ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 05 JUN 2026 8:45PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

   విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!

అందరూ బాగున్నారా? సూరత్ నగరంలో మనోల్లాసానికి కొదవేమీ లేదు కదా! అటువైపున్న సోదరా.. మీరేదో తెచ్చినట్టున్నారు? ఓహ్‌.. సుందర చిత్రం రూపొందించారు మిత్రమా.. మీకు ధన్యవాదాలు. ఆ సోదరుడు దాన్ని నాకు బహూకరించాలని వచ్చారు. ప్రత్యేక రక్షణ సిబ్బంది సభ్యులెవరైనా ఆ చిత్రాన్ని కాస్త అందుకోండి. సోదరా.. మీకు మరొకసారి ధన్యవాదాలు.. ఆ చిత్రాన్ని దయచేసి నా రక్షణ బృందంలోని ఒకరి చేతికిస్తే, నాకు చేరుస్తారు.

మిత్రులారా!

ముందుగా- ఇటీవల కన్నుమూసిన నా ఆప్తమిత్రుడు కనుభాయ్ మవానీకి సగౌరవ నివాళి అర్పిస్తున్నాను. మేమిద్దరం ఎన్నో ఏళ్లపాటు కలిసి పనిచేశాం... జీవితంలో అంతిమ క్షణాలదాకా చురుగ్గా కనిపించిన నా సహచరుడిని కోల్పోవడం సహజంగా బాధాకరమే. అయితే, నేనివాళ ఈ సూరత్ గడ్డపై ఆయన పవిత్ర స్మరణతో ప్రసంగాన్ని కొనసాగిస్తాను.

మిత్రులారా!

సూరత్ కేవలం ఒక నగరం కాదు... అదొక చైతన్య స్ఫూర్తి అని నాకెప్పుడూ అనిపిస్తూంటుంది. ఈ స్ఫూర్తి ఫలితంగానే ఇవాళ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం చేయీచేయీ కలిపి పర్యావరణానికి అంకితం చేస్తూ 15,000 పోస్టర్లను తయారు చేసి తెచ్చారు. ఈ సత్కార్యంలో పాలుపంచుకున్న కుటుంబాలన్నింటినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజుకు గల ప్రత్యేకతపై వారి ఆలోచనే పర్యావరణ పరిరక్షణ కృషిలో వారిని నిమగ్నం చేసింది. మన కథియావాడ్ సోదరులలో చాలామంది ఈ నగరంలోనే నివసిస్తున్నారు. వారికికిక్కడ పొలాలున్నాయి... కాబట్టి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా “పొలాన్ని కాపాడండి” కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా వారిని నా మనవి. రసాయన రహిత వ్యవసాయం, మన పెద్దలు ఆచరించిన సహజ విధానం. భూకమతాలున్న సూరత్ ప్రజలు ఎక్కడున్నా సరే... మీపై నాకు గల పూర్తి హక్కుతో ఈ విధానాన్ని అనుసరించాల్సిందిగా కోరుతున్నాను.

మిత్రులారా!

ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ప్రతి ఒక్కరూ సాదర స్వాగతం పలికి, నా కోసం రకరకాల జ్ఞాపికలు, కానుకలు ఇచ్చారు. అయితే, వీటన్నిటితో పాటు సూరత్ నాకొక అమూల్య, అద్భుత బహుమతిగా- చెత్తను నా చేతిలో పెట్టి, ఆహ్వానించింది. ఈ దిశగా లక్ష మంది 5 రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించారు. ఇంతకన్నా విలువైన బహుమతి మరేముంటుంది? అందుకే, ఆ లక్ష మందితోపాటు సూరత్‌ నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ‘ఈయనేం ప్రధానమంత్రి? స్వాగత బహుమతిగా చెత్తను అందుకోవడం ఈయనకు గర్వకారణమా” అని మీకందరికీ ఆశ్చర్యం కలుగుతుందేమో! అయితే, పరిశుభ్రత ఒక విలువగా మారాలన్నదే నా దృక్కోణం. ఈ కృషిలో లక్ష మంది చేయికలపడమంటే శుభ్రత కోసం లక్ష కుటుంబాలు సామూహికంగా పాటుపడటమే. ఇది కేవలం పారిశుధ్య కార్యక్రమానికి పరిమితం కాదు... ఆరోగ్యకర భవిష్యత్తు దిశగా ఒక రకమైన విలువల వేడుక. ఇందుకుగాను సూరత్ వాసులందరూ అత్యంత అభినందనార్హులు.

మిత్రులారా!

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ  అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

మీరు మాకు.. అంటే బీజేపీకి రెండున్నర దశాబ్దాలకు పైగా నిరంతర మద్దతు, ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు. కాలం గడిచేకొద్దీ మా ప్రేమాదరాలు మరింత పెరుగుతూ వచ్చాయి. ఈ గడ్డమీది ఓ పుత్రిక మిమ్మల్నందర్నీ ముందుండి నడిపించింది. జిల్లా, తాలూకా పరిషత్‌లు సహా పురపాలికలు, నగరపాలికలకు ఇటీవల నిర్వహించిన ఎన్నికలలో గుజరాత్ ప్రజలు బీజేపీకి ఎంతగా మద్దతిచ్చారంటే- పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇవాళ నాకు మరింత సంతోషంగా ఉంది.. ఎందుకంటే- మీరు నా రికార్డులను కూడా అధిగమించారు. నేను చాలా ఆలస్యంగా... బహుశా 1987లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పట్లో సూరత్-అహ్మదాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించినపుడు మా తొలి ఎన్నికల్లోనే మేం ఘనవిజయం సాధించాం. నాటినుంచీ ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ప్రజాస్వామ్య సమాజాలలో ఇలాంటిది అత్యంత అరుదు. ఏదైనా మా పార్టీకి ప్రజల ఆశీస్సులు, వారికి మరింతగా సేవ చేసే అవకాశం ఇంత సుదీర్ఘకాలం లభిస్తుండటం నిజంగా మా అదృష్టం.

మిత్రులారా!

ఈ కార్యక్రమానికి హాజరైన సూరత్, నవసారి ప్రజాప్రతినిధులను అభినందిస్తూ- వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సేవా స్ఫూర్తికి గుజరాత్ ప్రజల ఆమోదం లభించిందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ భారీ విజయాన్ని సేవా తత్పరతతో మరింత శ్రద్ధతో కృషి చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా “సఫల గుజరాత్, సఫల భారత్” సాకారమే మన సంకల్పం. ఇనుమడించిన దీక్షతో మనను మనం సేవకు అంకితం చేసుకోవడమే ఇందుకు సరైన మార్గం. సూరత్ అన్నది నగరానికి పరిమితం కాదు... సూరత్ ఒక స్ఫూర్తికి ప్రతీక అనడంలో నా దృఢ విశ్వాసం ధ్వనిస్తుంది. ఒక్కసారి ఊహించండి... యావద్దేశం ప్రాతిపదికన నిరంతర పరిశుభ్రతకు గాను అనేక పురస్కారాలు అందుకుంటున్న నగరమిది. ఇలాంటప్పుడు “మనకు చాలా అవార్డులొచ్చాయి... ఇంకా మనం చేయాల్సిందేముంటుంది?” అనిపించడం సహజం. కానీ, సూరత్ ఎన్నడూ అలా ఆలోచించదు. అది పరిశుభ్రతకు సదా పెద్దపీట వేస్తుంది. అందుకే- సూరత్ ఓ నగరానికి పరిమితం కాదు... ఇది నిత్యచైతన్య స్ఫూర్తి అని నేనంటాను.

మిత్రులారా!

వికసిత భారత్‌ లక్ష్యసాధనే మన మహా సంకల్పం... అలాగే వికసిత గుజరాత్‌ కూడా. దేశంలోని ప్రతి గ్రామాన్ని, జిల్లాను, నగరాన్ని అభివృద్ధి చేయడం ద్వారానే ఇది సాకారం కాగలదు. అందువల్ల బీజేపీకి ప్రాతినిధ్య వహించే ప్రజాప్రతినిధులందరూ ఇందులో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది.

మిత్రులారా!

నేడు జూన్‌ 5... ఇది పర్యావరణ దినోత్సవం కావడం ఓ యాదృచ్ఛిక శుభపరిణామం. ఇలాంటి రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో ఒకటైన సూరత్‌లో ఉండటం నాకెంతో ఆనందాన్నిస్తోంది... ఎంతో గర్వంగా కూడా ఉంది. ఒకప్పుడు ప్లేగు మహమ్మారి బారినపడి అష్టకష్టాలూ పడిన సూరత్ నగరం పరిశుభ్రతకు ప్రతీకగా గుర్తింపు పొందుతోంది. ఈ ఘనత నిజంగా పౌరులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సహా రెండున్నర దశాబ్దాలుగా సంబంధిత వర్గాలన్నీ చేసిన నిరంతర కృషి ఫలితమే. ఇటీవల ఇక్కడ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు కూడా నిర్వహించారని నాకు సమాచారం అందింది. ఇందుకుగాను సూరత్‌ నగరవాసులందరినీ అభినందిస్తున్నాను. ప్రియమైన సూరత్‌ వాసులారా! మీకు నా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఈ నగరాభివృద్ధికి మరింత ఉత్తేజమిచ్చే క్రమంలో ఇవాళ అనేక పనులకు శంకుస్థాపన చేశాం. ఈ ప్రాజెక్టులన్నీ లభించినందుకుగాను మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

కాలుష్య రహిత శకం వైపు, హరిత భవిత దిశగా పయనానికి ప్రపంచమంతా నేడు ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భారత్‌ కూడా కాలుష్య రహిత వృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో గుజరాత్‌ అనేక ఏళ్లకిందటే ఎంతో వేగంగా ముందడుగు వేసింది. ఆ మేరకు ఈ శతాబ్దారంభంలోనే వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో ఇలాంటి చర్య చేపట్టిన తొలి రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. ఆనాడు ముఖ్యమంత్రిగా నా హయాంలోనే పాటన్‌ జిల్లా పరిధిలోగల చరంకా గ్రామంలో భారత తొలి సౌరశక్తి పార్కు ఏర్పాటైంది. అప్పట్లో అదొక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి విశాల ప్రాంతంలో నిర్మించిన అంతటి భారీ సౌరశక్తి ప్రాజెక్టు ప్రజలను ఎంతో అబ్బురపరచింది.   

మిత్రులారా!

గుజరాత్‌లో మీరు ఆనాడు చేసిన కృషి యావద్దేశాన్నీ ఉత్తేజితం చేసింది. ఇవాళ ప్రకృతితో సహజీవనం ద్వారా ప్రగతి... ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం జమిలి వృద్ధి నినాదంగా భారత్‌ దూసుకెళ్తోంది.

మిత్రులారా!

ఈ పరిణామాత్మక ప్రస్థానం సూరత్‌లో ఇవాళ ప్రస్ఫుటమవుతోంది. ఈ నగరంలోని వినూత్న ‘వర్తుల జల ఆర్థిక వ్యవస్థ’ నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పారిశ్రామిక అవసరాల కోసం మురుగునీటి శుద్ధి ఈ నగర ప్రత్యేకత. ఆ మేరకు వ్యర్థ జలాలను శుద్ధి చేయడం ద్వారా కూడా ఈ నగరం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. పన్నెండేళ్లుగా దేశమంతటా ‘వ్యర్థం నుంచి అర్థం’ పేరిట భారీ ప్రజా ఉద్యమం సాగుతోంది. పరిశుభ్రదత, పచ్చదనం పెంపు దిశగా దేశంలోని నగరాలన్నిటికీ ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతోంది.

మిత్రులారా!

ఈ నగర భవిష్యత్ తాగునీటి, మురుగుశుద్ధి భద్రతకు భరోసా ఇస్తూ తాపి బ్యారేజ్ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర పడింది. దీనికితోడు జల నిర్వహణ, వరదనీటి పారుదలకూ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. కాబట్టే, సంబంధిత పలు ప్రాజెక్టులకు మనమివాళ శంకుస్థాపన చేశాం.

మిత్రులారా!

సూరత్‌ నగరం పరిశుభ్రతకు, వర్తుల ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ విస్తరణ కాలుష్య రహిత ప్రగతి దిశగానూ వేగంగా సాగుతోంది. ఉదాహరణకు విద్యుత్‌ రవాణా వ్యవస్థ వైపు సూరత్ శరవేగంగా పురోగమిస్తోంది. ఈ మేరకు నగరంలో అన్ని బస్సులూ విద్యుత్తుతో నడిచేవిగా శ్రద్ధ వహిస్తోంది. దీంతోపాటు మెట్రో నెట్‌వర్క్ కూడా విస్తరిస్తోంది. పరిశుభ్రతకు నెలవుగా సూరత్‌ నగరానికిగల గుర్తింపును ఇవన్నీ మరింత విస్తృతం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలని భావిస్తున్నాను. హజీరా పారిశ్రామిక ప్రాంతంలో త్వరలోనే పూర్తి పునరుత్పాదక ఇంధనంతో కాలుష్య రహిత ఉక్కు ఉత్పత్తికి నెలవు కాగలదు. అంటే- ఉక్కు ఉత్పత్తి కోసం కాలుష్య రహిత విద్యుత్తును వినియోగించడం అన్నమాట!

మిత్రులారా!

యావత్‌ ప్రపంచం ఈ రోజున అనేక అసాధారణ సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుత కాలం ప్రపంచానికి విపత్తుల దశాబ్దమని నేను ఇటీవలే చెప్పాను. అనేక విపత్తులు ఒకదాని వెంట మరొకటిగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. వీటిలో మొట్టమొదటిది కరోనా మహమ్మారి కాగా, ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో సంఘర్షణలు మొదలయ్యాయి. ఇక ఈ క్షణంలో ప్రపంచ దేశాలన్నీ ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు క్షణక్షణానికీ మారిపోతున్నాయి. గ్యాస్‌ సరఫరా వ్యవస్థలు హఠాత్తుగా కుప్పకూలుతున్నాయి.

అయితే, సోదరీసోదరులారా!

ఈ భారీ ప్రపంచ సంక్షోభాల నడుమ 140 కోట్ల మంది భారతీయులు దృఢంగా నిలవడం నాకు ఎనలేని సంతృప్తినిస్తోంది. సవాళ్లపై పోరులో మీరంతా నాకు వెన్నదన్నుగా నిలిచారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ పోరులో మనం గెలిచి తీరాల్సిందే.. ఏమంటారు?

అంతేకాదు మిత్రులారా!

ఈ పోరాటంలోనూ గుజరాత్‌ తనవంతు కీలక పాత్ర పోషించింది. ఇటీవలి కాలంలో చమురుశుద్ధి, సౌరశక్తి, పవన విద్యుత్తు తదితర రంగాల్లో ఈ రాష్ట్రం తన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇదంతా రాష్ట్రానికే కాకుండా దేశానికీ మేలు చేసే పరిణామమే. కాబట్టే, దేశంలోని 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో 5వ వంతు.. అంటే 50 గిగావాట్లు ఈ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోంది. ఇంతకుముందు మెగావాట్‌ తప్ప గిగావాట్‌ అనే పదమే మన దేశంలో చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో యావద్దేశ సామర్థ్యంలో ఒక్క గుజరాత్‌ రాష్ట్ర వాటాయే 50 గిగావాట్లు కావడం మనందరికీ గర్వకారణమే కదా! మరోవైపు సౌరశక్తి ఉత్పాదనలోనూ గుజరాత్‌ కృషి ప్రశంసనీయం. ఇక నేడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి ఆధునిక రంగాల్లో దేశం ముందడుగు వేస్తున్న తరుణంలోనూ గుజరాత్‌ పాత్ర గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

మిత్రులారా!

ఇంధన స్వావలంబన ఎంత ముఖ్యమో ప్రస్తుత ప్రపంచ సంక్షోభం మనకు తేటతెల్లం చేస్తోంది. ఈ నేపథ్యంలో గడచిన పన్నెండేళ్లుగా దేశం సాధించిన ఇంధన సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యముంది. ఒకవైపు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి చమురు, గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేసుకున్నాం. మరోవైపు పునరుత్పాదక ఇంధన రంగంలో చారిత్రక రీతిలో పెట్టుబడులు పెట్టాం. పన్నెండేళ్ల కిందట దేశంలో సౌరశక్తి ఉత్పాదన నామమాత్రం కాగా, ఇవాళ ప్రపంచంలోని ఐదు అగ్ర దేశాల జాబితాలో మనకూ స్థానముంది. సౌరశక్తి ఒక్కటే కాదు... ఇథనాల్ మిశ్రణ సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నాం. రైల్వేల విద్యుదీకరణ వేగం ఇనుమడించింది.. అణుశక్తి సాధనలో పురోగతి కనిపిస్తోంది.. పాతబడిన విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌ను ఆధునికీకరించడమే కాకుండా మరింత విస్తరించాం. గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకున్నాం.. ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచుతున్నందు వల్ల మరిన్ని పెట్రోలియం ఉత్పత్తులను అక్కడికి చేర్చి నిల్వ చేసుకోగలుగుతాం.  భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ దేశ సామర్థ్యం ఇనుమడించేలా మా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది.

మిత్రులారా!

సూరత్‌లో ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. హర్ష్‌ భాయ్‌ ప్రస్తావించిన హజీరాను నేను సందర్శించాను. స్వయంసమృద్ధ భారత్ కార్యక్రమానికి ఈ పారిశ్రామిక ప్రాంతం ఒక సజీవ నిదర్శనం. ఈ ప్రాంతాన్ని నేడు పారిశ్రామిక మండలిగా మాత్రమేగాక ఇంధనం, ఉక్కు, రక్షణ ఉత్పత్తులు సహా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రతీకగా మారింది. ముఖ్యంగా మన దేశానికి ప్రధాన అంతర్జాతీయ సముద్ర వాణిజ్య కూడలిగానూ రూపొందుతోంది.

అయితే, మిత్రులారా!

దేశంలో ఇవాళ స్వయంసమృద్ధ భారత్ ఉద్యమాన్ని అపహాస్యం చేసే నిరాశావాద వర్గాలున్నాయి. ఈ దిశగా మన దృఢ సంకల్పాన్ని అవి తక్కువచేసి చూపుతుంటాయి. చారిత్రకంగా దేశాన్ని విదేశీ సంస్థలపై ఆధారపడేలా చేసింది ఈ నిరాశావాద వర్గాలే. పరాధీన దేశమేదైనా తాను నిష్పాక్షికంగా చేరాల్సిన సమున్నత ప్రగతి శిఖరాలను అందుకోలేదన్న వాస్తవాన్ని వారు విస్మరించారు.

మిత్రులారా!

స్వయంసమృద్ధి సాధనలో కీలకమైన ఆధునిక అనుసంధానంపై మా ప్రభుత్వం నిశితంగా దృష్టి సారిస్తోంది. ఈ దిశగా ప్రత్యేక రవాణా కారిడార్, బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తోంది. ఇక ఈ రోజున వడోదర-ముంబై ‘ఎక్స్‌ప్రెస్‌ వే’లో ప్రధాన విభాగాన్ని ప్రారంభించాం. దీనివల్ల రెండు భారీ పారిశ్రామిక-వాణిజ్య ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత మెరుగవుతుంది.

మిత్రులారా!

దేశంలో ప్రతి ప్రాంతాన్నీ అనుసంధానించడం, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించడం మా ప్రాథమ్యాల్లో ఒక భాగం మాత్రమే. లోగడ తగినంతగా సేవలందని గిరిజన, మారుమూల ప్రాంతాలకు చేరువయ్యే ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాం. దాహోద్-బోడెలి-వాపి కారిడార్ వంటి అభివృద్ధి కార్యక్రమం ఇందుకొక నిదర్శనం.

అలాగే నర్మద, తాపి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలకు 4 వరుసల రహదారి సదుపాయం కల్పించడాన్ని ఒకసారి ఊహించుకోండి. దీనివల్ల ప్రయాణ సమయం, రవాణా వ్యయం ఆదా అవుతాయి. అదే సమయంలో గిరిజనులకు విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి పరంగా భరోసా లభిస్తుంది.

మిత్రులారా!

ఈ కారిడార్‌ ద్వారా ఛోటా ఉదయ్‌పూర్‌, నర్మద, భరూచ్, తాపి గిరిజన ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతంతో సంధానితమవుతాయి. తద్వారా దక్షిణ గుజరాత్‌లో పర్యాటకాభివృద్ధికి బాటలు పడతాయి.  ఐక్యతా విగ్రహం సహా సమీపంలోని సందర్శనీయ ప్రదేశాలతో అనుసంధాన సౌలభ్యం కూడా కలుగుతుంది.

మిత్రులారా!

సూరత్‌ నగరంలో ఇవాళ అత్యాధునిక ‘ఈఎస్ఐసీ’ ఆస్పత్రిని ప్రారంభించాం. ఇది ఇక్కడి కార్మిక సోదరులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కేంద్రం కాగలదు.

మిత్రులారా!

మా ప్రభుత్వం దేశాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది... అందుకే- దేశానికి బీజేపీ మీద, అది చేపట్టే ప్రగతి ప్రాజెక్టుల మీద నమ్మకం నానాటికీ ఇనుమడిస్తోంది. కాబట్టే, దేశ ప్రజలు బీజేపీకి వరుసగా అధికార పగ్గాలు అప్పగిస్తున్నారు. ఇటీవల బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు ఇందుకు ఒక ఉదాహరణ.. బెంగాల్ అనగానే మీలో ఓ రకమైన ఉత్సాహం పెల్లుబకవచ్చు. కానీ, నా అనుభవం ఏమిటంటేఞ ఇటీవల ఐదు దేశాల్లో నేను పర్యటించిన సందర్భంగా విదేశాల్లోనూ బెంగాల్ రాష్ట్రంలో మా విజయంపైనే చర్చ సాగింది. అందరూ బెంగాల్ పరిణామాలనే ప్రస్తావించారు. బెంగాల్ ఒక్కటే కాదు.. అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలలో బీజేపీ, ఎన్డీయే భారీ విజయం సాధించాయి. అంతేనా... దేశవ్యాప్తంగా పంచాయతీలు, కార్పొరేషన్ల ఎన్నికలలోనూ బీజేపీ విజయపతాక రెపరెపలాడుతోంది.

మిత్రులారా!

ఇలాంటి ప్రతి ఎన్నిక ఓ సందేశాన్నిస్తూంటుంది... దేశానికి గందరగోళం, అనిశ్చితి, నిరాశ వంటివి ఎంతమాత్రం నచ్చవు. కానీ, కాంగ్రెస్ పార్టీ గడచిన 12 ఏళ్లుగా మూసుకుపోయిన అవకాశాల కోసం అంధకారంలో తడుముకుంటూ గందరగోళం, అనిశ్చితిని సృష్టిస్తోంది. అందుకే, ప్రజలు దానికి పదేపదే గట్టి జవాబిస్తున్నారు... ఆ క్రమంలోనూ గుజరాత్‌లో మీరు కూడా కాంగ్రెస్‌ను పాతాళంలో పాతిపెట్టారు. అయితే, అక్కడక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాల దుష్పరిపాలనతో ప్రజలు విసిగిపోయారు. ఇటీవలే ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఆ రాష్ట్ర  ప్రజలు కాంగ్రెస్ దుష్పరిపాలనను చీదరించుకుని తిప్పికొట్టారు. అంతకుముందు హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడింది. అదేవిధంగా పంజాబ్ ప్రజలు కూడా కాంగ్రెస్ పరాన్నజీవి రాజకీయాలు ఇక పనిచేయవని కాంగ్రెస్‌కు స్పష్టమైన హెచ్చరిక పంపారు. గందరగోళం నడుమ అవకాశాలు వెతుక్కునే కాంగ్రెస్ రాజకీయాలు ఇకపై ఫలించవని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్నమొన్ననే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబకడంతో ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చింది.

మిత్రులారా!

భారత్‌ ఇప్పటికే ఎన్నో ప్రతికూలతలను అధిగమించింది... ఇది అపరిమిత ఆశావహ దృక్పథం గల దేశం. ఉన్నత ఆకాంక్షలు నిండిన ఈ దేశంలోని పౌరులకు అనేక కలలు, సంకల్పాలు ఉన్నాయి. వాటన్నిటినీ సాకారం చేసుకోవడానికి సకల ప్రజానీకం నిబద్ధతతో కృషి చేస్తోంది. జనం దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తే దేశం ప్రతి స్వప్నాన్నీ సాకారం చేసుకోగలదు. సరిగ్గా ఇదే భారత్‌ సామర్థ్యం... మనమంతా ఏకతాటిపై నిలిచి, వికసిత భారత్‌ సాకారం వైపు ప్రస్థానాన్ని వేగిరపరుద్దాం. మనను మనం పూర్తిగా పునరంకితం చేసుకుంటూ స్వప్నాలను సంకల్పాలుగా, సంకల్పాలను విజయాలుగా మార్చుకుందాం. నేను కూడా మీతో భుజం కలిపి నడుస్తాను... మీరు రెండడుగులు వేస్తే, మూడడుగులు ముందుకు నడవానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆగిపోవడం, అలసిపోవడం మనకెవరికీ ఆమోదయోగ్యం కాదన్నది వాస్తవం. నేటి అభివృద్ధి ప్రాజెక్టులపై మీకు మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ పిలుపుతో నా ప్రసంగం ముగిస్తున్నాను. ఇప్పుడు నాతో గళం కలిపి దిక్కులు పిక్కటిల్లేలా నినదించండి:

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

 

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగంలో కొంత గుజరాతీ భాషలో సాగింది... ఇది దానికి స్వేచ్ఛానువాదం మాత్రమే.

***


(रिलीज़ आईडी: 2269930) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Kannada