వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లీగల్ మెట్రాలజీ సంస్కరణలపై దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్ష నిర్వహించిన వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ


లీగల్ మెట్రాలజీలో 'జన్ విశ్వాస్' సంస్కరణల వేగవంతమైన అమలుకు కేంద్రం కృషి

రిజిస్ట్రేషన్-ఆధారిత విధాన ప్రణాళిక, జీఏటీసీల విస్తరణ, ఇ-మాప్ అనుసంధానంపై సమీక్ష

సులభ అనుమతులు, వినియోగదారుల భద్రత విధానాలపై దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 3:41PM by PIB Hyderabad

జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం-2026 ద్వారా లీగల్ మెట్రాలజీ చట్టం-2009 కింద ప్రవేశపెట్టిన సంస్కరణల అమలుతో పాటు... నియంత్రణ సంస్కరణలపై మంత్రివర్గ సచివాలయ ఉన్నత స్థాయి కమిటీ, డీరెగ్యులేషన్ సెల్ చేసిన సిఫార్సులపై భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. 

ఈ సమావేశం ప్రధానంగా కింది విషయాలపై దృష్టి సారించింది –

కొత్త రిజిస్ట్రేషన్ ఆధారిత విధాన ప్రణాళిక అమలు,

చిన్నపాటి విధానపరమైన ఉల్లంఘనలను నేరరహితం చేయడం, ‘మెరుగుదల నోటీసులు’ ప్రవేశపెట్టడం

ప్రభుత్వ ఆమోదిత పరీక్ష కేంద్రాల (జీఏటీసీల) విస్తరణ, లీగల్ మెట్రాలజీ సేవల డిజిటలీకరణ.

సామర్థ్యాలను పెంపొందించడం

లైసెన్సింగ్ నుంచి రిజిస్ట్రేషన్‌కు మార్పు 

“లైసెన్సింగ్” నుంచి “రిజిస్ట్రేషన్” కు మార్పు... నిజమైన, విశ్వాస ఆధారితమైన, సులభతరమైన నియంత్రణ వ్యవస్థను ప్రతిబింబించేలా చూడాలని చర్చ సందర్భంగా రాష్ట్రాలను కోరారు. అనవసర జాప్యం, ముందస్తు తనిఖీలు లేకుండా నిర్దేశిత పత్రాలను సమర్పించిన వెంటనే రిజిస్ట్రేషన్లను స్వయంచాలకంగా మంజూరు చేయాలని స్పష్టం చేశారు. 

నేరరహితం చేయడం, "మెరుగుదల నోటీసు" విధానం 

జన్ విశ్వాస్ సంస్కరణల కింద కొత్తగా ప్రవేశపెట్టిన “మెరుగుదల నోటీసు” విధానం అమలును మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఈ నిబంధన ప్రకారం, లీగల్ మెట్రాలజీ చట్టంలోని నిర్దిష్ట సెక్షన్ల కింద మొదటిసారి జరిగే సాధారణ విధానపరమైన ఉల్లంఘనల కోసం ఏదైనా శిక్ష విధించే చర్యలకు ముందు ‘మెరుగుదల నోటీసు’ జారీ చేస్తారు. ఈ సంస్కరణ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూనే... స్వచ్ఛంద అనుమతులను ప్రోత్సహించడం, వ్యాజ్యాలను తగ్గించడం, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

ప్రభుత్వ ఆమోదిత పరీక్ష కేంద్రాల (జీఏటీఎస్‌ల) విస్తరణ

సవరించిన లీగల్ మెట్రాలజీ విధాన ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్రాలు వారి అమలు నిబంధనలు, జీఏటీసీ నిబంధనల్లో సవరణలను వేగవంతం చేయాలని కోరారు. సవరించిన నిబంధనలు ముసాయిదా, ఆమోదాల అధునాతన దశల్లో ఉన్నాయనీ, త్వరలోనే వాటిని నోటిఫై చేసే అవకాశం ఉందని ఆయా రాష్ట్రాలు తెలియజేశాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ జీఏటీసీ నిబంధనలను వీలైనంత త్వరగా నోటిఫై చేయాలని... జీఏటీసీ యంత్రాంగం పరిధిలోకి వచ్చే సాధనాల పరిధిని విస్తరించాలని మంత్రిత్వ శాఖ కోరింది. దీని ద్వారా ధ్రువీకరణ మౌలిక సదుపాయాలు బలోపేతమవుతాయని... ధ్రువీకరించువారు మరింతగా అందుబాటులో ఉంటారని... పరిశ్రమలు, వర్తకులు, వినియోగదారులకు వేగంగా సేవలు అందించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

రద్దయిన తూనికలు, కొలతల ప్రమాణాల చట్టం-1976 వలె కాకుండా... లీగల్ మెట్రాలజీ చట్టం-2009 అంతర్-రాష్ట్ర తూనికలు, కొలతల ధ్రువీకరణకు వీలు కల్పించదని సమావేశంలో స్పష్టం చేశారు. దీని ప్రకారం, భారత ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ డైరెక్టర్ ఆమోదం పొందిన ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాలు (జీఏటీసీలు)... అవి మంజూరైన రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే ధ్రువీకరణ, పునఃధ్రువీకరణను చేపట్టగలవు. ఈ విధాన ప్రణాళిక ఏకరీతి అమలును నిర్ధారించడానికి, జీఏటీసీల అధికార పరిధికి సంబంధించి కార్యాచరణపరమైన అస్పష్టతను నివారించడానికి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

 సామర్థ్యాలను పెంపొందించడం 

సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, సంస్కరణలను సమర్థంగా అమలు చేయడంలో మద్దతునివ్వడానికి, రాంచీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ (ఐఐఎల్ఎమ్) ద్వారా లీగల్ మెట్రాలజీ అధికారుల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ తెలియజేసింది. 

సమావేశంలో చర్చించిన కీలక అంశాలు - ఇ-మాప్ పోర్టల్ ద్వారా సేవలను వేగంగా, సజావుగా అందించడం. తృతీయ పక్ష ధ్రువీకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడం. ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాల (జీఏటీసీల) ద్వారా ధ్రువీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం. జీఏటీసీ విధాన ప్రణాళిక కింద కొత్తగా జోడించిన తూనికలు, కొలతల పరికరాల వర్గాలను చేర్చడం. లీగల్ మెట్రాలజీ అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం, వారికి సాంకేతిక శిక్షణ అందించడం. 

నిజాయితీగా నిర్వహించే వ్యాపారాలు, వర్తకులకు మద్దతుగా విధానపరమైన నిబంధనలను సరళీకరిస్తున్నప్పటికీ... మోసాలకు పాల్పడటం, తూనికలను తారుమారు చేయడం, వినియోగదారుల ప్రయోజనాలను ప్రభావితం చేయడం వంటి ఉల్లంఘనలపై లీగల్ మెట్రాలజీ విధాన ప్రణాళిక ద్వారా కఠిన చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. వ్యాపార సౌలభ్యం, వినియోగదారుల భద్రత రెండింటినీ ప్రోత్సహించే పారదర్శకమైన, ఆధునికమైన, సమతుల్యమైన నియంత్రణ వ్యవస్థను సృష్టించడమే ఈ సంస్కరణల లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

***


(రిలీజ్ ఐడి: 2266324) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam