ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రెగాబాలిన్‌ను షెడ్యూల్ హెచ్-1 పరిధిలోకి తెచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ... నియంత్రణను పటిష్టం చేయడం దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యం


సులభ లభ్యతను అరికట్టడానికి, మందుచీటీలపై పర్యవేక్షణను పెంచడానికి, సరఫరా వ్యవస్థల జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి, ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 10:30AM by PIB Hyderabad

‘ఔషధ నియమాలు - 1945’లోని షెడ్యూల్ హెచ్-1 పరిధిలోకి ‘ప్రెగాబాలిన్’ ఔషధాన్ని చేరుస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు 2026 మే 13న గెజెట్ నోటిఫికేషన్ జీఎస్ఆర్ 377(ఇ) జారీ చేయగా, 2026 మే 20 నాటి భారత అధికారిక గెజెట్ అత్యవసర ప్రచురణలో అది ప్రచురితమైంది.

ప్రెగాబాలిన్ ఔషధం దుర్వినియోగం (ముఖ్యంగా యువతలో) అవుతున్నట్లు కొన్ని రాష్ట్రాల నుంచి అందిన నివేదికల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక నొప్పులు, నరాల వ్యాధులు, కండరాల నొప్పులు, కొన్ని రకాల నరాల సంబంధిత సమస్యలకు చికిత్స కోసం వైద్యులు సిఫార్సు చేసే ఈ ఔషధాన్ని... మత్తు, ఉల్లాసం, వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయినట్టు భ్రమ కలిగించే మానసిక అనుభూతిని పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన, అనధికారికంగా విక్రయిస్తున్న ప్రెగాబాలిన్ ఔషధాలను ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి.

 

షెడ్యూల్ హెచ్-1 ప్రిస్కిప్షన్ ఔషధం - హెచ్చరిక:

-  వైద్య సలహా మేరకు తప్ప ఈ మందును తీసుకోవడం ప్రమాదకరం.

-  నమోదు చేసుకుని ఉన్న వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా దీనిని చిల్లరగా అమ్మకూడదు.

 

 

 

 

ఔషధాలు, సౌందర్య సాధనాల నియమాలు- 1945లో షెడ్యూల్ హెచ్‌లో ఉన్న ప్రెగాబాలిన్ ఔషధం.. తాజా ప్రకటన ద్వారా షెడ్యూల్ హెచ్-1 పరిధిలోకి వచ్చింది. ఇకపై ఇందులోని కఠిన నిబంధనలు ప్రెగాబాలిన్‌ను నియంత్రిస్తాయి.

 

 వర్గీకరణలో సవరణ ఈ కింది అంశాలను తప్పనిసరి చేస్తుంది:

గుర్తింపు పొందిన వైద్యుడు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే ప్రెగాబాలిన్ ఔషధాన్ని విక్రయించాల్సి ఉంటుంది.

ప్రిస్క్రిప్షన్లు, అమ్మకాల వివరాలను నమోదు చేస్తూ ఒక ప్రత్యేక రిజిస్టరును చిల్లర వర్తకులు నిర్వహించాలి.

ఉత్పత్తి ప్యాకేజింగ్‌పై నిర్దేశిత ‘షెడ్యూల్ హెచ్ 1 ఔషధ హెచ్చరిక’ లేబుల్‌ను తయారీదారులు స్పష్టంగా ప్రదర్శించాలి.

ఉల్లంఘనలు, నిబంధనలను పాటించకపోవడం వంటి చర్యలు.. ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం - 1940, దాని నిబంధనల మేరకు శిక్షార్హమవుతాయి.

సరఫరా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడం, అనధికారిక విక్రయాలను నిరోధించడం, ప్రిస్కిప్షన్లపై పర్యవేక్షణను మెరుగుపరచడం, అక్రమ రవాణాను అరికట్టడం, ఈ ఔషధ దుర్వినియోగం నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

తయారీదారులు, పంపిణీదారులు, టోకు వ్యాపారులు, చిల్లర వర్తకులు, ఫార్మసిస్టులు సహా సంబంధిత వర్గాలన్నీ ఈ ప్రకటనలోని నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.

కింది లింక్ ద్వారా ఇ-గెజిట్‌ను చూడొచ్చు - https://egazette.gov.in/(S(rqa3ekkjb0kpe5pwg0vwdyg4))/ViewPDF.aspx

 

(రిలీజ్ ఐడి: 2264160) సందర్శకుల సూచీ సంఖ్య : : 89
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam