వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
లీగల్ మెట్రాలజీ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో వంట నూనెల ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను నిర్ణయించిన వినియోగదారుల వ్యవహారాల శాఖ
ధరల సరిపోలికను సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం, ఏకరూప ప్యాకేజింగ్ విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎస్ఓపీ సవరణ
మారేందుకు మూడు నెలల సమయం: స్వదేశీ, దిగుమతి వంట నూనెలకూ వర్తించనున్న నిబంధనలు
ఏకరూప ప్యాక్ పరిమాణాలు, పరిమాణంతో పాటు దానికి సమానమైన బరువును ప్రకటించాలని నిర్దేశిస్తోన్న ఎస్ఓపీ సవరణ
प्रविष्टि तिथि:
06 JUN 2026 4:04PM by PIB Hyderabad
వినియోగదారుల పారదర్శకతను పెంపొందించడం, నిష్పక్షపాత వాణిజ్య పద్ధతులను ప్రోత్సహించడంలో భాగంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా లీగల్ మెట్రాలజీ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో తినే నూనెలు, కొవ్వుల నికర పరిమాణం, ప్రామాణిక ప్యాక్ పరిమాణాల నిర్ధారణ కోసం 29.12.2023 నాటి ఎస్ఓపీని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) సవరించింది.
దేశంలోని దాదాపు 90 శాతం తినే నూనెల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన వంట నూనెల (ఎడిబుల్ ఆయిల్) పరిశ్రమల సంఘాలతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో విభిన్న పరిమాణాల ప్యాకేజీలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వినియోగదారులు ధరలను పోల్చుకుని సరైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కొత్త చర్యను చేపట్టారు.
వంట నూనెల ప్యాకేజింగ్, లేబులింగ్‌లో వినియోగదారుల ప్రయోజనార్థం సంస్కరణల ప్రకటన
-
ప్రధాన వంట నూనెలు, మిశ్రమ వంట నూనెలు కోసం ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను నిర్ణయించారు.
-
వినియోగదారులు వివిధ బ్రాండ్ల ధరలను మరింత సులభంగా పోల్చుకోవడానికి, తాము పెట్టే ఖర్చుకు తగ్గ విలువను కచ్చితంగా అంచనా వేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.
-
పారదర్శకతను పెంచడం కోసం పరిమాణం, దానికి సమానమైన బరువు రెండింటినీ ప్రకటించాల్సి ఉంటుంది.
-
ఈ నిబంధనలు దేశీయంగా తయారయ్యే, దిగుమతి చేసుకునే వంట నూనెలు రెండింటికీ వర్తిస్తాయి.
-
కొత్త నిబంధనలకు మారేందుకు తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు మూడు నెలల సమయాన్ని (ట్రాన్సిషన్ పీరియడ్) ఇచ్చారు.
ప్రధాన వంట నూనెలు, మిశ్రమ వంట నూనెల విషయంలో సవరించిన ఎస్ఓపీ.. ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను నిర్దేశిస్తుంది. ఇందులో పామాయిల్, సోయాబీన్ నూనె, సన్‌ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ నూనె, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనె ఉన్నాయి.
అనుమతించిన ప్రామాణిక ప్యాక్ పరిమాణాలు:
-
200 మి.లీ / గ్రా
-
500 మి.లీ / గ్రా
-
1 లీటరు / కేజీ
-
2 లీటర్లు / కేజీ
-
3 లీటర్లు / కేజీ
-
4 లీటర్లు / కేజీ
-
5 లీటర్లు / కేజీ
-
15 లీటర్లు / కేజీ
-
20 లీటర్లు / కేజీ
ఈ ప్రామాణిక పరిమాణాలు వినియోగదారులు వివిధ బ్రాండ్ల ధరలను మరింత సులభంగా పోల్చుకోవడానికి, సరైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి.
వినియోగదారుల ఎంపికకు రక్షణ
200 మి.లీ లేదా 200 గ్రాముల కంటే తక్కువ పరిమాణం ఉన్న ప్యాకేజీలకు ఈ ప్రామాణీకరణ వర్తించదు. దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌లు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. తక్కువగా వాడే ఇతర నూనెలకు (మైనర్ ఆయిల్స్) కూడా ఈ ప్రామాణిక ప్యాక్ పరిమాణ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.
అదనపు చర్యలు, అమలు
ఒకవేళ వంట నూనె పరిమాణాన్ని లీటర్లు లేదా మిల్లీలీటర్లలో చూపించినట్లయితే ప్యాకేజీపై దానికి సమానమైన బరువును కూడా స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరి. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్ చేసిన సరుకులు) నిబంధనలు- 2011 ప్రకారం ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులు వివిధ బ్రాండ్‌ల ఉత్పత్తులను మరింత సులభంగా పోల్చుకోవడానికి, మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
ఈ కొత్త నిబంధనలు భారతదేశంలో తయారయ్యే వాటితో పాటు దిగుమతి చేసుకునే వంట నూనెలకు వర్తిస్తాయి. శాంప్లింగ్, టెస్టింగ్, నికర పరిమాణాన్ని తనిఖీ చేయడం.. అనుమతించదగిన లోపాలకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు యథావిధిగా ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్), లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్ చేసిన సరుకులు) నిబంధనలు- 2011 పరిధిలోనే కొనసాగుతాయి. ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు మూడు నెలల సమయం (ట్రాన్సిషన్ పీరియడ్) ఉంది. నిర్ణీత పరిమాణాల ప్యాకేజింగ్ విధానాన్ని ముందుగానే అమలు చేయాలనుకునే వ్యాపార సంస్థలు వెంటనే ప్రారంభించొచ్చు.
ఈ ప్రామాణిక ప్యాక్ పరిమాణాల ప్రవేశం వల్ల వినియోగదారులు వివిధ బ్రాండ్ల ధరలను మరింత సులభంగా పోల్చుకోవడానికి, తాము పెట్టే ఖర్చుకు తగిన విలువను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇది వినియోగదారులు మరింత పారదర్శకంగా, సరైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నిర్ణయం ప్యాకేజింగ్ విధానాలలో మరింత ఏకరూపతను తీసుకురావడం ద్వారా వంట నూనెల పరిశ్రమకు కూడా ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రామాణిక ప్యాక్ పరిమాణాలు నిబంధనల అమలును సులభతరం చేస్తాయి. ఇవి తయారీదారులు, దిగుమతిదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయి. మార్కెట్‌లో మరింత పారదర్శక వాతావరణాన్ని సృష్టించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
మార్కెట్‌లో పారదర్శకత, నిష్పక్షపాత వాతావరణం, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించే సంస్కరణల ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2269912)
आगंतुक पटल : 5