ఉప రాష్ట్రపతి సచివాలయం
ఎన్నికైన ప్రధానమంత్రిగా భారతదేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి
ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వం, 'దేశమే తొలి ప్రాధాన్యత' పట్ల అంకితభావాన్ని ప్రశంసించిన ఉప రాష్ట్రపతి
ప్రధానమంత్రి మోదీ అవిశ్రాంత సేవలను కొనియాడిన ఉప రాష్ట్రపతి... సమకాలీన భారతదేశానికి ఆయన "యుగ పురుషుడు" అని అభివర్ణన
प्रविष्टि तिथि:
10 JUN 2026 12:30PM by PIB Hyderabad
భారతదేశంలో సుదీర్ఘ కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ విజయం చారిత్రక ఘట్టమని, ఇది పరివర్తనాత్మక యుగాన్ని ప్రతిబింబిస్తోందని సోషల్ మీడియా సందేశం ద్వారా ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, సాంకేతిక పురోగతితో సహా ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మెరుగైన భారత్ ప్రతిష్ఠ, పునరుత్తేజం పొందిన నాగరికత విశ్వాసం ఈ కాలానికి విశిష్ట లక్షణాలుగా ఆవిర్భవించాయని అభిప్రాయపడ్డారు.
అందరికీ అభివృద్ధి చేకూరాలనే ప్రధానమంత్రి సంకల్పాన్ని కొనియాడుతూ... దేశంలో 25 కోట్లకు పైగా ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది కోట్ల మంది కుటుంబాల్లో కొత్త ఆశలను, అవకాశాలను, ఆత్మ గౌరవాన్ని నింపిందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
భారతదేశ గొప్ప సంస్కృతి, నాగరిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి చేస్తున్న ప్రయత్నాలను ఉప రాష్ట్రపతి ప్రశంసించారు. కాలగర్భంలో కలిసిపోయిన వీరులను గౌరవించటం, భారత విభిన్న సంప్రదాయాలను, భాషలను వేడుకగా జరుపుకోవటం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటం, వలసవాద మనస్తత్వాన్ని వీడటం ద్వారా దేశ గౌరవాన్ని, నాగరిక చైతన్యాన్ని ప్రధానమంత్రి బలోపేతం చేశారని అన్నారు.
ఐక్యరాజ్యసమితిలో ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించిన "యాదుమ్ ఊరే, యావరుమ్ కేలిర్" ("ప్రతి ప్రాంతం మన ఇల్లే.. ప్రతి ఒక్కరూ మనవారే") అనే తమిళ సూక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇది భారత కాలాతీత సంప్రదాయమైన "వసుధైవ కుటుంబకం" భావనను, విశ్వ సోదరభావం, మానవ ఐక్యతకు సంబంధించి శాశ్వత సందేశాన్ని స్పష్టం చేసిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
భారతదేశ నాగరికత ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి చేపట్టిన పలు కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమాల్లో కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం, నూతన పార్లమెంటు భవనంలో పవిత్రమైన సెంగోల్ ప్రతిష్ఠాపన, చోళుల వారసత్వాన్ని గౌరవిస్తూ గంగైకొండ చోళపురంలో ప్రధానమంత్రి పర్యటించటం, విదేశాల నుంచి అమూల్యమైన కళాఖండాలు, పురాతన వస్తువులను తిరిగి తీసుకురావటం వంటివి ఉన్నాయి.
దూరదృష్టి గల ప్రధానమంత్రి మోదీ నాయకత్వం, అవిశ్రాంత సేవ, "దేశమే తొలి ప్రాధాన్యత" అనే ఆశయానికి కట్టుబడి... దేశ ప్రజల సామర్థ్యం, ఆకాంక్షలపై తిరిగి విశ్వాసాన్ని నింపారని శ్రీ సీపీ రాధాకృష్ణన్ కొనియాడారు. సమకాలీన భారతదేశానికి "యుగ పురుషుడు"గా శ్రీ నరేంద్ర మోదీ అవతరించారని అభివర్ణించారు.
"వికసిత్ భారత్ @2047” దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నాయకత్వం కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తినివ్వటంతో పాటు దేశ ప్రగతి ప్రయాణంలో మార్గదర్శక శక్తిగా నిలుస్తోందని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
దేశానికి ప్రధానమంత్రి అందిస్తున్న నిరంతర సేవలకుగానూ ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2271077)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam