ఉప రాష్ట్రపతి సచివాలయం
బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా అంతర్జాతీయ వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి
180 దేశాల్లో శాంతి, మానవీయ విలువలను వ్యాప్తి చేస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
“ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్న భారత ఆధ్యాత్మిక వారసత్వం, ఆధునిక నాయకత్వం”: ఉపరాష్ట్రపతి
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వలంటీర్లను ‘నిశ్శబ్ధ సేవా ప్రదాతలు’గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి
నేటి ప్రపంచంలో ‘వసుధైక కుటుంబం’ ఔచిత్యాన్ని వివరించిన ఉపరాష్ట్రపతి
“మానవీయతకు అంకితమవడమే నిజమైన భక్తి”: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 2:30PM by PIB Hyderabad
బెంగళూరులో ఈ రోజు నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల అంతర్జాతీయ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం, సేవాభావం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వ్యాప్తిచేయడంలో సంస్థ కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతూ.. ఖండాలను దాటుకుని, ఎన్నో సంస్కృతులు, వివిధ తరాలకు చెందిన లక్షలాది ప్రజల జీవితాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉద్యమం స్పృశించిందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. సంస్థ అంతర్జాతీయ విస్తృతిని వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాలున్నాయని గుర్తు చేశారు.
‘అంతర్గత శాంతే బాహ్య సామరస్యానికి పునాది’ అన్న సూత్రంపై నాలుగున్నర దశాబ్దాల కిందట మొదలైన ఈ ఉద్యమం.. కరుణ, స్థైర్యం, ఆనందాలను ప్రోత్సహించే ఒక ప్రధాన మానవతా, ఆధ్యాత్మిక శక్తిగా మారిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
భక్తికి గల ఉన్నతమైన అర్థాన్ని వివరిస్తూ.. భక్తి అంటే కేవలం దైవారాధన మాత్రమే కాదనీ, తన పట్ల, కుటుంబం, సమాజం, దేశం, మొత్తం మానవాళి పట్ల చూపే సంపూర్ణ అంకితభావమే భక్తి అనీ ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇతరులతో కలిసి శాంతియుతంగా జీవించడాన్ని ఆధ్యాత్మికత నేర్పుతుందనీ, అలాగే జీవితాన్ని అర్థవంతంగానూ, సంపూర్ణంగానూ మారుస్తుందని వివరించారు.
ఘర్షణ, అనిశ్చితితో నిండిన ఈ ప్రపంచంలో.. వివేకం, చైతన్యం, శాంతి, సామరస్యం వంటి విలువలతో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ మానవాళికి స్ఫూర్తినిస్తున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. గురుదేవ్ శ్రీ రవిశంకర్ నిరాడంబరత, నమ్రత, కారుణ్యభావం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను ప్రభావితులను చేశాయన్నారు.
ధ్యానం, సేవా కార్యక్రమాలు, విద్య, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సర్వమత సమ్మేళనాల ద్వారా.. సామాజిక మార్పులో ఆధ్యాత్మికత ఎంతటి కీలక పాత్ర పోషించగలదో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిరూపించిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ధ్యానం, ఏకాగ్రతల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ఏకాగ్ర చిత్తంతో అసాధారణ విజయాలను సాధించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
మన ప్రాచీన సంస్కృతిని, ఆధునికతను మేళవించి యువత వాటిని ముందుకు తీసుకెళ్లగలిగే స్ఫూర్తిదాయక నమూనాను గురుదేవ్ శ్రీ రవిశంకర్ సమాజం ఎదుట నిలిపారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆధునికత, ప్రాచీన వారసత్వం ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయన్న ఆయన.. ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం నానాటికీ పెరుగుతుండడంపై అభినందనలు తెలిపారు.
రాక్ సత్సంగ్, భజన్ క్లబ్బింగ్ వంటి సరికొత్త కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. భారత ప్రాచీన విజ్ఞాన సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకునేలా ఆధునిక రూపంలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు పునరుజ్జీవింపజేస్తున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు.
మాదకద్రవ్య రహిత భారత్ కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చేపట్టిన ప్రచారాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. యువత హానికరమైన వ్యసనాలకు బదులు ఆత్మనియంత్రణ, సానుకూల విలువలతో ముందుకు సాగాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ భారత్ ప్రతిష్ఠ పెరుగుతోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. నేడు దేశం.. చరిత్రలోనే ఒక గొప్ప సమయంలో ఉందన్నారు. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం, ఉన్నతమైన ఆశయాలతో అంతర్జాతీయ అగ్రగామిగా ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. మన ప్రాచీన నాగరికతా విజ్ఞానం, యోగా, ఆరోగ్యం, సుస్థిరత, వసుధైక కుటుంబ భావనలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యం.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రచారం చేస్తున్న విలువలకు పూర్తిగా అనుగుణంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ ఉద్యమంలో భాగస్వాములైన స్వచ్ఛంద సేవకులను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచంలోని నలుమూలలకూ ఈ మిషన్‌ను చేరవేసిన వారిని ‘నిశబ్ధ సేవా ప్రదాతలు’గా అభివర్ణించారు. ఒక వ్యక్తిలో వచ్చే సానుకూల మార్పయినా సరే.. కుటుంబం మొత్తాన్నీ సాధికారికం చేస్తుందనీ, తద్వారా సమాజం మొత్తం శక్తిమంతంగా మారుతుందనీ ఆయన వ్యాఖ్యానించారు.
ఉపరాష్ట్రపతి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంగణంలోని గణపతి ఆలయంలో ప్రార్థనలు కూడా చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించారు.
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సభ్యులు, భారత్, విదేశాల ప్రముఖులు, వేలాది మంది భక్తులు, స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2266838)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13