మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి మాతృ వందన యోజనతో తల్లుల ఆరోగ్యానికి రక్షణ, బాల్యానికి భద్రత
प्रविष्टि तिथि:
09 JUN 2026 2:46PM by PIB Hyderabad
ప్రతిష్ఠాత్మకంగా 2017లో ప్రారంభించిన మాతృత్వ ప్రయోజనాల పథకం ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ (పీఎంఎంవీవై). తల్లుల ఆరోగ్యం, పిల్లల బాల్యాన్ని సంరక్షించడం పట్ల నిబద్ధతను మహిళా - శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ఈ పథకం ద్వారా చాటుకుంటోంది. గర్భిణులు - బాలింతలకు ఆర్థిక సాయాన్ని అందించడం, వారిలో ఆరోగ్యపరమైన అవగాహనను పెంపొందించడంతో పాటు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
దీనిని 2022 ఏప్రిల్ 1న ‘మిషన్ శక్తి’లో విలీనం చేసినప్పటి నుంచి - ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని మరింత సరళతరం చేస్తూ... అంతకుముందున్న మూడు విడతల ఆర్థిక సాయాన్ని రెండు విడతలకు కుదించారు. అంతేకాకుండా రెండో సంతానం గనుక ఆడపిల్ల అయితే... ఆ రెండో బిడ్డకు కూడా ఈ మాతృత్వ ప్రయోజనాలను వర్తింపజేస్తూ పథకాన్ని మరింత విస్తరించారు.
ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు మొదటి సంతానానికి రెండు విడతల్లో రూ. 5,000 ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే రెండో సంతానానికి (ఆడపిల్ల అయితే) రూ. 6,000 లభిస్తుంది. గర్భిణిగా పేరు నమోదు చేసుకోవడం, ప్రసవ పూర్వ ఆరోగ్య పరీక్షలు, రోగ నిరోధక టీకాల వంటి మాతా శిశు ఆరోగ్యానికి కీలకమైన వివిధ దశల్లో ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానాన్ని ఉపయోగించి... సకాలంలో, ఎంతో పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ఈ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా గర్భస్రావం జరిగినా లేదా మృతశిశువు జన్మించినా... ఆయా సందర్భాల్లో వారు మళ్లీ కొత్తగా ఈ పథకానికి అర్హత పొందేందుకు కూడా ఇందులో నిబంధనలున్నాయి. ఇది ఈ పథకం సమ్మిళిత స్వభావాన్ని బలోపేతం చేస్తోంది. ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయం మహిళలకు ఒకరకమైన పాక్షిక వేతన పరిహారంగా ఉపయోగపడుతుంది. తద్వారా వారు ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవడానికి వీలవుతుంది.
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎంతో విస్తృతమైన సానుకూల ప్రభావాన్ని చూపింది:
- మొత్తం లబ్ధిదారులు: 4.27 కోట్ల మంది (2026 ఏప్రిల్ 30 నాటికి)
- పంపిణీ చేసిన మొత్తం నిధులు: రూ. 20,150 కోట్లు
లబ్ధిదారుల నిజజీవిత కథనాలు క్షేత్రస్థాయిలో ఈ పథకం వాస్తవిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం తెచ్చిన విప్లవాత్మక మార్పు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. గర్భధారణ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న ఎందరో మహిళలకు పీఎంఎంవీవై కింద బలమైన ఆసరా లభించింది. సకాలంలో ఆర్థిక సాయం వల్ల.. అదనపు ఆర్థిక భారం లేకుండానే వారు పౌష్టికాహారాన్ని పొందగలిగారు. ప్రసవ పూర్వ ఆరోగ్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుని, అవసరమైన వైద్య సంరక్షణను పొందారు. సరైన సంరక్షణ, నిరంతర పర్యవేక్షణ వల్ల.. వారు వైద్య సంస్థల్లో ఆరోగ్యకరమైన పిల్లలకు సురక్షితంగా జన్మనిచ్చారు. సురక్షితమైన మాతృత్వాన్ని అందించడంలో, తల్లీపిల్లల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడంలో పథకం పాత్రను ఈ విజయాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆస్పత్రుల్లో ప్రసవాలయ్యేలా చూడడం, లింగ సమానత్వాన్ని పెంపొందించడం (ముఖ్యంగా బాలికా సంతానానికి అదనపు ప్రోత్సాహకాలను అందించడం) ద్వారా... తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ పథకం ఎంతగానో దోహదం చేసింది.
ఆరోగ్యకరమైన, సంపూర్ణ సాధికారత కలిగిన భారత్‌ను సాకారం చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా... అర్హత ఉన్న ప్రతి మహిళకూ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, పథకం పరిధిని విస్తరించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2270971)
आगंतुक पटल : 16