ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద సుమారు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
తొలిసారిగా ఉద్యోగంలో చేరేవారికి సాధికారత కల్పించడం, యువతకు-పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేయడం పీఎమ్ వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లక్ష్యం
మన యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలే వికసిత భారత్‌కు మార్గాన్ని నిర్దేశిస్తాయి
రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణలు, ఔత్సాహిక పరిశ్రమలను నడిపించడంలో భారత యువత ముందుంటుంది
ప్రపంచానికి మార్గనిర్దేశం చేయడానికి భారత్ సిద్ధం
21వ శతాబ్దంలో నైపుణ్యం గల ప్రతిభను పెంపొందిస్తూ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, అత్యున్నత నాణ్యత ప్రమాణాలను నిలబెట్టే దేశాలకే అవకాశాలు
ప్రపంచంతో పోటీపడాలంటే, మనం అత్యున్నత నాణ్యత ప్రమాణాలను అందుకోవాలి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 JUN 2026 7:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, భాగస్వాములనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. భారత యువతకు సాధికారత కల్పించడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎం-వీబీఆర్‌వై అమలులో భాగంగా... అన్ని రంగాలకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ ప్రోత్సాహకం దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడింది.
ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల పర్యటనలో భాగంగా జీ-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, ప్రపంచ నాయకులతో సమావేశమై తిరిగి వచ్చిన వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. భారత యువత తమ ప్రతిభ, నైపుణ్యాలు, సామర్థ్యానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వ గుర్తింపును పొందుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతీయ యువత సామర్థ్యాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు పెరుగుతూనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యువత తమ సామర్థ్యాన్ని విజయంగా మలచుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
"ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కేవలం ఒక ఉపాధి పథకం కంటే చాలా ఎక్కువ. ఇది తమ తొలి ఉద్యోగంలో చేరుతున్న యువత ఆకాంక్షలను బలోపేతం చేయడంతో పాటు, పరిశ్రమకు-కార్మిక వర్గానికి మధ్య ఒక బలమైన వారధిని నిర్మించడానికి రూపొందించిన కార్యక్రమం" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సాధారణంగా అనేక పథకాలు ఉద్యోగులపైనో లేదా యజమానులపైనో మాత్రమే దృష్టి సారిస్తాయని, ఈ కార్యక్రమం ఏకకాలంలో ఇద్దరికీ మద్దతునిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించే యువతకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించే సంస్థలనూ ప్రోత్సహిస్తుందని అన్నారు.
ఈ పథకం సాధించిన విజయాలను వివరిస్తూ... ఇప్పటివరకు దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని, అదేసంఖ్యలో తొలిసారిగా ఉద్యోగంలో చేరిన వారిని సామాజిక భద్రత పరిధిలోకి తీసుకువచ్చామని శ్రీ మోదీ తెలిపారు. దాదాపు 20 లక్షల మంది యువత తమ తొలి ఉద్యోగంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్నారని, ఈ మైలురాయిని పూర్తి చేసిన సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటికే ఈ పథకం కింద ప్రోత్సాహకాలను అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2,000 కోట్లకు పైగా బదిలీ చేశామన్నారు. ఈ మద్దతు కేవలం ఆర్థిక సహాయం కంటే ఎక్కువని వర్ణిస్తూ... ఇది యువత కష్టానికి దేశం ఇస్తున్న గుర్తింపును, వారి భవిష్యత్తుపై దేశానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ పథకం కింద ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థలు, వ్యాపార సంస్థల భాగస్వామ్యం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వం, పరిశ్రమలు, యువత కలిసి పనిచేసినప్పుడు ఉపాధి కల్పన ఊపందుకుంటుంది. యువతకు అవకాశాలు లభించడం, పరిశ్రమలకు ప్రోత్సాహం అందడం, ఉపాధి కల్పన జాతీయ కర్తవ్యంగా మారడం సాధ్యమయ్యే నూతన భారత్‌కు ఈ కార్యక్రమం ప్రతిబింబం వంటిది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దేశ జనాభా బలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత గల దేశాల్లో భారత్ ఒకటని, అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణం మన యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రతి యువ భారతీయుడు తన ప్రతిభ, ఆశయాలకు అనుగుణంగా పురోగమించగలరని నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గత పన్నెండేళ్లుగా, ఉపాధికి సంబంధించిన ప్రతి మార్గాన్నీ బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేసిందని ప్రధానమంత్రి తెలిపారు. "మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల నుంచి తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్ష సాంకేతికత, అంకురసంస్థల వరకు అన్ని రంగాల్లో గణనీయ కృషి జరిగింది. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నాలు, మిషన్ మానుఫ్యాక్చరింగ్ వంటి కార్యక్రమాలు ఉపాధి, స్వయం ఉపాధి రెండింటికీ మార్గాలను విస్తరించాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వం పెట్టిన రూ.12 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి, ఉపాధి కల్పనకు బలమైన పునాది వేస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద అందించిన రూ.33 లక్షల కోట్లకు పైగా సహాయం, లక్షలాది మంది యువత తమ సొంత సంస్థలను స్థాపించుకోవడానికి వీలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత గురించి ప్రస్తావిస్తూ... 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక బృందాలతో అనుబంధం కలిగి ఉన్నారని, 3 కోట్లకు పైగా మహిళలు లక్‌పతి దీదీలుగా ఎదిగారని ఆయన తెలిపారు. పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ వంటి కార్యక్రమాలు చిన్న పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులు, సాంప్రదాయ కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేశాయని ఆయన జోడించారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు కొత్త ఉపాధి అవకాశాలను ఎలా సృష్టిస్తున్నాయనడానికి, వేగంగా విస్తరిస్తున్న డ్రోన్ రంగం ఒక చక్కటి ఉదాహరణ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఔషధాల పంపిణీ, వ్యవసాయ సంబంధిత అనువర్తనాల నుంచి స్వామిత్వ పథకం కింద భూమి మ్యాపింగ్, రక్షణ కార్యకలాపాల వరకు... డ్రోన్ టెక్నాలజీని ఎక్కువగా వినియోగించడం ద్వారా యువ భారతీయులకు కొత్త ఉపాధి మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరివర్తన ప్రభావం గురించి మాట్లాడుతూ... గిగ్ ఎకానమీ, ప్లాట్‌ఫామ్ ఆధారిత సేవలు, కంటెంట్ క్రియేషన్, టెక్నాలజీ ఆధారిత సంస్థల ఆవిర్భావాన్ని ఉపాధికి, ఆదాయానికి ప్రధాన వనరులుగా పేర్కొన్నారు. “ఒకప్పుడు ఊహించడం కూడా సాధ్యంకాని ఎన్నో అవకాశాలు ఇప్పుడు లక్షలాది మంది యువ భారతీయులకు ఆచరణీయ జీవనోపాధిగా మారాయి. ఇదే పరివర్తన భారత శక్తిమంతమైన అంకుర సంస్థల వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తోంది, ఇది ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, ఉద్యోగాలను సృష్టిస్తూ, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతూనే ఉంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
గత దశాబ్ద కాలంలో భారత అంకుర సంస్థల వ్యవస్థ సాధించిన అద్భుతమైన వృద్ధిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకప్పుడు దేశంలో కేవలం 500 అంకురసంస్థలు మాత్రమే ఉండగా... నేడు దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో అంకుర సంస్థల ఏర్పాటుతో ప్రస్తుతం 2 లక్షలకు పైగా నమోదిత అంకురసంస్థలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "భారత భవిష్యత్తుపై ప్రపంచ సమాజం ఆశాభావంతో ఉంది. ఇక్కడి యువత సామర్థ్యాలపై అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంది" అని శ్రీ మోదీ అన్నారు. తన ఇటీవలి ఫ్రాన్స్ పర్యటనను ప్రస్తావిస్తూ... కృత్రిమ మేధ, అంతరిక్ష సాంకేతికత, హరిత ఇంధనం, బయోటెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారతీయ అంకుర సంస్థలను, ప్రపంచ పెట్టుబడిదారులను ఒకచోట చేర్చిన "ఇండియా ఇన్నోవేట్స్" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భారత ఆవిష్కరణల వ్యవస్థపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆసక్తిని, భవిష్యత్ సాంకేతికతలను తీర్చిదిద్దడంలో విస్తరిస్తున్న భారత్ పాత్రను ఇటువంటి కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారత్ చురుగ్గా కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందాలు భారతీయ పరిశ్రమలకు కొత్త మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భారతీయ నిపుణులకు సరికొత్త అవకాశాలనూ సృష్టిస్తున్నాయని ఆయన గమనించారు. “ప్రపంచం భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ కోసం సిద్ధమవుతుండగా, భారత్ దానికి నాయకత్వం వహించడానికి సిద్ధమవుతోంది. దేశాలు భవిష్యత్ సాంకేతికతల వైపు ఎక్కువగా పయనిస్తున్న తరుణంలో, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలతో తన యువతను సన్నద్ధం చేయడంపై భారత్ దృష్టి సారించింది” అని ఆయన స్పష్టం చేశారు.
గత పన్నెండేళ్లలో భారత ఉపాధి వ్యవస్థలో వచ్చిన ఒక ముఖ్యమైన పరివర్తనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పరివర్తనకు తరచుగా తక్కువ శ్రద్ధ లభిస్తున్నప్పటికీ, అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగే ప్రయాణానికి ఇది చాలా కీలకమైనదన్నారు. “ఉద్యోగాన్ని భద్రత, గౌరవం, సామాజిక రక్షణతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)ను ఆధునీకరించడానికి, పింఛను వ్యవస్థలను సరళీకృతం చేయడానికి, లక్షలాది మంది కార్మికులకు ఆరోగ్య బీమా, సరసమైన ఆరోగ్య సంరక్షణను విస్తరించడానికి సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంస్కరణలకూ ఇదే తత్వం మార్గదర్శకంగా ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళల నుంచి పెరుగుతున్న సహకారాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "రాత్రి షిఫ్టు ఉద్యోగాలకు సంబంధించిన సంస్కరణలు, ఇంటి నుంచి పని చేసే అవకాశాలను ప్రోత్సహించడం, కార్యాలయ భద్రతా యంత్రాంగాలను బలోపేతం చేయడం వంటి చర్యలు శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో కొనసాగుతున్నాయి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
పరిశ్రమ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తూ... ఇరవై ఒకటో శతాబ్దంలో ఆర్థిక విజయాన్ని నిర్ధారించడంలో నైపుణ్యం గల ప్రతిభ, ఆవిష్కరణలు, నాణ్యతల ప్రాముఖ్యతను శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ బలాలు కలిగిన దేశాలు గొప్ప అవకాశాలను ఆకర్షిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు రంగాల్లోనూ భారత్ అపూర్వమైన సామర్థ్యాలను కలిగి ఉందని ఉద్ఘాటించారు. "ప్రపంచం భారత్ కోసం తన ద్వారాలను తెరుస్తూనే ఉంది. దాదాపు నలభై దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు కొత్త మార్కెట్లను సృష్టిస్తున్నాయి. ప్రపంచ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా అవి విస్తరిస్తున్నాయి. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద దేశంలో రూపొందించిన బ్రాండ్‌లకు అంతర్జాతీయంగా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఒక దేశం ప్రపంచ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడు, విజయాల పరిధులు సహజంగానే విస్తరిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇరవై ఒకటో శతాబ్దంలో... శిక్షణ, మార్గదర్శకత్వం, ఇంటర్న్‌షిప్‌లు ఐచ్ఛికాలు కాదనీ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తికి అవి అత్యవసరమైన అంశాలని ఆయన తెలిపారు. “అభివృద్ధి చెందిన భారత్ వైపు ప్రయాణం కేవలం పెట్టుబడులతో మాత్రమే సాగదు. ప్రతిభ, నైపుణ్యాలు, ఆవిష్కరణల శక్తితోనే అది సాధ్యమవుతుంది. జాతీయ అభివృద్ధికి సంబంధించిన ప్రతి రంగంలోనూ నాణ్యత ప్రధాన ప్రమాణంగా నిలవాలి. ప్రపంచ వేదికపై పోటీపడి విజయం సాధించాలంటే, భారత్ నిరంతరం అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలి, వాటిని అధిగమించాలి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ప్రపంచం నేడు భారత్‌పై గొప్ప అంచనాలను కలిగి ఉందని శ్రీ మోదీ గమనించారు. దేశ యువతపై విశ్వాసం వ్యక్తం చేస్తూ... యువ భారతీయులు తమ సంకల్పం, సృజనాత్మకత, సామర్థ్యాల ద్వారా ఈ అంచనాలను అందుకోవడమే కాకుండా వాటిని మించి పురోగతి సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ విశ్వాసమే వికసిత్ భారత్ నిజమైన బలం అని... భారత యువశక్తి అపార సామర్థ్యానికి ప్రతిబింబం అని ఆయన అభివర్ణించారు. ఎదురుదెబ్బలు లేదా వైఫల్యాలతో నిరుత్సాహపడవద్దని ప్రధానమంత్రి యువతను ప్రోత్సహించారు. "ప్రతి వైఫల్యం విలువైన పాఠాలను నేర్పుతుంది. వ్యక్తిగత ఎదుగుదలకు, భవిష్యత్ విజయానికి దోహదపడుతుంది. సవాళ్ల నుంచి నిరంతరం నేర్చుకోవడం, కలలను విజయాలుగా మార్చుకోవడం, ప్రతి విజయం తర్వాత కొత్త ఆకాంక్షలను సృష్టించుకోవడం యువత మేధస్సుకు నిజమైన కొలమానం అవుతుంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారత యువత, పారిశ్రామిక స్ఫూర్తిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ... భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా పురోగమిస్తున్న తరుణంలో, దేశ యువ పౌరుల ఆకాంక్షలు, ఆవిష్కరణలు, లక్ష్యాలకు మద్దతునివ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
***
(रिलीज़ आईडी: 2275585)
आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam