ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 11:00PM by PIB Hyderabad

ఎఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌,

గౌరవనీయులారా,

మహిళలు, పెద్దలకు,

నమస్కారాలు!

సాదరంగా స్వాగతం పలికి, నన్ను అగ్రికోలా పతకంతో సత్కరించిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) డైరెక్టర్‌ జనరల్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. భారతదేశం గురించి ఆయన మాట్లాడిన గౌరవప్రదమైన మాటలు, ఎఫ్‌ఏఓకు అందించిన సేవల పట్ల అభినందనలు తెలియజేస్తున్నా.

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. భారత్‌లోని కోట్లాది మంది రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రామికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది. ఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ "అన్నదాతలకు" అంకితమిస్తున్నా.

మిత్రులారా,

భారత నాగరికతలో వ్యవసాయం అంటే కేవలం పంటలను పండించటం మాత్రమే కాదు. అది మనిషికీ, భూమాతకీ ఉన్న పవిత్రమైన, లోతైన బంధం.

భారత్‌లో వ్యవసాయమే జీవనానికి మూలాధారం. ఇది మన సంస్కృతిలో కీలక భాగం. మన విలువలకు ప్రతిబింబం. మన సంప్రదాయంలో నేలని "భూమాతగా”, రైతుని "భూమి పుత్రుడిగా" అభివర్ణిస్తారు. వేల ఏళ్లుగా మన వారసత్వంలో పాతుకుపోయిన ఈ కాలాతీత విలువలు నేటికీ మన ప్రయత్నాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

మిత్రులారా,

వేల ఏళ్లుగా విజ్ఞానం, భారతదేశ సుసంపన్న వ్యవసాయ సంప్రదాయాల ఆధారంగా నేడు మన దేశం శాస్త్రీయ, సాంకేతిక, ఆవిష్కరణల ఆధారిత విధానంతో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

మేం కేవలం ఉత్పత్తిని పెంచేందుకు మాత్రమే కాక.. స్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే వ్యవసాయ వ్యవస్థను సృష్టించేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం భారతదేశవ్యాప్తంగా శాస్త్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్‌లో అభివృద్ధి చేస్తున్నాం.

భూసార ఆరోగ్య కార్డుల ద్వారా రైతులకు శాస్త్రీయమైన భూ పరీక్షలను, పోషకాల ఆధారిత మార్గదర్శకత్వాన్ని మేం అందిస్తున్నాం.

"ప్రతి నీటి బొట్టుకు అధిక పంట" వంటి ప్రచార కార్యక్రమాలు సూక్ష్మ నీటి పారుదల, ఖచ్చితత్వ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రైతులు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట దిగుబడులను సాధించేలా ఇవి దోహదపడుతున్నాయి.

మిత్రులారా,

భారత వ్యవసాయానికి నూతన శక్తిగా సాంకేతికత అవతరిస్తోంది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలైన అగ్రిస్టాక్‌, ఏఐ ఆధారిత సలహా వ్యవస్థలు, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలు, సెన్సార్ ఆధారిత యంత్రాలు భారతదేశంలో వ్యవసాయాన్ని మరింత స్మార్ట్‌గా, డేటా ఆధారితంగా మారుస్తున్నాయి. నేడు ఒక గ్రామంలోని చిన్న రైతు కూడా మొబైల్ సాంకేతికత ద్వారా వాతావరణ సమాచారాన్ని, పంట సలహాలను, మార్కెట్ వివరాలను సులభంగా పొందుతున్నారు.

వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయం దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. గత పదేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకోగలిగే దాదాపు 3,000 పంట రకాలను దేశంలో అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఈ ఆవిష్కరణల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

"అధిక ఉత్పత్తి" కాదు.. "మెరుగైన ఉత్పత్తి"లోనే వ్యవసాయ భవిష్యత్ ఉందని మేం విశ్వసిస్తున్నాం. ఈ దృక్పథంతో జీవవైవిధ్యాన్ని పెంపొందించటం, రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించటంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. విస్తరణ, స్థిరత్వం రెండూ కలిసి పురోగమించగలవని, సాంకేతికత, సమ్మిళితత్వం పరస్పరం బలాన్ని చేకూర్చుకుంటాయని, శాస్త్రీయ ఆధారిత వ్యవసాయం ప్రపంచ ఆహార భద్రతకు బలమైన ఆధారంగా మారగలదని భారత్‌ అనుభవం ప్రపంచానికి నిరూపిస్తోంది.

