నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 2026 నాటికి 75 లక్షల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు లక్ష్యం: కేంద్ర నూతన-పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి
వెనకబడిన కుటుంబాల్లో వేగంగా అమలు చేసే లక్ష్యంతో ప్రారంభమైన యుటిలిటీ-లింక్డ్ అగ్రిగేషన్ (యూఎల్ఏ) నమూనా
పీఎం సూర్య ఘర్ లోగో, వాట్సాప్ బాట్ ప్రారంభం
రెండేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన
प्रविष्टि तिथि:
04 JUN 2026 6:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి సూర్యఘర్ - ముఫ్త్ బిజ్లీ యోజన రెండేళ్లలోనే 40 లక్షలకు పైగా లబ్ధిదారుల కుటుంబాలకు చేరిందని, 2026 డిసెంబరు నాటికి 75 లక్షలకు పైగా కుటుంబాలకు చేరుతుందని ఆశిస్తున్నామని కేంద్ర నూతన-పునరుత్పాదక ఇంధనం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘రెండేళ్ల ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన – సౌర విద్యుత్ గృహాలను కోటి పైకప్పులకు విస్తరించడం’ అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా వెనకబడిన కుటుంబాల్లో పథకం అమలును వేగవంతం చేయడానికి యుటిలిటీ-లింక్డ్ అగ్రిగేషన్ (యూఎల్ఏ) నమూనాను రూపొందించినట్లు శ్రీ జోషి తెలిపారు. ఈ నమూనా కింద రాష్ట్రాల వ్యాప్తంగా సుమారు 30 లక్షల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని, వీటిని వేగంగా స్వీకరించి, అమలు చేయడంలో యుటిలిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని, సరసమైన పరిశుద్ధ ఇంధనం విస్తృతంగా అందుబాటులో ఉండేలా నిర్ధారించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 65 లక్షలకు పైగా దరఖాస్తులు పరిశీలనలో ఉండగా... ఈ పథకం దేశవ్యాప్తంగా బలమైన ప్రజా భాగస్వామ్యం, అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోందని శ్రీ జోషి తెలిపారు.
భారత సౌర విద్యుత్ వృద్ధి వేగంగా పుంజుకుంటోందని కేంద్ర మంత్రి అన్నారు. మొదటి 50 గిగావాట్ల సామర్థ్యానికి 96 నెలలు పట్టిందని, ఆ తర్వాతి 50 గిగావాట్లకు 36 నెలలు, 100 గిగావాట్ల నుంచి 150 గిగావాట్లకు వృద్ధి చెందడానికి కేవలం 14 నెలలు మాత్రమే పట్టిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభించినప్పటి నుంచి మే 2026 అత్యంత బలమైన నెలగా నిలిచిందన్నారు. ఆ నెలలో రికార్డు స్థాయిలో 3.16 లక్షల రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారనీ, కేవలం ఒక్క రోజులోనే 15,000 గృహాలకు వీటిని జోడించారని కేంద్ర మంత్రి తెలిపారు.
లక్ష కుటుంబాలకు ఈ పథకాన్ని చేర్చడానికి 118 రోజుల సమయం పడుతుండగా... అది ప్రస్తుతం ఎనిమిది రోజుల కన్నా తక్కువ సమయానికి స్వయంచాలకంగా పెరిగిందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. 2026 మే నెలలోనే రూ. 2,743 కోట్లు సహా... మొత్తం రూ. 22,750 కోట్లకు పైగా సబ్సిడీలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. "పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత పరిశుద్ధ ఇంధన పరివర్తనను, ఇంధన రంగంలో స్వయం-సమృద్ధిని ముందుకు తీసుకెళ్తూ... ప్రపంచంలోనే అతిపెద్ద గృహసంబంధిత సౌర విద్యుత్ మార్కెట్లలో ఒకదాన్ని సృష్టిస్తోంది" అని శ్రీ జోషి పేర్కొన్నారు.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచం ఇంధన అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో... పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి కార్యక్రమాలు భారత ఇంధన భద్రతను, వ్యూహాత్మక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని శ్రీ జోషి అన్నారు. ఈ పథకానికి ముందు నెలకు సుమారు 7000గా ఉన్న రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లు... ప్రస్తుతం నెలకు మూడు లక్షలకు పైగా పెరిగాయని ఆయన తెలిపారు. 17 లక్షలకు పైగా కుటుంబాలు సున్నా విద్యుత్ బిల్లులను సాధించాయని, ఇది కుటుంబాలకు కలిగిన ప్రత్యక్ష పొదుపును స్పష్టంగా చూపిస్తోందని కేంద్ర మంత్రి శ్రీ జోషి తెలిపారు.
