సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోటి మందికి పైగా వినియోగదారులతో భారత ప్రభుత్వ డిజిటల్ మీడియా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న ‘వేవ్స్ ఓటీటీ’


మొత్తం 24 వేల టైటిల్స్... 140 లైవ్ చానెళ్ల ఉచిత సౌలభ్యంతో దేశంలో అత్యంత వైవిధ్యభరిత ప్రభుత్వ స్ట్రీమింగ్ గమ్యంగా మారిన వేవ్స్ ఓటీటీ

प्रविष्टि तिथि: 02 JUN 2026 6:52PM by PIB Hyderabad

   ప్రసార భారతి పరిధిలోని డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక ‘వేవ్స్ ఓటీటీ’ కోటి మందికి పైగా  నమోదిత వినియోగదారులతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ వేదిక 2024 నవంబరులో ప్రారంభం కాగా, కేవలం రెండేళ్లలోపే ఈ ఘనతను సాధించడం విశేషం.

భారత సార్వజనీన డిజిటల్ మీడియా వ్యవస్థ వృద్ధిలో ఈ విజయం ఓ కీలక మలుపును సూచిస్తోంది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు విశ్వసనీయ, సమ్మిళిత, వైవిధ్యభరిత కంటెంట్‌ను అందించే స్వదేశీ డిజిటల్ వేదికలకు పెరుగుతున్న ఆదరణను కూడా ప్రతిబింబిస్తుంది.

‘వేవ్స్ ఓటీటీ’పై నేడు వినోదం, వార్తలు, విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రభుత్వ సేవలు వంటి వివిధ విభాగాల్లో 24,000కు పైగా కంటెంట్ టైటిల్స్ సహా 15,000 గంటలకు పైగా కంటెంట్‌ను అందిస్తోంది. ఈ వేదికపై 140కి పైగా ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానెళ్లు, 200కు పైగా రేడియో సేవలు, లైవ్ ఈవెంట్ స్ట్రీమింగ్, పీఎం ఈవిద్యా చానెళ్ల ద్వారా విద్యా సంబంధిత కంటెంట్, యోజన, కురుక్షేత్ర, రోజ్‌గార్ సమాచార్ డిజిటల్ ఎడిషన్లు, ప్రముఖ ఆలయాల నుంచి భక్తి ప్రసారాలు సహా ప్రసార భారతి నుంచి వేలాది గంటల భాండాగార కంటెంట్‌ను కూడా ప్రేక్షకులకు అందిస్తోంది.

మొబైల్, వెబ్ సహా సంధానిత టీవీల ద్వారా అందుబాటులోగల ‘వేవ్స్ ఓటీటీ’ ప్రస్తుతం 130కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు చేరువైంది. అనేక భారతీయ భాషలలో కంటెంట్‌ను అందిస్తూ, విస్తృత శ్రేణి ప్రజాహిత, వినోద కార్యక్రమాలను ఉచితంగా అందిస్తోంది.

‘వేవ్స్‌ ఓటీటీ’ వేదిక కోటిమంది వినియోగదారుల స్థాయిని అధిగమించడంపై ప్రసార భారతి స్పందిస్తూ- “డిజిటల్ యుగంలో డిజిటల్ ప్రభుత్వ సేవా మాధ్యమాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుంది. అలాగే టెలివిజన్, రేడియో, ఆన్-డిమాండ్ కంటెంట్, విద్య, సంస్కృతి, వారసత్వాల దిశగా ఒకే గమ్యాన్ని సృష్టించే దార్శనికత సాకారానికి ఇది భరోసా ఇస్తుంది” అని పేర్కొంది.

కంటెంట్ ప్రసారాల నిరంతర విస్తరణ, వ్యూహాత్మక డిజిటల్ భాగస్వామ్యాలు, విస్తృత ఉపకరణాల ద్వారా లభ్యత, మెరుగైన వినియోగదారు అనుభవం తదితరాలతో ఈ వేదిక నిలకడగా వృద్ధి పథంలో సాగుతోంది. భక్తి కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం, విద్యా సంబంధ కంటెంట్, డిజిటల్ ప్రచురణలు, ఆర్కైవల్ సేకరణలు, ప్రత్యక్ష ఈవెంట్ కవరేజ్ వంటి ఇటీవలి అదనపు హంగులు ‘వేవ్స్‌ ఓటీటీ’ ప్రేక్షక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి.

ఈ మేరకు కోటి మందికి పైగా నమోదిత వినియోగదారులు, 1.4 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ‘వేవ్స్ ఓటీటీ’ ఇప్పుడు తదుపరి దశ వృద్ధిపై దృష్టి సారించింది. కంటెంట్ భాగస్వామ్యాల విస్తరణ, వివిధ ఉపకరణాలు-వేదికల ద్వారా విస్తృత పంపిణీ, ప్రాంతీయ, విద్యా సంబంధిత కంటెంట్‌ బలోపేతం సహా 2027 మార్చి నాటికి నమోదిత వినియోగదారుల సంఖ్యను 2 కోట్లకు చేర్చడం వంటి లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ప్రభుత్వ సేవా స్ట్రీమింగ్ వేదికగా భారతీయ సంస్కృతి, జ్ఞానం, వారసత్వం, సృజనాత్మకతల డిజిటల్ ప్రదర్శన వేదికగా ‘వేవ్స్ ఓటీటీ’ స్థానాన్ని ప్రస్తుత విజయం మరింత బలోపేతం చేస్తుంది.

***


(रिलीज़ आईडी: 2268251) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Khasi , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam