హోం మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్.. జగ్‌దల్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, నక్సలైట్ల ఉనికి లేని ప్రాంతంగా మారిన బస్తర్..
ఇక భద్రత నుంచి నమ్మకానికీ, నమ్మకం నుంచి అభివృద్ధికీ, అభివృద్ధి నుంచి సమృద్ధికీ, సమృద్ధి నుంచి సంతృప్తి దిశకీ సాగే ఈ పయనాన్ని వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేసి తీరాల్సిందే
రాబోయే అయిదేళ్లలో బస్తర్ ఆదాయాన్ని ఆరు రెట్ల మేర పెంచడమే లక్ష్యం
నక్సల్స్ రహిత భారత్‌ను ఆవిష్కరించిన ఘనత మన భద్రతాదళాలూ, వారి కుటుంబాలదే..
ఈ యుద్దంలో వారిది సర్వోన్నత త్యాగం
వారందరికీ నా హృదయ పూర్వక అభినందనలు
నక్సల్స్ రహితం అయితేనే సరిపోదు.. 2031 కల్లా అభివృద్ధి చెందిన బస్తర్‌ను తీర్చిదిద్దడమే మన ధ్యేయం
2031లో బస్తర్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయిన తర్వాత.. ఈ ప్రాంత ప్రగతిని అడ్డుకుంది నక్సలిజమేనన్న సంగతి
బహిర్గతం అవుతుంది
లొంగిపోయిన నక్సలైట్ల మానసిక స్థితి, నైపుణ్యాభివృద్ధి, విద్యాబోధన ముఖ్యమని స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రి
సమాజంలో ఆత్మగౌరవంతో జీవించడానికి బాధితులకు అన్ని హక్కులూ ఉన్నాయి
బస్తర్‌లో రాబోయే 6 నెలల్లో, పాడి సహకార సంఘాల విస్తృత వ్యవస్థ
ప్రతి గిరిజన మహిళకీ ఒక ఆవూ, ఒక గేదెనూ ఇస్తాం
బస్తర్‌లో నక్సలిజాన్ని నిర్మూలించడానికి, 200 భద్రతా శిబిరాల ఏర్పాటు.. ఆ శిబిరాల్లో మూడింట ఒక వంతు శిబిరాలు ఇకపై ‘‘వీర్ శహీద్ గుండాధుర్ డేరాలు’’గా మార్పు
‘‘సేవా డేరా’’ నమూనా ద్వారా పల్లెల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకువచ్చే దిశగా సన్నాహాలు..
అందరి అందుబాటులోకీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు.. ఈ మార్గంలో వెళితేనే ‘వికసిత్ బస్తర్’ సాకారం
బస్తర్‌లో అటవీ ఉత్పత్తులతో పాటు వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలతో గిరిజన సముదాయాలకు ఇక సర్వత్రా మేలు
‘‘బస్తర్ ఒలింపిక్స్’’, ‘‘బస్తర్ పండుమ్’’లతో గిరిజన యువత అనుసంధానం.. ఇవి గిరిజన సంస్కృతి పునరుద్ధరణకు మార్గదర్శక నమూనాలు
నక్సలిజం సమాప్తం కావడంతో మావోయిస్టులు కొత్త వేషాలతో, కొత్త పేర్లతో మళ్లీ వస్తారు
ఎవ్వరి మోసాల వలలోనూ చిక్కుకోవద్దు….
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 8:16PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్.. జగ్‌దల్‌పూర్‌లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడారు.
‘‘శ్రీ విష్ణు దేవ్ సాయ్ నాయకత్వంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మా పార్టీ ప్రభుత్వం ఉన్నకాలంలో, కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన మా పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది’’ అని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ‘ఇక్కడ 2023 డిసెంబరు 13న మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే, బస్తర్‌లో మిగిలిన నక్సలైట్లను ఏరివేయడానికి ఒక కార్యక్రమాన్ని మేం మళ్లీ మొదలుపెట్టాం’ అని శ్రీ షా చెప్పారు. 2024 ఆగస్టు 24న అన్ని రాష్ట్రాల డీజీపీలతో సమావేశాన్ని నిర్వహించి, 2026 మార్చి నెల 31 కల్లా దేశంలో నక్సలైట్ల జాడ లేకుండా చేస్తామని ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ‘మన భద్రతాదళాల పరాక్రమం, ధైర్య సాహసాలు, త్యాగాల కారణంగా అనుకున్న సమయాని కన్నా ముందే.. అంటే 2026 మార్చి 31కి ముందుగానే.. దేశంలో నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం’ అని ఆయన తెలిపారు.
2026 మే నెల 19 కి కూడా గొప్ప ప్రాధాన్యం ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. నక్సల్‌బరీ నుంచి నక్సలిజం వ్యాప్తి చెందడం మొదలుపెట్టిన తరువాత, ఆ సిద్ధాంతాన్ని సమర్థించే మేధావులు అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు చేరుకోకపోవడం వల్లనే నక్సలిజం ఉనికిలోకి వచ్చిందని వాదించే వారని మంత్రి అన్నారు. ఇది నిజం కాదనీ, నక్సలైట్ల బాధిత ప్రాంతాల కన్నా మరింత ఎక్కువగా దేశంలోని వెనుకబడిన ప్రాంతాలు అనేకం ఉన్నా, అక్కడ నక్సలిజం విస్తరించలేదన్నారు. ఆయా ప్రాంతాలన్నీ క్రమంగా అభివృద్ధి దిశగా పురోగమించాయని తెలిపారు. ‘ఏమైనా, మన బస్తర్‌తో పాటు అనేక ఇతర నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు’ అని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.
2026 మే నెల 19న ఇదివరకటి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలోనే సమగ్ర అభివృద్ధికి సంబంధించిన దార్శనికతను మొదలుపెట్టినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. ‘‘వీర్ శహీద్ గుండాధుర్ సేవా డేరా’ను నిన్ననే ప్రారంభించాం’’ అని ఆయన చెప్పారు.
బస్తర్‌లో ఏడు జిల్లాలను నక్సలిజం నుంచి విముక్తం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆ ప్రాంతంలో సుమారు 200 భద్రతాశిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. బస్తర్ ఇప్పుడు నక్సల్స్ ఆనవాళ్లు లేని ప్రాంతంగా మారడంతో, మొదటి దశలో ఈ 200 శిబిరాల్లో 70 శిబిరాలను వీర్ శహీద్ గుండాధుర్ సేవా డేరాలుగా మారుస్తారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ సదుపాయాల్నీ, సేవల్నీ బస్తర్‌లో గిరిజన సోదరీ, సోదరులందరి చెంతకు చేర్చడం ఈ శిబిరాలను ఏర్పాటు చేయడంలో ముఖ్యోద్దేశమన్నారు. ప్రతి సేవా డేరాలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన 371 పథకాల ప్రయోజనాలతో పాటు బ్యాంకింగ్ సదుపాయాల్నీ, ఆధార్ కార్డ్ సేవల్నీ, డిజిటల్ సేవలన్నిటినీ సాధారణ సేవా కేంద్రాల (సీఎస్‌సీస్) సాయంతో ఒకే చోట అందుబాటులోకి తీసుకు వస్తారని శ్రీ షా అన్నారు. 50 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని పౌరులు ప్రభుత్వ పథకాలన్నిటి ప్రయోజనాల్నీ పూర్తి స్థాయిలో అందుకొనేటట్లు చూడడమే ధ్యేయమన్నారు. ఈ సేవా డేరాల్లో ఒక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)తో పాటు పాల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేరస్తారనీ, దీంతో ప్రతి గిరిజన మహిళ తన ఆధ్వర్యంలోని పశువులు ఇచ్చే పాలను ఈ కేంద్రానికి సరఫరా చేసే వీలు ఉంటుందన్నారు. బస్తర్‌లోని ప్రతి గిరిజన కుటుంబానికీ ఒక ఆవునూ, ఒక గేదెనూ ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేస్తుందనీ, వారు వాటి పాలను సహకార వ్యవస్థ సాయంతో దేశవ్యాప్తంగా విక్రయించగలుగుతారనీ మంత్రి వివరించారు. రాబోయే ఆరు నెలల్లో బస్తర్ డివిజన్ నలు మూలలా ఒక పెద్ద పాడి నెట్‌వర్కును తీర్చిదిద్దుతారని ఆయన తెలిపారు.
ఈ ప్రాంతం ఇంతకు ముందు తుపాకుల నీడలో ఉందనీ, అయితే ఇప్పుడు అభివృద్ధి ఈ ప్రాంతానికి చేరుకుంటుందనీ శ్రీ అమిత్ షా అన్నారు. ఇప్పటి వరకు, ఈ ప్రాంతమంతా నక్సలైట్ల కారణంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు రేషన్ కార్డులు గానీ, ఉచిత ఆహారధాన్యాల పథకాల మేలు గానీ, లేదా రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమా సదుపాయం గానీ అందుకోలేదనీ, వారు పండించిన పంటల్ని క్వింటాలు రూ.3,100 చొప్పున సేకరించ లేదనీ, ఉపాధి పత్తా లేకుండా పోయిందనీ, కరెంటు పల్లెలకు చేరలేదనీ, నీళ్లూ అందలేదనీ, పాఠశాలల్ని నిర్మించలేదనీ వివరించారు. ‘సేవా డేరాల దన్నుతో మేం ఈ సదుపాయాలన్నింటినీ బస్తర్ అంతటా కల్పించబోతున్నాం’ అని ఆయన అన్నారు. నక్సలైట్ల ప్రభావానికి లోనైన బస్తర్‌ను నక్సలైట్ల జాడ లేని, అభివృద్ధి చెందిన బస్తర్‌గా తీర్చిదిద్దడానికి వీర్ శహీద్ గుండాధుర్ సేవా డేరా కార్యక్రమం ఒక ప్రధాన చోదకశక్తి కానుందని శ్రీ షా తెలిపారు. అటవీ ఉత్పాదనలను సహకార సంఘాల ద్వారా ప్రాసెసింగ్ చేస్తారనీ, వాటి ద్వారా అందే లాభాలన్నిటినీ గిరిజన సముదాయాలకే అందిస్తారన్నారు.
బస్తర్ అభివృద్ధికి అనేక ప్రధాన పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర హోం మంత్రి వెల్లడించారు. ‘‘రూ.20,557 కోట్ల ఖర్చుతో 12,211 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని మేం చేపట్టి, పూర్తి చేశాం. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలన్నిటా మొత్తం 13,000 మొబైల్ టవర్ల నిర్మాణ ప్రణాళికను రూపొందించగా వాటిలో 5,000 టవర్ల స్థాపన పనులను ఇప్పటికే పూర్తి చేశారు. 1,804 బ్యాంకు శాఖలను తెరిచారు. 1,321 ఏటీఎంలను ఏర్పాటు చేశారు. 890 పోస్టాఫీసులను ప్రారంభించడానికి సంబంధించిన అన్ని పనులూ పూర్తి చేశారు. 259 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను తెరిచారు. 46 ఐటీఐలతో పాటు 49 నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను కూడా స్థాపించారు. 90,000 మంది కన్నా ఎక్కువ మంది యువతకీ, మహిళలకీ నైపుణ్యాల సాధనలో శిక్షణనిచ్చారు’’ అని ఆయన వివరించారు. నక్సల్స్ రహిత బస్తర్ సహా దేశంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని శ్రీ షా తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పథకాలను అన్ని వర్గాల వారి చెంతకూ తీసుకుపోతారనీ, సంపూర్ణ భద్రత వ్యవస్థ, యువతతో పాటు మహిళల భవిష్యోన్ముఖ సాధికార కల్పనకు శాస్త్రీయ కార్యక్రమాన్ని అమలు చేస్తారనీ, గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడమే కాక, వాటిని ప్రోత్సహిస్తూ స్థానిక వారసత్వాన్ని పెంచి పోషిస్తారనీ ఆయన తెలిపారు.
‘‘ఇక్కడ బస్తర్ పండుమ్‌ను మేం మొదలుపెట్టాం’’ అని శ్రీ అమిత్ షా అన్నారు. ‘గిరిజన సంస్కృతిని కాపాడటానికి నిజాయతీతో ప్రయత్నాలు చేయాలనీ, ఒక ప్రణాళికను రూపొందించాలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాలో స్ఫూర్తిని నింపారు’ అని ఆయన తెలిపారు. బస్తర్ పండుమ్‌లో భాగంగా గిరిజన నృత్యం, గీతం, భాష, సాంప్రదాయిక దుస్తులు, రుచులు వంటి వాటి కోసం ఒక పెద్ద వేదికను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఏడాది కిందట, 45,000 మంది బస్తర్ పండుమ్‌లో పాల్గొని, ఈ విధమైన కార్యకలాపాలన్నిటినీ ప్రోత్సహించడంలో తమ వంతు తోడ్పాటును అందించారని ఆయన తెలిపారు. ఇదే మాదిరిగా, బస్తర్ ఒలింపిక్స్‌ను రెండు సార్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ‘‘వెనుకటి బస్తర్ ఒలింపిక్స్‌లో 3 లక్షల 94 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో పునరావాసం పొందిన మన మాజీ నక్సల్ సోదరీ, సోదరులతో కూడిన జట్టు కూడా