గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరు కోట్ల మంది లఖ్‌పతి దీదీల లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా 700 షి-మార్టులు, 1,000 జిల్లా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు


డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్‌లో భాగంగా మార్కెటింగ్ కార్యక్రమాలపై గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సమీక్ష.. మహిళల సారథ్యంలోని వాణిజ్య సంస్థలకు మార్కెట్ లభ్యతను బలోపేతం చేయాలని పిలుపు

సామర్థ్యాల పెంపుదల, వాణిజ్య సంస్థలకు ప్రోత్సాహం, ఓఎన్‌డీసీ భాగస్వామ్యాలు, అందరికీ ఆర్థిక సేవల లభ్యత.. ఇవే కీలక ప్రాధాన్యాలు

నాడు పోస్టు చేయడమైనది: 14 JUN 2026 8:52PM by PIB Hyderabad

ఆరు కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తీర్చిదిద్దడానికి ఒక వ్యూహాన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ రూపొందించింది. ఈ వ్యూహంలో వాణిజ్య సంస్థలను ప్రోత్సహిస్తూ జీవనోపాధికి మెరుగైన అవకాశాలను కల్పించడం, గ్రామీణ మహిళలకు ఆర్థిక సేవల లభ్యతను మెరుగుపచడం, స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల సామర్థ్యాల పెంపు, మార్కెటింగ్ కార్యకలాపాలపై శ్రద్ధ తీసుకోవడం, శిక్షణనివ్వడం, చేయూతను అందించడం భాగంగా ఉంటాయి. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహెడ్స్ మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్‌)తో పాటు ఆ మిషన్‌‌కు చెందిన వివిధ ఉప పథకాల పురోగతిని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి విభాగం కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శులు స్వాతి వర్మ, జయశ్రీ ఎమ్.జి.తో పాటు రూరల్ లైవ్లీహుడ్స్ డివిజన్, నేషనల్ మిషన్ మేనేజ్‌మెంట్ యూనిట్ (ఎన్ఎమ్ఎమ్‌యు)కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా వస్తూత్పత్తుల తయారీదారులు (ప్రొడ్యూసర్లు) కేవలం బతుకుదెరువును సంపాదించుకోవడానికి పరిమితం కాకుండా వృత్తిపరమైన నైపుణ్యంతో నిర్వహించే, నిరంతర ప్రాతిపదికన వ్యవస్థాగత మార్కెట్లకు చేరుకొనగలిగిన వాణిజ్య సంస్థలకు యాజమానురాళ్లుగా ఎదగడానికి వీలు కల్పించే ఒక పటిష్ఠ, ఏకీకృత మార్కెటింగ్ విస్తారిత అనుబంధ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గ్రూపులో యాజమాన్య హక్కును కలిగి ఉండే రిటైల్ వ్యవస్థలు, ఒక యూనిఫైడ్ నేషనల్ మార్కెటింగ్ గుర్తింపు, డిజిటల్ వాణిజ్య వేదికలు, కీలక రిటైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సంస్థాగత సహాయ యంత్రాంగాలతో పాటు సంబంధిత మార్గదర్శకాలను ఆచరణరూపం దాల్చే స్థాయిలో రూపొందించాలనే అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.  
ఎస్‌హెచ్‌జీ సారథ్యంలోని వాణిజ్య సంస్థలను ప్రోత్సహించడానికి 700 షి-మార్టు(SHE-MART)లు, 1,000 డిస్ట్రిక్ట్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, శ్రేష్ఠతా కేంద్రాలను (సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో సమాఖ్యలను బలోపేతం చేయాలని సమావేశంలో తెలిపారు. అవకాశాలు ఎక్కువగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో  షి-మార్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిచారు. వాటిలో ఎస్‌హెచ్‌జీ ఉత్పాదనలకు నిరంతర లభ్యతను నిర్ధారించడానికి బలమైన బ్యాక్‌వర్డ్, ఫార్వర్డ్ మార్కెట్ లింకేజీలకు ఆస్కారం ఉండాలని సూచించారు. అమలు తీరు పటిష్ఠంగా ఉండేటట్లు చూడటానికి కార్యకలాపాల వార్షిక క్యాలెండరును రూపొందించాలని కార్యదర్శి ఆదేశించారు. లక్ష్యాల వారీ కాలావధులను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అనేక పురస్కారాలను అందిస్తూ ఎస్‌హెచ్‌జీ సభ్యుల, కమ్యూనిటీ సంస్థల విశిష్ట సేవలను గుర్తించి, సత్కరించాలని ఆయన అన్నారు. ప్రతిపాదిత కేటగిరీల్లో.. ‘అత్యుత్తమ పనితీరును కనబరిచిన రాష్ట్రం’, ‘అత్యుత్తమ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త’, ‘అత్యుత్తమ డిజిటలీకరణ కార్యక్రమం’, ‘అన్నింటి  కన్నా ఎక్కువ మొత్తంలో ఎస్‌హెచ్‌జీ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఘనత’, ‘లఖ్‌పతి దీదీ పురస్కారం’తో పాటు గ్రామీణ జీవనోపాధి విస్తారిత అనుబంధ వ్యవస్థలో శ్రేష్ఠత్వాన్ని గుర్తించే ఇతర కేటగిరీలు భాగంగా ఉన్నాయి.      
వ్యవసాయేతర జీవనోపాధి మార్గాలు, మార్కెటింగ్ కార్యక్రమాలను కార్యదర్శి సమీక్షించారు. సవరించిన సరస్ (SARAS) మేళా మార్గదర్శకాలను రూపొందించి, జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఎస్‌హెచ్‌జీ ఉత్పాదనల విక్రయ అవకాశాలు, మార్కెట్ లభ్యతను పెంచడానికి జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో సరస్ మేళాల సంఖ్యను పెంచాలన్నారు. ప్రొడ్యూసర్ గ్రూప్ యాప్‌ను ప్రారంభించాలనీ, జన్ సమర్థ్ వెబ్‌సైట్ ద్వారా దాఖలు చేసిన రుణ దరఖాస్తుల్లో జాప్యాన్ని నివారించాలనీ ఆయన ఆదేశాలిచ్చారు. డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్‌ క్రెడిట్-లింక్‌డ్ స్కీమ్ విషయంలో బ్యాంకర్ల మధ్య అవగాహనను పెంచడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కూడా ఆయన స్పష్టం చేశారు
.
‘
సరస్ ఆజీవికా’ కోసం ప్రతిపాదిత యూనిఫైడ్ నేషనల్ మార్కెటింగ్ గుర్తింపునూ సమీక్షించారు. ముక్కచెక్కలుగా ఉన్న బ్రాండింగును ఏకవిధ, ప్రీమియం, సాంస్కృతికంగా జతపడిన జాతీయ బ్రాండుగా మార్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెరుగైన ప్రాడక్ట్ పొజిషనింగ్, మంచి ప్యాకేజింగ్‌ ద్వారా మార్కెట్లో గుర్తింపును పెంచుకోవడంతో పాటు ఆయా ఉత్పాదనల కోసం శ్రమించిన చేతివృత్తి కళాకారుల, సముదాయాల కృషిని కూడా వెలుగులోకి తీవడం ఈ కార్యక్రమం ఉద్దేశాలు.    
సరికొత్తగా తీర్చిదిద్దిన ‘ఈ-సరస్ (e-Saras) పోర్టల్’ విషయంలో చోటుచేసుకున్న పురోగతినీ సమీక్షించారు. స్వయంసహాయ బృందాల ఉత్పాదనలకు డిజిటల్ లభ్యతను పెంచడానికి ఈ వేదికను ఒక అమ్మకందారు (సింగిల్-వెండర్) వెబ్‌సైట్‌కు బదులు, బహుళ విక్రేతల (మల్టి-వెండర్)తో కూడిన, ఓమ్ని-చానల్ మార్కెట్‌ ప్లేసుగా మార్పు చేర్పులు చేస్తున్నారు. దీనికి అదనంగా, న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఉన్న ప్రధాన ‘సరస్ గ్యాలరీ’కి కొత్త రూపును ఇవ్వాలన్న ప్రణాళికలపైనా చర్చించారు. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని పంచడం, రిటైల్ పనితీరును పటిష్ఠపరచడంపై దృష్టిని కేంద్రీకరించారు.
ఉత్పాదనలకు కొత్త రూపురేఖలను కల్పించడం, డిజైన్ డెవలప్‌మెంట్, ప్యాకేజింగ్‌లో మార్పు, నాణ్యత నియమాలను పాటించడం, సామర్థ్యాల పెంపుదల కోసం నేషనల్ హబ్స్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు. ఈ హబ్స్ ఎస్‌హెచ్‌జీ ఉత్పాదనల పోటీతత్వాన్ని మెరుగుపరిచి, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని వాటిని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తాయని ఆశిస్తున్నారు.

ప్రతి ఒక్క కార్యక్రమానికీ విస్తృత కార్యనిర్వహణ సంబంధిత మార్గదర్శకాలను అందించాలన్నది సమావేశంలో కీలకాంశమైంది. ఈ మార్గదర్శకాలు రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ ఒక ఉమ్మడి ప్రాథమిక ప్రణాళికను, ప్రామాణిక కార్యనిర్వహణ విధివిధానాల (ఎస్ఓపీస్)ను, సుస్పష్టంగా నిర్వచించిన భూమికలను, కాలపరిమితులను, ప్రక్రియలను అందిస్తాయి. దీంతో వాటిని ప్రభావవంతంగా అమలుపరచడంతో పాటు అనుకున్న ఫలితాలను సకాలంలో రాబట్టవచ్చు. అమలు బాధ్యతను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలూ స్వీకరిచడం,  అవసరమైన వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్నీ, సహాయాన్నీ మంత్రిత్వ శాఖ అందించనుండడంతో ఈ ప్రయత్నాలు గ్రామీణ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్కెట్ లభ్యతను చెప్పుకోదగిన స్థాయిలో బలోపేతం చేస్తాయనీ, ఎస్‌హెచ్‌జీ ఉత్పాదనలకు మంచి ధర లభించే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆదరణ లభించేటట్లు తోడ్పాటును అందిస్తాయనీ భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2273043) సందర్శకుల సూచీ సంఖ్య : : 61
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam , English , Urdu