మిత్రులారా,

భారత వ్యవసాయ రంగం నేడు శరవేగంగా మారుతోంది. ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించటంతో పాటు, ప్రపంచ ఆహార భద్రతలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలు, మసాలా దినుసులను భారత్‌ ఉత్పత్తి చేస్తోంది. వరి, గోధుమలు, పండ్లు, కూరగాయలు, పత్తిని పండించే అగ్ర దేశాల్లోనూ ఒకటిగా భారత్‌ నిలిచింది. భారతదేశ వ్యవసాయ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. 2020లో 35 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతుల విలువ.. గతేడాది నాటికి 51 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

మిత్రులారా,

ప్రపంచంలోని వ్యవసాయ భూమిలో కేవలం 2.5 శాతం మాత్రమే భారత్‌లో ఉండగా, ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది ఇక్కడ నివసిస్తున్నప్పటికీ ఈ విజయాలు సాధించటం విశేషం. భారత్‌ సాధించిన ఈ విజయం గ్లోబల్ సౌత్ మొత్తానికి స్ఫూర్తిదాయకంగా నిలవటమే కాక, అనేక దేశాలు విశ్వాసంతో ముందుకు సాగేలా చేస్తుంది. భారతదేశానికి ఆహార భద్రత కేవలం విధానపరమైన అంశం మాత్రమే కాదు.. మానవాళి పట్ల ఉన్న బాధ్యత.

మిత్రులారా,

భారతదేశానికి ఎఫ్‌ఏఓతో దశాబ్దాలుగా భాగస్వామ్యం ఉంది. ఎం.ఎస్. స్వామినాథన్, బినయ్ రంజన్ సేన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఎఫ్‌ఏఓతో పనిచేసి ప్రపంచ ఆహార భద్రతకు అందించిన విశేషమైన సహకారం మనకెంతో గర్వకారణం. విజ్ఞానం, విధానాలు, మానవీయ విలువలు ఒకచోట చేరినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని భారత్‌ ఎల్లప్పుడూ విశ్వసిస్తోంది. ఎఫ్‌ఏఓ వ్యవస్థాపక సభ్య దేశంగా ప్రపంచ ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం, సుభిక్షమైన ప్రపంచ నిర్మాణానికి భారత్‌ క్రియాశీలకంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా మన భాగస్వామ్యానికి అత్యుత్తమ ఉదాహరణ కనిపించింది. ఆహార, వ్యవసాయ సంస్థతో కలిసి మనం చేసిన ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ప్రపంచం మరోసారి చిరుధాన్యాల ప్రాముఖ్యతను, వాటి శక్తిని అర్థం చేసుకుంది. భవిష్యత్తులోనూ మనం కలిసి పనిచేద్దాం. చిరుధాన్యాల గురించి నేను మాట్లాడినప్పుడు గమనించిన విషయం ఏంటంటే.. చాలామంది వాటిలోని పోషక విలువలపైనే దృష్టి పెడతారు. కానీ, చిరుధాన్యాలు పర్యావరణానికి ఎంతో మేలు చేసే పంటలు. తక్కువ నీటితో, రసాయన ఎరువులు వినియోగించకుండా వీటిని పండించవచ్చు. భారత్‌లో దాదాపు 85 శాతం మంది పరిమిత భూమిలో సాగు చేసే చిన్న రైతులే. నీటిపారుదల సౌకర్యం లేని, వర్షాధారంగా వ్యవసాయం సాగే అనేక ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు పోషకాహారాన్ని మెరుగుపరచటమే కాక, పర్యావరణ పరిరక్షణకు ఎంతోగానో సహకరిస్తుంది.

మిత్రులారా,

భారతదేశంలో "జై జవాన్, జై కిసాన్" అంటాం. ఒక రైతు విత్తనం నాటినప్పుడు కేవలం పంటను మాత్రమే పండించడు. రాబోయే తరాల కోసం ఆశలను నాటుతాడు. నేడు ప్రపంచం అనిశ్చితి, అస్థిరతను ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సహకారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజు వారికి లభించిన ఈ గౌరవం.. భారతదేశంలోని ప్రతి రైతు సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆకలి, పేదరికం, పోషకాహార లోపానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటాలకు పూర్తి మద్దతును భారత్‌ అందిస్తూనే ఉంటుంది. రేపు మీరు "టీ దినోత్సవం" జరుపుకోనున్నట్లు ప్రస్తావించారు. ఆ సందర్భానికి ఒక రోజు ముందుగానే "చాయ్‌వాలా" మీ ముందుకు వచ్చారు. వైవిధ్యభరితమైన టీలకు భారత్‌ ప్రసిద్ధి చెందింది. టీకి నిజంగానే ప్రత్యేకమైన శక్తి ఉంది.

 

ఎప్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌కు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

 

****

 


(రిలీజ్ ఐడి: 2264552) సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Manipuri , Gujarati , Urdu , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam