వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పీఎం మోదీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ద్వారా రైతుల జీవితాలను సులభతరం చేసే కీలక సంస్కరణలను ప్రకటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్
గృహ వినియోగ పురుగు మందుల విక్రయం, నిల్వకు సంబంధించిన లైసెన్సింగ్ ప్రక్రియ, కొత్త ఎరువుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరళీకరణ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్
వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను సులభతరం చేసేందుకు దేశంలోని 649 కస్టమ్స్ కేంద్రాల అనుసంధానం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 9:03PM by PIB Hyderabad
రైతులు, వ్యాపారులు, వ్యవసాయ రంగ భాగస్వాములకు ప్రక్రియలను సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక సంస్కరణలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం సమీక్షించింది. ఈ సందర్భంగా వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ నిర్వహణను మరింత పారదర్శకంగా, సాంకేతిక ఆధారిత, సమర్థవంతంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సంస్కరణల వేగం ద్వారా మంత్రిత్వ శాఖ మార్పులను వేగవంతం చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ సంస్కరణలు, రాబోయే సంస్కరణ చర్యల గురించి కేంద్ర వ్యవసాయ మంత్రికి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అతీశ్ చంద్ర వివరించారు.
గృహ వినియోగ పురుగు మందుల విక్రయం, నిల్వకు సంబంధించిన లైసెన్సింగ్ ప్రక్రియను సరళీకరించినట్లు కార్యదర్శి అతీశ్ చంద్ర తెలిపారు. లైసెన్స్ పొందేందుకు వినియోగించే దరఖాస్తును మూడు నుంచి ఒక పేజీకి తగ్గించామన్నారు. ఉత్పత్తులతో పాటు కరపత్రాలను అందించే పద్ధతిని నిలిపివేసినట్లు చెప్పారు. బదులుగా నేరుగా ఉత్పత్తి లేబుళ్లపైనే క్యూఆర్ కోడ్‌ల ఏర్పాటుతో కాగితపు పత్రాల అవసరం తగ్గిపోయినట్లు పేర్కొన్నారు.
దోమల నివారణ మ్యాట్లు, కాయిల్స్, లిక్విడ్ వేపరైజర్లు, బొద్దింకల స్ప్రేల వంటి ఉత్పత్తులను విక్రయించే 40 లక్షలకు పైగా రిటైలర్లు, కిరాణా దుకాణదారులకు ఈ సంస్కరణల ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సీఓ)-1985 ద్వారా కొత్త ఎరువుల నమోదు ప్రక్రియ సరళీకరణకు తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో వివరించారు. గతంలో కొత్త ఎరువుల చేరిక, వాటి నిర్దేశిత ప్రమాణాలు, విశ్లేషణ పద్ధతుల ఆమోదానికి సాంకేతిక కమిటీ, కేంద్ర ఎరువుల కమిటీ ఆమోదం తెలిపే రెండంచెల వ్యవస్థ అమల్లో ఉండేది. ఇప్పుడు ఈ రెండంచెల విధానాన్ని తొలగించి, కేంద్ర ఎరువుల కమిటీకి మాత్రమే పూర్తి అధికారాన్నిచ్చారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు 19 మంది దరఖాస్తుదారులు, తయారీదారులు ప్రయోజనం పొందారు.
వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన సంస్కరణల వివరాలను అధికారులు ఈ సమావేశంలో తెలియజేశారు. దేశంలోని మొత్తం 649 కస్టమ్స్ కేంద్రాలను డిజిటల్ అనుసంధానం విజయవంతంగా పూర్తయినట్లు వెల్లడించారు. ప్లాంట్ క్వారంటైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీక్యూఎంఎస్), ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్ గేట్‌వే (ఐస్‌గేట్)ల మధ్య పూర్తిస్థాయి అనుసంధానాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిదారులు ఐస్‌గేట్ ద్వారా కేవలం ఒకే దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత ఇంపోర్ట్ రిలీజ్ ఆర్డర్ (ఐఆర్ఓ) నేరుగా దిగుమతిదారు లాగిన్‌కు జారీ అవుతుంది.
విత్తనాలు, మొక్కలు నాటేందుకు వినియోగించే సామాగ్రి దిగుమతి-ఎగుమతి ప్రక్రియను మరింత సరళీకరించినట్లు ఈ సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఈఎక్స్ఐఎం కమిటీని పూర్తిగా రద్దు చేయటంతో పాటు తప్పనిసరిగా ఉండాల్సిన "ముందస్తు సిఫార్సు" నిబంధనను కూడా తొలగించినట్లు చెప్పారు. దీనివల్ల విత్తనాలు, మొక్కలు నాటేందుకు వినియోగించే సామాగ్రి దిగుమతి-ఎగుమతి ప్రక్రియ మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారింది.
రైతుల జీవన విధానాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంగా రూపొందించిన 'భారత్ విస్తార్-వ్యవసాయంలో ఏఐ' వేదికను అధికారులు సమీక్షించారు. వ్యవసాయానికి సంబంధించి కీలక సమాచారాన్ని ఒకేచోట అందించేందుకు రూపొందించిన ఏఐ ఆధారిత నూతన కేంద్రీకృత వ్యవస్థే ఈ వేదిక. ఫిబ్రవరి 17, 2026న దీని మొదటి దశ ప్రారంభమైనప్పటి నుంచి ఈ వేదికకు 44 లక్షలకు పైగా ప్రశ్నలు అందాయి.
రైతులు సమాచారాన్ని తెలుసుకునేందుకు గతంలో 15కు పైగా వేదికలను సందర్శించాల్సి వచ్చేదని, ఇప్పుడు కావాల్సిన సమాచారాన్నంతా ఒకేచోట ఏ సమయంలోనైనా పొందవచ్చని అధికారులు తెలిపారు.
వ్యవసాయ రంగంలో సులభతర వ్యాపార నిర్వహణకు లక్ష్యంగా పెట్టుకున్న మరో సంస్కరణలో భాగంగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సీఓ)-1985 పరిధిలో నూతన ఎరువుల ఆమోద ప్రక్రియను సరళీకరించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రతిపాదిత సంస్కరణ ప్రకారం.. నిర్దేశిత నాణ్యతా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రసాయన ఎరువులకు తప్పనిసరి క్షేత్రస్థాయి ప్రయోగాల నుంచి మినహాయింపు లభించవచ్చు. దీనివల్ల మార్కెట్లో కొత్త ఎరువుల సాంకేతికతను ప్రవేశపెట్టే ప్రక్రియ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), వ్యవసాయ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలతో సమగ్ర సంప్రదింపులు జరిపి, సంబంధిత పత్రాలను సమీక్షించిన తర్వాత ఈ సంస్కరణల అమలును ఖరారు చేయనున్నట్లు చెప్పారు.
సమావేశం చివరిలో... కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో పారదర్శకత, సాంకేతిక సామర్థ్యం, సుపరిపాలనను పెంపొందించేందుకు సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ రంగంతో ముడిపడున్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర భాగస్వాములందరికీ సరళంగా, వేగంగా, మరింత ప్రభావవంతంగా ప్రక్రియలను మార్చటమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2262860)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15