పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీజిలును అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నియంత్రణ ఉత్తర్వులు జారీ

प्रविष्टि तिथि: 12 JUN 2026 2:57PM by PIB Hyderabad

దేశంలో డీజిల్ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ “మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిలు (రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా తాత్కాలిక సరఫరా నియంత్రణ) ఉత్తర్వులు 2026’’ను జారీ చేసింది.

 

సామాన్య వినియోగదారులందరికీ డీజిలు సజావుగా అందుబాటులో ఉండేలా చూసేందుకు ఉద్దేశించిన ఈ నిబంధనలు.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రారంభంలో 90 రోజుల పాటు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ప్రస్తుతం భారీ మొత్తంలో డీజిలును ప్రభుత్వ రంగ చమురు సంస్థల రిటైల్ అవుట్‌లెట్లకు తరలించడం వల్ల కొన్ని బంకుల్లో అసాధారణమైన, అసమానమైన డిమాండ్ పెరుగుదల కనిపిస్తోంది. బల్క్, రిటైల్ డీజిల్ ధరల్లో వ్యత్యాసం కారణంగా పారిశ్రామిక, ప్రత్యక్ష లేదా సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు తమ కొనుగోళ్లను సొంత పంపుల నుంచి రిటైల్ అవుట్‌లెట్లలకు మారుస్తుండటమే ఇందుకు కారణం. మరోవైపు ప్రైవేటు చమురు మార్కెటింగ్ సంస్థలు డీజిల్ ధరలను భారీగా పెంచడంతో 2026 మే నెలలో వారి హై-స్పీడ్ డీజిలు అమ్మకాలు ఏకంగా 58 శాతం మేర పడిపోయాయి. ప్రైవేటు బంకుల్లో రేట్లు ఎక్కువగా ఉండటంతో వాహనదారులంతా ప్రభుత్వ బంకుల వైపే మొగ్గు చూపారు.

 

గత ఏడాది మే నెలతో పోలిస్తే 2026 మే నెలలో ప్రభుత్వ రంగ చమురు సంస్థల రిటైల్ కేంద్రాల ద్వారా డీజిలు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని 327 జిల్లాల్లో 10 శాతానికి పైగా వృద్ధి నమోదు కాగా.. అందులో 80 జిల్లాల్లో డీజిలు అమ్మకాలు ఏకంగా 30 శాతానికి పైగా పెరగడం విశేషం.

బంకుల్లో అప్పుడప్పుడు ఎదురవుతున్న డీజిల్ కొరత సమస్యల వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూసేందుకే ఈ కొత్త నియంత్రణ చర్యలను తీసుకువచ్చారు. కారు, ద్విచక్ర వాహనం నడిపే వారికి ప్రభుత్వం విధించిన 200 లీటర్ల పరిమితి అనేది వారి సాధారణ అవసరాల కంటే చాలా ఎక్కువ కాబట్టి ఈ నిబంధనల వల్ల సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

 

ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని, లాభాల కోసం సాధారణ రిటైల్ కేంద్రాల నుంచి డీజిలును కొనుగోలు చేసే భారీ/బల్క్ వినియోగదారులను నియంత్రించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం. పెద్ద మొత్తంలో జెర్రీ క్యాన్లలో డీజిలును కొనుగోలు చేసి, దానిని బయట ఎక్కువ ధరలకు తిరిగి విక్రయించే ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ కొత్త ఉత్తర్వుల ద్వారా ఇలాంటి డీజిల్ నల్లబజారు, అక్రమ నిల్వలకు పాల్పడే కొనుగోలుదారులు, నిర్వాహకులు, డీలర్లు, సంబంధిత అధికారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.

 

రిటైల్ బంకుల నుంచి బల్క్ వినియోగదారులకు డీజిలు మళ్లించడాన్ని నిరోధించడమంటే.. సాధారణ వినియోగదారుల కోసం మార్కెట్‌లో ఎక్కువ డీజిల్ అందుబాటులో ఉండేలా చూడటమే.

 

ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో సామాన్య వినియోగదారులపై భారం పడకుండా కాపాడేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోలు, డీజిలు, గృహ వినియోగ ఎల్‌పీజీ విక్రయాలపై రోజుకు సుమారు రూ. 500 కోట్ల మేర నష్టాలను భరిస్తున్నాయి. రిటైల్ వినియోగదారులను రక్షించేందుకు, సాధారణ కుటుంబాలు, రైతులు, ఇతరులకు ఇంధనం అందుబాటు ధరల్లో ఉండేలా చూసేందుకే ప్రభుత్వం ఈ రాయితీ అందిస్తోంది. ఈ మద్దతు ధర పారిశ్రామిక, బల్క్ సరఫరాల కోసం ఉద్దేశించింది కాదు. బల్క్ వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారమే అమ్మకాలు జరుగుతాయి. ఈ కారణంగానే ప్రస్తుతం సాధారణ బంకుల్లో దొరికే డీజిల్ ధర.. బల్క్ డీజిల్ ధర కంటే లీటరుకు దాదాపు రూ. 40 రూపాయలు తక్కువగా ఉంది.

 

ఈ భారీ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని బల్క్ వినియోగదారులు సాధారణ రిటైల్ బంకుల నుండి హై-స్పీడ్ డీజిలును తరలిస్తుండటం వల్ల కొన్ని ప్రాంతీయ బంకుల్లో కొరత ఏర్పడుతోంది. దీనివల్ల నిజమైన వినియోగదారులకు, నిత్యావసర సేవలకు డీజిలు లభించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

     ఈ ఉత్తర్వుకు అనుగుణంగా దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అవి ఈ కింది విధంగా ఉన్నాయి. 

 

· రిటైల్ బంకుల్లో కేవలం వాహనాల ట్యాంకుల్లోకి లేదా పెసో అనుమతించిన కంటైనర్లలోకి మాత్రమే డీజిలును నింపాలి. ప్రతి వినియోగదారునికి, లేదా వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే డీజిలు ఇవ్వాలి. బంకుల్లో కొనుగోలు చేసిన డీజిలును బయట తిరిగి అమ్ముకోవడం పూర్తిగా నిషిద్ధం. 

 

· పారిశ్రామిక, ప్రత్యక్ష లేదా సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు సాధారణ బంకుల నుండి డీజిలు కొనుగోలు చేయడాన్ని నిషేధించారు. వారు తమ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కన్స్యూమర్ పంపుల (కంపెనీల సొంత పంపుల) నుంచే డీజిలును పొందాల్సి ఉంటుంది. 

 

· ఈ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘనకు గురికాకుండా చూసే పూర్తి బాధ్యతను చమురు మార్కెటింగ్ సంస్థలు, సంబంధిత రిటైల్ బంకుల డీలర్లకే అప్పగించారు. చట్టాన్ని పక్కదారి పట్టించే ఎలాంటి ప్రయత్నాలనైనా వారు కఠినంగా అడ్డుకోవాలి. 

 

సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా.. డీజిల్ బ్లాక మార్కెటింగ్, అక్రమ నిల్వలు, నిబంధనలకు విరుద్ధంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలను కేంద్రం ఆదేశించింది.

 

ఈ కొత్త ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం 1955, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం భారీ జరిమానాలు విధించడంతోపాటు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

 

‘‘మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా తాత్కాలిక సరఫరా నియంత్రణ) ఉత్తర్వులు 2026’’ అనేది కేవలం ప్రస్తుత మార్కెట్ సవాళ్లను, అక్రమాలను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఒక తాత్కాలిక నిబంధన మాత్రమేనని ప్రభుత్వం పేర్కొంది.

 

ఇది రేషనింగ్ (కోటా) విధానం కాదని, దేశంలో పెట్రోలు లేదా డీజిల్ కొరత అసలే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచంలోనే చమురు శుద్ధి చేయడంలో భారత్ నాలుగో అతిపెద్ద దేశంగా, అలాగే శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిలో 5వ అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది. ఇలాంటి ముందస్తు చర్యల ద్వారా సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ.. దేశ ఇంధన భద్రతను కాపాడటానికి, నిరంతరాయంగా ఇంధన సరఫరా జరిగేలా చూడటానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొంది.

****


(रिलीज़ आईडी: 2272458) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam