హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌.. జగ్‌దల్‌పూర్లో అమరవీరుల కుటుంబాలు, సీఏపీఎఫ్ సిబ్బందితో పాటు నక్సల్ హింసాకాండ బాధితులతో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా భేటీ


భారత్‌లో ఇప్పుడిక నక్సలైట్లకు చోటు లేదని సగర్వంగా నేను చాటిచెబుతున్నాను

దేశాన్ని నక్సలైట్ల జాడ లేని దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని 3-4 సంవత్సరాల్లోనే సాధించిన మోదీ ప్రభుత్వం.. ఇది ఒకప్పుడు జీవితకాలంలోనూ కష్టమేనని అనిపించింది

నక్సలైట్ల ఉనికి లేని భారత్‌ను ఆవిష్కరించాలనే ప్రతిజ్ఞను తీసుకున్నది 2024 ఆగస్టు 24న.. ఈ సంకల్పం 2026 మార్చి నెల 31 కన్న ముందే నెరవేరింది

కాశ్మీర్, ఈశాన్యం, నక్సలిజం.. దేశ అంతర్గత భద్రతకు ప్రధాన సవాళ్లుగా నిలిచిన ఈ మూడింటిపైనా మోదీ ప్రభుత్వానిదే విజయం

భారత్‌ను నక్సల్‌రహితంగా తీర్చిదిద్దడంలో పెద్ద తోడ్పాటునిచ్చింది మన డీఆర్‌జీ సోదరీ, సోదరులూ, కోబ్రా కమెండోలే

మావోవాదం వ్యాప్తి చెందడానికి అభివృద్ధి లోపించడం కాదు కారణం.. అభివృద్ధికి అడ్డు నిలిచిందే సాయుధ నక్సలైట్లు

‘అభివృద్ధి చెందిన బస్తర్’ను సాధ్యం చేయకుండా, ‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్’ స్వప్నం సాకారం కాబోదు

బస్తర్లో కళలు, సంగీతం, సంప్రదాయాలను నక్సలిజం అణచేసింది.. ఇప్పుడు, నవోదయం వెలుగులీనుతోంది

రాబోయే కొన్నేళ్లలో, దేశంలో గిరిజన ప్రాంతాలన్నిటిలోకీ అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారనున్న బస్తర్

వేలాది సభల్లో ప్రసంగించినప్పటికన్న బస్తర్‌లోని నెతనార్ గ్రామస్తులైన 400 మంది గిరిజనులతో మాట్లాడినప్పుడే నాకు మరింత ఎక్కువ ఆత్మసంతృప్తి కలిగింది.. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను

లొంగిపోయిన దాదాపు 3,000 మంది నక్సలైట్ల పునరావాసంతో పాటు, వారికి నైపుణ్యసాధనలో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 8:23PM by PIB Hyderabad

అమరవీరుల కుటుంబాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్) సిబ్బందితో పాటు నక్సలైట్ల హింసాత్మక చర్యల బాధితులను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా  ఛత్తీస్‌గఢ్‌.. జగ్‌ద‌ల్పూర్లో ఈ రోజు కలుసుకొని, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ  విజయ్ శర్మ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టరు శ్రీ తపన్ డేకా, నక్సలిజం నుంచి విముక్తిని పొందిన రాష్ట్రాల డీజీపీలు సహా అనేక మంది ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
 


ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ‘భారత్ ఇక నక్సలిజం నుంచి విముక్తం అయిందని ఇవాళ నేను సగర్వంగా చెప్పగలను’ అని పేర్కొన్నారు. ఈ కలను నెరవేర్చడానికి వేల మంది భద్రతాదళాల సిబ్బంది సర్వస్వాన్నీ త్యాగం చేశారని ఆయన అన్నారు. 6 దశాబ్దాల పాటు రక్తపాతం, తగినంత అభివృద్ధికి నోచుకో లేకపోవడంతో పాటు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లోని యువత కళ్లెదుట చీకట్లు కమ్ముకొన్న భవిత.. వంటి పీడకలలతో దేశం సతమతం అయిందని శ్రీ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల ప్రజానీకం పడుతున్న బాధలను చూసి నక్సల్ బెడద లేని రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా ఎంతో బాధపడ్డారని ఆయన అన్నారు. ఒకప్పుడు జీవిత కాలంలోనూ సాధ్యం కాదనుకున్న లక్ష్యాన్ని మూడు, నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే సాహసిక భద్రతాదళాలు సాధించిపెట్టాయని మంత్రి చెబుతూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నక్సలైట్లను నిర్మూలించేందుకు సంబంధించిన చరిత్రలో మూడు రోజులను సువర్ణాక్షరాలతో రాస్తారని శ్రీ అమిత్ షా అన్నారు. ఆ మూడు తేదీలూ.. 2024 జనవరి 21, 2024 ఆగస్టు 24తో పాటు 2026 మార్చి 31 అని ఆయన తెలిపారు. ‘‘ఛత్తీస్‌గఢ్లో మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత, 2024 జనవరి 21న నక్సలిజానికి సంబంధించిన తొలి సమావేశాన్ని నిర్వహించారు. 2026 మార్చి నెల 31 కల్లా నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రతిన స్వీకరించారు. మరి ఆ ప్రతిజ్ఞను 2026 మార్చి నెల 31న నెరవేర్చారు. ఈ మూడు తేదీలనూ ‘నక్సల్ రహిత భారత్’ ప్రచార ఉద్యమ చరిత్రలో బంగారు అక్షరాల్లో లిఖిస్తారు’’ అని మంత్రి వివరించారు. ‘దంతేశ్వరి అమ్మవారి దయతో, బస్తర్‌ను నక్సలైట్ల ఉనికి లేని బస్తర్‌గా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యం ఎట్టకేలకు ఇవాళ.. 2026 మార్చి 31న.. నెరవేరింది’ అని శ్రీ షా అన్నారు.
బస్తర్లో ఈ రోజు శహీద్ వీర్ గుండా ధుర్ సేవా డేరా ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఛత్తీస్‌గఢ్లో దాదాపుగా 200 సీఏపీఎఫ్ శిబిరాలు ఉన్నాయనీ, అవి ఇంత కాలం గిరిజన సముదాయాలనీ, రైతులనీ, మహిళలనీ, బాలలనీ నక్సలైట్ల హింస నుంచి కాపాడాయనీ ఆయన వెల్లడించారు. వీటిలో 70 శిబిరాలను ఇకమీదట శహీద్ వీర్ గుండా ధుర్ సేవా డేరా శిబిరాలుగా మార్చి, ప్రాంతీయ అభివృద్ధి నమూనాలుగా తీర్చిదిద్దుతారన్నారు. ఈ కేంద్రాల్లో 370 ప్రభుత్వ పథకాలు ఆన్‌లైన్లో అందుబాటులో ఉండే దిశగా చర్యలు చేపడతారని ఆయన వివరించారు. జన్ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులనూ, ఆధార్ కార్డులనూ రూపొందిస్తారన్నారు. తగ్గింపు ధరలకు ఇచ్చే ఆహార ధాన్యాలు అందుబాటులో లేనప్పుడు ఆ కేంద్రాల్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా ఈ కేంద్రం నుంచి నిర్వహించుకోవచ్చని మంత్రి చెప్పారు. ఆరోగ్య సంబంధిత సేవలు కూడా లభిస్తాయన్నారు. ఇది పాడి పాల సేకరణ కేంద్రంగానూ పనిచేస్తుందని తెలిపారు. ఉత్తమ సాగు పద్ధతుల్ని గురించి వ్యవసాయ విభాగం నుంచి మార్గదర్శనాన్ని అందిస్తారని శ్రీ షా అన్నారు.  ఎన్ఐడీ సహకారంతో ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి నమూనాను మూడు నెలల లోపల తయారు చేసి, ఒక సంపూర్ణ అభివృద్ధి ప్రణాళికను ‘శహీద్ వీర్ గుండా ధుర్ సేవా డేరా’ పేరిట క్షేత్ర స్థాయిలో అమలుచేస్తారన్నారు. ఇది మావోవాదులను సమర్ధించే మేధావులకు ఒక సందేశాన్ని కూడా అందిస్తుందన్నారు. అభివృద్ధి లోపించినందువల్ల మావోవాదం వ్యాప్తి చెందలేదనీ, అభివృద్ధిని అడ్డుకున్నదే నక్సలైట్ల కార్యకలాపాలు అనీ శ్రీ షా స్పష్టం చేశారు. ఇప్పుడిక సాయుధ ఉద్యమం అంతం అయినందున, ఎట్టకేలకు అభివృద్ధి జోరుగా ముందుకు సాగగలుగుతుందని ఆయన అన్నారు.  
బస్తర్ దేశం అంతటిలోకీ అత్యంత అధిక స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిలవగలదన్న విశ్వాసాన్ని కేంద్ర హోం మంత్రి వ్యక్తం చేశారు. పేదలకీ, వెనుకబడిన వర్గాల వారికీ, దళితులకీ, గిరిజన సమాజాలకీ అనేక సంక్షేమ పథకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని శ్రీ షా తెలిపారు. ‘‘క్వింటాలుకు రూ.3,100 చొప్పున చెల్లించి ధాన్యాన్ని సేకరించడం, నెలకు ఒక వ్యక్తికి 7 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయడం వంటి పథకాలు అమల్లో ఉన్నా, మా ప్రభుత్వం అధికారంలోకి రావడాని కన్న ముందు ఈ పథకాల ప్రయోజనాలు ప్రజల చెంతకు చేరేవి కాదు’’ అని శ్రీ షా అన్నారు. బస్తర్ రుచులు, కళలు, సంగీతం, నాట్యం, క్రీడలు, సంప్రదాయాలను మంత్రి  మెచ్చుకుంటూ, ఈ విశిష్ట సాంస్కృతిక అంశాలకు నక్సలైట్ల హింస వల్ల ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. ఏమైనా బస్తర్ ఇక ఒక కొత్త ఉషోదయాన్ని చూస్తోందనీ, ప్రగతిపథంలో ముందుకు సాగుతోందనీ ఆయన అన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు చేసిన త్యాగాలనీ, భద్రతాదళాలతో పాటు అమాయక గిరిజన పౌరులు చేసిన త్యాగాలనీ శ్రీ షా శిరసా వహించారు. మాజీ నక్సలైట్లు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) లో చేరడంతో పాటు నక్సల్ వ్యతిరేక ప్రచార ఉద్యమ విజయంలో తమ వంతు తోడ్పాటును కూడా అందించినందుకు ఆయన ప్రశంసలు కురిపించారు.


నక్సలైట్లకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాలు సఫలం అయ్యాయంటే అందుకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) సిబ్బందీ, కోబ్రా (CoBRA) కమెండోలు కనబరిచిన ధైర్య సాహసాలూ, అంకిత భావమే చాలావరకూ కారణమయ్యాయని శ్రీ అమిత్ షా అన్నారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి విజయాన్ని సాధించడంలో ఘనత అంతా సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఛత్తీస్‌గఢ్ పోలీసు, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, బస్తర్ ఫైటర్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలదేనని ఆయన వివరించారు.  లొంగిపోయి, పునరావాసానికి మొగ్గు చూపాల్సిందిగా నక్సలైట్లను ప్రోత్సహించడంలో పౌర సమాజం సభ్యులు, పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు తమ వంతుగా అందించిన సేవలను కూడా మంత్రి అభినందించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014లో పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత, అంతర్గత భద్రతతో పాటు దేశానికి వెలుపలి భద్రతను కూడా పటిష్టపరచడానికి ఒక సమగ్ర మార్గసూచీని సిద్ధం చేశారని హోం మంత్రి అన్నారు. ‘‘జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సలిజం.. ఇవి దేశం ఎదుర్కొంటున్న అదతి పెద్ద సవాళ్లుగా ఉండేవి.. మరి ఇవాళ భారత్ ఈ మూడిటినీ అధిగమించి అభివృద్ధి పథంలో దృఢంగా పురోగమిస్తోంది’’ అని ఆయన వివరించారు. అమరవీరుడు ‘గుండా ధుర్ సేవా డేరా’ను నెతనార్ గ్రామంలో ఈ రోజు ప్రారంభించిన విషయాన్ని శ్రీ షా ప్రస్తావిస్తూ, ఈ సందర్భంగా ‘‘గిరిజన నివాసుల మోముల్లో ఆశాకిరణాలు మెరవటాన్ని  నేను చూశాను’’ అని వ్యాఖ్యానించారు. లొంగిపోయిన నక్సలైట్లకూ, వారి కుటుంబాలకూ విద్యావకాశాలనీ, నైపుణ్యాల సాధన అవకాశాలనీ కల్పించి వారు ఆత్మవిశ్వాసంతో ప్రధాన సమాజ స్రవంతిలో తిరిగి అడుగుపెట్టేటట్లు చూస్తామని ఆయన హామీని ఇచ్చారు. లొంగిపోయిన సుమారు 3,000 మంది నక్సలైట్లకు పునరావాస కల్పన కోసం విస్తృత ప్రణాళికను తయారు చేశారనీ, వారికి విద్యాబోధనతో పాటు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు రూ.20 కోట్లు కేటాయించారన్నారు. వారు ఆత్మగౌరవంతో, సమాదరణకు నోచుకొని జీవించేటట్లు మోదీ ప్రభుత్వం చూస్తుందని ఆయన తెలిపారు.
లొంగిపోయిన 3,000 మంది నక్సలైట్లను బస్తర్ ప్రజలు దయతో అక్కున చేర్చుకొని, ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు సాయపడతారన్న విశ్వాసాన్ని శ్రీ అమిత్ షా వ్యక్తం చేశారు. బస్తర్ అభివృద్ధి పథంలో ముందుకు నడవనిదే 2047 కల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి శ్రీ మోదీ దార్శనికత సంపూర్ణం కాబోదని శ్రీ షా అన్నారు. నక్సలిజం ఇక సమాప్తం అయినా, గత 50 ఏళ్ల నష్టాల్ని రాబోయే అయిదేళ్లలో భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనీ, బస్తర్‌ను దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా నిలపాల్సివుందనీ ఆయన చెప్పారు. రోడ్లు, గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్, తపాలా సేవలు, గ్యాసు సరఫరా, స్వచ్ఛమైన నీరు, కరెంటు, ఆహార భద్రత సహా వివిధ సేవలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేటట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూస్తుందని ఆయన తెలిపారు.  


