ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుష్ గ్రిడ్ కార్యక్రమం కింద ఆయుష్ అనుదాన్ వేదికను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్



నిధుల నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ఆయుష్‌ అనుదాన్ వేదిక లక్ష్యం: శ్రీ ప్రతాపరావు జాదవ్


డిజిటల్ సాధికారత, పారదర్శకతతో కూడిన ఆయుష్‌ వ్యవస్థ దిశగా ఈ వేదిక కీలక ముందడుగు

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 6:03PM by PIB Hyderabad

ఆయుష్ రంగంలో డిజిటల్ పాలనను బలోపేతం చేయడం, పారదర్శకతను పెంపొందించడం వైపు కీలక ముందడుగు పడింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ నేడు న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో ఆయుష్ అనుదాన్ వేదికను ప్రారంభించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చే నిధుల ప్రతిపాదనలను సమర్పించడం, వాటిని పరిశీలించడం, ఆమోదించడం, పర్యవేక్షించే ప్రక్రియలను సరళతరం చేయడానికి ఆయుష్ గ్రిడ్ కార్యక్రమంలో భాగంగా ఈ వేదికను అభివృద్ధి చేశారు.

 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆయుష్ రంగం కోసం ఒక సమగ్రమైన, పారదర్శకమైన, పౌర కేంద్రిత డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన డిజిటల్ కార్యక్రమమే ఆయుష్ గ్రిడ్ అని అన్నారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరిస్తూ ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించే  ‘వ్యాపార సౌలభ్యం’, ‘జీవన సౌలభ్యం’ దార్శనికతతో స్ఫూర్తి పొంది ఈ ఆయుష్ అనుదాన్ వేదికను ఒక సమగ్ర డిజిటల్ వేదికగా తీర్చిదిద్దాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

 

ఈ వేదిక ఆయుష్ రంగంలోని నిధుల మంజూరు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఈ వేదిక ప్రాముఖ్యతను వివరిస్తూ  ‘‘నిధుల నిర్వహణ ప్రక్రియలో 100 శాతం పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనం, సులభతరమైన అందుబాటును నిర్ధారించడమే ఈ వేదిక ప్రాథమిక లక్ష్యం’’ అని ఆయన అన్నారు. సంస్థలు, సంస్థాగత విభాగాలు తమ ప్రతిపాదనలను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే సమర్పించేలా వీలు కల్పించడం ద్వారా ఈ వేదిక కాగిత రహిత పాలనపై ప్రభుత్వ దార్శనికతను ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.

 

ఈ వేదికను ఎన్‌జీవో దర్పణ్ పోర్టల్‌తో అనుసంధానం చేయడం వల్ల దరఖాస్తు చేసుకునే సంస్థల గుర్తింపు, ధ్రువీకరణ ప్రక్రియ మరింత వేగంగా, స్వయంచాలితంగా, నమ్మదగినదిగా, దోష రహితంగా మారుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆయుష్ గ్రిడ్ కార్యక్రమం కింద విద్య, పరిశోధన, ఆరోగ్య సేవలు, ఔషధ మొక్కల పరిపాలన, ఔషధ నియంత్రణ, సామర్థ్య పెంపు, ప్రపంచవ్యాప్త ప్రచారం వంటి రంగాల్లో ఇప్పటికే అనేక డిజిటల్ వేదికలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీని ద్వారా పారదర్శకమైన, పౌర స్నేహపూర్వక సేవలందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటెచా,  సంయుక్త కార్యదర్శులు డాక్టర్ కవితా జైన్, శ్రీమతి అలర్మేల్‌మంగై, కుమారి మోనాలిసా డాష్, ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ఆయుష్ అనుదాన్ వేదిక ద్వారా వివిధ సంస్థలు, సంస్థాగత విభాగాలకు తమ నిధుల ప్రతిపాదనలను ఒక క్రమబద్ధమైన, సులభతరమైన ఇంటర్‌ఫేస్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఇంతకముందు ఉన్న మానవ ప్రయత్నంతో కూడిన,కాగిత ఆధారిత విధానాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఇది పూర్తిగా తొలగిస్తుంది. ఎన్‌జీవో దర్పణ్ వేదికతో దీనిని అనుసంధానించడం వల్ల దరఖాస్తు చేసుకునే సంస్థల గుర్తింపు, ధృవీకరణ ప్రక్రియ చాలా సులభంగా జరుగుతుంది. ఇది సంస్థల విశ్వసనీయతను పెంచడంతో పాటు, తనిఖీ ప్రక్రియలను మరింత వేగవంతం చేస్తుంది.

 

ఈ వేదిక ముఖ్య లక్షణాల్లో ఒకటి పథకాల వారీ దరఖాస్తుల నిర్వహణ. దీని ద్వారా మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్దిష్ట నిబంధనలకు అనుగుణంగా ప్రతిపాదనలను వర్గీకరించడం, పరిశీలించడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. ఈ వేదికలో తక్షణ అప్లికేషన్ ట్రాకింగ్ సౌకర్యాన్ని కూడా చేర్చారు. దీనివల్ల దరఖాస్తుదారులు, సంబంధిత అధికారులు ప్రతిపాదనల స్థితి ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు.

 

నిధుల మంజూరు ప్రక్రియలలో పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యం, జవాబుదారీతనం, సులభతరమైన అందుబాటును నిర్ధారించడమే లక్ష్యంగా ఆయుష్ అనుదాన్ వేదికను ప్రారంభించారు.ఈ చర్య డిజిటల్ పరివర్తన, పారదర్శక పాలన, డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా బలమైన, ఆవిష్కరణలతో కూడిన, డిజిటల్ సాధికారత కలిగిన ఆయుష్ వ్యవస్థను  సృష్టించడం పట్ల మంత్రిత్వ శాఖకు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

 

ఈ వేదికను ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సింగిల్-విండో డిజిటల్ కార్యక్రమమైన ఎంఏఐఎస్‌పీ(మై ఆయుష్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ పోర్టల్) ద్వారా గానీ, లేదా నేరుగా ఆయుష్ అనుదాన్ వేదిక లింక్ ద్వారా గానీ దీనిని ఉపయోగించవచ్చు.

 

ఎంఏఐఎస్‌పీ వేదిక లింకు: https://maisp.ayush.gov.in/dashboard

 

ఆయుష్ అనుదాన్ వేదిక లింకు: https://anudan.ayush.gov.in/index

 

******


(రిలీజ్ ఐడి: 2263268) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam