వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాల (జీఏటీసీ) పరిధిని విస్తరించిన వినియోగదారు వ్యవహారాల విభాగం...
సీఎన్‌జీ, ఎల్ఎన్‌జీలతో పాటు హైడ్రోజన్ డిస్పెన్సర్ల ప్రమాణీకరణకు అవకాశం
రాష్ట్రాలకు అదనపు కేటగిరీలను నోటిఫై చేసే అధికారం... ఇంధన డిస్పెన్సర్లకు కొత్త ప్రమాణీకరణ రుసుము ప్రకటన
ఖచ్చిత, విశ్వసనీయ కొలతలు లక్ష్యంగా ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం
వినియోగదారుల విశ్వాసం, స్వచ్ఛ ఇంధన సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన, దేశవ్యాప్త ప్రమాణీకరణ సామర్థ్యాల బలోపేతం లక్ష్యాలుగా లీగల్ మెట్రాలజీ సంస్కరణలు
నాడు పోస్టు చేయడమైనది:
24 MAY 2026 10:31AM by PIB Hyderabad
దేశంలో లీగల్ మెట్రాలజీ విస్తారిత అనుబంధ వ్యవస్థను ఇప్పటి కన్న బలోపేతం చేయడంతో పాటు, తూనికలు కొలతలకు సంబంధించిన మౌలిక సదుపాయాల ప్రమాణీకరణ వ్యవస్థను కూడా విస్తరించే లక్ష్యంతో ‘లీగల్ మెట్రాలజీ (ప్రభుత్వ ఆమోదిత పరీక్ష కేంద్రం.. జీఏటీసీ) సంబంధిత నియమావళి-2013’ (Legal Metrology (Government Approved Test Centre) Rules, 2013) లో సవరణల్ని వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ లోని వినియోగదారు వ్యవహారాల విభాగం ప్రవేశపెట్టింది.
• జీఏటీసీ పరిధిలోకి అయిదు కొత్త ఇంధన పంపిణీ వ్యవస్థలు
ప్రభుత్వ ఆమోదిత పరీక్ష కేంద్రాల (జీఏటీసీస్) పరిధి విస్తరణే ఈ సవరణలో కీలకాంశం. దీనిలో అదనపు ఇంధన పంపిణీ వ్యవస్థల (డిస్పెన్సర్ల) ప్రమాణీకరణతో పాటు పునఃప్రమాణీకరణను కూడా చేర్చారు. ఈ చర్యతో ప్రమాణీకరణ సేవల లభ్యతను పెంపొందింప చేయడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దేశమంతటా స్వచ్ఛ ఇంధన వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.
సవరించిన నియమాల్లో భాగంగా, జీఏటీసీలు ప్రమాణీకరించే ఉపకరణాల జాబితాలో ఈ కింద ప్రస్తావించిన అయిదు కేటగిరీల పంపిణీ వ్యవస్థలను కూడా చేర్చారు:
• పెట్రోలు, డీజిల్ డిస్పెన్సర్లు
• సీఎన్‌జీ డిస్పెన్సర్లు
• ఎల్‌పీజీ డిస్పెన్సర్లు
• ఎల్ఎన్‌జీ డిస్పెన్సర్లు
• హైడ్రోజన్ డిస్పెన్సర్లు
ఈ ఉపకరణాలను చేర్చడంతో, ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాలు ఇక లీగల్ మెట్రాలజీ ప్రణాళికలో భాగంగా మొత్తం 23 కేటగిరీల్లో తూనికలు, కొలతల ప్రమాణీకరణ తో పాటు పునఃప్రమాణీకరణ కూడా సాధ్యపడుతుంది.
• స్వచ్ఛ ఇంధన సంబంధిత మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం
దేశం నలుమూలలా స్వచ్ఛ ఇంధన వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ, ఎల్ఎన్‌జీ, హైడ్రోజన్ డిస్పెన్సర్లను జీఏటీసీ పరిధిలో చేర్చడం సందర్భోచిత నిర్ణయమని చెప్పాలి. ఇంధనాన్ని ఖచ్చితంగా పంపిణీ చేయడంతో పాటు లావాదేవీల్లో ఇదివరకటి తో పోలిస్తే మరింత ఎక్కువ పారదర్శకత్వాన్ని నిర్ధారించడంలో కూడా ఈ నిర్ణయం తోడ్పడనుంది.
• ప్రమాణీకరణ సామర్థ్యాన్ని విస్తరించడం
ప్రభుత్వ ఆమోదిత పరీక్షాకేంద్రాలు (జీఏటీసీస్) గుర్తింపును పొందిన సంస్థలు. వీటి వద్ద లీగల్ మెట్రాలజీ యాక్టు, నియమావళిల ప్రకారం ప్రమాణీకరణకీ, పునఃప్రమాణీకరణకీ అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు సాంకేతిక నైపుణ్యం కూడా జతపడి ఉంది. అర్హతలు కలిగిన ప్రయివేటు ప్రయోగశాలలతో పాటు పరిశ్రమల సేవలను కూడా పొందుతున్న కారణంగా, జీఏటీసీ వ్యవస్థ దేశంలో ప్రమాణీకరణ సామర్థ్యాన్ని పెంచడంలో, ప్రమాణీకరణ సేవల లభ్యతను మెరుగుపరచడంలో తోడ్పాటును అందించగలుగుతుంది.
• మరింత సరళత్వంతో పాటు ప్రాసెసింగ్ కూడా వేగవంతం
ఈ సవరణలతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ నియమావళిలో భాగంగా, జీఏటీసీల ద్వారా ప్రమాణీకరణను పొందడానికి తూనికలు, కొలతల అదనపు కేటగిరీల్ని నోటిఫై చేసేందుకు తగిన అధికారాలను దక్కించుకొంటాయి. దీంతో స్థానిక అవసరాల ఆధారంగా ప్రమాణీకరణ సేవలను విస్తరించడంలో తోడ్పాటు లభిస్తుంది. పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సంయుక్త కార్యదర్శి, అంతకు పై స్థాయి అధికారులకు నియమాలతో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం అధికారాలను వినియోగించడానికి అనుమతిని ఇస్తున్నారు. ఫలితంగా ఆమోదాలు, సంబంధిత వ్యవహారాలను శరవేగంగా పరిష్కరించడం సాధ్యపడుతుంది.
• ప్రమాణీకరణ రుసుముల ప్రకటన
సవరించిన నియమాల్లో భాగంగా పెట్రోలు, డీజిల్ డిస్పెన్సర్లకు ప్రమాణీకరణ రుసుమును ఒక్కో నోజిలుకు రూ.5,000గా ఖరారు చేశారు. సీఎన్‌జీ, ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీతో పాటు హైడ్రోజన్ డిస్పెన్సర్ల విషయంలో ఈ రుసుమును ప్రతి నోజిలుకు రూ.10,000గా ఖరారు చేశారు.
దేశవ్యాప్తంగా తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో, విశ్వసనీయ ప్రమాణీకరణ సేవల్ని అందించడంలో ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాలు (జీఏటీసీస్) ఇప్పటికే ఒక ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. జీఏటీసీల పరిధిని ఇప్పుడు విస్తరించిన కారణంగా, భారత్‌లో ప్రమాణీకరణ సంబంధిత మౌలిక సదుపాయాలను మరింత బలోపేతమై, సేవల అందజేతతో పాటు జాప్యాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.
ఈ సంస్కరణలు తనిఖీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, వినియోగదారు ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్రాల లీగల్ మెట్రాలజీ విభాగాలు దృష్టిని మరింత ఎక్కువగా కేంద్రీకరించేందుకు వీలును కల్పిస్తాయి. ఈ కార్యక్రమం లీగల్ మెట్రాలజీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ (ఓఐఎమ్ఎల్) చెబుతున్న అత్యుత్తమ ప్రపంచ పద్దతులు, సిఫార్సులకు అనుగుణంగా భారత మెట్రాలజీ వ్యవస్థను పటిష్ఠపరచడంతో పాటు సాంకేతికత ఆధారిత పాలన, వాణిజ్య పద్ధతుల్లో పారదర్శకత్వంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధి సాధన దిశగా దేశం పయనించాలన్న) ప్రభుత్వ దార్శనితను కూడా ప్రోత్సహిస్తుంది.
జీఏటీసీల ద్వారా ప్రమాణీకరించగల బరువులు, కొలతల కేటగిరీలు
ఇప్పుడున్న కేటగిరీలు (18)
1. నీళ్ల మీటరు
2. రక్తపోటును కొలిచే సాధనం
3. జ్వరాన్ని కొలిచే సాధనం
4. ఆటోమేటిక్ రైల్ వేబ్రిడ్జులు
5. కొలిచేందుకు వాడే టేపులు
6. ఖచ్చితత్వ వర్గం III (150 కిలోగ్రాముల వరకూ) రకానికి చెందిన నాన్-ఆటోమేటిక్ తూనిక పరికరాలు
7. ఖచ్చితత్వ వర్గం III రకానికి చెందిన నాన్-ఆటోమేటిక్ తూనిక పరికరాలు
8. లోడ్ సెల్
9. త్రాసు
10. కౌంటర్ మెషిన్
11. తూనిక రాళ్లు (అన్నీ కేటగిరీలవి)
12. గ్యాస్ మీటరు
13. విద్యుత్తు మీటరు
14. తేమ మీటరు
15. వాహన స్పీడ్ మీటరు
16. శ్వాసను విశ్లేషించే పరికరం
17. బహుళ పార్శ్వాలను కలిగివుండే, కొలిచే సాధనం
18. ఫ్లో మీటరు
కొత్తగా జోడించిన కేటగిరీలు (5)
19. పెట్రోలు, డీజిల్ డిస్పెన్సరు
20. సీఎన్‌జీ డిస్పెన్సరు
21. ఎల్‌పీజీ డిస్పెన్సరు
22. ఎల్ఎన్‌జీ డిస్పెన్సరు
23. హైడ్రోజన్ డిస్పెన్సరు
వివరాల కోసం, దయచేసి ఈ కింది లింకును చూడగలరు:
https://consumeraffairs.gov.in/public/upload/files/GATC_Amendment_Rules_2026_1778476324.pdf
****
(రిలీజ్ ఐడి: 2264964)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10