2047 నాటికి ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు ఉంటాయని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. "పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రజా ఉద్యమంగా మారుతోంది" అని ఆయన అన్నారు. భవిష్యత్తులో నిల్వ ఖర్చులు తగ్గుతున్న కొద్దీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లనూ అనుసంధానిస్తామని, మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం ద్వారా వీటి వినియోగాన్ని విస్తరిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగి, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ. 75,021 కోట్ల వ్యయంతో 13 ఫిబ్రవరి 2024న ప్రారంభించిన 'పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజ్లీ యోజన' ప్రపంచంలోనే అతిపెద్ద గృహ రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమంగా అవతరించింది. 2026 మే నెల నాటికి, కోటికి పైగా కుటుంబాలు జాతీయ పోర్టల్‌లో నమోదు చేసుకోగా... 33 లక్షలకు పైగా రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. దీని ద్వారా 12 గిగావాట్లకు పైగా సామర్థ్యాన్ని జోడించారు. ప్రస్తుతం గృహ సౌర విద్యుత్ సామర్థ్యంలో రూఫ్‌టాప్ సోలార్ వాటా దాదాపు 45 శాతంగా ఉంది. 2024-2026 మధ్యకాలంలో దీని విస్తరణ వృద్ధి 85 శాతానికి పెరిగింది. 2026 మార్చి నెల నాటికి మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లను దాటడంతో... 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతికి ఈ పథకం దోహదపడుతోంది. ఇది ఇంధన లభ్యతను పెంచుతూనే, డిస్కమ్‌లపై సబ్సిడీ భారాన్నీ తగ్గిస్తుంది.
పీఎం సూర్య ఘర్ లోగో, వాట్సాప్ బాట్‌నూ శ్రీ జోషి ప్రారంభించారు. 2026 మే నెలలో నిర్వహించిన “సౌర ఇంధన మాసం” ప్రచారంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారితో సహా... అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, డిస్కమ్‌లు, బ్యాంకులు, విక్రేతలు, ఇతర భాగస్వాములకు పీఎం సూర్య ఘర్ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.
సీఈఈడబ్ల్యూ (కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్) రెండు నివేదికలను కేంద్ర మంత్రి విడుదల చేశారు. అవి (i) “భారతీయ గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ నిర్ణయాలను నడిపించేది ఏమిటి? పాన్-ఇండియా సర్వే ద్వారా గృహాల నిర్ణయాలను అర్థం చేసుకోవడం”. (ii) “పటిష్ఠ ఓ అండ్ ఎమ్ వ్యవస్థను ప్రారంభించడం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ పనితీరును మెరుగుపరచడం – భారత్‌లో నివాసాల ఆర్‌టీఎస్ విభాగంలో మల్టీ-బిలియన్ మార్కెట్‌కు అవకాశం”. ఈ నివేదికలు మెరుగైన నిర్వహణ ఆవశ్యకతను, విస్తరణ పెరిగేకొద్దీ ఏటా 3.3 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే దాని సామర్థ్యాన్ని స్పష్టం చేశాయి.
భారత్‌లో రూఫ్‌టాప్ సోలార్ భవిత గమనంపై దృష్టి సారించిన రెండు ఉన్నత స్థాయి ప్లీనరీ సమావేశాలను ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. "40 లక్షల నుంచి 1 కోటికి - పీఎం సూర్య ఘర్ ప్రయాణం" పేరుతో జరిగిన మొదటి ప్లీనరీ సమావేశంలో... కోటి గృహాలకు దీని వినియోగాన్ని విస్తరించడానికి అవసరమైన విధానం, ఆర్థిక సహాయం, అమలు ప్రాధాన్యాలపై చర్చించడానికి నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, ఆర్థిక మంత్రిత్వ శాఖల సీనియర్ ప్రతినిధులతో పాటు ప్రముఖ ఆర్థిక సంస్థలూ పాల్గొన్నాయి. "సబ్‌నేషనల్ సరిహద్దులు - రాష్ట్రాల నేతృత్వంలోని సౌరశక్తి విప్లవానికి ఊతమివ్వడం" పేరుతో నిర్వహించిన రెండో ప్లీనరీ సమావేశంలో... రాష్ట్రాల మధ్య నేర్చుకున్న పాఠాలు, వినూత్న ప్రోత్సాహక నమూనాలు, రూఫ్‌టాప్ సోలార్ విస్తరణను డిస్కమ్‌ల సుస్థిరత, రాష్ట్ర స్థాయి ఇంధన ప్రాధాన్యాలతో సమతుల్యం చేసే వ్యూహాలపై చర్చించడానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఇంధన రంగ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.
***
(रिलीज़ आईडी: 2269156)
आगंतुक पटल : 19