ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్‌లో ‘వివాటెక్-2026’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 18 JUN 2026 7:00PM by PIB Hyderabad

గౌరవనీయ అతిథులు.. ఆవిష్కర్తలు.. వాణిజ్యవేత్తలు.. సాంకేతిక రంగ ఔత్సాహికులు.. అంకుర ప్రపంచ ప్రముఖులు.. సోదరీసోదరులందరికీ...

నమస్కారం!

బాంజూర్‌... (అభివందనం)

   పారిస్‌లో ‘వివాటెక్’ పదో వార్షికోత్సవం కోసం ఈ నగరానికి రావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఇది ఐరోపా ఖండంలోనే అత్యంత భారీ సాంకేతికోత్సవం. వివాటెక్ విజయవంతం కావడంపై అధ్యక్షుడు మాక్రాన్‌తోపాటు, ఉత్సవ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

భారత్‌ సహా ఐరోపా దేశాలకు 2026 ఒక ప్రత్యేక సంవత్సరం. ఈ ఏడాది ఆరంభంలోనే  మనం చారిత్రక భారత్-ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాం. ఇది మన వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరింత విస్తరింపజేస్తుంది. దాంతోపాటు ప్రతిభ, సాంకేతికత, పర్యాటక రంగాల్లో ఆదానప్రదానానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది.

 

ఇక ఇదే సంవత్సరంలో ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ ప్రారంభం కావడంతో రెండు దేశాలతోపాటు ఐరోపా సాంకేతికావరణ వ్యవస్థలను చేరువ చేసే కీలక వారధిగా ఇది రూపొందింది. కొన్ని రోజుల కిందట నైస్‌ నగరంలో నిర్వహించిన ‘భారత్ ఇన్నొవేట్స్’ నుంచి ఇవాళ పారిస్‌ నగరంలో నిర్వహిస్తున్న ‘వివాటెక్’ దాకా మన అంకుర సంస్థలు అనేక కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటున్నాయి.

మిత్రులారా!

లోగడ ‘వివాటెక్‌-2021’లో నేను ప్రసంగించిన రోజున ప్రపంచం కోవిడ్-19 మహమ్మారితో సతమతం అవుతోంది. ఇక ఇప్పటి పరిస్థితులు కూడా భిన్నమేమీ కాదు.. ఇవాళ కూడా ప్రపంచం ఇతరత్రా అవరోధాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం విఫలమైన చోట ఆవిష్కరణ గట్టెక్కించగలదని వివాటెక్-2021 సందర్భంగా ఇచ్చిన నా సందేశాన్నే ఇక్కడ కూడా పునరుద్ఘాటిస్తున్నాను.

మిత్రులారా!

గడచిన దశాబ్దంలో భారత్‌ శరవేగంగా పురోగమించే సాంకేతికతతో రూపాంతరీకరణ దిశగా సాగింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థ సృష్టి నుంచి, అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వేదికల దాకా ముందంజ వేసింది. ఇవాళ మేము ఆర్థిక సార్వజనీనత, విద్య, దూరవైద్యం, వ్యవసాయం సహా మరెన్నో అవసరాల కోసం సాంకేతికతను భారీగా  వినియోగిన్నాం.

ఒక్క డిజిటల్ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోండి... మా ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) ద్వారా ప్రపంచవ్యాప్త ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీలలో సగం నేడు భారత్‌లోనే నమోదవుతున్నాయి. మీరిప్పుడు ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద లేదా పారిస్ విమానాశ్రయంలో కూడా ‘యూపీఐ’ని ఉపయోగించవచ్చు.

ఇటువంటి అంతర్జాతీయ స్థాయి సార్వజనీన డిజిటల్ సదుపాయాల సామర్థ్యాన్ని చాటే ఉదాహరణలు మనముందు అనేకం ఉన్నాయి. వాటిలో ‘డిజిలాకర్’ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్లలో ఒకటిగా ఉంది. దీనిద్వారా  700 మిలియన్ల మంది  వినియోగదారులకు ఎప్పుడైనా.. ఎక్కడైనా.. మూలం నుంచి ప్రామాణిక పత్రాల సౌలభ్యం కలుగుతుంది. ఈ వేదిక పరిధిలోకి మేమిప్పుడు 2 వేలకు పైగా ప్రామాణిక పత్రాలను చేర్చాం. ఇకపై భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి పత్రాలను భౌతికంగా భద్రపరచుకోవడం, అవసరమైనప్పుడు వెతుక్కోవడం అనే అవస్థలు ఉండవు.

ఇందుకు మరొక ఉదాహరణ ‘గతిశక్తి’ వేదిక. సాంకేతికత సహాయంతో ఒకే ‘జీఐఎస్‌’ ఆధారిత పటంలో 1,600కు పైగా భౌగోళిక డేటా పొరలను జోడించాం. అలాగే, మౌలిక సదుపాయాల కోసం మేమొక సమీకృత, డేటా-ఆధారిత, సంపూర్ణ ప్రభుత్వ ప్రణాళిక వేదికను సృష్టించాం. కాబట్టి, లోగడ నెలల తరబడి చేయాల్సిన ప్రాజెక్ట్ సర్వేలు కొన్ని వారాల్లోనే పూర్తవుతున్నాయి.

మిత్రులారా!

ఆరేళ్ల కిందట ప్రజానీకానికి గౌరవం, ఆర్థిక భద్రత దిశగా సాంకేతికత సామర్థ్యానికి ఒక బలమైన ఉదాహరణగా ‘స్వామిత్వ్’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికింద గ్రామీణ కుటుంబాలకు ఆస్తి రికార్డులు సమకూర్చేందుకు డ్రోన్లు, జియోస్పేషియల్ మ్యాపింగ్, ఆధునిక సర్వే సాంకేతికతలను సమ్మిళితం చేశాం.  దాదాపు 2 లక్షల గ్రామాల్లో 31 మిలియన్లకు పైగా ఆస్తి కార్డులు రూపొందించి, జారీచేశాం. దీంతో ఆయా కుటుంబాలు తమ ఆస్తిని ఆర్థిక వనరులుగా వాడుకునే వెసులుబాటు కలిగింది.

ప్రభుత్వం ఇలా భారీ ఎత్తున ప్రజా ప్రయోజనాలను సమకూరుస్తుంటే, మరోవైపు మా అంకుర సంస్థలు ప్రతి రంగంలోనూ మానవ జీవన సౌలభ్యం కల్పిస్తున్నాయి.

మిత్రులారా!

‘సర్లాబెన్’ అనే ఒక ఏఐ అనువర్తనం లక్షలాది మహిళా పాడి రైతులతో వారి మాతృభాషలో మాట్లాడుతూ- పశువుల ఆరోగ్యం-నిర్వహణపై వారికి నిపుణుల మార్గదర్శక సూచనలను చేరవేస్తుంది.

మరోవైపు ఎరువులు చల్లడం, పంటల పర్యవేక్షణలో భారత మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తున్నాం. ఉపగ్రహ సమాచారంతో లక్షలాది మత్స్యకారులు అత్యంత అనుకూల ప్రాంతాల్లో చేపల వేట సాగిస్తున్నారు. దీనివల్ల వారికి ఇంధనంతోపాటు సమయం కూడా  ఆదా అవుతూ, వేట సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా మా సాంకేతిక పరిష్కారాలు క్షేత్రస్థాయిలో సౌభాగ్యానికి తోడ్పడుతున్నాయి.

మిత్రులారా!

అంతరిక్ష సాంకేతికతల నుంచి అణుశక్తి దాకా మానవ సామర్థ్యాల పరిధిని విస్తృతం చేస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ రికార్డులకెక్కింది. ఇటీవలే భారత నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. ఇది మా అపార థోరియం నిల్వల సద్వినియోగం సహా మూడు దశల అణుశక్తి లక్ష్యం  సాకారానికి మమ్మల్ని మరింత చేరువ చేసింది.

మిత్రులారా!

రెండు లక్షలకు పైగా అంకుర సంస్థలతో భారత్‌ ఇవాళ ప్రపంచంలోనే అత్యంత చైతన్యవంతమైన అంకురావరణ వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇండియా పెవిలియన్‌ను సందర్శించాల్సిందిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

భారత్‌ అపార సామర్థ్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. ప్రపంచంలోనే తొలి ఏకఖండ త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, అధునాతన జన్యు-ఇంజనీరింగ్ చికిత్సలు, కేన్సర్ సహా ఇతర ప్రాణాంతక వ్యాధులను గుర్తించే లేదా సైబర్-నెట్‌వర్క్ భద్రతను మెరుగుపరిచే ఏఐ పరిష్కారాలు, స్వయంప్రతిపత్తి గల రోబోలు, స్మార్ట్ నగరాలు, రవాణా పరిష్కారాలు వంటివన్నీ ఇక్కడ లభిస్తాయి. వీటన్నింటినీ మీరు ఇండియా పెవిలియన్‌లో చూడవచ్చు. వివిధ రంగాల్లో మా అంకుర సంస్థలు స్ఫూర్తిదాయక ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నాయి.

మిత్రులారా!

సాంకేతికత విషయానికి వస్తే, ఆవిష్కరణలతో పాటు సౌలభ్యం కూడా ముఖ్యమే. సాంకేతికత అందరికీ అందుబాటులోకి వస్తే పురోగమనం సాధ్యం. విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే ఈ యుగంలో సాంకేతికత అందరికీ ప్రయోజనం చేకూర్చాలన్నది భారత్‌ ప్రగాఢ విశ్వాసం.

కృత్రిమ మేధనే ఉదాహరణగా తీసుకుందాం... ఈ పరిజ్ఞానం ప్రజల జీవితాలను మెరుగుపరుస్తూ జీవన  సౌలభ్యం కల్పించాలి. వృద్ధిని సాధించడంతోపాటు భూగోళం ఆరోగ్యంగా మనగలిగేలా తోడ్పడాలి. వివాటెక్-2026లో ఏఐ కంట్రీ పార్ట్‌నర్‌గా మా భాగస్వామ్యం ఈ దృక్పథాన్నే ప్రతిబింబిస్తుంది. భారతదేశం విషయంలో ‘ఏఐ’ అంటే- ‘సార్వజనీనం’ (All Inclusive) అని అర్థం.

మిత్రులారా!

భారత్‌ ఒక స్వేచ్ఛాయుత సమాజమేగాక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిభానిధిగల దేశం. మేం సదా నిబంధనలను సరళీకరిస్తూ, వ్యాపార సౌలభ్యం కల్పిస్తున్నాం. ఆవిష్కరణల నుంచి వాణిజ్యీకరణ దాకా 50 బిలియన్ డాలర్లకు పైగా లక్షిత ప్రోత్సాహకాలతో ప్రైవేట్ సంస్థలకు మద్దతిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత సరసమైన డేటా, స్వల్ప వ్యయంతో కాలుష్య రహిత ఇంధనం కూడా సమకూరుస్తున్నాం.

మా విధానం సుస్పష్టం... మా ప్రభుత్వం సాధికారత కల్పిస్తుంది... పరిశ్రమల్లో ఆవిష్కరణలు రూపొందుఆయి. అంకుర సంస్థలు విప్లవాత్మక మార్పులు తెస్తాయి.. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి వృద్ధి చెందుతారు. సమష్టిగా మనం మునుపెన్నడూ లేనంత వేగంగా ముందడుగు వేస్తాం. ఈ మందిరంలోని ఉన్న ప్రతి ఒక్కరూ నాయకత్వ పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.

భారత్‌లో చేయి కలపండి... ప్రపంచానికి మేలు చేయండి.

 

ధన్యవాదాలు... మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

***


(रिलीज़ आईडी: 2274934) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Gujarati