గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్రామీణాభివృద్ధికి రూ.1.25 లక్షల కోట్ల పథకాన్ని ప్రకటించిన కేంద్రం
జూలై 1 నుంచి అమలులోకి నూతన విధాన ప్రణాళిక
వీబీ జీ రామ్ జీ అమలుపై శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రుల సమావేశం
చరిత్రాత్మక గ్రామీణాభివృద్ధి పరివర్తనకు రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష
గ్రామీణ ఉపాధి, గ్రామాభివృద్ధి వేగవంతం కోసం రూ.95,692 కోట్ల భారీ మధ్యంతర కేటాయింపు
'ఒక్క కార్మికుడూ ఉపాధి లేకుండా ఉండకూడదు'... జూలై 1 గ్రామీణ పరివర్తనపై మరోసారి సమీక్ష
నూతన విధాన ప్రణాళిక కింద గ్రామీణాభివృద్ధి తదుపరి దశను ముందుకు నడిపించనున్న గ్రామ పంచాయతీలు
ఎమ్‌జీఎన్ఆర్ఈజీఏ కింద ఇప్పటికే రూ.30,000 కోట్ల కేటాయింపు
ఈ పరివర్తన కాలంలో ఏ కార్మికుడూ నిరుద్యోగిగా ఉండకూడదని ఆదేశం
డీబీటీ, ఇ-కేవైసీ, ముఖ ప్రామాణీకరణలో వేగవంతమైన రాష్ట్రాల పురోగతి
అమలు కోసం మార్గదర్శకాలు
బడ్జెట్ కేటాయింపులు చేసిన ఇరవై ఆరు రాష్ట్రాలు
మిగిలిన నాలుగు రాష్ట్రాలూ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరిన కేంద్ర మంత్రి
प्रविष्टि तिथि:
09 JUN 2026 6:57PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈ రోజు 'వికసిత్ భారత్ గ్రామ్' అమలుకు సంబంధించి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రులతో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో... గ్రామీణ ఉపాధి, కార్మికుల భద్రత, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చేందుకు భారత ప్రభుత్వం ఒక సమగ్ర ఆర్థిక, విధానపరమైన కార్యక్రమాన్ని ప్రకటించింది. వీడియో అనుసంధానం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో శ్రీ చౌహాన్ మాట్లాడుతూ... జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ చరిత్రాత్మక నూతన ప్రణాళిక ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా, కార్మిక- కేంద్రితమైన మార్పును సాధించాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని పాల్గొన్నారు.
ఇది కేవలం ఒక పథకంలో మార్పు మాత్రమే కాదనీ... కోట్లాది మంది కార్మికుల జీవితాలు, జీవనోపాధికి సంబంధించిన విషయమని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. "ఏ ఒక్క కార్మికుడూ ఏ ఒక్క రోజూ ఉపాధి లేకుండా ఉండకూడదు" అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఉపాధి కల్పన, వేతనాల చెల్లింపులు, చట్టబద్ధమైన హక్కుల్లో ఎలాంటి అంతరాయం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్‌జీఎన్ఆర్ఈజీఏ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.30,000 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. దీనికి అదనంగా... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ రోజు రూ.95,692 కోట్ల మధ్యంతర కేటాయింపునూ విడుదల చేశారు. దీంతో మొత్తం కేటాయింపు రూ.1.25 లక్షల కోట్లను దాటింది.
దేశవ్యాప్తంగా దాదాపు 2.80 లక్షల గ్రామ పంచాయతీలకు ఈ మొత్తం చేరుతుందనీ, తద్వారా ప్రతి పంచాయతీకి అనేక లక్షల రూపాయల నిధులు అందుతాయని శ్రీ చౌహాన్ అన్నారు. ఉపాధి కల్పన, గ్రామీణ ఆస్తుల సృష్టి రెండింటినీ నిర్ధారించేలా... చట్టంలోని నిబంధనల ప్రకారం గుర్తించిన అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు అందించడంతో పాటుగా... సకాలంలో వేతనాల చెల్లింపులు, కార్మిక హక్కుల పరిరక్షణ, నిరంతర అభివృద్ధి పనులనూ నిర్ధారించాలని కోరుకుంటోందని ఆయన అన్నారు. జూలై 1 నుంచే పనుల అమలు వేగవంతంగా ప్రారంభమయ్యేందుకు వీలుగా, రాష్ట్రాలు తగినన్ని పనులకు ముందస్తు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు.
డిజిటల్, పరిపాలనా సంసిద్ధతపై మాట్లాడుతూ... డీబీటీ, ఎస్ఎంఎస్ ఆధారిత సమాచార వ్యవస్థలు, ఇ-కేవైసీ, ముఖ ప్రామాణీకరణ వంటి ప్రక్రియల్లో అనేక రాష్ట్రాలు గణనీయ పురోగతిని సాధించాయనీ, ఇది కొత్త విధానం విజయవంతంగా అమలు కావడాన్ని సూచిస్తుందని శ్రీ చౌహాన్ అన్నారు.
'వికసిత్ భారత్ – గ్రామీణ భారత్' లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని 26 రాష్ట్రాలు ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు చేశాయనీ... జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలు ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాను స్వయంగా లేఖ రాస్తాననీ శ్రీ చౌహాన్ తెలిపారు.
వీలైనంత త్వరగా రాష్ట్ర స్థాయి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన కోరారు. నోటిఫికేషన్లు జారీ చేసినందుకు మిజోరం, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లను అభినందించిన కేంద్ర మంత్రి... ఇతర రాష్ట్రాలూ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వ్యవసాయ పనులు జోరుగా సాగే సీజన్‌లను నోటిఫై చేయాలనీ... 100 శాతం ఇ-కేవైసీని నిర్ధారించాలని... జిల్లా, మండల స్థాయిల్లో సామర్థ్యాలను మెరుగుపరిచే, అవగాహన పెంపొందించే కార్యక్రమాలనూ నిర్వహించాలని ఆయన రాష్ట్రాలను ఆదేశించారు.
గ్రామ పంచాయతీలు, గ్రామసభల ద్వారా పనులను ఎంపిక చేసి, ఆ ప్రతిపాదనల ఆధారంగా ఖరారు చేస్తామని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జూలై 1 వరకు ఎమ్‌జీఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి కల్పన, వేతన చెల్లింపుల్లో ఎలాంటి కోతలు గానీ, అంతరాయం గానీ ఉండకూడదని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వివిధ రాష్ట్రాలకు మధ్యంతర కేటాయింపులను ప్రకటించారు. కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి – ఆంధ్రప్రదేశ్ రూ.7,707.21 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ రూ.560.70 కోట్లు, అస్సాం రూ.1,929.24 కోట్లు, బిహార్ రూ.6,715.83 కోట్లు, ఛత్తీస్‌గఢ్ రూ.3,354.85 కోట్లు, గోవా రూ.3.70 కోట్లు, గుజరాత్ రూ.1,540.54 కోట్లు, హర్యానా రూ.590.23 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ.1,201.78 కోట్లు, జార్ఖండ్ రూ.2,705.64 కోట్లు, కర్ణాటక రూ.5,709.09 కోట్లు, కేరళ రూ.3,136.44 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.6,252.03 కోట్లు, మహారాష్ట్ర రూ.4,420.32 కోట్లు, మణిపూర్ రూ.581.99 కోట్లు, మేఘాలయ రూ.1,155.09 కోట్లు, మిజోరం రూ.611.65 కోట్లు, నాగాలాండ్ రూ.287.85 కోట్లు, ఒడిశా రూ.3,763.80 కోట్లు, పంజాబ్ రూ.1,331.61 కోట్లు.
అదేవిధంగా, రాజస్థాన్‌కు రూ.7,581.87 కోట్లు, సిక్కింకు రూ.97.57 కోట్లు, తమిళనాడుకు రూ.7,957.57 కోట్లు, తెలంగాణకు రూ.4,229.74 కోట్లు, త్రిపురకు రూ.1,041.07 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.12,221.48 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.626.43 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.8,508.00 కోట్లు కేటాయించగా... రాష్ట్రాలకు మొత్తం కేటాయింపులు రూ.92,550.17 కోట్లకు చేరాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరికి రూ.40.56 కోట్లు, జమ్మూ కాశ్మీర్‌కు రూ.1,151.02 కోట్లు, అండమాన్-నికోబార్ దీవులకు రూ.4.44 కోట్లు, లదాఖ్‌కు రూ.85.98 కోట్లు, దాద్రా - నగర్ హవేలీ, డామన్ - డయ్యూలకు రూ.9.02 కోట్లు, లక్షద్వీప్‌కు రూ.0.32 కోట్లు కేటాయించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం కేటాయింపు రూ.1,291.32 కోట్లకు చేరింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం చేసిన ఈ కేటాయింపులకు అదనంగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, సామాజిక ఆడిట్ కోసం రూ.1,850.62 కోట్లు కేటాయించారు. దీంతో మొత్తం మధ్యంతర కేటాయింపు రూ.95,692.31 కోట్లకు చేరింది. ఇది ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో భాగంగా 'వికసిత్ గావ్'ను నిర్మించడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన సాధనమని శ్రీ చౌహాన్ అన్నారు. దీని విజయం రాష్ట్రాల నిబద్ధత, సంసిద్ధత, క్రియాశీల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడంపై సవివరంగా చర్చించేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో న్యూఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్‌లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సులో పాల్గొనవలసిందిగా ఆయన అన్ని రాష్ట్రాలను ఆహ్వానించారు.
అన్ని రాష్ట్రాల సహకారంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ కార్యక్రమం గ్రామీణ భారత పరివర్తనలో... కోట్లాది మంది కార్మికులకు సుస్థిరమైన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2270967)
आगंतुक पटल : 500