ఉంది’’ అని మంత్రి వివరించారు. ఆ జట్టు అత్యుత్తమ ఆటతీరును కనబరిచిందని ఆయన ప్రశంసించారు. ఏ వివాదానికైనా హింస ఎన్నటికీ ఒక పరిష్కార మార్గం కానే కాదని నక్సల్స్ రహిత ప్రాంతానికంతటికీ ఒక స్పష్టమైన సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందజేయదలుచుకున్నారని శ్రీ షా చెప్పారు. ప్రజాస్వామిక విలువలు, పరస్పర సహకారం, అభివృద్ధికి పాటుపడాలనే ఆలోచన.. ఇవే వ్యక్తుల పురోగతికి పునాదులు వేస్తాయనీ, హింస ద్వారా ఎలాంటి వికాసమూ.. అది వ్యక్తి పరమైన వికాసం గానీ, లేదా గ్రామ వికాసం గానీ, లేదా ప్రాంతాభివృద్ధి గానీ.. సాధ్యపడదనీ ఆయన అన్నారు. పేదరికం కారణంగానే నక్సలిజం విస్తరించిందనే అపోహను వీర్ శహీద్ గుండాధర్ సేవా డేరా తొలగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాంతమంతా పూర్తిగా అభివృద్ధి చెందిన తరువాత, యావత్తు ప్రపంచానికీ ఒక శక్తిమంతమైన సందేశం అందుతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ‘నక్సలైట్లు విధ్వంసానికి పాల్పడినందువల్లనే ఇక్కడ బడులను నిర్మించలేకపోయారనీ, వాళ్లు ఆటంకాలు కల్పించినందువల్లనే ఇక్కడ రోడ్లను నిర్మించలేకపోయారనీ, ఆసుపత్రి సిబ్బందిని నక్సలైట్లు హతమార్చినందువల్లనే ఆసుపత్రులు పనిచేయలేకపోయాయనీ, దోపిడీకి నక్సలైట్లు పాల్పడినందువల్లనే ఇక్కడకు బ్యాంకులు రాలేదనో, లేక నక్సలైట్ల లూటీల కారణంగానే ఇక్కడి బ్యాంకుల్ని మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడిందనేదే ఆ సందేశం’ అని మంత్రి వివరించారు. ప్రగతి మార్గాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి ఆయుధాల్ని పట్టుకున్న దేశంలోని వివిధ వర్గాల కళ్లెదుట.. ఒక ప్రజాస్వామిక అభివృద్ధి నమూనాను బస్తర్‌లోని ‘శహీద్ వీర్ గుండాధర్ సేవా డేరా’ ప్రదర్శించనుందని శ్రీ షా అన్నారు.
ఇక మీదట భయంతో వణుకుతూ, బిక్కుబిక్కుమంటూ బతకనక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరఫున బస్తర్ ప్రజలందరికీ శ్రీ అమిత్ షా హామీ ఇచ్చారు. ‘‘ఇక్కడ ఒక కొత్త ఉషోదయం అయింది’’ అని ఆయన వర్ణించారు. ఈ ప్రాంత గిరిజన మహిళలూ, యువతీయువకుల వెన్నంటి కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిలబడుతున్న కారణంగా, వారందరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఆయన చెప్పారు. మునుపు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ఉన్న బస్తర్.. ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారనుందనీ, ప్రజలు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ శ్రీ షా హెచ్చరిక చేశారు. మావోవాద ఆదర్శాలతో స్ఫూర్తిని పొందిన వారు ఒకప్పుడు బస్తర్‌ను తుపాకులతో నాశనం చేయాలని చూశారనీ, వారు మారు రూపాలతో తిరిగి రావొచ్చనీ ఆయన అన్నారు. వారు చేసే ప్రచారంతో తప్పుదోవ పట్టకండి అని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనీ, అవి ప్రజాస్వామ్య పద్ధతుల్లో బస్తర్‌ను ప్రగతిపథంలోకి తీసుకుపోతాయనీ ఆయన స్పష్టం చేశారు.
దేశంలో అత్యంత అధిక స్థాయిలో అభివృద్ది చెందిన గిరిజన డివిజన్‌గా ఈ ప్రాంత రూపురేఖల్ని మార్చడానికి భుజం భుజం కలిపి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. వచ్చే అయిదేళ్లలో బస్తర్ ఆదాయం 6 రెట్లు పెరిగి, భారత్‌లోని అన్ని గిరిజన ప్రాంతాల్లో అత్యంత అధిక స్థాయిలో అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్‌గా బస్తర్ మారుతుందని ఆయన తెలిపారు. నక్సలైట్ల జాడే లేని భారత్‌ను ఆవిష్కరించిన పూర్తి ఘనత సర్వోన్నత త్యాగాలు చేసిన మన భద్రతాదళాలకూ, వారి కుటుంబాలకూ దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2263288)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16