ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశం

प्रविष्टि तिथि: 15 JUN 2026 5:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  స్లోవాక్ పర్యటన సందర్భంగా చారిత్రాత్మక బ్రాటిస్లావా కోట వద్ద ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో అధికార లాంచనాలతో ఘనస్వాగతం పలికారు.

ఇద్దరు నేతలూ ఏకాంతంగానూ, ప్రతినిధి బృందాల స్థాయిలోనూ చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచడాన్ని వారు స్వాగతించారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, ఉమ్మడి విలువలు, కాలపరీక్షను తట్టుకుని నిలిచిన స్నేహబంధానికి ప్రతిబింబంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అంతరిక్షం, పౌర అణుశక్తి, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ఆవిష్కరణలు, విద్యా సంబంధిత మార్పిడులు, సంస్కృతి, ప్రతిభావంతుల పర్యటనలతో సహా అన్ని ద్వైపాక్షిక సంబంధాలను ప్రధానులిద్దరూ సమీక్షించారు. కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఏఐ, సూపర్ కంప్యూటర్ల వంటి సరికొత్త రంగాలలో భాగస్వామ్య అవకాశాలను కూడా వారు అన్వేషించారు.

ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశానికి స్లోవేకియా అందించిన సంఘీభావం, మద్దతుకు గానూ ప్రధానమంత్రి ఫికోకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో, అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు కలిగి ఉన్న దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయఅంశాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షికతకు, ప్రపంచ పాలనా సంస్థల సంస్కరణకు తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

ఇటీవలి భారత్ - ఈయూ శిఖరాగ్ర సదస్సు ప్రోత్సాహకర ఫలితాలపై ఇద్దరు నేతలూ  సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా ఖరారు కావడంతో పాటు ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక ఎజెండాను ఆమోదించడాన్ని వారు స్వాగతించారు. ఈ రెండు పరిణామాలూ కీలక రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తాయి.

చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికతలు, కార్మిక వలసలు, ఉన్నత విద్యా పరిశోధనలు, ఆడియో-విజువల్ రంగాలలో సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలను మార్చుకున్నారు. రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించడంపై ఒక ఆసక్తి లేఖను కూడా మార్పిడి చేసుకున్నారు. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ కోసిస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మొట్టమొదటి చైర్‌ను భారత్ ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం కుదిరింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం స్లోవాక్ ప్రధానమంత్రి విందు ఏర్పాటు చేశారు. పరస్పర అనుకూలమైన తేదీలో భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీ ఆయనను ఆహ్వానించారు.

 

***


(रिलीज़ आईडी: 2273213) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada