశ్చితితో కూడి ఉందని అన్నారు. ఇటువంటి సమయాల్లో మానసిక ప్రశాంతత, ఓర్పు, భావోద్వేగ సమతుల్యత, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కాపాడుకోవడానికి యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 21వ శతాబ్దపు అతిపెద్ద సవాళ్లలో మానసిక ఒత్తిడి ఒకటని.. దీనికి యోగా ఒక సులభమైన, శాస్త్రీయమైన, అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి డిజిటల్ తరం తమ స్క్రీన్ సమయాన్ని, ఒత్తిడిని సమతుల్యం చేసుకోవడానికి యోగాను తమ జీవనశైలిలో ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
యోగా కేవలం శారీరక దృఢత్వానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని.. అది వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, చైతన్యాన్ని పెంపొందించే ఒక సాధనమని శ్రీ ఓం బిర్లా అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రజలు మరింత సమతుల్యతను సాధిస్తారని, వారి నిర్ణయాత్మక సామర్థ్యాలు మెరుగుపడతాయని, వారి సంపూర్ణ ఆరోగ్యం వృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. “ఆరోగ్యకరమైన పౌరులే బలమైన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద సంపద” అని స్పష్టం చేసిన ఆయన.. భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ కేవలం కొన్ని నిమిషాల సమయాన్ని యోగాకు కేటాయిస్తే అది దేశంలోనే అతిపెద్ద ప్రజారోగ్య విప్లవంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
యోగా ఇచ్చే సందేశం దేశంలోని ప్రతి మూలకు చేరాలని లోక్‌సభ స్పీకర్ అన్నారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలతో మాట్లాడుతుంటారు కాబట్టి ప్రజలు యోగాను స్వీకరించేలా, దానిలోని పరివర్తన శక్తిని అర్థం చేసుకునేలా వారిని ప్రేరేపించడంలో వారు కీలక పాత్ర పోషించగలరని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి నిరంతర ప్రయత్నాలు ఎలాగైతే జరుగుతుంటాయో అదేవిధంగా యోగా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అంతర్భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు.
యోగా అనేది కేవలం భారత్ సాఫ్ట్ పవర్ మాత్రమే కాదన్న లోక్‌సభ స్పీకర్.. అది మానవాళి పట్ల దేశానికి ఉన్న బాధ్యత అని అన్నారు. ప్రజలందరూ యోగాను ఒక రోజు వేడుకగా మాత్రమే చూడకుండా 365 రోజుల నిబద్ధతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యం, సామరస్యం, ఆత్మశిక్షణతో కూడిన సంస్కృతిని బలోపేతం చేయాలని ఆయన కోరారు.
***
(रिलीज़ आईडी: 2276064)
आगंतुक पटल : 12