పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
గ్రామాల్లో మార్పును ప్రోత్సహించినందుకు 42 పంచాయతీలకు సత్కారం
న్యూఢిల్లీలో ‘జాతీయ పంచాయతీ పురస్కారాలు-25’ కార్యక్రమ నిర్వహణ
వికసిత్ భారత్ సాధనలో ‘గ్రామోదయ్ సే భారత్ ఉదయ్’: కీలకం శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
42 జాతీయ పురస్కార విజేత పంచాయతీలలో 22 పంచాయతీలకు మహిళలే సారథులు.. అత్యుత్తమ పద్థతుల సంగ్రహ గ్రంథం ఆవిష్కరణ
प्रविष्टि तिथि:
03 JUN 2026 9:09PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 42 శ్రేష్ఠ పంచాయతీలకు ‘జాతీయ పంచాయతీ పురస్కారాలు-25’ను కేంద్ర పంచాయతీ రాజ్, మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఈ రోజు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘెల్, అస్సామ్ ప్రభుత్వ పరివర్తన, అభివృద్ధి, కార్మిక సంక్షేమ, టీ ట్రైబ్స్, ఆదివాసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రమేశ్వర్ తేలీ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భారద్వాజ్, కేంద్ర, రాష్ట్రాల సీనియర్ అధికారులతో పాటు వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పురస్కారాలు దేశమంతటా 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతకు అనుగుణంగా సమ్మిళిత, భాగస్వామ్య ప్రధాన, సుస్థిర గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా మార్గదర్శక తోడ్పాటును అందించిన పంచాయతీలకు గుర్తింపును ఇస్తాయి. ‘జాతీయ పంచాయతీ పురస్కారాలు-2025’తో సత్కరించిన పంచాయతీలు పూర్తి చేసిన పనులు, అనుసరించిన అత్యుత్తమ విధివిధానాలను వివరించిన ఒక ఈ-పుస్తకాన్నీ, పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలుచేసిన అత్యుత్తమ పద్ధతుల సంకలన గ్రంథాన్నీ కూడా ఇదే కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాలు సమాన స్థాయిలో నేర్చుకోవడంతో పాటు, క్షేత్ర స్థాయిలో విజయవంతమైన పరిపాలన నమూనాను అనుసరించడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.



పురస్కారాలు గెలుచుకున్న పంచాయతీలను.. అంకిత భావంతో, నవకల్పనకీ, ప్రజల ప్రయోజనాలకీ ప్రాధాన్యాన్ని ఇస్తూ పరిపాలనను సాగిస్తున్నాయంటూ కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అభినందించారు. పురస్కారాలను అందుకున్న పంచాయతీల ప్రతినిధుల్నీ, దృశ్య మాధ్యమం ద్వారా దేశం నలుమూలల నుంచీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్య బలం పెరుగుతోందనీ, వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో పంచాయతీలు కీలక పాత్రను పోషిస్తున్నాయనీ ఈ పురస్కారాలు చాటిచెబుతున్నాయని శ్రీ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణాన్ని మంత్రి పంచుకుంటూ, సాధికారతను సంతరించుకున్న పల్లెలు సారథ్యం వహిస్తుండగా, ‘గ్రామోదయ్ సే భారత్ ఉదయ్’ సిద్ధాంతం మార్గదర్శనం చేస్తుండగా.. వికసిత్ భారత్ ప్రయాణం ముందుకు సాగాలన్నారు. అవార్డులను అందుకున్న 42 పంచాయతీలలో 22 పంచాయతీలకు మహిళలు సారథులుగా ఉన్నందుకు కేంద్ర మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది మహిళల నాయకత్వం ప్రసరింపచేస్తున్న పరివర్తనప్రధాన ప్రభావానికీ, గ్రామీణ భారతంలో సమ్మిళిత పాలనకీ నిదర్శనంగా నిలుస్తోందంటూ ఆయన కొనియాడారు. పంచాయత్ పురోగమన సూచీ (పీఏఐ) 2.0, ‘ఈ-గ్రామ్ స్వరాజ్’, కృత్రిమ మేధ ఆధారిత సభాసార్ ప్లాట్‌ఫారమ్ తదితర మంత్రిత్వశాఖ కార్యక్రమాల్ని శ్రీ సింగ్ ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలు పంచాయతీలకు సాంకేతికత, వనరులు, సామర్థ్యాల పెంపుదల విషయంలో సహాయం అందజేస్తూ వాటిని పటిష్ఠపరుస్తున్నాయని వివరించారు. పారదర్శకత్వం, జవాబుదారుతనం, పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిచ్చే పరిపాలన.. వీటిని నిర్ధారించడానికే ఇలా చేస్తున్నామన్నారు. అత్యుత్తమ పద్ధతులను పంచుకొంటూ, నవకల్పనను ప్రోత్సహిస్తూ, మహిళల నాయకత్వ సామర్థ్యాన్ని బలపరుస్తూ, సేవలను సమాజంలో ప్రతి ఒక్కరి చెంతకూ చేరుస్తూ ఆదర్శ నమూనాల్లా పనిచేయాల్సిందిగా అవార్డులను పొందిన పంచాయతీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పంచాయతీలకు సాధికారతను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ సింగ్ పునరుద్ఘాటిస్తూ, 16వ ఫైనాన్స్ కమిషన్‌లో భాగంగా కేటాయించే రూ.4.35 లక్షల కోట్లు (15వ ఫైనాన్స్ కమిషన్‌తో పోలిస్తే కేటాయింపుల్లో 84 శాతం వృద్ధి) క్షేత్ర స్థాయిలో పాలనను మరింత ఎక్కువ శక్తిమంతంగా మార్చడమే కాకుండా ‘వికసిత్ భారత్’ దార్శనికతకు కూడా సాయపడగలవన్నారు.
కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘెల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 2.5 లక్షల కన్నా ఎక్కువ పంచాయతీలలో నుంచి 42 పురస్కారాలను గెలుచుకున్న పంచాయతీల ఎంపిక చేసిన ప్రక్రియ పారదర్శకత్వానికీ, నిర్దుష్ట మూల్యాంకన ప్రక్రియకీ అద్దం పడుతోందన్నారు. ఈ పురస్కారాలు స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎల్ఎస్‌డీజీ)తో పాటు పంచాయతీ పురోగమన సూచీ (పీఏఐ)పై ఆధారపడ్డాయనీ, ఈ రెండూ మూల్యాంకన ప్రక్రియ వస్తుగతంగానూ, పనితీరును ఆధారం చేసుకొనీ చోటుచేసుకొందని నిర్ధారిస్తాయనీ ఆయన తెలిపారు. అభివృద్ధి ఫలితాలు సమాజంలో అన్ని వర్గాలకూ చేరి, సమగ్ర అభివృద్ధి సాధ్యపడేటట్లు ఆరోగ్యం, పింఛన్లు, సామాజిక భద్రత వంటి రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందే దిశగా చర్యలను తీసుకోవాల్సిందిగా పంచాయతీ ప్రతినిధులను కేంద్ర సహాయ మంత్రి కోరారు.
పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక భరద్వాజ్ తన ప్రసంగంలో, పంచాయతీ రాజ్ సంస్థలు తీసుకువచ్చిన అద్భుత మార్పును వివరించారు. ఈ సంస్థలు డేటాను ఆధారం చేసుకొని, పారదర్శకంగా, క్షేత్ర స్థాయిలో పాలనకు బాధ్యతను వహిస్తున్న సంస్థలుగా ఉన్నాయన్నారు. ఈ ప్రస్థానం భారత ప్రజాస్వామిక గాథలో అత్యంత స్ఫూర్తిదాయక అధ్యాయాల్లో ఒకటని ఆయన వర్ణించారు. ఈ శ్రేష్ఠ నమూనాల నుంచి దేశంలో పంచాయతీలు శక్తినీ, స్ఫూర్తినీ పొందాలని ఆయన కోరారు. అదే జరిగితే భారత్‌లో స్వపరిపాలనను భాగస్వామ్య ప్రధానమైందిగా, పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చేదిగా మరింత పటిష్టపరచవచ్చన్నారు.


జాతీయ పంచాయతీ పురస్కారాల గురించిన వివరాలు
పంచాయతీ రాజ్ శాఖ ‘జాతీయ పంచాయతీ పురస్కారాల’ (ఎన్‌పీఏ)ను ఏటా అందజేస్తోంది. సమ్మిళిత, భాగస్వామ్య ప్రధాన, సుస్థిర గ్రామీణాభివృద్ధికి మార్గదర్శక తోడ్పాటును అందించిన అత్యత్తమ పంచాయతీల్ని గుర్తించి, ప్రోత్సహించడానికి ఈ అవార్డులను ఇస్తున్నారు. ఈ పురస్కారాల రూపురేఖలలో 2023లో విస్తృత మార్పుచేర్పులు చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) స్థానికీకరణకు చెందిన తొమ్మిది అంశాలతో జోడించారు. దీంతో మూల్యాంకనం మరింత సమగ్రంగా, పారదర్శకంగా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొన్నదిగా మారింది. రెండు ప్రధాన కేటగిరీలలో ‘ఎన్‌పీఏ-2025’ను బహూకరించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ (ఎల్ఎస్‌డీజీ)కి సంబంధించిన తొమ్మిది అంశాల్లో విశిష్ట పనితీరును కనబరిచినందుకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 34 గ్రామ పంచాయతీలకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల’ను (డీడీయూపీఎస్వీపీ) ప్రదానం చేశారు. ఆ తొమ్మిది అంశాల్లో.. మనుషులను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చిన ఉపాధి మార్గాలు, ఆరోగ్యం, బాలల ప్రయోజనాలపై శ్రద్ధ తీసుకొనే పాలన, చాలినంత నీటిని సమకూర్చడం, స్వచ్ఛ హరిత ప్రధాన పరిసరాలు, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక న్యాయం, భద్రత, సుపరిపాలన, మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యల్ని తీసుకోవడం భాగంగా ఉన్నాయి. ఈ పంచాయతీలను పంచాయతీ పురోగమన సూచీ (పీఏఐ) 2.0 ఆధారంగా ఎంపిక చేశారు. ‘నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల’ను (ఎన్‌డీఎస్‌పీఎస్‌వీపీ) 8 పంచాయతీలకు ఇచ్చారు. వీటిలో 3 అత్యుత్తమ జిల్లా పంచాయతీలు, 2 అత్యుత్తమ బ్లాకు పంచాయతీలతో పాటు 3 అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటికీ మొత్తం మీద అన్నింటి కన్నా ఉత్తమ పనితీరును కనబరిచిన సంస్థలుగా గుర్తింపును ఇచ్చారు. పురస్కారాలను అందుకున్న పంచాయతీలకు రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్ఏ)లో ఒక భాగమైన పంచాయతీలకు ప్రోత్సాహకాల అందజేత (ఐఓపీ) పథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకం ప్రతి పురస్కార విజేతకూ రూ.50 లక్షల మొదలు రూ.5 కోట్ల వరకూ ఉంది. ఈ డబ్బును రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించాల్సి ఉంటుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు: please click.
***
(रिलीज़ आईडी: 2268914)
आगंतुक पटल : 7