సీఏపీఎఫ్ సిబ్బందికి హోం మంత్రి శ్రీ అమిత్ షా నమస్సులు అర్పించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో పాల్గొన్న జవాన్లు 45 డిగ్రీల మండుటెండల్లో పనిచేశారనీ, సరఫరాల గురించి వారు ఎంతమాత్రం ఆందోళన చెందలేదన్నారు. అక్కడ వేల సంఖ్యలో మందుపాతరలు పాతిపెట్టినప్పటికీ, ఆ కఠిన ప్రాంతాల నుంచి మావోయిస్టు శిబిరాలను దళాలు విజయవంతంగా తుడిచిపెట్టాయనీ, అది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కావచ్చు, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ ఆక్టోపస్, లేదా ఆపరేషన్ డబల్ బుల్ కావచ్చు.. ఈ ఆపరేషన్లు జార్కండ్ , బీహార్ మొదలు బస్తర్, తెలంగాణ వరకూ విస్తరించిన విశాల ప్రాంతాలను క్లియర్ చేశాయనీ, అలాగే ఆయా ప్రాంతాల అభివృద్దికి బాటలు వేశాయనీ మంత్రి వివరించారు. ‘‘శాంతియుత, ప్రగతిశీల బస్తర్ తెర ముందుకు వచ్చిందంటే అందుకు ఖ్యాతినంతా పూర్తిగా సీఏపీఎఫ్ సిబ్బందికి ఇవ్వాల్సిందే’’ అని శ్రీ షా అన్నారు. నక్సలైట్లు అనేక సందర్భాల్లో వందల మంది గిరిజనుల ఇళ్లను తగులబెట్టారని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున హింస, ఊచకోతలు కొనసాగినప్పటికీ భద్రతాదళాలు ధైర్య సాహసాలతో పోరాడి, తమ సర్వస్వాన్నీ పణం పెట్టాయనీ, అమాయకులైన ఎంతో మంది ప్రజలను రక్షించడానికి తమ జీవితాల గురించి ఆందోళన చెందనేలేదనీ మంత్రి అన్నారు. బస్తర్‌ను సంరక్షించినందుకూ, కష్టకాలాల్లో సమాజంలో ధైర్యాన్ని నింపినందుకూ వివిధ గిరిజన సముదాయాల నాయకులు ఎంతో తోడ్పడ్డారంటూ వారిని ఆయన ప్రశంసించారు.  
ఇక ఏ అమాయక గిరిజన వ్యక్తికీ హాని జరగదనీ, బడులు తెరిచే ఉంటాయనీ, కరెంటు సరఫరాలో అంతరాయం ఎదురవదనీ, రైతులు తమకు అందాల్సిన పూర్తి ప్రయోజనాలను నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో అందుకుంటారనీ శ్రీ అమిత్ షా చెప్పారు. బస్తర్ ఒలింపిక్స్, బస్తర్ పండుమ్ వంటి కార్యక్రమాలు ఈ ప్రాంత సాంస్కృతిక సంప్రదాయాన్ని పునరుద్దరిస్తాయని ఆయన తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2262773) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia , Tamil , Kannada