యు పి ఎస్ సి
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026 ముగిసిన వెంటనే ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేయనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)
ప్రొవిజనల్ ఆన్సర్ కీని త్వరగా విడుదల చేయడాన్ని మరింత పారదర్శకత దిశగా ఒక ‘నూతన ఆరంభం’గా అభివర్ణించిన యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 6:17PM by PIB Hyderabad
పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంపొందించడానికి, అత్యున్నత ప్రమాణాలను నిలబెట్టేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మొదటిసారిగా సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026 ముగిసిన వెంటనే ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేయనుంది.
యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ దీనిని ఒక నూతన ఆరంభంగా అభివర్ణిస్తూ, “యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన తాత్కాలిక సమాధానాల కీ (ప్రొవిజనల్ ఆన్సర్ కీ)ని విడుదల చేయనుంది. మరింత పారదర్శకత, స్పందనశీలత, అభ్యర్థులతో సకాలంలో సమాచార మార్పిడిని పెంపొందించేందుకు కమిషన్ రంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ చొరవ అద్దం పడుతోంది. పరీక్ష ప్రక్రియ పవిత్రత, సమగ్రత, ప్రతిభ ఆధారిత వ్యవస్థను నిలబెడుతూ ఈ విధానం పరీక్షా ప్రక్రియను మరింత భాగస్వామ్యపూర్వకంగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది” అని తెలిపారు.
ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత, సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అభ్యంతరాలు లేదా ప్రతిపాదనలు ఏవైనా ఉంటే, వాటిని 31 మే 2026 సాయంత్రం 6 గంటల వరకు సమర్పించవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్ “ఆన్‌లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ (క్యూపీఆర్ఈపి)” https://upsconline.nic.in/login. అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ అవగాహన ప్రకారం సరైన సమాధానాన్ని (కీ) సూచిస్తూ, దానికి సంబంధించిన సంక్షిప్త వివరణను, మూడు విశ్వసనీయ మూలాల (అథెంటిక్ సోర్సెస్) నుంచి నుండి సేకరించిన ఆధారిత పత్రాలను జత చేస్తూ తమ అభ్యంతరాలను సమర్పించవచ్చు. ఇది అభ్యర్థులు పరీక్షలో తమ ప్రతిభను ముందుగానే స్పష్టంగా అంచనా వేసుకోవడానికి సహాయపడటమే కాకుండా, వారి అభ్యంతరాలను సమర్పించడానికి తగిన సమయాన్ని, అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.
అభ్యర్థుల నుంచి వచ్చిన అన్ని అభ్యంతరాలను సమగ్రంగా,నిశితంగా సమీక్షించడం కోసం వాటిని విషయ నిపుణుల బృందం ముందు ఉంచుతారు. ఆయా రంగాలలో విశేష పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన ఈ నిపుణులు ప్రతి అభ్యంతరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు. అభ్యర్థులు జత చేసిన ఆధారిత పత్రాలను అంచనా వేస్తారు.సంబంధిత ప్రశ్నల సమాధానాల కీ (ఆన్సర్ కీ) సరి అయిందో, కాదో అనే అంశంపై తమ విశ్లేషణాత్మక అభిప్రాయాలను నమోదు చేస్తారు. అభ్యర్థుల నుంచి అందిన అన్ని అభ్యంతరాలను తగిన విధంగా పరిశీలించిన తర్వాతే సమాధానాల కీ తుది రూపం దాల్చుతుంది.
ప్రొవిజనల్ ఆన్సర్ కీ లను విడుదల చేయాలంటూ అభ్యర్థుల నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు ఈ నూతన సంస్కరణను ప్రవేశపెట్టారు. పరీక్ష విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, అభ్యర్థులలో నమ్మకాన్ని మరింత పెంచడానికి యూపీఎస్సీ ఈ తాత్కాలిక సమాధానాల కీ లను ప్రచురించే విధానాన్ని అమలులోకి తీసుకువస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2262631)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28