ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఇన్వెస్టర్స్ సపోర్ట్’ పోర్టల్‌ను ప్రారంభించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)... వ్యవస్థాగత భాగస్వాములు, పెట్టుబడిదారులకు దన్నుగా నిలవడమే లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 11:47AM by PIB Hyderabad

వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలు, విధానపరమైన చర్యల ద్వారా పటిష్టమైన, విశ్వసనీయమైన, సుస్థిర సెమీకండక్టర్ వ్యవస్థను దేశంలో అభివృద్ధి చేసే దిశగా భారత ప్రభుత్వం సమన్వయంతో కృషి చేస్తోంది. సెమికాన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 12 ఫ్యాబ్/ప్యాకేజింగ్ ప్రాజెక్ట్ లతోపాటు 24 సెమీకండక్టర్ల డిజైన్ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.

పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు వారి ఆందోళనలను పరిష్కరించడం లక్ష్యంగా ‘ఇన్వెస్టర్స్ సపోర్ట్’ పేరుతో 2026 మే 26న ఒక ఆన్లైన్ పోర్టల్‌ను ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించింది. ఇది https://www.ism.gov.in/investmentలో అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వారికి ప్రభుత్వ పథకాలు, విధానాలు, సెమికాన్ ఇండియా కార్యక్రమం కింద ఆమోదం పొందిన ప్రాజెక్టులు, నియంత్రణ పరమైన ఆవశ్యకాలు తదితర సమాచారాన్ని అందించడం లక్ష్యంగా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశారు.

ఈ పోర్టల్ ద్వారా పెట్టుబడిదారులు తమ ఫిర్యాదులు/ ఆందోళనలను నమోదు చేసుకోవచ్చు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆమోదం పొందిన ప్రాజెక్టు కంపెనీలు, అంతర్జాతీయ, జాతీయ వాణిజ్య సంస్థలు/ సంఘాల నోడల్ అధికారుల సహకారంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ అధికారులు వాటిని పరిష్కరిస్తారు.

ప్రారంభోత్సవ సందర్భంగా ఐఎస్ఎం సీఈవో శ్రీ అమితేశ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. విదేశీ పెట్టుబడిదారులకు చేయూతనివ్వాల్సిన, తగిన సదుపాయాలను కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దేశంలో సెమీకండక్టర్ తయారీ, డిజైన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా.. పెట్టుబడిదారుల ఆందోళనలను పరిష్కరించడంలో సంబంధిత భాగస్వాములంతా క్రియాశీలకంగా పనిచేయాలని ప్రతినిధులను కోరారు.

సంబంధిత భాగస్వాములందరికీ సులభతర సమన్వయం, కాలపరిమితిలో సమస్యల పరిష్కారం దిశగా సురక్షితమైన, తమ పాత్రలకు తగిన, ఏకగవాక్ష డిజిటల్ వేదిక అందుబాటులో ఉంటుంది.

పోర్టల్ వ్యవస్థపై సమీక్ష, వివరణ, విధులు, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ, సమన్వయ యంత్రాంగాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆమోదం పొందిన ప్రాజెక్టు కంపెనీలు, అంతర్జాతీయ, జాతీయ వాణిజ్య సంస్థలు/సంఘాల నోడల్ అధికారుల పాత్ర, బాధ్యతలపై కూడా ఈ ప్రారంభోత్సవంలో చర్చించారు.  

***


(రిలీజ్ ఐడి: 2265448) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Kannada