రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్రలో 3వ పర్వత సొరంగ నిర్మాణం పూర్తి


హై స్పీడ్ రైలు విభాగం పనుల పురోగమన వేగానికి ఇదొక నిదర్శనం.

అత్యాధునిక పర్యవేక్షణ.. భద్రత వ్యవస్థలతో హై స్పీడ్ బుల్లెట్ రైలు రాకపోకలకు తగినట్లుగా 417 మీటర్ల పొడవు... 14.4 మీటర్ల వెడల్పుతో (ఎంటీ-07) సొరంగ నిర్మాణం

పాల్ఘడ్‌ జిల్లాలో 5 నెలల్లోనే 3 పర్వత సొరంగాల నిర్మాణంలో సాధించిన ప్రగతి భారత తొలి బుల్లెట్ ప్రాజెక్ట్‌ పనులను మరింత వేగిరపరుస్తోంది

प्रविष्टि तिथि: 02 JUN 2026 3:58PM by PIB Hyderabad

  ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులలో ఓ ప్రధాన ఇంజనీరింగ్ విజయం నమోదైంది. మహారాష్ట్రలోని పాల్ఘఢ్‌ జిల్లా, దహను తాలూకా పరిధిలోగల అంబేసరి గ్రామం మీదుగా సాగే ఈ మార్గంలో 3వ పర్వత సొరంగ (ఎంటీ-07) నిర్మాణం పూర్తయింది.

భారత తొలి హై స్పీడ్ రైలు కారిడార్‌లో సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడిన విభాగాలలో ఒకటైన ఈ ప్రాజెక్టు పనుల పురోగమన వేగాన్ని తాజా విజయం ప్రతిబింబించింది. తద్వారా 5 నెలల వ్యవధిలోనే మహారాష్ట్ర పరిధిలో 3 సొరంగాల తవ్వకం పూర్తి కావడం విశేషం.

ప్రస్తుతం పూర్తిచేసిన ఎంటీ-07 పర్వత సొరంగం పొడవు 417 మీటర్లు కాగా, వెడల్పు 14.4 మీటర్లు. బుల్లెట్ రైలు కారిడార్‌లోని అప్-డౌన్ ట్రాక్‌లకు అనువుగా దీనికి రూపమిచ్చారు. అత్యాధునిక ఇంజనీరింగ్, భద్రత విధానాల తోడ్పాటుతో నియంత్రిత తవ్వకం-పేలుడు (డ్రిల్లింగ్-బ్లాస్టింగ్) విధానంలో సొరంగాన్ని రెండు వైపుల నుంచి తవ్వుతూ వచ్చారు.

ఈ ప్రక్రియలో ఆసాంతం నిర్మాణ స్థిరత్వం, కార్మిక భద్రత, నిర్దిష్ట పనితీరు దిశగా అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థలు, జియోటెక్నికల్ పరికరాలను వినియోగించారు. “సర్ఫేస్ సెటిల్‌మెంట్ పాయింట్స్, త్రీడీ టార్గెట్లు, స్ట్రెయిన్ గేజ్‌లు, సీస్మోగ్రాఫ్‌” వంటి వాటితో ప్రత్యక్ష పర్యవేక్షణతో కూడిన ప్రకంపనల పద్ధతి, సొరంగం తీరు, పరిసర నిర్మాణాలను నిరంతరం పరిశీలిస్తూ వచ్చారు. తవ్వకం పనుల సమయంలో వెంటిలేషన్ వ్యవస్థలు, అగ్నిమాపక భద్రత ఏర్పాట్లు, నియంత్రిత ప్రవేశం, నిరంతర జియోటెక్నికల్ పర్యవేక్షణ సహా కార్మికుల సమగ్ర భద్రతకు తగిన చర్యలు తీసుకున్నారు.

మహారాష్ట్రలో మునుపటి సొరంగాల తవ్వకం విజయాలు

ఈ మార్గంలోని మహారాష్ట్ర విభాగంలో తాజా ఘనత మునుపటి విజయాలకు కొనసాగింపుగా నిలిచింది. ఈ నేపథ్యంలో 1.5 కిలోమీటర్ల పొడవైన మొదటి సొరంగం (ఎంటీ-05) నిర్మాణం పాల్ఘఢ్‌ జిల్లాలోని సఫాలే సమీపాన ఈ ఏడాది జనవరి 2నాటికి పూర్తయింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ సంబంధిత తొలి విజయవంతమైన సొరంగ నిర్మాణంగా ఇది పరిగణనలోకి వచ్చింది. ఆ తర్వాత ‘న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్’ (ఎన్‌ఏటీఎం) ద్వారా 454 మీటర్ల పొడవైన రెండో సొరంగం (ఎంటీ-06) తవ్వకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 3న పూర్తిచేశారు. అంటే- కేవలం నెల వ్యవధిలోనే పాల్ఘఢ్‌ జిల్లాలో రెండు విజయాలను సాధించారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం 7 సొరంగాలను తవ్వుతుండగా, వీటిలో ‘ఎంటీ-05, 06, 07’  ఇప్పుడు పూర్తయ్యాయి. అయితే, 2023 అక్టోబరు 5 నాటికి ఎంటీ-08 (350 మీటర్లు) పూర్తికాగా, ‘ఎంటీ-03’ పనులు 80 శాతం దాకా అధిగమించాయి. ఇక ‘ఎంటీ-04’ దాదాపు 60 శాతం పూర్తికాగా, ‘ఎంటీ-01, 02’ సొరంగాల పనులు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. మొత్తంమీద ముంబయి–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు మార్గంలో 8 పర్వత సొరంగాలకుగాను మహారాష్ట్రలోని పాల్ఘఢ్‌ జిల్లా పరిధిలో 7, గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లాలో ఒకటి ఉన్నాయి.

మరోవైపు వాపి, బోయిసర్ బుల్లెట్ రైలు స్టేషన్ల మధ్యగల 3 సొరంగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం మహారాష్ట్రలోని బోయిసర్, గుజరాత్‌లోని వాపి మధ్యగల కీలక పారిశ్రామిక ప్రాంతం మీదుగా వెళ్తుంది. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ పనులన్నీ వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు నగరాల మధ్యనే 3 సొరంగాలు (ఎంటీ-06, 07, 08) ఉన్నాయి.

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనుల రూపంలో అధునాతన సొరంగాల తవ్వకం, పర్యవేక్షణ-నిర్మాణ సాంకేతికతలను రైల్వేశాఖ ప్రోత్సహిస్తోంది. తద్వారా హై స్పీడ్ రైళ్ల మౌలిక సదుపాయాల రీత్యా భారత్‌ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ సురక్షిత, ఆధునిక, భవిష్యత్‌ సంసిద్ధ రైలు రవాణాకు పునాదులు వేస్తోంది.

***


(रिलीज़ आईडी: 2268255) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Odia , Tamil , Kannada