పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
నిర్భయ్ చేతన ప్రారంభం: క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, లింగ సమానత్వ అంశాలపై 17.5 లక్షల మందికి పైగా పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సన్నాహాలు
నిర్భయ నిధి ద్వారా మొదటి జాతీయ కార్యక్రమం.. 28,500 మంది ప్రధాన శిక్షకుల బృందాన్ని సిద్ధం చేయటమే లక్ష్యం
प्रविष्टि तिथि:
20 JUN 2026 12:21PM by PIB Hyderabad
కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నిర్భయ నిధి ప్రాజెక్టు ద్వారా జూన్ 17, 2026 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో నిర్భయ్ చేతనపై శిక్షకులకు మూడు రోజుల శిక్షణా (టీఓటీ) కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచంలోనే అతిపెద్ద అవగాహనా ప్రచార కార్యక్రమంగా గుర్తింపు పొందిన నిర్భయ్ చేతన.. మహిళల భద్రత, రక్షణతో కూడిన మహిళా సంబంధిత అంశాలపై పురుషులకు అవగాహన కల్పించే కీలక జాతీయ కార్యక్రమం. క్షేత్రస్థాయిలో లింగ సమానత్వంతో కూడిన పాలనను బలోపేతం చేయటమే దీని లక్ష్యం. ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా సంస్థ రూపొందించిన నిర్భయ్ చేతన శిక్షణ ప్రణాళికను ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో లింగ సమానత్వం, మహిళల భద్రత, హక్కులు, నాయకత్వం వంటి అంశాలపై పురుష ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసేలా ప్రధాన శిక్షకుల బృందాన్ని తయారు చేయటమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మొదటి బృందంలో ఆరు రాష్ట్రాలు.. అస్సాం, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్ నుంచి సుమారు 40 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించేలా రూపొందించిన శిక్షణా నమూనాకు ఈ తొలి బ్యాచ్ కీలకంగా నిలుస్తుంది.
ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. మహిళలకు భద్రత, గౌరవం, సమాన భాగస్వామ్యాన్ని కల్పించకుండా వికసిత్ భారత్ కల సాకారం కాదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనా విధానాలు, ప్రవర్తనల్లో అర్థవంతమైన మార్పును తీసుకురాగల సామాజిక, ప్రజాస్వామ్య పరివర్తన సంస్థలుగా పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నిర్భయ్ చేతన ఉద్దేశాన్ని తెలియజేస్తూ... మహిళల గౌరవం, భద్రత, వారికి లభించే అవకాశాలను అభివృద్ధికి కీలక ఆధారాలుగా మార్చటం ద్వారా లింగ వివక్ష లేని నాయకత్వాన్ని పెంపొందించటానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహాని మాట్లాడుతూ... మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటం.. సమాజ ఉమ్మడి బాధ్యతని తెలిపారు. లింగ సమానత్వ పాలనను పెంపొందించటంలో మహిళలు, బాలికల కోసం మరింత సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటంలో పంచాయతీలది కీలక పాత్రని స్పష్టం చేశారు. పురుష ప్రజాప్రతినిధుల్లో అవగాహన, సున్నితత్వం, జవాబుదారీతనాన్ని పెంపొందించటమే నిర్భయ్ చేతన ముఖ్య లక్ష్యమని అన్నారు. తద్వారా వారి పరిధిలోని సమాజంలో మహిళల భద్రత, గౌరవం, నాయకత్వం, మహిళా సాధికారతకు ముందుండి పోరాడేలా ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులను సన్నద్ధం చేస్తుందని వివరించారు.
లింగ సమస్యలు, సామాజిక మూస పద్ధతులను సవాలు చేయటానికి, లింగ సమానత్వంతో కూడిన నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు నిపుణుల ఉపన్యాసాలు, బృంద చర్చలు, కేస్ స్టడీస్, అనుభవపూర్వకంగా నేర్చుకోవటం వంటి భాగస్వామ్య పద్ధతులను ఈ కార్యక్రమం అవలంబించింది. ఇందులో భాగంగా ప్రగతిశీల పురుష స్వభావం, సమాజ భాగస్వామ్యం, మహిళల భద్రత, గౌరవం, సమగ్రతను పెంపొందించటంలో పంచాయతీల పాత్ర వంటి కీలకమైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
నిర్భయ్ చేతన గురించి
మార్చి 11, 2026న ప్రారంభమైన నిర్భయ్ రహో కార్యక్రమంలో కీలక భాగం నిర్భయ్ చేతన. ఈ నిర్భయ్ రహో కార్యక్రమంలో పరస్పర అనుబంధం గల మూడు అంశాలున్నాయి. అవి: ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల్లో సామర్థ్యాన్ని పెంపొందించటం, చట్టపరమైన అవగాహన కల్పించటంపై "నిర్భయ్ నేత్రి" దృష్టి సారిస్తుంది. లింగ సమానత్వం, మహిళల భద్రతపై పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు "నిర్భయ్ చేతన" కృషి చేస్తుంది. పంచాయతీల్లో సాంకేతిక ఆధారిత భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం కోసం గ్రామీణ ప్రాంతాల్లోని కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును "నిర్భయ్ దృష్టి" పరిశీలిస్తుంది. నిర్భయ్ చేతన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 17.5 లక్షల మందికి పైగా పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో 28,500 మంది ప్రధాన శిక్షకుల బృందాన్ని సిద్ధం చేస్తారు.
***
(रिलीज़ आईडी: 2275859)
आगंतुक पटल : 10