ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) - 2026: ఆలోచన స్క్రీన్‌ప్లేగా మారే సుదీర్ఘ, ఏకాంత, అందమైన ప్రయాణాన్ని విశ్లేషించిన బిప్లబ్ గోస్వామి
రచనకు సంబంధించి స్వీయనమ్మకం తప్ప మరే ఇతర సూత్రం లేదు: లాపతా లేడీస్ రచయిత
ఒక చిన్న ఆలోచన పరిపూర్ణమైన స్క్రీన్‌ప్లేగా ఎలా మారుతుంది? ఒక కథ రూపం దాల్చి చివరకు వెండితెరపైకి వచ్చే వరకు, ఏళ్ల తరబడి ఒక రచయిత ఆ కథపై అంతే నిబద్ధతతో ఎలా కొనసాగగలడు? - 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026లో భాగంగా నేడు ఎంతో ఆసక్తిగా ప్రారంభమైన వర్క్‌షాప్ సిరీస్‌లో, ప్రముఖ స్క్రీన్‌ప్లే రచయిత, ఎడిటర్, దర్శకుడు బిప్లబ్ గోస్వామి "ఫ్రమ్ ఐడియా టు అవుట్‌లైన్: ది అనాటమీ ఆఫ్ ఎ సీన్" అనే వర్క్‌షాప్‌లో ఇటువంటి పలు అంశాలను ప్రస్తావించారు.
ఇటీవలి కాలంలో అత్యంత ఆదరణ పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచి, ఆస్కార్స్ 2025 కి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైన 'లాపతా లేడీస్' చిత్రానికి కథ అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన గోస్వామి, కథా రచనలో ఎదురయ్యే గందరగోళాలు, అది ఎంత వ్యక్తిగతమైనదో, ఎంతో శ్రమతో కూడుకున్నదో వివరిస్తూ, ఆ సృజనాత్మక ప్రయాణాన్ని వర్క్‌షాప్ ప్రతినిధులకు క్షుణ్ణంగా వివరించారు.
"రచనకు ఒక నిర్దిష్టమైన సూత్రం అంటూ ఏదీ లేదు" అని ఆయన తన ప్రసంగంలో పదే పదే స్పష్టం చేశారు. గోస్వామి దృష్టిలో, ప్రతి కథా విభిన్నంగానే మొదలవుతుంది. కొన్నిసార్లు అది సహజంగా ఉద్భవిస్తుంది.కొన్నిసార్లు పరిశీలన నుంచి నుండి పుడుతుంది. మరి కొన్నిసార్లు ఒక ఆలోచనను రేకెత్తించే ఒక చిన్న సంఘటన లేదా ప్రేరణ ద్వారా వస్తుంది. "రచయితలుగా మనం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మనం ఆలోచనలను సృష్టించాల్సి వస్తుంది. ఇంకొన్నిసార్లు కథే స్వయంగా మన దగ్గరకు వస్తుంది. దీనికి నిర్ణీత మార్గం అంటూ ఏదీ లేదు" అని ఆయన అన్నారు.
సృజనాత్మక ప్రక్రియలో ఎదురయ్యే భావోద్వేగపరమైన సవాళ్ల గురించి మాట్లాడుతూ, తాము రాసే ప్రాజెక్ట్‌కు ఒక నిర్మాత లభిస్తారనే భరోసా లేనప్పుడు కూడా నిరంతరాయంగా రచనను కొనసాగించడమే ఒక రచయిత ఎదుర్కొనే అతిపెద్ద అడ్డంకులలో ఒకటని ఆయన పేర్కొన్నారు.
"మీ దగ్గర ఒక మంచి కథ ఉండవచ్చు. కానీ నిర్మాత లేకపోవచ్చు. అది నిరుత్సాహం కలిగించే విషయమే. కానీ మీరు సినిమాను నిజంగా ప్రేమిస్తే ఆ అడ్డంకులతో సంబంధం లేకుండా మీ పనిని కొనసాగిస్తారు" అని ఆయన అన్నారు. "నేను ఒకే సమయంలో ఒక రచయిత, ఒక దర్శకుడు,ఒక నిర్మాత కోణం నుంచి ఆలోచిస్తూ రాస్తాను. నిర్మాత లేకపోయినా, నేను రాయడం మాత్రం ఆపను". సినిమాను ఒక సర్వస్వమైన, అత్యంత ఇష్టమైన అభిరుచిగా అభివర్ణించిన గోస్వామి, చలనచిత్ర నిర్మాణానికి ఒక విధమైన వ్యామోహం అవసరమని పేర్కొన్నారు.
"సినిమా అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. దానిపై మీకు ఒక విధమైన పిచ్చి ఉండాలి. దాని కోసం తపించాలి. మీరు నిరంతరం కథల ప్రపంచంలోనే జీవిస్తుంటారు కాబట్టి, కొన్నిసార్లు బాహ్య ప్రపంచంపై ధ్యాస లేకుండా, విషయాలను మర్చిపోతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ సృజనాత్మక ప్రక్రియలో నిలదొక్కుకోగలరు."
కథా రచనను ఆయన సందేహాలు, అలసటలతో కూడిన ఒక సుదీర్ఘ ప్రయాణంగా అభివర్ణించారు. "మనం ఏదో ఒకటి సృష్టించాలనే కోరికతో ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. కానీ మధ్యలో ఎక్కడో అలసిపోతాం. కొన్నిసార్లు మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఏళ్లు గడిచిపోతాయి. కానీ కథలు రూపం దాల్చడానికి సమయం పడుతుంది. మీరు వాటితో పాటే జీవించాల్సి ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు.
'లాపతా లేడీస్' చిత్ర పరిణామ క్రమమే ఇందుకు ఒక బలమైన ఉదాహరణ అని, మొదట 2014లోనే ఈ కథను రిజిస్టర్ చేయించానని, అప్పట్లో అది కేవలం 22 సీన్ల సంకలనంగా మాత్రమే ఉందని గోస్వామి వెల్లడించారు. "ఆ తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేను ఎన్నో చేయాల్సి వచ్చింది. చివరకు ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కానీ నేను మాత్రం అదే కథను చెప్పాల్సి వచ్చింది. నిన్నటి కథతో నేటి ప్రేక్షకులను ఎలా మెప్పించాలనేదే అక్కడ అసలైన సవాలుగా నిలిచింది" అని ఆయన వివరించారు.
ఈ సృజనాత్మక ప్రక్రియ ఎంతో బాధాకరమైనదని ఆయన అంగీకరించారు. "పగలు, రాత్రి అనే తేడా లేకుండా మీరు ఎప్పుడూ ఆ కథ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏం రాయాలి? ప్రేక్షకులు దేనికి కనెక్ట్ అవుతారు? ఇలాంటి ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ, చివరికి మీకో మార్గం దొరుకుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ వర్క్‌షాప్‌లో అత్యంత ఆసక్తికరంగా సాగిన భాగాలలో ఒకటి - చలనచిత్ర నిర్మాణం ప్రారంభం కావడానికి చాలా ముందే స్క్రీన్‌ప్లేని దృశ్య రూపంలో ఊహించుకోవడంపై కేంద్రీకృతమైంది. రచయితలు తమ సొంత సినిమాలకు తామే మొదటి ప్రేక్షకులు కావాలని గోస్వామి అన్నారు. "నేను రాస్తున్నప్పుడు, ఒక ఊహాజనిత తెరపై ఆ సినిమాను చూస్తుంటాను. నేనే దానికి మొదటి వీక్షకుడిని అవుతాను. ఆ తర్వాత ప్రేక్షకులు దీన్ని ఎలా చూస్తారో ఊహించుకుంటాను. మానసికంగా ఎడిటింగ్ టేబుల్ వరకు వెళ్లి, సన్నివేశాల కూర్పు ఎలా ఉందో కూడా చూసుకుంటాను. ఈ సాధన సినిమాను బహు కోణాల నుంచి అర్థం చేసుకోవడానికి నాకు ఎంతగానో సహాయపడుతుంది" అని ఆయన వివరించారు.
ఫిల్మ్ ఎడిటర్‌గా ఆయనకున్న అనుభవం, ఆయన రచనా విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చలనచిత్ర నిర్మాణంలో పరస్పర సహకారం ప్రాముఖ్యతను ప్రముఖంగా పేర్కొంటూ, సినిమా ఎప్పుడూ ఒక్కరి శ్రమతో మాత్రమే సాధ్యమయ్యేది కాదని ఆయన కాబోయే చలనచిత్ర దర్శకులకు, రచయితలకు గుర్తుచేశారు.
"సినిమా అనేది అందరి సమష్టి కృషి. రచయితలు ఇతర విభాగాల పనితీరును కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఒక కథను రాసిన తర్వాత, దాని నుంచి మిమ్మల్ని మీరు కొంతవరకు వేరు చేసుకోగలగాలి. మీరు మొండిగా ప్రతిదీ మీరు ఊహించినట్లే సరిగ్గా ఉండాలని పట్టుబడితే సమస్యలను ఎదుర్కొంటారు. ఇతర విభాగాలకు కూడా వారి స్వంత కోణాలు, ఆలోచనలు ఉంటాయి. అలా ఉండటం కూడా అవసరమే."
స్క్రీన్‌ప్లే సిద్ధాంతాలు, కథా రచన సూత్రాల గురించి మాట్లాడుతూ, నియమబద్ధమైన ఆ చట్రాలపై గోస్వామి తన సందేహాన్ని వ్యక్తం చేశారు. "నేను సిద్ధాంతాలపై దృష్టి పెట్టను. నా దృష్టి అంతా కథ పైనే ఉంటుంది. సినిమా అంటే అంతిమంగా కథను చెప్పడమే" అని అన్నారు. "కొన్నిసార్లు ఒక ఊహించని సంఘటన కథను ముందుకు నడిపిస్తుంది. మరికొన్నిసార్లు కథలో రెండో మలుపు ఉంటుంది. ఏ కథకైనా దాని స్వంత గమనాన్ని దానంతట అదే కనుగొంటుంది."
రచయితలు కావాలనుకునేవారు తమలో ఒక మంచి ఆలోచన ఉన్నప్పటికీ, దానిని ఒక పరిపూర్ణమైన స్క్రీన్‌ప్లేగా ఎలా విస్తరించాలో తెలియక తరచుగా ఆందోళనకు గురవుతుంటారు. "మీరు ఎలా రాస్తున్నారు అనే దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు - అనే దానిపైనే దృష్టి పెట్టండి. కొన్నిసార్లు నేను కేవలం ఒకే ఒక్క లైన్‌తో కథను ప్రారంభిస్తాను. ఆ తర్వాత అది ఒక సారాంశం గా మారుతుంది. ఆపై సన్నివేశాలు రూపుదిద్దుకుంటాయి. మరికొన్నిసార్లు, నేను మొదటి నుంచి సీన్ బై సీన్ రాసుకుంటూ వెళ్తాను. దీనికి ఎటువంటి నియమమూ లేదు." అంతిమంగా అన్నింటికంటే ముఖ్యమైనది పట్టుదల మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. "మొదట మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ తర్వాత మీకు అనుకూలమైన ఏ పద్ధతిలోనైనా సరే రాయడం కొనసాగించండి. ఆ తర్వాత, దానిని పరిశ్రమకు ప్రొఫెషనల్‌గా ప్రజెంట్ చేసేటప్పుడు, ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా దానికి ఒక స్వరూపాన్ని చేకూర్చవచ్చు"
షార్ట్‌కట్‌లు (సులభమైన మార్గాలు) లేదా సాంకేతిక చిట్కాల ద్వారా మాత్రమే రచనలో ప్రావీణ్యం సంపాదించవచ్చనే అభిప్రాయాన్ని కూడా గోస్వామి తప్పుబట్టారు. "రచనకు ఎటువంటి షార్ట్‌కట్‌లు లేవు. రాయడం అనేది ఒక కష్టమైన ప్రక్రియ. మీరు సాంకేతికతలను నేర్చుకోవచ్చు. కానీ అవి మిమ్మల్ని స్వయంచాలకంగా ఒక మంచి రచయితగా మార్చలేవు" అని ఆయన స్పష్టం చేశారు. దానికి బదులుగా, పరిశీలనా శక్తిని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. "మనుషులను గమనించండి. సమాజాన్ని పరిశీలించండి. హావభావాలను, బంధాలను, రకరకాల పరిస్థితులను క్షుణ్ణంగా చూడండి. ఆ పరిశీలనలే రేపు మీ కథలుగా, మీ పాత్రలుగా రూపాంతరం చెందుతాయి" అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సెషన్ కాబోయే రచయితలకు కథా గమనంలోని ఘర్షణ పాత్రల ప్రాధాన్యత లేదా స్వయంప్రతిపత్తి, సన్నివేశాల నిర్మాణం వంటి అంశాలపై కేవలం ఆచరణాత్మక అవగాహనను మాత్రమే గాకుండా ప్రతి స్క్రీన్‌ప్లే కూడా తనదైన స్వంత మార్గాన్ని వెతుక్కుంటుందనే ఒక చక్కని భరోసాను, స్ఫూర్తిని కూడా అందించింది. భవిష్యత్తు తరానికి చెందిన కథకులు, సినిమా ప్రేమికులతో నిండిన ఆ వేదిక నుంచి "కథను నమ్మండి. ఆ ప్రక్రియను నమ్మండి. అన్నింటికంటే ముఖ్యంగా రాయడం మాత్రం ఆపకండి" అని గోస్వామి ఇచ్చిన సందేశం చాలా సున్నితంగా, కానీ ఎంతో శక్తివంతంగా ఉంది.
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా నుంచి ఫిల్మ్ ఎడిటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బిప్లబ్ గోస్వామి ప్రస్తుతం అగర్తలాలోని త్రిపుర ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్లో సలహాదారుడిగా సేవలందిస్తున్నారు.
19వ ఎంఐఎఫ్ఎఫ్ గురించి
19వ ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సుసంపన్నమైన సినిమా అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన అద్భుతమైన వరస చిత్రాల ప్రదర్శనతో పాటు చలనచిత్ర రంగానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా రూపొందించారు.
-
ఈ సంవత్సరం, ఈ చలనచిత్రోత్సవం పోటీ విభాగానికి భారతదేశంతో పాటు 47 దేశాల నుంచి 1,459 చలనచిత్ర ఎంట్రీలు వచ్చాయి.
-
ఈ చలనచిత్రోత్సవం 42కు పైగా భారతీయ భాషలలో, అలాగే భారతదేశం వెలుపలికి చెందిన 30కి పైగా అంతర్జాతీయ భాషలలో చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఇది ఈ ఉత్సవం అంతర్జాతీయ స్థాయినీ, సాంస్కృతిక వైవిధ్యాన్నీ ప్రతిబింబిస్తోంది.
-
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన చలనచిత్ర దర్శకుల అద్భుతమైన సృష్టిని ప్రదర్శిస్తూ, ఈ చలనచిత్రోత్సవం అత్యుత్తమ డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు, యానిమేషన్లు, నూతన దర్శకుల చిత్రాలు, విద్యార్థులు రూపొందించిన చిత్రాలను వీక్షకుల ముందుకు తీసుకురానుంది.
-
సినిమా ప్రదర్శనలతో పాటు ఈ చలనచిత్రోత్సవంలో జరిగే రెండో ఎడిషన్ డాక్ బజార్ సుసంపన్నమైన మాస్టర్‌క్లాసెస్, ఐడీపీఏ 'ఓపెన్ ఫోరమ్ వంటి కార్యక్రమాలు సినిమా పరమైన, సృజనాత్మక ఆలోచనల మార్పిడిని మరింతగా పెంపొందించనున్నాయి.
శక్తివంతమైన సినిమా, సృజనాత్మక మేధావులు స్ఫూర్తిదాయకమైన గొంతుకలు ఒకచోట చేరి డాక్యుమెంటరీ, యానిమేషన్, లఘు చిత్రాల నిర్మాణ రంగంలో ఒక మరపురాని మహోత్సవాన్ని సృష్టించే ఎంఐఎఫ్ఎఫ్ 2026 వైవిధ్యభరితమైన కథల ప్రపంచంలోకి మీరూ అడుగు పెట్టండి.
***
रिलीज़ आईडी:
2273865
| Visitor Counter:
9