మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నైస్ నగరంలో ఘనంగా ముగిసిన భారత్ ఇన్నోవేట్స్ 2026 ప్రపంచ డీప్‌-టెక్, ఆవిష్కరణల కేంద్రంగా నిలిచిన భారత్


ముగింపు సదస్సులో ప్రసంగించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్... భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026 భవిష్యత్తు సహకారానికి గొప్ప వేదికగా మారుతుందని వెల్లడి

వ్యూహాత్మక భాగస్వామ్యాలు, భారీ పెట్టుబడి అవకాశాలు, సరికొత్త భారత్‌-ఫ్రాన్స్ ఆవిష్కరణ వారధులకు వేదికైన అంతర్జాతీయ సదస్సు

ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల నుంచి 2,000 మందికి పైగా ప్రతినిధుల హాజరు.. 1,350కి పైగా బీ2బీ సమావేశాలు, 50కి పైగా సహకార ఒప్పందాలు విజయవంతం

प्रविष्टि तिथि: 17 JUN 2026 5:30PM by PIB Hyderabad

భారత్‌, ఫ్రాన్స్,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల భాగస్వామ్యంతో ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సదస్సు ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనలు, వ్యాపార సమావేశాలు, పెట్టుబడుల ఆకర్షణ, వివిధ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య చర్చలు విజయవంతంగా ముగిశాయి.

 

ఈ సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భారత్ ఇన్నోవేట్స్‌ తొలి విడత ఒక మైలురాయిగా నిలిచిందని ఆయన అభివర్ణించారు. భారతదేశంలో పరిశోధనల ఆధారిత ఆవిష్కరణలను, సరికొత్త అంకుర సంస్థల వ్యవస్థలను, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో మన దేశ ఉన్నత విద్యా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రముఖంగా ప్రస్తావించారు.

 

ప్రస్తుత ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026’ గురించి మంత్రి మాట్లాడుతూ..  ఈ కార్యక్రమం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్‌ల ఉమ్మడి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. ఇరుదేశాల మధ్య భవిష్యత్తు సహకారానికి, సాంకేతిక మార్పిడికి ఇదొక గొప్ప వేదికగా మారుతుందని తెలిపారు. 

 

అంకుర సంస్థలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు,  విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అవకాశాలను అందుకోవాలని పిలుపునిస్తూ.. “ఈ ప్రపంచమే మీ వేదిక” అని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ‘భారత్ ఇన్నోవేట్స్’ ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని, ప్రపంచ సాంకేతిక, అంకుర సంస్థల కేంద్రంగా భారత్‌ ఎదుగుతున్న పాత్రను ఇది మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన స్పష్టం చేశారు. 

 

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఈ సదస్సు సాధించిన ముఖ్యమైన ఫలితాలను వెల్లడించారు. ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ భాగస్వాములు అందరూ ఒకే లక్ష్యంతో కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ‘భారత్ ఇన్నోవేట్స్’ నిరూపించిందని  కొనియాడారు. ఈ సదస్సు ముగిసినప్పటికీ అంకుర సంస్థల కేంద్రంగా భారత్‌ ఎదుగుతున్న పాత్రను ఇది మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు.

 

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే భారత్ ఇన్నోవేట్స్. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలు, స్టార్టప్ రంగం నుంచి వస్తున్న వినూత్న ఆవిష్కరణలను.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు, వినియోగదారులు, పరిశోధనా సంస్థలు, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించారు.

 

ఈ సదస్సులో దేశానికి చెందిన అత్యుత్తమమైన 120 డీప్‌టెక్ ఆవిష్కరణలను ప్రదర్శించారు.  దేశంలోని 15 ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలకు చెందిన దాదాపు 45 సాంకేతిక ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ సదస్సులో పాల్గొన్న అంకుర సంస్థల్లో దాదాపు 60 శాతం అంకుర సంస్థలు ప్రఖ్యాత ఐఐటీలు, ఐఐఎస్సీ,దేశంలోని ఇతర అగ్రశ్రేణి సంస్థల్లో రూపొందించినవే లేదా వాటితో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నవి కావడం గమనార్హం.

 

మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల నుంచి 2,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో ఫ్రాన్స్‌కు చెందిన 500 మందికి పైగా ప్రముఖ పెట్టుబడిదారులు, కార్పొరేట్ నాయకులు, సీఈఓలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.

 

మూడు రోజుల సదస్సు సాధించిన విజయాలు...

 

·       అంకుర సంస్థలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ దిగ్గజాలు, వివిధ విద్యా, పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో 1,350కి పైగా బీ2బీ భారీ సమావేశాలు జరిగాయి.

·       పరిశ్రమలు, విద్యాసంస్థలు , పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్ ఇంక్యుబేటర్ల మధ్య 50 కి పైగా పరస్పర సహకార, భాగస్వామ్య ఒప్పందాలు

·       ప్రపంచంలోని 10 కి పైగా దేశాలకు చెందిన 50 మందికి పైగా ప్రపంచ పెట్టుబడిదారుల ముందు భారతీయ 80 కి పైగా అంకుర సంస్థలు తమ వినూత్న వ్యాపార ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రదర్శించాయి.

·       ప్రదర్శన నచ్చడంతో 40 కి పైగా అంకుర సంస్థలతో తదుపరి చర్చలు జరపడానికి అంతర్జాతీయ పెటుబడిదారుల సుముఖత 

·       అమెరికా, జపాన్‌ దేశాల పెట్టుబడిదారులతో కలుపుకుని.. భారత్ ఇన్నోవేట్స్ ఆవిష్కర్తలకు సుమారు 254.5 మిలియన్ డాలర్ల నిధుల ఒప్పందాలు, చివరి దశ పెట్టుబడి హామీలు లభ్యం.

సదస్సులో పాల్గొన్న పలు భారతీయ అంకుర సంస్థలతో ఫ్రాన్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి భారీగా ఆర్డర్లు, ఆసక్తి వ్యక్తీకరణలు లభించాయి. ఇది మన స్టార్టప్‌లు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి సరికొత్త ద్వారాలను తెరిచింది.

 

సదస్సు చివరి రోజున టెక్నాలజీ పార్కులు, యాక్సిలరేటర్లు, పారిశ్రామిక డీకార్బనైజేషన్, వ్యాపారాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం వంటి కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా  ‘నథింగ్’ సహ వ్యవస్థాపకుడు శ్రీ అకిస్ ఇవాంజెలిడిస్ ప్రత్యేకంగా ప్రసంగించారు. సాంకేతిక రంగంలో వ్యవస్థాపకత, సరికొత్త ఉత్పత్తుల రూపకల్పన,  అంతర్జాతీయ వృద్ధిపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.

 

ఈ మూడు రోజుల సదస్సులో భవిష్యత్తును శాసించే పలు కీలక రంగాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. వాటిలో కృత్రిమ మేధ,సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, మెడ్‌టెక్, అంతరిక్షం, రక్షణ రంగం, ద్వంద వినియోగ సాంకేతికతలు, ఆధునాతన తయారీ రంగం, శక్తి, వాతావరణ సాంకేతికతలు, ప్రపంచ డీప్‌టెక్‌ పెట్టుబడులపై కార్యక్రమాలు జరిగాయి.

 

సదస్సులో భాగంగా సమాంతరంగా నిర్వహించిన ఇన్వెస్టర్ పిచ్ రూమ్‌లు, స్టార్టప్ మాస్టర్‌క్లాస్‌లు, సాంకేతిక ప్రదర్శనలు, ప్రత్యేక సమావేశాలు.. మన అంకుర సంస్థలు వెంచర్ ఫండ్‌లు, కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, అంతర్జాతీయ కార్పొరేషన్లు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఇంక్యుబేటర్లతో నేరుగా చర్చలు జరపడానికి ఎంతగానో దోహదపడ్డాయి.

 

ఈ అంతర్జాతీయ సదస్సు భారత్‌, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సంస్థాగత భాగస్వామ్యాలను  మరింత బలోపేతం చేసింది. ఇరుదేశాలు కలిసి ఉమ్మడి పరిశోధనలు, అంకుర సంస్థలను వేగంగా విస్తరించడానికి, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల మార్పిడికి, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్యపరంగా విజయవంతం చేయడానికి, అంతర్జాతీయ మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడానికి ఈ సదస్సు కొత్త మార్గాలను సుగమం చేసింది.

 

ఈ సదస్సు ప్రారంభోత్సవంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగిస్తూ.. మానవ నాగరికత తదుపరి అధ్యాయం సరికొత్త ఆవిష్కరణలేనని పేర్కొన్నారు. ప్రధాని చూపిన ఈ దిశలోనే భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సు.. భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం ప్రధాన లక్ష్యాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రపంచ ఆవిష్కరణల నెట్‌వర్క్‌లతో భారత్‌కు ఉన్న అనుసంధానాన్ని మరింత పెంచడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానాలలోఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి బలమైన పునాది వేసింది.

 

భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సు, ఇందులో పాల్గొన్న ఆవిష్కర్తలకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం www.bharatinnovates.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

***


(रिलीज़ आईडी: 2274510) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam