పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 48 రిటైల్ అవుట్‌లెట్లలో ‘ఈ85’ ఇంధన పంపిణీ ప్రారంభం

డబ్బు పొదుపు చేయండి... పర్యావరణాన్ని కాపాడండి... విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయండి...

భారతీయ రైతుల చెమట, శ్రమతో దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్‌తో నడిచే ‘ఈ85’ ఆధారిత వాహనాలు

దేశీయంగా ఉత్పత్తయ్యే ఇథనాల్ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా సాంప్రదాయిక పెట్రోల్ కంటే లీటరుకు దాదాపు రూ.20 తక్కువ ధరకే అందుబాటులో ‘ఈ85’ ఇంధనం

ఇది ‘ఈ85’ అసలైన శక్తి — చమురు దిగుమతి అవసరం లేదు... విదేశీ ఖనిజాలతో పనిలేదు

భారత ఉత్పత్తులు-భారత పురోగతి

- కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ

प्रविष्टि तिथि: 05 JUN 2026 7:57PM by PIB Hyderabad

‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026’ సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ ఈ రోజు న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఆయిల్ రిటైల్ అవుట్‌లెట్‌లో ఈ85 ఇంధన పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల సీఎమ్‌డీలూ పాల్గొన్నారు.

ఈ85 ఇంధనం... ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించినది. ఇది 80–85 శాతం ఇథనాల్, 14–19 శాతం పెట్రోల్‌తో కూడిన అధిక-ఇథనాల్ మిశ్రమ ఇంధనం. వినియోగదారులను ఒకే మిశ్రమానికి పరిమితం చేయకుండా, ఈ20 నుంచి ఈ100 వరకు పలు ఇథనాల్ మిశ్రమాలపై పనిచేయగల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

దేశంలోని 48 ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. దీని ద్వారా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహన వినియోగదారులకు ఈ పరిశుద్ధ ఇంధనం అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానూ విస్తరించనున్నారు. 2026 డిసెంబరు నాటికి 500 రిటైల్ అవుట్‌లెట్‌లకు, 2027 డిసెంబరు నాటికి సుమారు 5000 రిటైల్ అవుట్‌లెట్‌లకు విస్తరించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 2030-31 నాటికి దేశంలో మొత్తం ఇథనాల్ మిశ్రమాన్ని దాదాపు 26 శాతానికి పెంచడంలోనూ ఇది సహాయపడుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ఇంధన లభ్యత, సరసమైన ధర, సుస్థిరత అనే "ఇంధన సంబంధిత త్రిముఖ సమస్య"ను విజయవంతంగా సమతుల్యం చేయగల సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించిందన్నారు. సుస్థిర ఇంధన సరఫరాలను నిర్ధారిస్తూనే, ప్రపంచ ఇంధన అస్థిరత నుంచి వినియోగదారులకు సాధ్యమైన మేరకు అత్యధిక రక్షణను భారత్ అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి నుంచి ఇంధన ధరల పెరుగుదల అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని శ్రీ హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.

2014లో 1.53 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని, నిర్దేశిత గడువుకు అయిదేళ్ల ముందే లక్ష్యాన్ని సాధించామని ఆయన పేర్కొన్నారు. ఈ పరివర్తన వల్ల రూ.1.84 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, దాదాపు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఇది నిలిచిందని శ్రీ హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి 'అన్నదాతలు'గా ఉన్న రైతులు... ఇప్పుడు 'ఇంధన దాతలు'గానూ వారి సహకారంతో దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని ఆయన కొనియాడారు.

ఈ85 వల్ల కలిగే ప్రయోజనాలు:

·         దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను వినియోగదారులకు చేరేలా చూసేందుకు, సాంప్రదాయిక పెట్రోల్ కంటే లీటరుకు దాదాపు రూ.20 తక్కువ ధరకే ఈ85 ఇంధనం అందిస్తున్నారు.

·         సాంప్రదాయిక పెట్రోల్ వాహనాలతో పోలిస్తే, ఈ85తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు వాటి జీవితకాలంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను సుమారు 61 శాతం తగ్గించగలవు.

·         సుమారు 108 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ కలిగి ఉండటం వల్ల, ఇథనాల్ అత్యుత్తమ నాక్ నిరోధకతను అందిస్తుంది. ఇంజిన్‌లు అధిక కంప్రెషన్ నిష్పత్తులు, ఆప్టిమైజ్ చేసిన ఇగ్నిషన్ టైమింగ్‌తో పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

·         అధిక ఇథనాల్ మిశ్రమాలు పరిశుద్ధమైన, మరింత సంపూర్ణమైన దహనాన్ని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా దాదాపు సున్నా కణ పదార్థ ఉద్గారాలతో ఇవి పట్టణ గాలి నాణ్యత మెరుగుపడటానికి దోహదపడతాయి.

కొత్త ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు 50 శాతం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలుగా మారితే, అది 312 కోట్ల లీటర్లకు పైగా ఇథనాల్‌కు డిమాండ్‌ను సృష్టించగలదనీ... దాని వల్ల దాదాపు రూ.12,403 కోట్లు నేరుగా రైతులకు చేరతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇటువంటి మార్పు వల్ల ఏటా దాదాపు రూ.15,151 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, 66.4 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలూ తగ్గుతాయని ఆయన వివరించారు.

భారత ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన విజయాల నుంచి స్ఫూర్తి పొందుతూనే, దేశీయ ఆకాంక్షలు, బలాబలాలకు అనుగుణంగా రూపొందినదని శ్రీ హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ దశాబ్దాలుగా అధిక ఇథనాల్ మిశ్రమాలను వినియోగిస్తోందనీ, ప్రస్తుతం దాని తేలికపాటి వాహన సముదాయంలో 80 శాతానికి పైగా ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతోనే నడుస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్‌కు అనుకూలమైన ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, ఇప్పుడు ఈ85 ఇంధనాన్నీ ప్రారంభించడం... భారత ప్రయోగాత్మక కార్యక్రమాల నుంచి ఒక వ్యవస్థీకృత జాతీయ ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యవస్థ దిశగా సాగుతున్న పరివర్తనకు సంకేతమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ85 ఇంధనం, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం అనుకూలమైన పన్నుల విధానాల ద్వారా ఈ పరివర్తనకు మద్దతునివ్వాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు సంబంధించిన పలు అపోహలను పరిష్కరిస్తూ... శ్రీ హర్దీప్ సింగ్ పురీ ఇలా పేర్కొన్నారు:

·         ఈ85 ఇంధనం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమే ఉద్దేశించినది, సాధారణ పెట్రోల్ వాహనాల కోసం కాదు.

·         దేశవ్యాప్తంగా ఈ20 ప్రామాణిక ఇంధనంగా మారినప్పటి నుంచి, ఇథనాల్ కలపడం వల్ల ఇంజిన్ వైఫల్యం లేదా వాహనం ఆగిపోయినట్లు ఒక్క కేసూ నమోదు కాలేదు.

·         ఈ20కి అనుకూలమైన వాహనాలు... ముఖ్యంగా నగర డ్రైవింగ్ పరిస్థితుల్లో మెరుగైన యాక్సిలరేషన్, ప్రయాణ నాణ్యతనూ అందిస్తాయి.

·         దేశంలో ఈ20 ఇంధనాన్ని వాడటం వల్ల వాహన బీమా చెల్లుబాటుపైనా ఎలాంటి ప్రభావం ఉండదు.

తక్కువ కొనుగోలు వ్యయం, ఇప్పటికే ఉన్న ఇంధన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే సామర్థ్యం కారణంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఈవీలకూ గట్టి పోటీనిస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈవీ సాంకేతికతలు దిగుమతి చేసుకున్న బ్యాటరీలు, కీలక ఖనిజాలపై గణనీయంగా ఆధారపడగా... ఈ85తో నడిచే వాహనాలు భారతీయ రైతుల చెమట, శ్రమతో దేశీయంగా ఉత్పత్తి అయిన ఇథనాల్‌తో నడుస్తాయని ఆయన తెలిపారు.

ప్రతి లీటర్ ఇథనాల్... మనం దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనం స్థానాన్ని భర్తీ చేస్తుందనీ, ఈ85లోని ప్రతి చుక్కా స్వయం-సమృద్ధ భారత్ స్ఫూర్తిని తనలో నింపుకుందని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి... ఇలా చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రతి చుక్కలోనూ భారతీయత ఉంది, ప్రతి చుక్కలోనూ మన రైతుల శ్రమ ఉంది, ప్రతి చుక్కలోనూ భారత భవిత ఉంది!


(रिलीज़ आईडी: 2269934) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam